OFF THE RECORD: మహేష్ కుమార్ కు సవాల్ గా నామినేటెడ్ పదవులు!

OFF THE RECORD: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సొసైటీ చైర్మన్, మార్కెట్ కమిటీ పదవుల భర్తీలో జాప్యంపై కాంగ్రెస్ ఆశావహులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Nov 2026 7:59 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: మహేష్ కుమార్ కు సవాల్ గా నామినేటెడ్ పదవులు!

OFF THE RECORD: ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సహకార సంఘాల చైర్మన్ పదవుల భర్తీ వ్యవహారం ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్నప్పటికీ ఇంకా ఓ కొలిక్కి రాలేదు. బోధన్ నియోజకవర్గం మినహా మిగిలిన నియోజకవర్గాల్లో సొసైటీ చైర్మన్ పదవులు ఖాళీగానే ఉన్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పదవుల్లో తమకు అవకాశం వస్తుందని పలువురు ఆశించారు.

పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ సైతం సొసైటీ చైర్మన్ పదవులను కాంగ్రెస్ మండల, గ్రామ నాయకులకే ఇస్తామని ప్రకటించారు. రోజులు, నెలలు గడుస్తున్నా.. ఆ హామీ ఏమాత్రం కార్యరూపం దాల్చడం లేదు. దీంతో ఆశావహుల్లో తీవ్ర ఆవేదన వ్యక్తం అవుతోంది.

ఎవరికి అవకాశం కల్పించాలన్న విషయంలో స్థానిక నాయకుల మధ్య సమన్వయం కుదరకపోవడం కూడా జాప్యానికి కారణమన్న టాక్ నడుస్తోంది. నిజామాబాద్ వ్యవసాయ మార్కెట్ కమిటీతోపాటు బోధన్, ఆర్మూర్, వేల్పూర్, కమ్మర్పల్లి, వర్ని మార్కెట్ కమిటీలకు నూతన పాలకవర్గాల నియామకం చేయాల్సి ఉంది. ఇప్పటికే బోధన్ మార్కెట్ కమిటీకి నూతన పాలకవర్గాన్ని నియమించారు.

మిగిలిన మార్కెట్ కమిటీల పాలకవర్గాల నియామకానికి నేతల మధ్య సమన్వయం కుదరక ఆలస్యం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలోనూ ఆశావహుల జాబితాలో భారీగానే ఉంది. అయితే వారిలో పదవుల కేటాయింపు మరింత ఆలస్యమవుతుందా..? అన్న టెన్షన్ కనిపిస్తోంది. పార్టీని నమ్ముకుని పనిచేసిన తమకు ఇకనైనా తగిన గుర్తింపు లభిస్తుందా..? లేదా..? అన్న సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.

పదవుల కోసం పోటీ పడుతున్న నేతల జాబితా ఎక్కువగా ఉండటంతో ఎంపిక వ్యవహారం కష్టంగా మారుతోందన్న టాక్ లేకపోలేదు. మరింత ఆలస్యం చేయకుండా స్థానిక ఎమ్మెల్యేలు, జిల్లా నాయకత్వం, పార్టీ ముఖ్య నేతలు స్పందించి ఏకాభిప్రాయంతో నియామకాలు చేపట్టాలని పార్టీ కేడర్ కోరుతోంది.

పీసీసీ చీఫ్ జిల్లాకు వచ్చినప్పుడల్లా పదవుల కేటాయింపుపై శుభ వార్త ఉంటుందన్న సంబరం.. ఆయన పర్యటనతోనే ఆవిరి అవుతోందట. ఇలా మహేష్ కుమార్ జిల్లాకు వచ్చినప్పుడల్లా ఆశగా చూడటం తప్ప.. ఫలితం లేదని బావురుమంటున్నారు స్థానిక కాంగ్రెస్ నేతలు. పీసీసీ చీఫ్ సొంత జిల్లాలోనే నామినేటెడ్ పదవుల భర్తీలో ఇంత జాప్యం జరిగితే ఎలా..? అని ఆశావహులు కొందరు నిలదీస్తున్నారు.

నామినేటెడ్ పదవుల విషయంలో ఆలస్యమైతే కొంతమేరకు పార్టీకి నష్టం జరిగే అవకాశం కూడా లేకపోలేదట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి మూడేళ్ల కాలం పూర్తయ్యాక... ఇప్పటికైనా అసలు సిసలు కార్యకర్తలను గుర్తించకపోతే.. రాబోయే ఎన్నికల్లో కార్యకర్తలో వ్యతిరేకత వచ్చే ప్రమాదం ఉంటుందంటున్నారు పరిశీలకులు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్