Off The Record: మామా అల్లుళ్ళ సవాల్
Off The Record: పెదకూరపాడు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర్ రావు మరియు ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ మధ్య జరుగుతున్న రాజకీయ సవాళ్ల ప్రత్యేక కథనం.
Off The Record: మామా అల్లుళ్ళ సవాల్
Off The Record: అది రాజధాని అమరావతి ప్రాంతం. సరిహద్దున పెదకూరపాడు నియోజకవర్గం. ఇప్పుడక్కడ అధికార, ప్రతిపక్ష పార్టీల మధ్య పొలిటికల్ అగ్నిపర్వతాలు బద్ధలు అవుతున్నాయి. నియోజవర్గంలో నువ్వేం చేశావో.. నేనేం చేశానో,, నీ ప్రతాపం ఏంటో, నా ప్రతాపం ఏంటో తేల్చుకుందాం అంటూ ప్రస్తుత, మాజీ ఎమ్మెల్యేల మధ్య సవాళ్ల యుద్ధం నడుస్తోంది.
వైసీపీ నుంచి గతంలో ఎమ్మెల్యేగా పని చేసిన నంబూరు శంకర రావు.. ప్రస్తుత కూటమి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఇద్దరూ వరుసకు మామా- అల్లుడు అవుతారు. కానీ ఒకరు కూటమిలో.. మరొకర ప్రతిపక్షంలో ఉండడంతో రాజకీయ ప్రత్యర్థులుగా మారిపోయారు. అంత వరకు బాగానే ఉన్నా నియోజకవర్గ అభివృద్ధి విషయంలో ఇద్దరి మధ్య ఒక్కసారిగా నిప్పు రాజుకుంది. కూటమి పాలనకు రెండేళ్లు పూర్తి కావడంతో ప్రభుత్వంపై ప్రతిపక్షం దూకుడుకు అంతే స్థాయిలో అధికార పక్షం నుంచి కౌంటర్ ఎటాక్ మొదలుకావడంతో రాజకీయ మంటలు హీట్ పుట్టిస్తున్నాయి. ఎవరి సత్తా ఏంటో తేల్చుకుందామనే సవాళ్లు మొదలయ్యాయి. ఈ ఇద్దరూ తాడికొండ నియోజకవర్గం పెద్దపరిమి గ్రామానికి చెందిన వారే. ఐతే కూటమి ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ తాజాగా చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకరరావు చేసింది గోరంత, చెప్పుకునేది కొండంత అని.. వారి బండారం బయట పెట్టేందుకు తాను లెక్కలతో సహా వస్తా, బహిరంగ చర్చకు సిద్ధమా అంటు భాష్యం ప్రవీణ్ సవాల్ చేయడం.. పొలిటికల్ రగడకు దారి తీసింది.
ప్రజలు తనకు 60 నెలల సమయం ఇచ్చారు. నా పదవీకాలం పూర్తైన 59వ నెలలో బహిరంగ మీటింగ్ పెడతా, నువ్వు కూడా రా! ఈ నియోజకవర్గానికి నువ్వేం చేశావు, నేనేం చేశానో ప్రజల ముందే తేల్చుకుందాం... అంటూ ఓపెన్ ఛాలెంజ్ చేసారు ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్. తాను పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ ద్వారా ఎంత నిధులు తెచ్చాను.. R&B డిపార్ట్మెంట్ ద్వారా ఎంత తెచ్చానో ప్రతి రూపాయి సహా లెక్కతో వస్తానని చెబుతున్నారు కూటమి ఎమ్మెల్యే. ఈలోపు నువ్వు ఎన్ని ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడినా వాటికి ఎలాంటి విలువ ఉండదని శంకర రావును ఉద్దేశించి వ్యాఖ్యానించారు. గత ఐదేళ్ల పాలనలో మీరు చేసింది కేవలం 392 కోట్ల రూపాయల అభివృద్ధే అంటూ లెక్కలు చెప్పుకొచ్చారు ప్రవీణ్. తాను ఎమ్మెల్యేగా బాధ్యతలు చేపట్టిన రెండేళ్ల కాలంలోనే ఏకంగా 270 కోట్ల రూపాయలతో పెదకూరపాడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసి చూపించానని చెబుతున్నారు.
కూటమి ఎమ్మెల్యే ఛాలెంజ్‌పై.. మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర రావు సైతం ఘాటుగా స్పందించారు. నీ 59 నెలల పాలన తరువాత కూడా నువ్వు ఏం చేశావో చెప్పడానికి ఏమి ఉండదని ఎద్దేవా చేసారు. ప్రజల వద్దకు ప్రవీణ్ వంద రోజులు- వంద గ్రామాలతో సాధించింది ఏమిలేదని విమర్శించారు వైసీపీ మాజీ ఎమ్మెల్యే నంబూరు శంకర రావు. సాయంత్రం గంట సేపు గ్రామాలకు వెళ్తే అన్ని సమస్యలూ పరిష్కరించినట్లేనా అని ప్రశ్నించారు. తాను ప్రతి గ్రామంలో, ప్రతి గడపా ఎక్కి దిగాను, ప్రతి గ్రామ అభివృద్దిలో తన పాత్ర ఎంతో ఉందని చెప్పుకొచ్చారు మాజీ ఎమ్మెల్యే. నియోజకవర్గం ప్రజలు తెలియక నీకు ఓటు వేశారు. రెండోసారి నిన్ను రానివ్వరని జోస్యం చెప్పారు. ప్రశ్నించే హక్కు మాకుంది-ప్రశ్నిస్తే కాళ్ళు చేతులు విరగ్గొట్టే కల్చర్ మీది అంటూ ఫైర్ అవుతున్నారు వైసీపీ లీడర్ నంబూరు శంకరరావు.
నియోజకవర్గ ప్రజలకు మంచి చేసి మెప్పు పొందాలి, బెదిరించాలని చూస్తే ప్రజలు హర్షించరని శంకరరావు చెప్పుకొచ్చారు. పెదకూరపాడు నియోజకవర్గానికి ఐటి కంపెనీ తెస్తామని ఎమ్మెల్యే చెప్తున్నారు, అమరావతిలో ఐటి కంపెనీ పెట్టడానికే దిక్కులేదని ఫైర్ అయ్యారు. ఇలా ఒకరి పై మరొకరు తీవ్ర స్థాయిలో చేసుకుంటున్న ఆరోపణలతో నియోజకవర్గ రాజకీయం ఒక్కసారిగా కొత్త టర్న్ తీసుకుంది. రెండు పార్టీల కేడర్ సైతం నువ్వా నేనా అన్నట్లుగా పరిస్థితి మారుతోంది.
త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరిగే అవకాశం ఉండటంతో... ఈ సవాళ్లు ఎటు దారి తీస్తాయో అనే ఉత్కంఠ నెలకొంది.




