Burning Topic: హోటల్ బిల్ కట్టలేక ప్రపంచం ముందు పరువు తీసుకున్న పాక్!
Burning Topic: పాకిస్తాన్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయింది. విదేశీ అప్పులు తీర్చలేక, కనీసం శాంతి చర్చలకు ఆతిథ్యం ఇస్తున్న హోటల్ బిల్లులు కూడా చెల్లించలేక అంతర్జాతీయ స్థాయిలో ఆ దేశ పరువు పోతోంది.
Burning Topic: హోటల్ బిల్ కట్టలేక ప్రపంచం ముందు పరువు తీసుకున్న పాక్!
Burning Topic: మింగ మెతుకు లేదు, మీసాలకు సంపెంగ నూనె అన్నట్లుంది..ఆర్థిక సంక్షోభంతో కొట్టు మిట్టాడుతూ అప్పుల కోసం ప్రపంచ దేశాలను యాచిస్తోంది పాకిస్థాన్. సరిగ్గా ఇప్పుడే తామిచ్చిన రుణాన్ని వెంటనే చెల్లించాలని ఒత్తిడి తెస్తోంది యూఏఈ. తాజాగా పశ్చిమాసియా యుద్ధం తెచ్చిన సంక్షోభం కారణంగా చమురు ధరలు ఆకాశాన్ని అంటడంతో పాకిస్థాన్ ఆర్థిక పరిస్థితి మరింతగా దిగజారింది. ఇలాంటి పరిస్థితుల్లో అమెరికా, ఇరాన్ యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిత్వం నెత్తినేసుకుంది. కానీ శాంతి చర్చలకు ఆతిథ్యం ఇస్తున్న హోటల్ ఖర్చును చల్లించలేక అవస్థలు పడుతోంది. తాజా పరిణామాలు పాకిస్థాన్ ఉనికికే ప్రమాదకరంగా మారుతున్నాయి.
ఉప్పర్ షేర్వానీ, అందర్ పరేషానీ.. తెలుగులో చెప్పాలి అంటే.. పైన పటారం, లోన లొటారం.. మన పొరుగు దేశం పాకిస్తాన్ పరిస్థితి సరిగ్గా ఇలాగే ఉంది. పీకలోతు అప్పులలో కూరుకుపోయినా, పైకి మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తోంది. 2026 జనవరి నాటికి పాకిస్థాన్ దేశీయంగా, విదేశాల నుంచి తీసుకున్న అప్పులు 260 బిలియన్ డాలర్లకు చేరిందని అంచనా. ఇది ఆ దేశ జీడీపీలో దాదాపు 71.9% కి సమానం.
ప్రతి పాకిస్తాన్ పౌరుడిపై సగటున సుమారు 1,198 డాలర్ల అప్పు భారం ఉంది. ఇందులో అత్యధికంగా 22 % చైనా నుంచే తీసుకున్నవే ఉంటాయి. ప్రభుత్వ ఆదాయంలో 50-60 % కేవలం వడ్డీ చెల్లింపులకే ఖర్చవుతోంది. అప్పుల ఊబిలో కూరుకుపోయిన పాకిస్తాన్, పాత అప్పులు తీర్చడానికి కొత్త అప్పులు చేయాల్సిన పరిస్థితి ఉంది. తీవ్రమైన ఈ సంక్షోభం కారణంగా చైనా, సౌదీ అరేబియా, ఐఎంఎఫ్ నుంచి తీసుకున్న రుణాలను చెల్లించేందుకు ఆ దేశం ఇబ్బందులు పడుతోంది.
ఇప్పటికే ఆర్థిక సంక్షోభంతో తల్లడిల్లిపోతున్న పాకిస్థాన్ కు మరో ఇబ్బంది వచ్చి పడింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ తాము గతంలో ఇచ్చిన 3.5 బిలియన్ డాలర్లు అప్పు పూర్తిగా తిరిగి చెల్లించాలని కోరడంతో మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు అయింది. ఇంతకాలంగా యూఏఈకి ఉన్న అప్పును పలు దపాలుగా పాకిస్థాన్ వాయిదా వేస్తూ వచ్చింది.
సరిగ్గా ఇదే సమయంలో పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా పెరుగుతున్న ముడిచమురు ధరలతో కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. అసలే డబ్బులు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్న వేళ ఈ అప్పులు ఎలా చెల్లించేదని సమస్యగా మారిపోయింది.అయితే తాము అప్పు చెల్లించడానికి ఉన్న అన్ని మార్గాలను పరిశీలిస్తున్నాం అన్నారు ఆర్థిక శాఖ మంత్రి జౌరంగజేబ్. ఎట్టిపరిస్థితుల్లో యుఏఈకి ఉన్న అప్పును చెల్లిస్తామని స్పష్టం చేశారు. సమకూర్చుకోవాల్సిన నిధులను ద్వైపాక్షిక మార్గాలు, రుణాల ద్వారా సమకూర్చుకునే యత్నం చేస్తున్నాం అని చెప్పకొచ్చారాయన.




