Burning Topic: మోదీ పుతిన్ భేటీలో కీలక నిర్ణయాలు ఒప్పందాలు!
Burning Topic: ఢిల్లీలో ప్రధాని మోదీ, రష్యా అధ్యక్షుడు పుతిన్ భేటీ. S-400, సుఖోయ్-57 టెక్నాలజీ, బ్రహ్మోస్ అప్‌గ్రేడ్‌పై కీలక చర్చలు.
Burning Topic: మోదీ పుతిన్ భేటీలో కీలక నిర్ణయాలు ఒప్పందాలు!
Burning Topic: భారత్, రష్యాల మధ్య దశాబ్దాలుగా అత్యంత బలమైన, వ్యూహాత్మక దౌత్య సంబంధాలు కొనసాగుతున్నాయి. సోవియట్ యూనియన్ కాలం నాటి నుంచే భారత్‌కు రష్యా నమ్మకమైన మిత్రదేశంగా ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 12-13 తేదీలలో ఢిల్లీలో జరగనున్న బ్రిక్స్ దేశాల శిఖరాగ్ర సమావేశానికి రష్యా అధ్యక్షుడు పుతిన్ రాకకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ సమావేశాలకు ఒక రోజు ముందుగా పుతిన్‌తో ప్రధాని నరేంద్ర మోదీ భేటీ కానున్నారు. భారత్ తమకు వ్యూహాత్మక భాగస్వామి అని.. ఇరుదేశాల మధ్య భద్రత, అంతరిక్షం, ఇంధనం, రవాణా, సైన్స్ అండ్ టెక్నాలజీ సహా పలు రంగాలలో సహకారం విస్తరిస్తోందన్నారు రష్యన్ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఇరు దేశాల నేతలు ద్వైపాక్షిక సమావేశంలో వాణిజ్యం, ఆర్థిక సంబంధాలకు పెద్దపీట వేయనున్నారు. ఉక్రెయిన్‌తో యుద్ధం, పశ్చిమాసియా ఉద్రిక్తతలు, ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై దాని ప్రభావం వంటి విషయాలపైనా చర్చలు కొనసాగనున్నాయి.
ప్రపంచ భౌగోళిక రాజకీయాలు, ప్రాంతీయ ఉద్రిక్తతల నేపథ్యంలో ఈ ఇద్దరు అగ్ర నాయకుల మధ్య జరగున్న చర్చల మీద అందరి అసక్తీ కేంద్రీకృతమైంది. ఈసారి చర్చల అజెండాలోమూడు ప్రధాన అంశాలు ఉన్నాయి. అవే ఎస్-400 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్, రష్యాకు చెందిన ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ సుఖోయ్-57 సాంకేతిక బదిలీ, అత్యంత శక్తివంతమైన బ్రహ్మోస్ క్షిపణి అప్‌గ్రేడేషన్. ఈ రక్షణ ఒప్పందాలు కార్యరూపం దాల్చితే ఆసియా ఖండంలో భారత్ రక్షణ ముఖచిత్రం పూర్తిగా మారిపోనుంది. అమెరికా, ఫ్రాన్స్, ఇజ్రాయెల్ దేశాల నుంచి కూడా భారత్ భారీగా రక్షణ ఉత్పత్తులు కొనుగోలు చేస్తుండటంతో రష్యా తన విధానాలను మార్చుకుంది. ఉక్రెయిన్ యుద్ధం, పాశ్చాత్య దేశాల ఆంక్షల నడుమ భారత్ లాంటి నమ్మకమైన భాగస్వామిని మరింత చేరువ చేసుకునేందుకు, ఏకంగా సాంకేతికతనే పంచుకోవడానికి సిద్ధపడింది. సంయుక్త తయారీ, కొత్త టెక్నాలజీ, దేశీయ తయారీ ఇవే భవిష్యత్ భారత్-రష్యా రక్షణ బంధానికి పునాది కానున్నాయి.
దశాబ్దాలుగా భారత్‌కు భారత్ ప్రధాన ఆయుధ సరఫరాదారు. ఇరు దేశాల రక్షణ సహకారంలో ఎస్-400 వైమానిక రక్షణ వ్యవస్థ కీలకమైనది. భారత్ గతంలో రష్యాతో ఐదు ఎస్-400 వ్యవస్థల కోసం ఒప్పందం చేసుకుంది. 2018లో రష్యాతో భారత్ 5.43 బిలియన్ డాలర్ల ఒప్పందం కుదుర్చుకుంది. వాటిల్లో మూడింటిని ఇప్పటికే రష్యా నుంచి డెలివరీ తీసుకుంది. మిగిలిన రెండింటినీ ఈ ఏడాది చివర్లో అందుకోవాల్సి ఉంది. శత్రు దేశాల నుంచి దూసుకొచ్చే విమానాలు, క్రూయిజ్ క్షిపణులు, బాలిస్టిక్ మిస్సైళ్లను గాలిలోనే పసిగట్టి నిర్వీర్యం చేయగల శక్తివంతమైన వ్యవస్థ ఎస్-400. భారత వాయు రక్షణలో కీలకమైన ఈ ఎస్-400 సిస్టమ్స్ తదుపరి రెండు యూనిట్లను 2026 నాటికి పూర్తి స్థాయిలో సరఫరా చేయడానికి కట్టుబడి ఉన్నామని రష్యా తాజాగా ప్రకటించింది. రక్షణ కొనుగోళ్ల మండలి కూడా అదనపు వ్యవస్థల కొనుగోలుకు పచ్చజెండా ఊపిన నేపథ్యంలో ఈ డెలివరీలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది.
మోదీ-పుతిన్ భేటీలో మరో అత్యంత ఆసక్తికరమైన అంశం ఎస్‌యు-57 ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్. శత్రు రాడార్లకు చిక్కకుండా లక్ష్యాలను ఛేదించగల ఈ అధునాతన యుద్ధ విమానాన్ని భారత్‌కు విక్రయించేందుకు రష్యా గట్టి ప్రయత్నాలు చేస్తోంది.. అయితే భారత్ కేవలం విమానాలను కొనుగోలు చేయడంపైనే కాకుండా టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌పై కూడా ఆసక్తి చూపుతోంది. ఎస్‌యు-57 తయారీకి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానాన్ని భారత్‌లోకి తీసుకురావడం ద్వారా దేశీయంగా తయారీ సామర్థ్యాన్ని పెంచుకోవాలన్నది లక్ష్యంగా కనిపిస్తోంది. 'మేక్ ఇన్ ఇండియా'లో భాగంగా కేవలం కొనుగోలు దారుడిగా మిగిలిపోకుండా, సాంకేతిక బదిలీ జరగాలని భారత్ కోరుతోంది.ఆధునిక రాడార్, ఎలక్ట్రానిక్ వార్‌ఫేర్ సిస్టమ్స్, సెన్సార్ ఇంటిగ్రేషన్ ఇంజిన్ తయారీ వంటి అత్యంత సున్నితమైన సాంకేతికతను పంచుకోవడంపై ఇరు దేశాల శాస్త్రవేత్తలు, అధికారుల మధ్య లోతైన చర్చలు జరుగుతున్నాయి.
ఇక భారత్, అమెరికా నాయకుల మధ్య జరగనున్న చర్చల్లోని మూడో కీలక అంశం.. బ్రహ్మోస్ సూపర్ సోనిక్ క్రూయిజ్ మిస్సైల్ వ్యవస్థ అభివృద్ధి. భారత్-రష్యా సంయుక్త రక్షణ సహకారానికి ప్రతీకగా నిలిచిన బ్రహ్మోస్ సూపర్‌సోనిక్ క్రూయిజ్ మిసైల్‌ను కూడా మరింత అభివృద్ధి చేయాలని ఇరు దేశాలు భావిస్తున్నాయి. ఇప్పటికే భూ, జల, వాయు మార్గాల నుంచి ప్రయోగించేలా బ్రహ్మోస్ సక్సెస్ అయింది. ఇప్పుడు దీని రేంజ్, ఫీచర్లను పెంచి మరింత ఆధునీకరించాలని రష్యా కోరుతోంది. ఇలా చేయడం ద్వారా అంతర్జాతీయ డిఫెన్స్ మార్కెట్‌లో బ్రహ్మోస్‌ను ప్రధాన ఆకర్షణగా మార్చాలనేది ఇరు దేశాల ఆలోచన. బ్రహ్మోస్‌కు అదనపు సామర్థ్యాలు, కొత్త ఫీచర్లు జోడించి దాని పనితీరును పెంచడం గురించి చర్చలు జరుగుతున్నాయని రష్యా అధికార ప్రతినిధి పెస్కోవ్ తెలిపారు. ఇది కేవలం భారత సైనిక సామర్థ్యాన్ని పెంచడమే కాకుండా భవిష్యత్తులో రక్షణ ఎగుమతులకు కూడా ఉపయోగపడే అవకాశం ఉంది.




