Burning Topic: మనిషి స్వార్థానికి అరుదైన వానరజాతి బలి!
Burning Topic: ఇండోనేషియా వర్షారణ్యాల్లో పామాయిల్ తోటల విస్తరణ, స్మగ్లింగ్ వల్ల అంతరించిపోతున్న ఒరాంగ్ ఉటాన్‌లు మరియు ఒడిశాలో 5 ఒరాంగ్ ఉటాన్ పిల్లల రెస్క్యూ వివరాలు.
Burning Topic: మనిషి స్వార్థానికి అరుదైన వానరజాతి బలి!
Burning Topic: రాగి రంగు బొచ్చుతో, పొడవైన చేతులతో చెట్టు కొమ్మల నుండి మరో కొమ్మకు ఊగుతూ కనిపించే ఈ జీవులు ప్రకృతి సృష్టించిన ఒక అద్భుతం. భూమిపై కంటే చెట్ల పైనే ఎక్కువగా జీవించే ఈ జీవుల విన్యాసాలు అద్భుతంగా ఉంటాయి. తమ పొడవైన, బలమైన చేతులతో ఒక కొమ్మ నుండి మరో కొమ్మకు సునాయాసంగా ఊగుతూ, గాల్లో తేలుతున్నట్లుగా సాగిపోతుంటాయి. చూసేందుకు విలక్షణంగా ఉన్న ఈ ప్రాణులు అచ్చం చిన్న పిల్లల్లా ప్రవర్తిస్తుంటాయి.
తమ పిల్లలను ఎంతో ప్రేమగా గుండెలకు హత్తుకోవడం, ముద్దులాడటం, చేతులతో సైగలు చేయడం చూసే వారికి ఎంతో ముచ్చటేస్తుంది. మనుషుల లాగే ఇవి కూడా ఆనందంగా ఉంటే శబ్దాలు చేస్తూ నవ్వుతాయి, బాధొస్తే కన్నీళ్లు పెట్టుకుంటాయి. ప్రకృతి ప్రసాదించిన అత్యంత తెలివైన జీవులలో ఒకటైన కోతి జాతే ఒరాంగ్ ఉటాన్. ఒంటరిగా జీవించడానికి ఇష్టపడే ఈ ప్రశాంతమైన జీవుల జీవనశైలి ఎంతో విలక్షణమైనది.
మలేషియా భాషలో 'ఒరాంగ్ ఉటాన్' అంటే 'అడవి మనిషి' అని అర్థం. దట్టమైన వర్షారణ్యాలలో నివసించే ఈ అద్భుతమైన వానరజాతి ఇది. దాదాపు మనుషులను పోలి ఉంటే ఈ జీవుల డీఎన్ఏ కూడా దాదాపు 97% మనుషులను పోలి ఉంటుంది. ఇండోనేషియా, మలేషియా దేశాల్లోని బోర్నియో, సుమత్రా ద్వీపాల్లో ఒరాంగ్ ఉటాన్‌లు కనిపిస్తాయి. ఒరాంగ్ టాన్లలో ప్రధానంగా మూడు జాతులు ఉన్నాయి. అవి.. బోర్నియన్ , సుమత్రన్ , తపనులి.
ఎర్రటి గోధుమరంగు వెంట్రుకలతో కూడిన అతిపెద్ద వృక్షవాసి కోతి జాతి ఇది. వీటి చేతుల పొడవు సుమారు 2.2 మీటర్ల వరకు ఉంటుంది. ఆడ ఒరాంగ్ ఉటాన్ కన్నామగది రెండింతలు పెద్దగా ఉంటుంది. ఇవి ప్రధానంగా పండ్లు , ఆకులు, బెరడు, పురుగులను తింటాయి. ఇలాంటి విలక్షణ వానర జాతి ఉనికి ఇప్పుడు ప్రమాదంలో పడింది. మనుషులకు దగ్గరగా ఉంటే ఈ జాతి మానవుల స్వార్ధానికి అంతరించిపోయే ప్రమాదంలో పడింది.
ఇండోనేషియా దట్టమైన వర్షారణ్యాల్లో వేలాది సంవత్సరాలుగా స్వేచ్ఛగా బతికిన ఈ జీవులు, ఇప్పుడు తమ సొంత అవాసాలను కోల్పోయి మనుగడ కోసం చేస్తున్న ఆఖరి పోరాటం చేస్తున్నాయి. రాబోయే కొన్ని దశాబ్దాల్లో భూమిపై నుంచి ఒరాంగ్ ఉటాన్ పూర్తిగా తుడిచిపెట్టుకు పోయే ప్రమాదం ఉందని అంతర్జాతీయ ప్రకృతి సంరక్షణ సంఘం (IUCN) చెబుతోంది.
ఇందుకు కారణం పామాయిల్ తోటల విస్తరణ. మనం రోజూ వాడే సోపులు, తినే బిస్కెట్లు, చాక్లెట్లలో ఉండే పామాయిల్.. ఇండోనేషియాలో ఒక అమాయక జీవజాతి ప్రాణాలను బలితీసుకుంటోందని తలచుకుంటేనే బాధ కలుగుతుంది. అంతర్జాతీయ పర్యావరణ పరిశోధన సంస్థల నివేదికల ప్రకారం, గత రెండు దశాబ్దాలలో ఇండోనేషియా దట్టమైన వర్షారణ్యాలలో దాదాపు 11% నుండి 13% వరకు కోల్పోయింది. ఇందులో మూడో వంతు కేవలం పామాయిల్ తోటల పెంపకం కోసమే నరికివేతకు గురైంది.
ప్రపంచవ్యాప్తంగా అడవులను నరికి పామాయిల్ తోటలుగా మార్చిన భూమిలో మూడింట రెండు వంతులు ఇండోనేషియాలోనే ఉంది. ప్రపంచ దేశాలకు అవసరమయ్యే పామాయిల్లో సింహభాగం మలేషియాతో కలిపి 85% పైగా ఇక్కడి నుంచే సరఫరా అవుతోంది. మరోవైపు కలప కోసం పెద్ద చెట్లను నరికిన తర్వాత, మిగిలిన దట్టమైన పొదలను, నేలను సులభంగా క్లియర్ చేయడం కోసం ఉద్దేశపూర్వకంగా అడవులకు మంటలు పెడతారు. దీనివల్ల ప్రతి ఏటా ఇండోనేషియాలో భీకరమైన అడవి మంటలు చెలరేగి సమస్యలను సృష్టిస్తున్నాయి.
ఒరాంగ్ ఉటాన్‌లు తమ జీవితంలో 90% పైగా సమయాన్ని చెట్ల పైనే గడుపుతాయి. పామాయిల్ తోటల కోసం మైళ్ల కొద్దీ అడవులను నరికేయడంతో, మిగిలిన అడవి చిన్న చిన్న ముక్కలుగా విడిపోతోంది. దీనివల్ల ఒక ప్రాంతం నుండి మరో ప్రాంతానికి చెట్ల ద్వారా వెళ్లే మార్గం లేక అవి చిన్న అటవీ ప్రాంతాల్లోనే బందీలుగా మిగిలిపోతున్నాయి.
పామాయిల్ తోటల పెంపకం కోసం పెట్టే మంటలు ఒరాంగ్ ఉటాన్లకు శాపంగా మారుతున్నాయి. వేగంగా కదలలేని తత్వం, చెట్లను వదిలి కిందకు రాలేని భయం వల్ల వందలాది ఒరాంగ్ ఉటాన్‌లు ఆ మంటల్లో సజీవ దహనమవుతున్నాయి. పొగ కారణంగా ఊపిరాడక చనిపోయే జీవుల సంఖ్య కూడా ఎక్కువే.సహజ సిద్ధమైన అడవుల స్థానంలో కేవలం ఒకే రకమైన 'పామ్ చెట్లను' నాటడం వల్ల ఒరాంగ్ ఉటాన్లకు అవసరమైన వైవిధ్యభరితమైన ఆహారం దొరకడం లేదు.
అడవుల్లో ఆహారం లేకపోవడంతో, ఒరాంగ్ ఉటాన్‌లు పామాయిల్ తోటల్లోకి చొరబడి అక్కడి లేత ఆకులను, కాయలను తింటుంటాయి. దీంతో ఆగ్రహానికి గురయ్యే తోటల యజమానులు, కార్మికులు తుపాకులతో కాల్చి, కత్తులతో నరికి క్రూరంగా చంపేస్తున్నారు. జీవవైవిధ్యాన్ని కాపాడే ఒరాంగ్ ఉటాన్‌లు లేకపోతే వర్షారణ్యాలు అంతరించిపోతాయి. ప్రకృతికి ఊపిరిపోసే ఆ చేతులకే ఇప్పుడు ఊపిరాడకుండా చేస్తున్నారు.
ఒరాంగ్ ఉటాన్లకు అంతర్జాతీయ బ్లాక్ మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ప్రతి ఏటా వందలాదిగా వేటగాళ్ల చేతిలో చిక్కుతున్నాయి. ఇందులో స్మగ్లింగ్‌లో 90% పైగా వాటా కేవలం పిల్ల ఒరాంగ్ ఉటాన్‌లను పెంపుడు జంతువులుగా అమ్మడం కోసమే జరుగుతుంది. ఒరాంగ్ ఉటాన్‌లు తమ పిల్లలను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తాయి. దీంతో వేటగాళ్లు పిల్లలను పట్టుకోవడానికి తల్లి ఒరాంగ్ ఉటాన్ను క్రూరంగా చంపేస్తారు. ఒక పిల్ల ఒరాంగ్ ఉటాన్ మార్కెట్‌కు చేరాలనే ప్రక్రియలో కనీసం ఒక తల్లి ప్రాణాలు కోల్పోవాల్సి వస్తుంది.
ఆడ ఒరాంగ్ ఉటాన్ తన జీవితకాలంలో కేవలం 3 నుండి 4 పిల్లలకు మాత్రమే జన్మనిస్తుంది. పిల్లలు స్వతంత్రంగా జీవించే 12 నుండి 15 సంవత్సరాల వయస్సు వచ్చే దాకా మరో పిల్లకు జన్మ ఇవ్వవు. దీంతో వేటగాళ్ల చేతిలో చనిపోతున్న ఒరాంగ్ ఉటాన్ల జనాభాను ప్రకృతి అంత వేగంగా భర్తీ చేయలేకపోతోంది. ఒకప్పుడు ఇండోనేషియా, మలేషియాల్లో 2, 30, 000 ఒరాంగ్ ఉటాన్‌లు ఉంటే, ప్రస్తుతం 1,10,000లకు పడిపోయింది.
కొన్ని దేశాల్లోని సంపన్నులు తమ సామాజిక హోదాను ప్రదర్శించుకోవడం కోసం ఒరాంగ్ ఉటాన్ పిల్లలను పెద్ద మొత్తం వెచ్చించి కొంటారు. స్మగ్లర్లు వీటిని చిన్న పెట్టెల్లో, గోనె సంచుల్లో దాచి రహస్యంగా రవాణా చేస్తారు. దీంతో ఆహారం, నీరు లేక, తీవ్రమైన ఒత్తిడితో 80% వరకు గమ్యస్థానానికి చేరకముందే చనిపోతాయి. గత నెల మన దేశంలో ఐదు ఒరాంగ్ ఉటాన్ పిల్లలు కనిపించడం తీవ్ర కలకలవం రేపింది. ఒడిశాలోని బాలాసోర్ జిల్లా పరిధి అటవీ ప్రాంతంలో అర్ధరాత్రి వేళ స్థానికులు గుర్తించారు.
వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు.హుటాహుటిన అక్కడికి చేరుకున్న అధికారులు వాటిని సురక్షితంగా కాపాడారు. ఈ ఒరాంగ్ ఉటాన్లలో మూడు మగ, రెండు ఆడ పిల్లలు ఉన్నాయి. వయస్సు కేవలం 6 నుండి 8 నెలల లోపే ఉంటుందని అంచనా.ఈ ఐదు ఒరంగుటాన్లను భువనేశ్వర్‌లోని నందన్‌కానన్ జూకు తరలించారు.
ఒరాంగ్ ఉటాన్‌లు భారతదేశంలో సహజంగా జీవించే జంతువులు కావు. ఇండోనేషియా, మలేషియా వర్షారణ్యాలలో ఉంటే ఈ జీవులు ఒడిశా అడవుల్లో దొరకడం వన్యప్రాణి నిపుణులను, అధికారులను తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ పిల్లలు సుమారు 3,000 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం దాటి ఒడిశాకు చేరడం సాధ్యం కాదు.
దీంతో ఇది కచ్చితంగా స్మగ్లర్ల పనే అని భావిస్తున్నారు. పోలీసుల తనిఖీలకు భయపడి స్మగ్లర్లు వీటిని రహదారి పక్కన అడవిలో వదిలేసి వెళ్లి ఉండవచ్చని ఒడిశా అటవీశాఖ పేర్కొంది. వీటిని గుర్తించడం ఒక్క పూట ఆలస్యం అయినా, స్థానిక క్రూర మృగాలకు ఆహారమైపోయేవి. తీవ్రంగా నీరసించిన స్థితిలో ఉన్న ఒరాంగ్ ఉటాన్ పిల్లలకు 24 గంటల వైద్య పర్యవేక్షణ, ప్రత్యేక ఆహారం ఏర్పాటు చేశారు. వీటిని ఇండోనేషియాకు పంపించడానికి చట్టపరమైన ప్రక్రియలు ప్రారంభమయ్యాయి.




