Burning Topic: 150 ఏళ్ల సంప్రదాయానికి న్యూయార్క్ స్వస్తి!
Burning Topic: న్యూయార్క్ నగరంలోని ప్రసిద్ధ సెంట్రల్ పార్క్ గుర్రపు బగ్గీల సేవలను 2028 జూన్ నాటికి నిషేధిస్తూ న్యూయార్క్ సిటీ కౌన్సిల్ బిల్లు ఆమోదించింది.
Burning Topic: 150 ఏళ్ల సంప్రదాయానికి న్యూయార్క్ స్వస్తి!
Burning Topic: అమెరికా వాణిజ్య రాజధాని న్యూయార్క్ నగరం.. అంతులేని శక్తి, వైవిధ్యం, కలల సమ్మేళనం. ఎప్పటికీ నిద్రపోని నగరం ఇది.. కాంక్రీట్ జంగల్ లాంటి ఈ నగరంలో ఆకాశాన్ని ముద్దాడుతున్నట్లు ఉండే భవనాలు ప్రధాన ఆకర్షణ. చుట్టూ ఎత్తైన భవనాలు ఉంటే, వాటి మధ్యలో విశాలమైన పచ్చదనం, చెరువులు, నడక దారులతో కూడిన సెంట్రల్ పార్క్ నగర జీవులకు ప్రశాంతతను ఇస్తుంది.
ఆధునికతకు, ప్రకృతికి మధ్య ఉన్న సమతుల్యతకు న్యూయార్క్ ఉదాహరణ. ఇలాంటి ఆధునిక మహానగరంలో సెంట్రల్ పార్క్ దగ్గర చెవికి వినపడే గుర్రపు గిట్టల శబ్దాలు, అందంగా అలంకరించిన వింటేజ్ బగ్గీలు పర్యాటకులను ఆధునిక కాలం నుండి 19వ శతాబ్దపు పాత తరం న్యూయార్క్‌కు తీసుకువెళ్తాయి. ఈ గుర్రపు బగ్గీలు కేవలం ఒక రవాణా సాధనం మాత్రమే కాదు, అవి న్యూయార్క్ నగర చరిత్ర, సంస్కృతి పర్యాటక రంగానికి నిలువెత్తు రూపాలు.
1858లో న్యూయార్క్ నగరంలోని సెంట్రల్ పార్క్ ప్రారంభమైన నాటి నుండి గుర్రపు బగ్గీల ప్రయాణం ఒక సంప్రదాయంగా మొదలైంది. పార్క్ డిజైన్ చేసినప్పుడే, గుర్రపు బగ్గీల విహారానికి అనుకూలంగా ఉండేలా దాని దారులను తీర్చిదిద్దారు. 1863 లో కేవలం 25 సెంట్ల టికెట్‌తో పర్యాటకుల కోసం అధికారికంగా రైడ్లు మొదలయ్యాయి. అప్పటి నుండి నేటివరకు యుద్ధాలు, ఆర్థిక మాంద్యాలను దాటుకుంటూ ఈ ఆకర్షణ నిలిచి ఉంది.
ఈ బగ్గీలు పర్యాటకులను సెంట్రల్ పార్క్ లోని ప్రసిద్ధ ప్రాంతాలైన బెథెస్డా ఫౌంటెన్, ది కరౌసెల్, ప్లాజా హోటల్ వంటి ప్రఖ్యాత ప్రదేశాల మీదుగా తిప్పుతాయి. హాలీవుడ్ క్లాసిక్ సినిమాలు అయిన హోమ్ అలోన్ 2 , గోస్ట్బస్టర్స్ వంటి వందలాది చిత్రాలలో ఈ గుర్రపు బగ్గీలు న్యూయార్క్ నగర అందాన్ని రెట్టింపు చేస్తూ కనిపించాయి. ప్రపంచం నలుమూలల నుండి వచ్చే పర్యాటకులు, ప్రేమికులు సాయంత్రం విహారం కోసం ఈ బగ్గీ రైడ్లను ఎంచుకుంటారు.
సమయం మారింది, నగర వేగం పెరిగింది, చివరకు శతాబ్దాల నాటి ఒక సాంప్రదాయానికి తెరపడింది. టైమ్స్ స్క్వేర్ కాంక్రీట్ జంగిల్ మధ్య నిన్నటి తరం జ్ఞాపకంగా మిగిలిన న్యూయార్క్ గుర్రపు బగ్గీల చరిత్ర ముగింపు దశకు చేరింది. జంతు హక్కుల పోరాటాలు, రాజకీయ నిర్ణయాలు, పెరుగుతున్న నగర ట్రాఫిక్ లీగల్ పోరాటాల మధ్య.. ఐకానిక్ సెంట్రల్ పార్క్ క్యారేజీలు తమ చివరి ప్రయాణాన్ని ముగించే సమయం వచ్చేసింది.
అంతర్జాతీయ పర్యాటక కేంద్రమైన న్యూయార్క్ నగరంలో శతాబ్దాల నాటి సంప్రదాయానికి తెరపడబోతోంది. సెంట్రల్ పార్క్ ప్రాంతంలో ఎంతో ప్రాచుర్యం పొందిన గుర్రపు బగ్గీల సేవలను పూర్తిగా నిషేధిస్తూ న్యూయార్క్ సిటీ కౌన్సిల్ సంచలన నిర్ణయం తీసుకుంది. 2028 జూన్ నాటికి ఈ బగ్గీలను నగర వీధుల నుంచి పూర్తిగా తొలగించేందుకు వీలుగా ఒక బిల్లును ఆమోదించింది. ఏడుగురు వ్యతిరేకించారు. మరో ఇద్దరు ఓటింగ్‌కు దూరంగా ఉన్నారు.
ఒకవైపు ఆకాశాన్ని తాకే భవనాలు, హారన్ల మోతలు, ఎలక్ట్రిక్ కార్ల వేగం.. మరోవైపు నెమ్మదిగా సాగే గుర్రపు బగ్గీ ప్రయాణం. దశాబ్దాలుగా న్యూయార్క్ మహానగరంలో కనిపించిన ఈ విచిత్ర కాంట్రాస్ట్ 2028 జూన్ తర్వాత ఇకపై కనిపించదు. ఆధునికత వైపు పరుగు తీస్తున్న న్యూయార్క్, తన సాంస్కృతిక చిహ్నమైన గుర్రపు బగ్గీలకు వీడ్కోలు పలికింది. న్యూయార్క్ నగర కౌన్సిల్ ఇంతటి తీవ్ర నిర్ణయానికి రావడం వెనుక ఓ కారణం ఉంది.
ఈ ఏడాది జూన్ 17న భారత్‌కు చెందిన దీపక్ మహాజన్ తన కుటుంబంతో కలిసి న్యూయార్క్ పర్యటనకు వచ్చారు. వారంతా సెంట్రల్ పార్క్‌లోని గుర్రపు బగ్గీ ఎక్కారు. దానిని నడిపే వ్యక్తి పర్యాటకులను ఫొటోలు తీసేందుకు దిగిన సమయంలో.. గుర్రం ఒక్కసారిగా బెదిరిపోయి పరుగులు తీసింది. దాంతో బగ్గీలో ఉన్న దీపక్ కుమారుడు రోమాంచ్ మహాజన్ కిందపడటంతో తలకు తీవ్రగాయమై ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటనతో బగ్గీలను నిషేధించాలన్న డిమాండ్లు పెరిగాయి.
ఈ విషాదకర ఘటన న్యూయార్క్ నగరంతో పాటు అంతర్జాతీయ పర్యాటకులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. గుర్రపు బగ్గీల భద్రత, పర్యాటకుల రక్షణ, జంతువుల నిర్వహణపై మరోసారి చర్చ మొదలైంది. నగర ప్రజలను, జంతు సంక్షేమ సంఘాలను తీవ్రంగా కలిచివేసింది. ప్రమాదాల ముప్పును తగ్గించేందుకు ఈ తరహా ప్రయాణాలను నిలిపివేయాలన్న వాదనలకు బలం చేకూరింది. పర్యాటకుల భద్రతను తీవ్రంగా ప్రమాదంలో పడేస్తున్న ఈ గుర్రపు బగ్గీలను సెంట్రల్ పార్క్‌లో వెంటనే నిషేధించాలంటూ స్థానికుల నుంచి, పర్యాటకుల నుంచి పెద్ద ఎత్తున డిమాండ్లు వెల్లువెత్తాయి.
ఈ ప్రజాభిప్రాయాన్ని దృష్టిలో ఉంచుకుని సిటీ కౌన్సిల్ సభ్యులు ప్రత్యేక బిల్లును ప్రతిపాదించి ఓటింగ్ నిర్వహించారు. ఈ విచారణ తర్వాత గుర్రపు బగ్గీలను నిషేధిస్తూ నిర్ణయం తీసుకున్నారు. న్యూయార్క్ మేయర్ జోహ్రాన్ మామ్దానీ సంతకం చేసిన తర్వాత 2028 జూన్ నుంచి 150 ఏళ్లనాటి గుర్రపు బగ్గీల సాంప్రదాయం నిలిచిపోనుంది.
పర్యాటకులను ఆకర్షించే చారిత్రక సంప్రదాయాలకు భద్రతా ప్రశ్నలు ఎదురైతే.. వాటి భవిష్యత్తుపై పునరాలోచన తప్పదని న్యూయార్క్ నగరంలో చోటుచేసుకున్న పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి.
మరోవైపు, గుర్రపు బగ్గీల నిషేధ ప్రతిపాదనపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అభ్యంతరం వ్యక్తం చేశారు. న్యూయార్క్ నగర చరిత్రలో గుర్రపు బగ్గీలకు ప్రత్యేక స్థానం ఉందని పేర్కొన్నారు. సెంట్రల్ పార్క్ సమీపంలోనే తన వ్యాపార ప్రధాన కార్యాలయం ట్రంప్ టవర్ ఉన్న విషయాన్ని గుర్తు చేస్తూ, సోషల్ మీడియా వేదికగా ఆయన స్పందించారు.
పార్కు ప్రాంతంలో రోజూ ఎన్నో కార్ల ప్రమాదాలు జరుగుతున్నాయని, అలాగని పార్కులోకి కార్లను రాకుండా ఆపేస్తున్నారా అని ప్రశ్నించారు. ఒక గొప్ప సంప్రదాయాన్ని, చరిత్రను కాల రాశారని, ఈ రవాణా సేవలను నగరవాసులు ఖచ్చితంగా మిస్ అవుతారని ట్రంప్ తన ట్రూత్ సోషల్ వేదికగా అభిప్రాయపడ్డారు.
కాగా న్యూయార్క్ సిటీ కౌన్సిల్ గుర్రపు బగ్గీలను నిలిపేస్తూ బిల్లు ఆమోదించినప్పటికీ, దీని అమలు సులభంగా జరిగేలా కనిపించడం లేదు. గుర్రపు బగ్గీ యజమానులు, డ్రైవర్లకు ప్రాతినిధ్యం వహిస్తున్న ట్రాన్స్పోర్ట్ వర్కర్స్ యూనియన్ ఈ నిషేధాన్ని న్యాయపరంగా సవాలు చేసేందుకు సిద్ధమైంది. చట్టం అమల్లోకి వచ్చిన వెంటనే న్యాయస్థానం నుంచి తాత్కాలిక స్టే ఆర్డర్ పొందేందుకు ప్రయత్నిస్తామని ప్రకటించింది.
నగర చరిత్రలోనే లైసెన్స్ కలిగిన ఒక వృత్తిని ఉన్నపళంగా నిషేధించడం ఇదే మొదటిసారి కావచ్చని.. ఇది తమ ఆస్తి, జీవనోపాధి హక్కులను కాలరాయడమేనని యూనియన్ ప్రతినిధులు వాదిస్తున్నారు.నిషేధ బిల్లులో గుర్రపు బగ్గీలపై ఆధారపడి జీవిస్తున్న కార్మికుల భవిష్యత్తుకు సంబంధించిన అంశాలనూ చేర్చారు. ఏప్రిల్ నాటికి వారి ఉపాధి మార్పునకు సంబంధించిన ప్రణాళికను రూపొందించాలని నగర యంత్రాంగాన్ని ప్రతిపాదన కోరుతోంది. బగ్గీల నిర్వాహకులకు పరిహారం అందించే అవకాశాన్నీ పరిశీలించాల్సి ఉంటుంది.




