OFF THE RECORD: ఒంగోలు కూటమిలో కుంపటి..! బాలినేని మౌనం పై కొత్త చర్చ..!

OFF THE RECORD: ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల ఫలితాల తర్వాత కూటమి పార్టీల్లో రాజుకున్న రాజకీయం. ఓటమికి మిత్రపక్షాలే కారణమంటూ టీడీపీ, జనసేన శ్రేణుల పరస్పర ఆరోపణలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Updated on: 10 Nov 2026 7:52 AM IST
OFF THE RECORD
X

OFF THE RECORD: ఒంగోలు కూటమిలో కుంపటి..! బాలినేని మౌనం పై కొత్త చర్చ..!

OFF THE RECORD: 2024 ఎన్నికల తర్వాత చేతిలో చేయి వేసుకొని నడిచిన కూటమి పార్టీల్లో ఇప్పుడు ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలు కొత్త రాజకీయ మంటలు రాజేశాయనే టాక్ వినిపిస్తోంది. ఎన్నికల సమయంలో కలిసి పనిచేయాల్సిన రెండు పార్టీలు.. ఫలితాల తర్వాత మాత్రం ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నాయనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఆశించిన స్థాయిలో కార్పొరేటర్ స్థానాలు దక్కకపోవడంతో ఇప్పుడు రెండు పార్టీల నేతలు ఓటమికి కారణాలను వెతుక్కునే పనిలో పడ్డారట. అయితే ఆ కారణాలు వెతుక్కునే క్రమంలో సొంత తప్పుల కంటే మిత్రపక్షం తప్పులే ఎక్కువగా కనిపిస్తున్నాయనే చర్చ మొదలైంది. జనసేన సరిగా సహకరించకపోవడం వల్లే కొన్ని స్థానాల్లో ఓటమి ఎదురైందని టీడీపీ వర్గాలు భావిస్తుంటే.. టీడీపీ నేతల నుంచి పూర్తిస్థాయి సహకారం అందకపోవడం వల్లే తమ అభ్యర్థులు ఓడిపోయారని జనసైనికులు వాదిస్తున్నారట. అంటే ఎన్నికల్లో ఓడింది అభ్యర్థులే అయినా.. ఆ నిందలు మాత్రం మిత్రపక్షాల మీద పడుతున్నాయన్నమాట. గెలుపు కోసం కలిసికట్టుగా పనిచేయాల్సిన పార్టీలు.. ఇప్పుడు ఓటమి లెక్కల్లో ఒకరిపై ఒకరు వేలెత్తి చూపించుకోవడం ఒంగోలు రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇక ఎన్నికల ప్రారంభం నుంచి జరిగిన పరిణామాలు కూడా ఇప్పుడు చర్చకు వస్తున్నాయి. మొదట ఫ్రెండ్లీ ఫైట్ అంటూ రెండు పార్టీల అభ్యర్థులు రంగంలోకి దిగడం.. ఆ తర్వాత అధిష్టానాల నుంచి పోటీ నుంచి తప్పుకోవాలనే సంకేతాలు రావడంతో రాజకీయ సమీకరణాలు ఒక్కసారిగా మారిపోయాయనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొన్ని చోట్ల అభ్యర్థులు పోటీ నుంచి తప్పుకోగా.. మరికొన్ని చోట్ల మాత్రం చివరి వరకు బరిలోనే కొనసాగారనే చర్చ ఉంది. దీంతో ఎవరు ఎవరికి మద్దతు ఇవ్వాలి..? ఎవరి కోసం ఎవరు పనిచేయాలి..? అన్న విషయంలో క్షేత్రస్థాయిలో గందరగోళం నెలకొందనే టాక్ వినిపించింది. పైస్థాయిలో నాయకులు కలిసి ఉన్నా.. కిందిస్థాయిలో మాత్రం కార్యకర్తల మధ్య సమన్వయం కొరవడిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఒకరికి మద్దతు ఇస్తామని చెప్పి మరొకరు ప్రచారానికి రాకపోవడం.. మరికొన్ని చోట్ల సొంత పార్టీ అభ్యర్థుల గెలుపుకే ప్రాధాన్యత ఇవ్వడం వంటి పరిణామాలు ఫలితాలపై ప్రభావం చూపాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. మొత్తానికి ఫ్రెండ్లీ ఫైట్‌తో మొదలైన వ్యవహారం.. ఇప్పుడు ఫ్రెండ్లీ ఫైటింగ్‌గా మారిందా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.

ఈ మొత్తం ఎన్నికల వ్యవహారంలో మరో ఆసక్తికరమైన అంశం మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి మౌనం. ఒంగోలు రాజకీయాల్లో బాలినేని అంటే ఒక ప్రత్యేకమైన గుర్తింపు. ఆయన రాజకీయ వ్యూహాలు.. క్షేత్రస్థాయిలో ఉన్న పట్టుపట్టు.. అనుచరగణం.. ఎన్నికల సమయంలో ఆయన వేసే రాజకీయ అడుగులు ఎలాంటి ప్రభావం చూపుతాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి బాలినేని.. ఈ ఎన్నికల్లో పూర్తిస్థాయిలో యాక్టివ్‌గా కనిపించకపోవడమే ఇప్పుడు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. బాలినేని మౌనం అటు వైసీపీకి.. ఇటు టీడీపీ, జనసేన పార్టీలకు కొంత ఊరటనిచ్చిందనే చర్చ జరుగుతోంది. ఆయన సైలెంట్‌గా ఉండటంతోనే మూడు పార్టీలు ఎంతో కొంత ఊపిరి పీల్చుకున్నాయనే విశ్లేషణలు వినిపిస్తున్నాయి. అదే బాలినేని పూర్తిస్థాయిలో గ్రౌండ్‌లోకి దిగి, తన రాజకీయ వ్యూహాలకు పదునుపెట్టి ఎన్నికల ప్రచారంలో చురుగ్గా పాల్గొని ఉంటే పరిస్థితులు ఎలా ఉండేవి..? ఎన్నికల ఫలితాల లెక్కలు మరోలా ఉండేవా..? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఒంగోలు రాజకీయాల్లో ఆసక్తిని రేపుతున్నాయి. మరోవైపు బాలినేని యాక్టివ్‌గా లేకపోయినా సీట్ల విషయంలో కూటమి పార్టీలు తడబడటం కూడా చర్చనీయాంశంగా మారింది. మరి ఆయన పూర్తిస్థాయిలో రాజకీయంగా యాక్టివ్‌గా ఉంటే కూటమి ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొనేదన్నదే ఇప్పుడు అసలు ప్రశ్న. మొత్తానికి బాలినేని రాజకీయ మౌనం కూడా ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికల చర్చలో ఒక కీలక అంశంగా మారింది.

మరోవైపు ఈ ఎన్నికల్లో వైసీపీ ప్రదర్శన కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీస్తోంది. మేయర్ అభ్యర్థి దాదాపు ఒంటరి పోరాటం చేయాల్సి వచ్చిందని.. నగరంలోని ముఖ్య నాయకుల నుంచి ఆశించిన స్థాయిలో సహకారం అందలేదనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి. పార్టీ ముఖ్య నాయకులంతా సమన్వయంతో పనిచేసి ఉంటే ఫలితాలు మరింత మెరుగ్గా ఉండేవనే వాదన కూడా ఉంది. అయినప్పటికీ వైసీపీ నుంచి 11 మంది కార్పొరేటర్లు ప్రత్యక్షంగా గెలవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఇది నగరంలో ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఓటర్ల మద్దతు ఇంకా ఉందనే సంకేతంగా వైసీపీ వర్గాలు భావిస్తున్నాయనే టాక్ వినిపిస్తోంది. ముఖ్యంగా మేయర్ అభ్యర్థికి ఒంగోలు పార్టీలోని నాయకత్వం నుంచి పూర్తిస్థాయి సహకారం అందని పరిస్థితుల్లో కూడా అభ్యర్థులు గెలవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. నగరంలో బలమైన నాయకుడు ముందుండి పార్టీ శ్రేణులను సమన్వయం చేసి ఉంటే పరిస్థితి మరోలా ఉండేదనే విశ్లేషణలు కూడా వినిపిస్తున్నాయి. అంటే ఒకవైపు వైసీపీలో నాయకుల మధ్య సమన్వయంపై ప్రశ్నలు తలెత్తుతుంటే.. మరోవైపు 11 మంది కార్పొరేటర్ల విజయం ఆ పార్టీకి క్షేత్రస్థాయిలో ఉన్న పట్టును గుర్తు చేస్తోందనే చర్చ సాగుతోంది. ప్రత్యర్థి పార్టీ నుంచి పెద్దగా ఒత్తిడి లేదని భావించిన కూటమి కూడా ఆశించిన స్థాయిలో సీట్లు సాధించలేకపోవడం.. వైసీపీ నుంచి 11 మంది కార్పొరేటర్లు గెలవడం.. ఈ రెండు పరిణామాలు ఒంగోలు రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు చర్చకు తెరలేపాయి. మొత్తానికి నాయకుల సహకారం ఎంత..? క్షేత్రస్థాయిలో కార్యకర్తల బలం ఎంత..? ఓటర్ల మద్దతు ఎవరికి ఎంత..? అన్న లెక్కలను ఈ ఎన్నికలు మరోసారి తెరపైకి తీసుకొచ్చాయి.

ఇక ఈ ఎన్నికల్లో మరో ఆసక్తికరమైన పరిణామం చిన్నచూపు చూసిన అభ్యర్థుల విజయాలు. కొన్ని వార్డుల్లో యువకులు, చిన్నవాళ్లు అంటూ అభ్యర్థులను తక్కువ అంచనా వేసిన రాజకీయ పెద్దలకు ఫలితాలు గట్టి సమాధానం చెప్పాయనే చర్చ వినిపిస్తోంది. వయసు చూసి నాయకత్వాన్ని అంచనా వేస్తే కుదరదని.. ప్రజల్లో ఎవరికి పట్టుంది..? ఎవరు అందుబాటులో ఉంటున్నారు..? ఎవరు ప్రజల సమస్యలపై స్పందిస్తున్నారు..? అన్నదే ఓటరు చూస్తాడనే విషయం ఈ ఎన్నికలు మరోసారి నిరూపించాయనే విశ్లేషణలు వస్తున్నాయి. మరోవైపు మద్దతు ఇస్తామని హామీ ఇచ్చిన కొందరు నేతలు క్షేత్రస్థాయిలో సహకరించలేదనే అసంతృప్తి జనసేన శ్రేణుల్లో ఉందట. ఇదే సమయంలో టీడీపీ వర్గాలు కూడా తమ అభ్యర్థులకు జనసేన నుంచి ఆశించిన సహకారం అందలేదని భావిస్తున్నాయనే ప్రచారం సాగుతోంది. అంటే రెండు పార్టీల మధ్య నమ్మకం కంటే అనుమానాలే ఎక్కువయ్యాయా..? అన్న చర్చ మొదలైంది. ఎన్నికల్లో ఓటమి ఎదురైతే కారణాలను విశ్లేషించుకోవడం సహజం. కానీ ఆ విశ్లేషణ మిత్రపక్షాల మధ్యే విభేదాలకు దారితీస్తే మాత్రం అది భవిష్యత్తు రాజకీయాలకు ప్రమాదకర సంకేతమే అవుతుంది.

ఇప్పుడు అసలు ప్రశ్న ఒక్కటే. ఒంగోలులో మొదలైన ఈ రాజకీయ గ్యాప్ ఇక్కడితోనే ఆగిపోతుందా..? లేక రాబోయే రోజుల్లో జనసేన, టీడీపీ మధ్య మరింత దూరం పెంచుతుందా..? టీడీపీ నాయకులు తమ పార్టీ బలాన్ని తక్కువ అంచనా వేయొద్దని జనసేనకు పరోక్షంగా సంకేతాలు ఇస్తుంటే.. తమ మద్దతు లేకపోతే టీడీపీకి అంతటి విజయం సాధ్యమయ్యేది కాదని జనసైనికులు కౌంటర్ ఇస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. నిజానికి కూటమి బలం రెండు పార్టీల ఓట్ల కలయికలోనే ఉంది. కానీ ఆ బలాన్ని ఎన్నికల సమయంలో ఓట్లుగా మార్చుకోవాలంటే క్షేత్రస్థాయిలో సమన్వయం తప్పనిసరి. ఒక పార్టీ అభ్యర్థి గెలిస్తే మరో పార్టీ కార్యకర్తలు కూడా తమ అభ్యర్థి గెలిచినట్టుగా భావించాలి. అలా కాకుండా ఎవరి అభ్యర్థి.. ఎవరి గెలుపు.. ఎవరి ఓటమి అనే లెక్కలు వేసుకుంటే రాజకీయంగా నష్టపోయేది కూటమి మాత్రమే. ప్రస్తుతం ఒంగోలులో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఈ రెండు పార్టీల నాయకత్వాలు క్షేత్రస్థాయిలో ఉన్న అసంతృప్తిని గుర్తించాల్సిన అవసరం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రత్యర్థి పార్టీ బలహీనంగా ఉందని భావించి ధీమాగా ఉండటం కంటే.. సొంత కూటమిలో ఐక్యతను కాపాడుకోవడమే ముఖ్యమని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మొత్తానికి ఒంగోలు కార్పొరేషన్ ఎన్నికలు కూటమి పార్టీలకు ఒక గుణపాఠం నేర్పాయనే చర్చ జరుగుతోంది. గెలిచిన స్థానాల కంటే తగ్గిన స్థానాల గురించే ఎక్కువ చర్చ జరుగుతుండటం.. ఓడిన అభ్యర్థులు మిత్రపక్షాల సహకారంపై ప్రశ్నలు లేవనెత్తడం.. జనసేన, టీడీపీ శ్రేణుల మధ్య మాటల యుద్ధం మొదలవడం చూస్తుంటే పరిస్థితి అంతా సాఫీగా లేదనే సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం తుఫాను అయితే తీరం దాటింది.. కానీ ప్రమాద హెచ్చరికల జెండా మాత్రం ఇంకా ఎగురుతూనే ఉంది. ఈ గ్యాప్‌ను సరిదిద్దుకోకపోతే రాబోయే రోజుల్లో కూటమికి రాజకీయంగా ఇబ్బందులు తప్పవనే చర్చ వినిపిస్తోంది. మరి అధిష్టానాలు జోక్యం చేసుకొని రెండు పార్టీల మధ్య సమన్వయం తీసుకొస్తాయా..? లేక ఒంగోలులో మొదలైన ఈ ఆధిపత్య పోరు మరిన్ని ప్రాంతాలకు విస్తరిస్తుందా..? మరి.. చేతులు కలిపిన కూటమి చేతులు కలిపే ఉంటుందా..? లేక రాజకీయ అవసరాల దగ్గరే ఆ చేతులు విడిపోతాయా..? అన్నది చూడాలి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్