Burning Topic: ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరాన్ యుద్ధంపై కీలక చర్చలు

Burning Topic: ప్రధాని నరేంద్ర మోదీకి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఫోన్ చేశారు.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Published on: 16 April 2026 1:53 PM IST
Burning Topic
X

Burning Topic: ప్రధాని మోదీకి ట్రంప్ ఫోన్.. ఇరాన్ యుద్ధంపై కీలక చర్చలు

Burning Topic: పశ్చిమాసియాలో యుద్ధం, అమెరికా-ఇరాన్‌ మధ్య శాంతి చర్చల కోసం ప్రయత్నాలు జరుగుతున్న వేళ ప్రధాని నరేంద్ర మోదీకి ఓ ఫోన్ కాల్ వచ్చింది.. దాదాపు 40 నిమిషాలసేపు ఆయన ఫోన్లో మాట్లాడారు.. ఫోన్ చేసింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్.. అందుకే ఈ సంభాషణ ప్రాధాన్యం సంతరించుకుంది.. అమెరికా-ఇరాన్ కాల్పుల విరమణ, శాంతి చర్చలు విఫలమైన వేళ ట్రంప్‌తో మోదీ ఫోన్లో మాట్లాడటం ఇదే తొలిసారి. ఇరాన్‌పై యుద్ధం ప్రారంభమయ్యాక ప్రధాని మోదీతో అమెరికా అధ్యక్షుడు ఫోన్‌లో సంభాషించడం ఇది రెండో సారి. ఈ ఏడాదిలో మూడోసారి. పశ్చిమాసియాలో పరిస్థితులు, హర్మూజ్‌ జలసంధిని తెరవడంపై ప్రధానంగా చర్చించినట్లు చెబుతున్నారు. అంతకన్నా ముఖ్యంగా భారత్‌-అమెరికాల మధ్య ద్వైపాక్షిక సహకారం, మరికొన్ని రోజుల్లో రెండు దేశాల మధ్య కుదరనున్న కీలక ఒప్పందాలు తదితరాలపై ప్రధానంగా చర్చించినట్లు ప్రధాని మోదీ ‘ఎక్స్‌’ వేదికగా వెల్లడించారు.

తన మిత్రుడు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ నుంచి ఫోన్ కాల్ వచ్చిందని ప్రధాని మోదీ వెల్లడిచారు. వివిధ రంగాలలో మన ద్వైపాక్షిక సహకారంలో సాధించిన గణనీయమైన పురోగతిని మేమిద్దరం సమీక్షించుకున్నాం. అన్ని రంగాలలో సమగ్ర ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి మేం కట్టుబడి ఉన్నాము. మేం పశ్చిమాసియా పరిస్థితుల గురించి కూడా చర్చించాం. అలాగే హర్మూజ్​ జలసంధిని తెరవడం, భద్రత, దాని ప్రాముఖ్యతను గురించి మాట్లాడుకున్నాం' అని ఎక్స్‌ ద్వారా తెలిపారు. కాగా డొనాల్డ్ ట్రంప్, నరేంద్ర మోదీల మధ్య వ్యక్తిగతంగా మంచి స్నేహ సంబంధాలు ఉన్నప్పటికీ, వాణిజ్యం, భౌగోళిక రాజకీయాల విషయంలో కొన్ని విభేదాలు నెలకొన్నాయి. ట్రంప్ అమెరికా అధ్యక్షునిగా రెండోసారి అధికారం చేపట్టి తర్వాత భారత్ మీద సుంకాలు విధించడం, రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేస్తున్నందుకు ఆంక్షలు విధించడంతో రెండు దేశాల మధ్య సంబంధాలు కొంత బలహీనపడ్డాయి.

పశ్చిమాసియాలో శాంతి స్థాపనకు భారత్‌ ప్రయత్నిస్తానంటే స్వాగతిస్తామని మన దేశంలో అమెరికా రాయబారి సెర్గియో గోర్‌ తెలిపారు. ఢిల్లీ మధ్యవర్తిత్వంపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదన్నారు. అయితే, ఈ నిర్ణయం తీసుకోవాల్సింది భారత్‌ మాత్రమేనని స్పష్టం చేశారు. ఘర్షణలకు ముగింపు పలికేందుకు భారత్‌ మాత్రమే కాదు ఈ ప్రపంచంలో ఎవరు ప్రయత్నించినా ఆహ్వానిస్తామని వెల్లడించారు. మోదీ,ట్రంప్‌ మధ్య ఫోన్ కాల్ విషయంలో సెర్గియో గోర్‌ స్పందించారు. ఇద్దరి నేతల మధ్య సంభాషణ సానుకూలంగా సాగిందన్నారు. పశ్చిమాసియా పరిణామాలను ప్రధాని మోదీకి ట్రంప్‌ వివరించారని తెలిపారు. అయితే, ఈ ఏడాదిలో వీరిద్దరి మధ్య చాలా ఫోన్ సంభాషణలు జరిగినట్లు చెప్పారు. అందులో అన్ని ఫోన్​కాల్ సంభాషణలను బహిరంగపర్చలేదని, కొన్ని మాత్రమే బయటకు చెప్పినట్లు పేర్కొన్నారు. పశ్చిమాసియా సహా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న కీలక పరిణామాలపై సమాచారాన్ని ట్రంప్ ఎప్పటికప్పుడు మోదీతో పంచుకుంటున్నారని ఆయన చెప్పారు.

భారత్ తమకు మిత్ర దేశం మాత్రమే కాదని, అత్యంత కీలక వ్యూహాత్మక భాగస్వామి అని తెలిపారు అమెరికా రాయబారి సెర్గియో గోర్. ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక బంధం అత్యంత పటిష్టంగా ఉందని స్పష్టం చేశారు. వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలపడుతోందని పేర్కొన్నారు. ఇంధన రంగంతో పాటు పలు ముఖ్య ఒప్పందాలు వచ్చే రోజుల్లో ఖరారు అయ్యే అవకాశముందని చెప్పారు. భారత్-అమెరికా సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా మోదీ, ట్రంప్‌ల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు. ప్రజాస్వామ్య విలువల ఆధారంగా ఏర్పడిన ఈ బంధం రానున్న రోజుల్లో మరింత బలపడుతుందని సెర్గియో గోర్ ఆశాభావం వ్యక్తం చేశారు. భవిష్యత్తులో కూడా ఇరు దేశాలు పరస్పరం సహకరించుకుంటూ ముందుకెళ్తాయని సెర్గియో గోర్ పేర్కొన్నారు. చర్చల అనంతరం ట్రంప్‌ 'మేమంతా మిమ్మల్ని ఇష్టపడుతున్నాం' అంటూ ప్రధాని మోదీకి చెప్పిన తర్వాత ఈ సంభాషణ ముగిసిందని సెర్గియో గోర్ తెలిపారు.

కొద్ది వారాల్లోనే అమెరికా- భారత్ మధ్య రక్షణ, ద్వైపాక్షిక అంశాలపై కీలక ఒప్పందాలు జరిగే అవకాశం ఉందన్న సంకేతాలను సెర్గియో గోర్ ఇచ్చారు. ఇరు దేశాల మధ్య అత్యంత భారీ ఒప్పందాలు లేదా ప్రకటనలు వెలువడే అవకాశం ఉంది. సెర్గియో గోర్ ఇటీవల వాషింగ్టన్​వెళ్లి అమెరికా అధికారులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారత్‌తో సంబంధాలను మరింత బలోపేతం చేసే దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నట్లు ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతోంది.ఇదిలా ఉంటే.. అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో వచ్చే నెలలో తొలిసారిగా భారత్‌లో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన ఢిల్లీతో పాటు దేశంలోని ఇతర నగరాలను కూడా సందర్శించేందుకు ఆసక్తి చూపుతున్నారని గోర్ తెలిపారు. ఇదే సమయంలో, భారత్ ఆతిథ్యమివ్వనున్న క్వాడ్ దేశాల మంత్రుల స్థాయి సమావేశానికి కూడా అమెరికా ప్రతినిధులు హాజరుకానున్నారు. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో శాంతి, స్థిరత్వం కోసం ఈ సమావేశం కీలకం కానుంది.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story