Burning Topic: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుపై పాకిస్తాన్ కొత్త డ్రామా!
Burning Topic: FATF సమావేశాల నేపథ్యంలో మోస్ట్ వాంటెడ్ రెడ్ బుక్‌లో జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజార్ పేరును చేర్చిన పాకిస్థాన్. అసలు కారణం ఇదే.
Burning Topic: మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుపై పాకిస్తాన్ కొత్త డ్రామా!
Burning Topic: మసూర్ అజార్.. జైషే మహ్మద్ ఉగ్ర ముఠాకు అధినేత, ప్రపంచం దృష్టిలో మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాది. అతని చిరునామా ఎక్కడ అంటే పాకిస్థాన్ అని ఎవరైనా చెబుతారు.. ఆ దేశంలోని పంజాబ్ స్టేట్‌కు చెందిన బహావల్పూర్ అతని స్వస్థలం.. 1968 జూలై 10న ఇక్కడే జన్మించాడు.
కరాచీలోని 'జామియా ఉలూమ్-ఉల్-ఇస్లామియా' మదరసాలో చదువుకొని అక్కడే ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడయ్యాడు. జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థ వ్యవస్థాపకుడు మసూద్ అజార్‌పై భారత్ సహా అంతర్జాతీయంగా అనేక తీవ్రమైన ఉగ్రవాద ఆరోపణలు, కేసులు ఉన్నాయి. యువతను ఉగ్రవాదం వైపు ఆకర్షించడం, భారత్‌లో దాడులు చేయడానికి విదేశాల నుండి నిధులు సేకరించడం వంటి ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు.
మసూద్ అజార్ పాకిస్థాన్‌లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడని భారత్ ఎన్నిసార్లు చెప్పినా, ఆ దేశం మాత్రం దీన్ని అంగీకరించదు.. తాజా ప్రపంచాన్ని నమ్మించేందుకు పాకిస్థాన్ ఓ ప్రకటన చేసింది.
పాకిస్థాన్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ FIA తన ‘మోస్ట్ వాంటెడ్’ ఉగ్రవాదుల ‘రెడ్ బుక్’లో మసూద్ అజార్ పేరును చేర్చింది. ఆయన ఆచూకీ తెలిపిన వారికి 70 లక్షల పాకిస్థానీ రూపాయలు బహుమతిగా ప్రకటించింది. వాస్తవానికి మసూద్ అజార్ తల మీద 50 లక్షల పాకిస్థానీ రూపాయలు ఐదేళ్ల క్రితమే ప్రకటించింది పాకిస్ధాన్.
ప్రస్తుతం దానికి మరో 20 లక్షలు చేర్చి.. మరోసారి ప్రకటన చేసింది. మసూద్ అజార్ పాకిస్తాన్‌లోనే సురక్షితంగా దాక్కున్నాడని భారత ఇంటెలిజెన్స్ వర్గాలు గట్టిగా చెబుతున్నాయి. అంతర్జాతీయ నిఘా నివేదికల ప్రకారం, అతను పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లోని గిల్గిత్-బాల్టిస్తాన్ ప్రాంతంలో ఉన్న స్కర్దూ లేదా బహావల్పూర్ పరిసరాల్లోని రహస్య ప్రాంతాలలో తన స్థావరాలను నిరంతరం మారుస్తూ తలదాచుకుంటున్నట్లు సమాచారం ఉంది.
గత 6 నెలల్లో భారత నిఘా సంస్థలు విశ్లేషించిన దాని ప్రకారం చూస్తే అజర్ పాకిస్థాన్ సింధ్ ప్రావిన్స్‌లోని నవాబ్‌షా నగరంలోనే దాక్కున్నట్లు గుర్తించినట్లు సమాచారం.
జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ సహా పలువురు ఉగ్రవాదుల పేర్లను పాకిస్థాన్ ఇప్పుడు 2026 మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల జాబితాలో చేర్చడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు అసలు కారణాలు వేరుగా ఉన్నాయి. పాకిస్థాన్ ఉగ్రవాదులకు స్వర్గధామం అని జగమెరిగిన సత్యం.
ఆ దేశంలో అధికారికంగానే టెర్రరిస్టుల సంఖ్య భారీగా పెరిగింది. 2021లో 1330 మంది మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టుల పేర్లు ఉండగా, ఇప్పుడు ఆ సంఖ్య 35 శాతం పెరిగి 1804 కు చేరింది. వచ్చే నెల అంటే అక్టోబర్ నెలలో జరగనున్న ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (FATF) ప్లీనరీ సమావేశానికి ముందు కొత్త నాటకానికి తెరలేపిందని స్పష్టంగా తెలుస్తోంది.
ఉగ్రవాద సంస్థలకు నిధుల సరఫరాను అడ్డుకోవడంలో, అరికట్టడంలో పాకిస్థాన్ విఫలం కావడంతో ఆ దేశం 2018-2022 మధ్య FATF గ్రే లిస్టులోనే ఉంది. ఇప్పుడు మరోసారి అదే గతి పడుతుందన్న భయంతోనే ఇలా చేస్తున్నట్లు సమాచారం.
మసూద్ అజర్ ఉగ్ర చరిత్ర చూస్తే చాలా పెద్దదే.. భారత్‌లో జరిగిన అనేక ఘోరమైన ఉగ్రవాద దాడుల వెనుక ఇతనే ప్రధాన సూత్రధారి. మసూద్ అజార్ తొలుత 'హర్కత్-ఉల్-ముజాహిద్దీన్' అనే సంస్థలో పనిచేస్తూ 1994లో జమ్మూ కాశ్మీర్‌లో భారత భద్రతా దళాలకు చిక్కాడు.
ఉగ్రవాదులు డిసెంబర్ 1999లో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం IC-814 హైజాక్ చేసి, మసూద్ అజార్‌ను విడుదల చేయాలని భారత్ మీద వత్తిడి తెచ్చారు. ప్రయాణీకుల భద్రత దృష్ట్యా అప్పటి అతడిని విడుదల చేయాల్సి వచ్చింది. ఆ తర్వాత అతడు పాకిస్తాన్‌కు చేరి జైష్-ఎ-మొహమ్మద్ సంస్థను స్థాపించి భారత్‌పై వరుస కుట్రలకు తెరలేపాడు. (Kandahar Flightr Hizack)
2001లో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాదులు శ్రీనగర్‌లోని జమ్మూ కాశ్మీర్ శాసనసభ కాంప్లెక్స్ వెలుపల కారు బాంబు పేల్చారు. ఈ దాడిలో సుమారు 38 మంది ప్రాణాలు కోల్పోయారు. అదే ఏడాది భారత పార్లమెంట్ భవనంపై జైషే, లష్కరే తాయిబా ఉగ్రవాదులు సాయుధ దాడికి తెగబడ్డారు. ఈ దాడి భారత భద్రతా సిబ్బందితో సహా 14 మంది మరణానికి కారణమైంది.
2016లో పంజాబ్‌లోని పఠాన్‌కోట్ వైమానిక స్థావరంపై జైష్ ఉగ్రవాదులు దాడి చేసే ప్రయత్నం చేయగా మన సైన్యం సమర్థవంతంగా తిప్పికొట్టింది. 2016లో కాశ్మీర్‌లోని ఉరీ ఆర్మీ క్యాంప్‌పై జరిగిన దాడిలో 19 మంది భారత జవాన్లు అమరులయ్యారు.
దీనికి ప్రతీకారంగానే భారత్ మొదటిసారి చారిత్రాత్మక సర్జికల్ స్ట్రైక్స్ నిర్వహించింది. 2019లో పుల్వామాలో జైష్-ఎ-మొహమ్మద్ ఉగ్రవాది జరిపిన కారు బాంబు దాడిలో 40 మంది CRPF జవాన్లు అమరులయ్యారు. ఈ ఘోరకలికి ప్రతీకారంగా భారత వాయుసేన పాకిస్తాన్‌లోని 'బాలాకోట్' లో ఉన్న జైష్ శిక్షణ శిబిరాలపై వైమానిక దాడులు చేసింది. 2025 మే నెలలోలో కాశ్మీర్‌లోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం 'ఆపరేషన్ సింధూర్' చేపట్టింది.
పాకిస్తాన్‌లోని బహవల్‌పూర్‌లో ఉన్న జైష్ ప్రధాన కార్యాలయంపై భారత్ జరిపిన క్షిపణి దాడులలో మసూద్ అజార్ తృటిలో తప్పించుకోగా, అతని కుటుంబానికి చెందిన 10 మంది కీలక సభ్యులు మరియు కొందరు ప్రధాన అనుచరులు హతమయ్యారు.
2019లో మసూద్ అజార్‌ను ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది.. తమకు అప్పగించాలని అప్పగించాలని భారత్ డిమాండ్ చేస్తుంటే.. మసూద్ అజర్ 2021 నుంచే తమ భూభాగంలో లేడని, ఆయన అఫ్గానిస్థాన్‌కు పారిపోయాడని పాకిస్థాన్ ఇన్ని రోజులూ అంతర్జాతీయ సమాజం వద్ద వాదిస్తూ వచ్చింది. అయితే అఫ్గానిస్థాన్‌లో లేడని అక్కడి విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది.
దీంతో అజర్ పాకిస్థాన్‌లోనే దాక్కున్నాడన్న వాదనకు బలం చేకూరింది. కొంత కాలంగా ఉగ్రవాద సంస్థలపై చర్యలు తీసుకోవాలని అంతర్జాతీయంగా పాకిస్థాన్‌పై ఒత్తిడి పెరిగింది. అక్టోబర్ నెలలో పారిస్‌లో ఎఫ్ఏటీఎఫ్ ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించనుంది. ఉగ్రవాదానికి నిధుల పంపిణీ, మనీ లాండరింగ్ నిరోధక చర్యలపై దేశాల పనితీరును సమీక్షించే ఈ సమావేశం వేళ.. మళ్లీ 'గ్రే లిస్ట్' ప్రమాదం ముంచుకొస్తుందన్న భయంతోనే పాక్ తన అధికారిక రికార్డుల్లో అజార్ పేరును మోస్ట్ వాంటెడ్‌గా చేర్చి పారితోషికం పెంచినట్లు విశ్లేషకులు భావిస్తున్నారు.
పాకిస్థాన్‌లో మరోసారి ‘గుర్తు తెలియని ఆగంతకుడు’ కలకలం రేపారు. కరాచీలో లష్కరే తోయిబా (LeT)తో సంబంధాలున్నట్టు చెబుతున్న ఓ వ్యక్తిని నలుగురు గుర్తుతెలియని దుండగులు బైక్‌లపై వచ్చి కాల్చి అక్కడి నుంచి పారిపోయారు. ఈ దృశ్యం ధురంధర్ చిత్రాన్ని తలపించింది.
ఇందుకు సంబంధించిన వీడియో ఫుటేజీ ఒకటి నెట్టింట తెగ వైరల్ అవుతోంది. అయితే చనిపోయిన వ్యక్తి ఎల్‌ఈటీ వ్యవస్థాపకుడు హఫీజ్ సయ్యద్‌కు అత్యంత సన్నిహితుడని మాత్రం స్థానికంగా కొన్ని మీడియా సంస్థలు కథనాలు ఇస్తున్నాయి. పాకిస్థాన్‌లో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక వ్యక్తులు ‘గుర్తుతెలియని దుండగుల’ చేతిలో హతమవుతున్న ఘటనలు గత కొన్నేళ్లుగా అంతర్జాతీయంగా చర్చకు వస్తున్నాయి.
ముఖ్యంగా లష్కరే తోయిబా, జైషే మహ్మద్ వంటి భారత్ వ్యతిరేక ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్న వ్యక్తులు లక్ష్యంగా మారిన ఘటనలు వెలుగులోకి వచ్చాయి.




