Off The Record: ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టిన ఎస్సై వివాదం!
Off The Record: కారంపూడి మోసం, ఎస్సై సస్పెండ్ వ్యవహారంపై పల్నాడు ఎమ్మెల్యేల వర్గపోరు సీఎం చంద్రబాబు వద్దకు చేరి రాజకీయంగా కలకలం రేపింది.
Off The Record: ఎమ్మెల్యేల మధ్య చిచ్చుపెట్టిన ఎస్సై వివాదం!
Off The Record: వ్యాపారి మోసంతో..నష్టపోయిన రైతులు కారంపూడి ఎస్సైఐ వాసుకు ఫిర్యాదు చేశారు. పోలీసులు వ్యాపారిని పట్టుకొచ్చారు. విచారణ జరుగుతున్న క్రమంలోనే.. పోలీసులు వేధిస్తున్నారంటూ వ్యాపారి అయ్యప్ప భార్య ఆత్మహత్యాయత్నం చేసుకుంది. దీంతో ఎస్సై వాసును ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు.
ఇంతవరకూ సాధారణ స్టోరీనే. అయితే ఇక్కడే నాయకులు, వారి అనుచరులు ప్రచ్చన్న యుద్దం మొదలు పెట్టారు. వాసు వేధింపులకు గురి చేశాడని అతన్ని సర్వీస్ నుండి తొలగించాలంటూ ఒక వర్గం రైతులు ఏకంగా గుంటూరులోని ఐజీ త్రిపాఠిని కలిశారు.
ఈ వర్గం వెనుక గురజాల ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు ఉన్నట్లు పల్నాడులోని కూటమి నేతలు అనుకుంటున్నారు. లేకుంటే ఐజి అపాయింట్ మెంట్ అంత సులభంగా దొరికేది కాదని చెబుతున్నారు. కారంపూడి మండలంలోని పలు గ్రామాల టిడిపి నాయకులకు యరపతినేనితో సత్సంబంధాలు కొనసాగుతున్నాయి.
కారంపూడి టిడిపి నేతలతో పాటు, రైతులను ఎస్సై వేధించాడని వారంతా యరపతినేనికి మొర పెట్టుకున్నారు. యరపతినేని శ్రీనివాసరావు ఆయన అనుచరులతో ఏకంగా ఐజికే ఫిర్యాదు చేయించినట్లు చెప్పుకుంటున్నారు. ఇదే సమయంలో మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డితోనూ యరపతినేని మంచి సంబంధాలే ఉన్నాయి.
ఇద్దరి నేతలు కలిసి మెలిసి పనిచేస్తుంటారు. కానీ, ఎస్సై వాసు కార్యకర్తలను వేధించాడని చెప్పగానే యరపతినేని సీరియస్ అయినట్లు తెలుస్తుంది. యరపతినేని వర్గం ఐజికి ఫిర్యాదు చేసి వెళ్లగానే... వ్యాపారి అయ్యప్ప కారణంగా నష్టపోయిన మాచర్ల నియోజకవర్గంలోని రైతులు మరుసటి రోజు వచ్చి ఐజికి తమకు న్యాయం చేయాలంటూ ఫిర్యాదు చేశారు.
తమ ఫిర్యాదు మేరకే ఎస్సై వ్యాపారిని అరెస్ట్ చేసినట్లు చెప్పారు. తమకు ఇవ్వాల్సిన కోటి 75లక్షల రూపాయలను ఎగ్గొట్టేందుకే భార్యతో ఆయన ఆత్మహత్యాయత్నం నాటకం ఆడించినట్లు చెప్పుకున్నారు. ఈ వర్గం వెనుక జూలకంటి బ్రహ్మారెడ్డి ఉన్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
ఎస్సైని సస్పెండ్ చేసినప్పటికీ రైతులకు న్యాయం చేయాల్సిన భాద్యత ఉందని బ్రహ్మారెడ్డి వర్గం వాదన. దీంతో రైతులను మోసం చేసిన అంశం పక్కకు పోయి ఎస్సై సస్పెండ్ చుట్టూ రాజకీయం తిరిగినట్లైంది. అంతేకాదు ఏకంగా ఈ పంచాయితీ సిఎం చంద్రబాబు దగ్గరికి వెళ్ళిందట.
చివరికి చంద్రబాబును కలిసిన ఎమ్మెల్యె జూలకంటి.. తాను స్థానిక సంస్థల ఎన్నికల్లో అనుకూల ఫలితాలు రాబట్టాలంటే ఆ ఎస్సైపై సస్పెండ్ ఎత్తివేయాలని కోరారట.. ఆ తరువాత ఎమ్మెల్యే యరపతినేనిని.... సీఎం చంద్రబాబు పిలిచి బుజ్జగించారని టాక్.
దీంతో, ఎస్సైపైన ఉన్న సస్పెన్షన్ ను అధికారులు ఎత్తివేసారు. ఇలా ఒక ఎస్సై కోసం ఇద్దరు ఎమ్మెల్యేలు పోటీ పడటం.. ప్రచ్చన్న యుద్దానికి దిగటం.. సీఎం కార్యాలయం జోక్యం చేసుకోవటం ఇప్పుడు జిల్లా రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.




