Burning Topic: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి అసలు కారణం ఇదే
Burning Topic: దేశంలో నాలుగేళ్ల తర్వాత పెట్రోల్, డీజిల్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. లీటరుకు 3 రూపాయల చొప్పున ధరలు పెంచుతూ చమురు కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.
Burning Topic: పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడానికి అసలు కారణం ఇదే
Burning Topic: దేశ వ్యాప్తంగా పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు అన్ని రాష్ట్రాల్లో ఒకే తరహాలో లేవు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు విధించే వ్యాట్ ఇతర సెస్సుల కారణంగా ధరలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. కాగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు రెండు తెలుగు రాష్ట్రాల్లోనే అధికంగా ఉండటం గమనించవచ్చు.. ప్రధాన మెట్రో నగరాల్లో హైదరాబాద్ టాప్‌లో ఉంది. మొత్తంగా చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్‌లో ధరలు అధిక స్థాయిలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోల్‌పై రూ.3.29, డీజిల్‌పై రూ.3.14 చొప్పున పెంపు నమోదైంది. తెలంగాణలో పెట్రోల్, డీజిల్‌పై లీటరుకు రూ.3 చొప్పున ధరలు పెరిగాయి.
దీర్ఘకాలంగా కొనసాగుతున్న అమెరికా–ఇరాన్ యుద్ధం, హర్ముజ్ జలసంధి దిగ్బంధనం కారణంగా నౌకా రవాణా ఆగిపోవడంతో చమురు, వాయువు సరఫరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ పరిస్థితుల్లో ఇంధన ధరల పెరుగుదల తప్పనిసరి అయింది. భారత ప్రభుత్వానికి చెందిన ఆయిల్ కంపెనీలు అధిక ధరలకు క్రూడ్ ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయి. ఇప్పటిదాకా ఆ భారాన్ని వినియోగదారులపై వేయకుండా రోజుకు సుమారు రూ.1,600 కోట్ల నష్టాన్ని భరించాయి. ద్రవ్యోల్బణం నియంత్రణలో ఉంచేందుకు కేంద్రం కూడా ఇంధన ధరలు పెంచకుండా ఆగింది. ప్రపంచవ్యాప్తంగా సరఫరా వ్యవస్థను దెబ్బతినడంతో పరిస్థితిని ముందుగానే అర్థం చేసుకున్న కేంద్రం పెట్రో పెంపు సంకేతాలిచ్చింది. ఈలోపు ప్రధాని మోదీ ప్రజలకు ఇంధన పొదుపు పిలుపునిచ్చి అవసరం లేని ప్రయాణాలను తగ్గించాలని సూచించారు. దీంతో ఆ పెంపు భారీగా ఉండొచ్చని ఊహాగానాలు చక్కర్లు కొట్టాయి.
తాజాగా యుద్ధ పరిస్థితుల కారణంగా అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు 50 % వరకు పెరిగింది. ఫిబ్రవరిలో భారత్ దిగుమతి చేసుకునే క్రూడ్ ఆయిల్ సగటు ధర బ్యారెల్‌కు 69 డాలర్లుగా ఉండగా, అనంతర నెలల్లో అది 113-114 డాలర్లకు చేరింది.. ఈ పరిస్థితుల్లో చమురు సంస్థలపై ఆర్థిక భారం పెరగడంతో ధరల పెంపు తప్పనిసరి అయిందని చెబుతున్నారు. దేశంలో ఇంధన కొరత లేదని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. దేశంలో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని కూడా తెలిపారు. అంతర్జాతీయ మార్కెట్లో తీవ్ర ఒడిదుడుకులు ఉన్నప్పటికీ దేశవ్యాప్తంగా ఇంధన సరఫరాను నిరంతరంగా కొనసాగిస్తున్నామని చెప్పారు.ముడి చమురు నిల్వలు స్థిరంగా ఉన్నాయని, రిఫైనరీలు పూర్తి స్థాయిలో పనిచేస్తున్నాయని కేంద్ర పెట్రోలియం శాఖ వెల్లడించింది. దేశంలోని అన్ని ప్రాంతాల్లో పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ నిల్వలు తగినంతగా ఉన్నాయని, ఎక్కడా కొరత పరిస్థితులు లేవని స్పష్టం చేసింది.
పెట్రోల్, డీజిల్ ధరలను ఒక్కసారిగా పెంచడంపైసామాన్యులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పెరిగిన జీవన వ్యయాలతో ఇబ్బందులు పడుతున్న మధ్యతరగతి ప్రజలకు ఈ నిర్ణయం మరో ఆర్థిక భారం కానుంది. ఉద్యోగులు, చిన్న వ్యాపారులు, డెలివరీ సిబ్బంది, ఆటో డ్రైవర్లు, ట్రాన్స్‌పోర్ట్ రంగానికి చెందినవారిపై ఈ ప్రభావం ఎక్కువగా పడనుంది. ఈ ధరల పెంపుతో రవాణా రంగంపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. సరుకు రవాణా ఖర్చులు పెరగడం వల్ల కూరగాయలు, పాలు, ధాన్యాలు, ఇతర అవసర వస్తువుల ధరలు కూడా పెరిగే అవకాశం ఉంది. కాగా
ఆర్థికవేత్తలు ధరల పెంపు తప్పనిసరి అని చెబుతున్నారు. ధరల పెంపు ద్వారా వినియోగం తగ్గుతుంది. ఇది సరఫరా-డిమాండ్ సమతుల్యతను కొంతవరకు కాపాడుతుంది అని విశ్లేషిస్తున్నారు. కాగా రూపాయి విలువ తగ్గడం వల్ల దిగుమతులు ఖరీదవుతాయి, ఎగుమతులు లాభదాయకమవుతాయి. దీంతో ప్రస్తుత ఖాతా లోటు తగ్గే అవకాశం ఉందని వారు సూచిస్తున్నారు.
మరోవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంపై ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలు ముగియగానే మోదీ వసూలు మొదలైందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రధాని మోదీ ప్రజలపై 'కొరడా ఝుళిపించారని తీవ్రంగా విమర్శించింది.ఇంధన ధరల పెంపునకు ప్రధాని మోదీయే కారణమని లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. పెట్రోల్, డీజిల్ ధరల పెంపును దోపిడీగా అభివర్ణించారు. ఈ పెంపును విడతల వారీగా చేస్తారని ఆయన తెలిపారు. "మోదీ ప్రభుత్వ తప్పునకు ప్రజలే మూల్యం చెల్లిస్తున్నారు. రూ. 3 షాక్ ఇప్పటికే తగిలింది. మిగిలిన వసూలు విడతల వారీగా జరుగుతుంది." అని ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కాగా అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరల పెరుగుదల, పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ఈ పెంపు తప్పలేదని బీజేపీ పేర్కొంది. సుమారు 11 వారాల పాటు ధరలు పెంచకుండా స్థిరంగా ఉంచిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్రమంత్రి హర్‌దీప్ సింగ్ పూరీ వివరించారు.




