Burning Topic: కేంద్రం బిగ్ బాంబ్..పాస్ పోర్ట్ ఉన్నంత మాత్రాన మీరు భారతీయులు అవ్వరు

Burning Topic: పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన భారత పౌరసత్వం లభించదా? కేంద్ర విదేశాంగ శాఖ (MEA) సంచలన ప్రకటన పూర్తి వివరాలు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Jun 2026 6:29 AM IST
Burning Topic
X

Burning Topic: కేంద్రం బిగ్ బాంబ్..పాస్ పోర్ట్ ఉన్నంత మాత్రాన మీరు భారతీయులు అవ్వరు

Burning Topic: దేశంలో పౌరసత్వానికి పాస్‌పోర్టు ప్రామాణికం కాదా..? అది కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఒక ట్రావెల్ డాక్యుమెంట్ మాత్రమేనా..? ఒకవేళ ఎవరినైనా ఓటరు జాబితా నుంచి తొలగిస్తే పాస్‌పోర్టు చూపెడితే కదరదా..? తమ వద్ద 'పాస్‌పోర్ట్' ఉందనే ఒకే ఒక్క కారణంతో తాము భారత పౌరులమని క్లెయిమ్ చేయడానికి వీలుండదా..? భారత విదేశాంగ శాఖ ఏమంటోంది..? ప్రపంచ దేశాల్లో పరిస్థితి ఎలా ఉంది..? పాస్‌పోర్ట్‌ను అక్కడ పౌరసత్వానికి తుది ఆధారంగా గుర్తిస్తారా..? భారత్‌లాగే అభ్యంతరాలు ఉన్నాయా..? లెట్స్ వాచ్ దిస్ HMTV ఎక్స్‌క్లూజివ్ రిపోర్ట్.

పాస్‌పోర్ట్‌ దేశ పౌరసత్వానికి రుజువు కాదని కేంద్ర విదేశాంగ శాఖ బాంబు పేల్చింది. తాజాగా ఇది దేశవ్యాప్తంగా చర్చకు దారితీసింది. పాస్‌పోర్ట్‌ కోసం పోలీసు వెరిఫికేషన్‌ నుంచి పలు స్థాయిల పరిశీలన జరిగితే.. అదే పత్రాన్ని పౌరసత్వానికి ఆధారంగా ఎందుకు గుర్తించరనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. మామూలుగా పాస్‌పోర్ట్‌ అనగానే చాలా మంది.. అది ఒక వ్యక్తి పౌరసత్వాన్ని నిరూపించే అత్యంత బలమైన పత్రంగానే భావిస్తారు. ఎందుకంటే సాధారణంగా ఏ దేశమైనా ఆ దేశ పౌరులకే పాస్‌పోర్ట్‌లు జారీ చేస్తుంది. అయితే ఈ పరిస్థితి భారత్‌లో మాత్రం భిన్నంగా ఉండటం హాట్ టాపికైంది.

పాస్‌పోర్ట్ కేవలం అంతర్జాతీయ ప్రయాణాల కోసం జారీ చేసే ఒక 'ట్రావెల్ డాక్యుమెంట్' మాత్రమేనని కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. అది భారత పౌరసత్వానికి చట్టపరమైన రుజువు కాదనీ తేల్చి చెప్పింది. 14వ పాస్‌పోర్ట్ సేవా దివస్ సందర్భంగా ఓటర్ల జాబితా ప్రత్యేక ప్రక్షాళన నేపథ్యంలో ఒక ప్రశ్నకు సమాధానంగా అధికారులు ఈ సంచలన విషయం వెల్లడించారు. ప్రస్తుతం పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రక్రియ జరుగుతోంది. ఒకవేళ ఎవరినైనా ఓటరు జాబితా నుంచి తొలగిస్తే, వారు తమ వద్ద 'పాస్‌పోర్ట్' ఉందనే ఒకే ఒక్క కారణంతో తాము భారత పౌరులమని కోర్టుల్లో లేదా అధికారుల ముందు క్లెయిమ్ చేయడానికి వీలుండదు.

భారతీయ చట్టాలను పరిశీలిస్తే.. గతంలో 2013 నాటి బాంబే హైకోర్టు తీర్పు ప్రకారం.. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో పౌరులు కాని వారికి సైతం పాస్‌పోర్ట్ లేదా ప్రయాణ పత్రాలు జారీ చేసే అవకాశం ఉంది. అందువల్ల కేవలం పాస్‌పోర్ట్ ఉన్నంత మాత్రాన పౌరసత్వం ఖరారు కాదు. ఇప్పటికే ఆధార్ కార్డ్ కేవలం వ్యక్తిగత గుర్తింపు, నివాస ధ్రువీకరణకు మాత్రమేనని, అలాగే ఓటర్ ఐడీ అనేది కేవలం ఓటు హక్కు వినియోగించుకోవడానికే తప్ప అవి పౌరసత్వానికి నిరూపణలు కావని సుప్రీంకోర్టు, కేంద్రం ఇదివరకే స్పష్టం చేశాయి. ఇప్పుడు పాస్‌పోర్ట్ కూడా అదే జాబితాలోకి చేరింది. అత్యంత కఠినమైన పోలీస్ వెరిఫికేషన్, ప్రభుత్వ నిబంధనల తర్వాతే పాస్‌పోర్ట్ జారీ అవుతుంది. అలాగని పాస్‌పోర్టు ఏమాత్రం పౌరసత్వానికి రుజువు కాదని తాజాగా కేంద్రం తేల్చిచెప్పడం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది.

విదేశాల్లో ఉన్నప్పుడు లేదా అంతర్జాతీయ ప్రయాణాల్లో పాస్‌పోర్ట్ కేవలం ఒక వ్యక్తి యొక్క 'జాతీయతను' మాత్రమే సూచిస్తుంది. అయితే దేశం లోపల పౌరసత్వ చట్టాల ప్రకారం హక్కులను తేల్చడానికి ఇది ఎంతమాత్రం తుది పత్రం కాదని తాజాగా తేలిపోయింది. అయితే పాస్‌పోర్టు వంటి అత్యున్నత పత్రం కూడా పౌరసత్వానికి రుజువు కాకపోతే, మరి సామాన్య పౌరుడు తన పౌరసత్వాన్ని ఎలా నిరూపించుకోవాలనే ప్రశ్నలు, ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. కేంద్రం తీసుకువస్తున్న ఎన్‌ఆర్‌సీ, సీఏఏ వంటి ప్రక్రియల నేపథ్యంలోనే ఈ తరహా ప్రకటనలు వస్తున్నాయని ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి.

ప్రపంచంలో పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి అత్యంత బలమైన ఆధారంగా గుర్తించే దేశాల్లో అమెరికా ముందుంటుంది. ఆ దేశంలో చెల్లుబాటు అయ్యే అమెరికన్‌ పాస్‌పోర్ట్‌ ఉంటే.. అది పౌరసత్వ ధ్రువీకరణ పత్రంతో సమానంగా పరిగణిస్తారు. ప్రభుత్వ సంస్థలు, కోర్టులు, ఇమ్మిగ్రేషన్‌ అధికారులు కూడా సాధారణంగా అమెరికన్‌ పాస్‌పోర్ట్‌ను పౌరసత్వానికి ప్రత్యక్ష ఆధారంగా అంగీకరిస్తారు. అమెరికాలో Birth Certificate, Certificate of Citizenship, US Passport.. ఈ మూడింటినీ ప్రధాన పౌరసత్వ ఆధారాలుగా పరిగణిస్తారు. అయితే వీటిలో పాస్‌పోర్ట్‌కే అత్యంత ప్రాధాన్యం ఉంటుంది.

ఇక.. బ్రిటన్‌, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ వంటి కామన్‌ లా దేశాల్లో కూడా పాస్‌పోర్ట్‌కు భారీ చట్టబద్ధ ప్రాధాన్యం ఉంది. ఒక వ్యక్తి ఆ దేశ పాస్‌పోర్ట్‌ను కలిగి ఉంటే.. సాధారణ పరిస్థితుల్లో సంబంధిత వ్యక్తిని ఆ దేశ పౌరుడిగానే భావిస్తారు. అయితే అవసరమైతే పౌరసత్వ రికార్డులు, జనన ధ్రువీకరణ పత్రాలు, నేచురలైజేషన్‌ సర్టిఫికెట్లు వంటి అదనపు ఆధారాలను పరిశీలించే అవకాశం లేకపోలేదు. మరోవైపు జర్మనీ, ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌,

నెదర్లాండ్స్‌ వంటి యూరోపియన్‌ దేశాల్లో పాస్‌పోర్ట్‌‌ను బలమైన పౌరసత్వ ఆధారంగా పరిగణిస్తారు. అయితే అక్కడ చాలా దేశాల్లో జాతీయ గుర్తింపు కార్డులు కూడా ఉంటాయి. అందువల్ల పౌరసత్వ నిర్ధారణలో పాస్‌పోర్ట్‌తో పాటు జాతీయ గుర్తింపు వ్యవస్థ కూడా కీలక పాత్ర పోషిస్తుంది. యూరోపియన్‌ యూనియన్‌లోని అనేక దేశాల్లో పౌరులు దేశీయ ప్రయాణాలు, ప్రభుత్వ సేవల కోసం పాస్‌పోర్ట్‌ కంటే జాతీయ గుర్తింపు కార్డులనే ఎక్కువగా ఉపయోగిస్తారు. ఇలా ప్రపంచంలోని 190కి పైగా దేశాల్లో పాస్‌పోర్ట్‌కు ఉన్న చట్టబద్ధ హోదా ఒక్కో దేశంలో ఒక్కోలా ఉంటుంది.

అమెరికా, ఇతర దేశాల్లోలాగా.. భారత్‌లో ప్రతీ పౌరుడికి ఇచ్చే ఒకే ఒక్క "యూనివర్సల్‌ సిటిజన్‌షిప్‌ డాక్యుమెంట్‌" అంటూ ఏదీ లేదు. ఆధార్‌ గుర్తింపును మాత్రమే నిర్ధారిస్తుంది. ఓటరు కార్డు ఓటు హక్కును సూచిస్తుంది. పాన్‌ కార్డు పన్ను అవసరాల కోసం. పాస్‌పోర్ట్‌ ప్రయాణ పత్రం మాత్రమేనని తాజాగా తేలింది. ఈ నేపథ్యంలో పౌరసత్వాన్ని నిరూపించాల్సిన పరిస్థితి వచ్చినప్పుడు ఒక్క పత్రం కాకుండా.. జనన ధ్రువీకరణ పత్రాలు, తల్లిదండ్రుల రికార్డులు, విద్యా ధ్రువపత్రాలు, ప్రభుత్వ రికార్డులు వంటి అనేక ఆధారాలను అధికారులు పరిశీలించాల్సి వస్తోంది. ఈ పరిస్థితిపైనే పౌరసమాజం ముక్తకంఠంతో ప్రశ్నిస్తోంది. ఈ దేశ పౌరుడిని అని గర్వంగా చెప్పుకునేందుకు అవసరమైన ఆ ఒక్క గుర్తింపు కార్డు ఇవ్వాలని జనం కోరుతున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story