BIG STORY: పార్లమెంట్‌లో అరుదైన ఘటన!

BIG STORY: వర్షాకాల సమావేశాలు ముగిసి 88 రోజులు గడిచినా పార్లమెంట్ ప్రోరోగ్ కాకపోవడంతో పాత రికార్డులు బద్దలయ్యాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 10 Nov 2026 10:31 AM IST
BIG STORY
X

BIG STORY: పార్లమెంట్‌లో అరుదైన ఘటన!

BIG STORY: పార్లమెంటు సమావేశాలు ముగిసిన తరువాత వాటిని ప్రోరోగ్ చేయడం సహజం. ప్రోరోగ్ అంటే...సమావేశాలు ముగిసినట్లు అధికారికంగా ప్రకటించడం అన్నమాట. కాగా ఈ ఏడాది ఆగస్టులో పార్లమెంటు ఉభయ సభలు నిరవధికంగా వాయిదా పడ్డాయి.

అయితే సమావేశాలను ప్రోరోగ్ చేసినట్లు ఇప్పటివరకు ఎటువంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. అలా గత 88 రోజులుగా పార్లమెంటు వర్షాకాల సమావేశాలు ప్రొరోగ్ అవకుండా కొనసాగుతున్నాయి. అధికారిక లెక్కల ప్రకారం ఇప్పటికే పార్లమెంటు సమావేశాలు ముగియలేదు. గతంలో 2008లో కూడా ఇటువంటి పరిస్థితే నెలకొంది. అప్పట్లో మొత్తం 87 రోజుల పాటు పార్లమెంటు ఉభయ సభలు ప్రోరోగ్ కాలేదు. ఈసారి గత రికార్డు బద్దలైంది. పార్లమెంటు చరిత్రలోనే ఇదొక రికార్డు కింద లెక్క.

సాధారణంగా పార్లమెంటు ఉభయ సభలను నిరవధికంగా వాయిదా వేసిన తరువాత రెండు మూడు రోజుల్లో సమావేశాలను ముగిసినట్లు రాష్ట్రపతి ప్రకటిస్తుంటారు. అంటే సమావేశాలను ప్రోరోగ్ చేయడమన్నమాట. అయితే ఈసారి అలా జరగలేదు. ఆగస్టు 13వ తేదీన వర్షాకాల సమావేశాలు ముగిశాయి. అయితే ఇప్పటివరకు సమావేశాల ముగింపు ప్రకటన రాలేదు.

ఒక్కమాటలో చెప్పాలంటే పార్లమెంటు వర్షాకాల సమావేశాల నిర్వహణకు ఆర్టికల్ 85 ( 1 ) కింద రాష్ట్రపతి జారీ చేసిన ఉత్తర్వులు ఇప్పటికీ అమలులో ఉన్నట్లే లెక్క. దీంతో మరోసారి ఆర్టికల్ 85 ( 1 ) కింద పిలుపు ఇవ్వాల్సిన అవసరం లేకుండానే ఎప్పుడు కావాలంటే అప్పుడు సమావేశాలు నిర్వహించే అధికారం పార్లమెంటరీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు ఉంటుంది.

కాగా మహిళా రిజర్వేషన్ల అమలు కోసమే ఈసారి పార్లమెంటును ప్రోరోగ్ చేయలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. మహిళా రిజర్వేషన్లను 2029 నుంచి అమలు చేయాలన్నది కేంద్రం అభిప్రాయంగా కనిపిస్తోంది. అంతేకాదు...మహిళా రిజర్వేషన్ల బిల్లుకు లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును కూడా కలిపారు. ఈ బిల్లుల ఆమోదం కోసం పార్లమెంటు ప్రత్యేక సమావేశాలు నిర్వహించే అవకాశాలున్నట్లు తెలుస్తోంది.

కాగా బడ్జెట్ సమావేశాల సందర్బంగా సదరు లోక్ సభ నియోజకవర్గాల పునర్విభజన బిల్లును ఏప్రిల్ 17న లోక్ సభలో ప్రవేశ పెట్టారు. అయితే సరిపడ సంఖ్యాబలం లేకపోవడంతో బిల్లుకు ఆమోదం లభించలేదు. అయితే నియోజకవర్గాల పునర్విభజన బిల్లు సభ ఆమోదం పొందితే, లోక్ సభ నియోజకవర్గాల 543 నుంచి 850 వరకు పెరిగే అవకాశాలున్నాయి.

ఇదిలా ఉంటే గతంలోనూ పార్లమెంటులో అనేకసార్లు ఇలా ప్రోరోగ్ అవకుండా సుదీర్ఘకాలం కొనసాగిన సందర్భాలున్నాయి. 1987లో 76 రోజులు ఇలా ప్రోరోగ్ అవకుండా పార్లమెంటు ఉభయ సభలు కొనసాగాయి. అలాగే 1989లో 54 రోజులు కొనసాగింది. 1963లో 41రోజుల పాటు కొనసాయాయి.అయితే ఈసారి మాత్రం ప్రోరోగ్ విషయంలో పాత రికార్డులను పార్లమెంటు సమావేశాలు బద్దలు కొట్టాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్