Burning Topic: నక్సల్స్‌పై మోదీ వ్యాఖ్యలతో కలకలం!
Burning Topic: స్వాతంత్ర్య దినోత్సవ వేదికపై ప్రధాని మోదీ ‘దిమాగీ నక్సల్స్’ వ్యాఖ్యలతో రాజకీయ వేడి. కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య తీవ్రస్థాయిలో సవాల్ ప్రతిసవాళ్లు.
Burning Topic: నక్సల్స్‌పై మోదీ వ్యాఖ్యలతో కలకలం!
Burning Topic: స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎర్రకోట వేదికగా చేసే ప్రసంగంపై దేశ ప్రజలతో పాటు ప్రపంచమంతా ఆసక్తిగా గమనించడం సహజం. ఈసారి మోదీ ప్రసంగంలో చేసిన దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. అభివృద్ధి చెందిన దేశాన్ని నిర్మించడంలో యువత నాయకత్వం వహించాలని వారిని కోరారు. సమాజాన్ని తప్పుడు మార్గంలోకి లాగడానికి కుయుక్తులు పన్నుతుపన్నేవారిపట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు.
దేశంలో మావోయిస్టు తీవ్రవాదం అంతమైనప్పటికీ దిమాగీ నక్సల్స్ మాత్రం సమాజానికి ముప్పుగా మారారన్నారు.. ‘అడవుల్లో సాయుధ నక్సల్స్‌ను మనం వదిలించుకున్నాం. కానీ హింస, అశాంతిని సృష్టించడానికి ‘దిమాగీ నక్సల్స్’ అవకాశాల కోసం చూస్తున్నారు. వారు సమాజాన్ని తప్పుదోవ పట్టించాలనుకుంటున్నారు. ఈ ‘దిమాగీ నక్సల్స్’ ను గుర్తించి, వారిని ఏకాకులను చేయాలి. యువతను ప్రధాన స్రవంతిలోకి తీసుకురావాలి’ అంటూ పిలుపునిచ్చారు మోదీ.
దిమాగీ నక్సల్స్ విషయంలో ప్రధాని మోదీ ప్రజలకు ఇచ్చిన పిలుపు చర్చనీయాంశంగా మారిపోయింది. ఈ వ్యాఖ్యల పట్ల అధికార, విపక్షాల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. మోదీ వ్యాఖ్యల పట్ల కాంగ్రెస్ సహా ప్రతిపక్ష నేతలు ఆగ్రహం వ్యక్తంచేశారు. అసమ్మతిని అణచివేయడానికే విపక్షాలపై దిమాగీ నక్సలైట్ అంటూ ముద్ర వేస్తున్నారని ఆరోపించారు. మోదీ వ్యాఖ్యలను కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ తప్పుబట్టారు.
దిమాగీ నక్సల్స్ అనే పదం ఎక్కడాలేదన్నారు. రెండు, మూడేళ్ల క్రితం రాజకీయ ప్రత్యర్థులను అర్బన్ నక్సల్స్ అనే పదంతో ప్రధాని విమర్శించేవారిని ఆయన చెప్పారు. దిమాగీ నక్సల్స్ అనే పదం కూడా అలాంటిదేనని అన్నారు. ఈ క్రమంలోనే కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ కేంద్ర హోంమంత్రి పీ చిదంబరం సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ నేను దిమాగీ నక్సల్‌గా గర్వపడుతున్నాను అంటూ బాహాటంగా ట్వీట్ చేసి ప్రకటించున్నారాయన.
చిదంబరం పోస్టు మీద బీజేపీ నాయకులు ఘాటుగానే స్పందించారు.. యూపీఏ హయంలో ఆయన హోంమంత్రిగా ఉన్న సమయంలోనే దేశంలో వామపక్ష తీవ్రవాదం పతాక స్థాయికి చేరడంపై విమర్శలున్నాయి. 2004–2014 మధ్య నక్సలిజంపై పోరాడుతూ దాదాపు 2,000 మంది పోలీసులు, సీఆర్‌పీఎఫ్ జవాన్లు.. వేలాది ప్రజలు ఎందుకు ప్రాణాలు కోల్పోయారో తమకు ఇప్పుడు తెలిసిందని బీజేపీ జాతీయ అధికార ప్రతినిధి సంబిత్ పాత్ర వ్యాఖ్యానించారు. ఆయన హయాంలో నక్సల్స్ దాడుల వల్ల దేశానికి ఎంతో నష్టం జరిగిందరని మండిపడ్డారు.
చిదంబరం దిమాగీ నక్సల్ అనే బిరుదు తగిలించుకోవడం ఆలస్యమైనా, అది మంచి పరిణామమేనని అన్నారు. చిదంబరం కాషాయానికి ఉగ్రవాదం అంటగట్టే మేనేజ్‌మెంట్ కన్సల్టెంట్‌గా పనిచేశారు అంటూ ఆరోపించారు బీజేపీ ఎంపీ నిశికాంత్ దూబే. ఆయన నిజంగానే దిమాగా నక్సలైట్ అని విరుచుకుపడ్డారు.
మరోవైపు ప్రధాని మోదీ వ్యాఖ్యలపై ప్రతిపక్షాలు అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నాయని పార్లమెంటరీ వ్యవహారాలశాఖ మంత్రి కిరణ్ రిజిజు మండిపడ్డారు. ప్రతిపక్ష నాయకుల గురించి కాకుండా దేశ వ్యతిరేక శక్తుల గురించి మాత్రమే మాట్లాడారని స్పష్టంచేశారు. 1. మావోయిస్టులకు మద్దతు ఇస్తూ భారత రాజ్యాంగాన్ని వ్యతిరేకించేవారు. 2. వేర్పాటువాదులతో అండగా నిలుస్తూ ఆర్టికల్ 370కి మద్దతిచ్చే వారు. 4. భారతదేశం నుంచి ఈశాన్య ప్రాంతాన్ని వేరు చేయడానికి చికెన్ నెక్‌ను కత్తిరించాలని కుట్రలు సాగించేవారు మాత్రమే దిమాగీ నక్సల్స్’’ అని కిరణ్ రిజిజు ట్వీట్ చేశారు.
అయితే కిరణ్ రిజిజు చేసిన ట్వీట్‌పై కాంగ్రెస్ రాజ్యసభ ఎంపీ పవన్ ఖేరా ‘ఎక్స్’లో వ్యంగ్యంగా స్పందించారు. ‘‘ ముందు మీ లెక్కింపును సరిచేసుకోండి. అప్పుడు మేము సమాధానం ఇస్తాము. 1, 2 తర్వాత 3 వస్తుంది, 4 కాదు’’ అని పోస్టుచేశారు.
ప్రభుత్వం తమపై చేస్తున్న విమర్శలను స్వీకరించడం ద్వారా ప్రజల్లో సానుభూతి పొందవచ్చని కాంగ్రెస్ భావిస్తున్నప్పటికీ.. దిమాగీ నక్సల్స్ అనే విషయాన్ని గర్వకారణంగా చెప్పుకోవడం బెడిసికొట్టే ప్రమాదం కనిపిస్తోంది. దేశ సమగ్రత, శాంతిభద్రతలతో ముడిపడి ఉన్న నక్సలిజం భావజాలాన్ని రాజకీయ విమర్శల కోసం ఇలా వాడుకోవడం ద్వారా నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు
ప్రధాని మోదీ చెప్పిన ‘దిమాగీ నక్సల్స్’ అంటే ఢిల్లీ, ముంబై, పట్నా, కోల్‌కతాల్లోని ఏసీ గదుల్లో కూర్చుని మావోయిస్టు భావజాలాన్ని పోషించే వ్యక్తులని అర్థమని బీజేపీ సీనియర్ నాయకుడు రవిశంకర్ ప్రసాద్ అన్నారు. వారు నక్సలైట్ల ఉద్యమానికి నిధులు, మద్దతు సమకూర్చుకోవడానికి తమ నెట్‌వర్క్‌లను ఉపయోగించుకుంటారని తెలిపారు. అర్బన్ నక్సలైట్లు, దిమాగీ నక్సలైట్లు దేశ విద్రోహ కార్యకలాపాలకు మద్దతు ఇస్తారని కేంద్ర మంత్రి గిరిరాజ్ కిశోర్ మండిపడ్డారు. ఇలాంటి వారి పట్ల దేశ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
మరోవైపు ప్రధాని మోదీ దిమాగీ నక్సల్స్ వ్యాఖ్యలపై కాక్రోచ్ జనతా పార్టీ కూడా స్పందించింది. ప్రభుత్వాన్ని ప్రశ్నించినంత మాత్రాన చదువుకొన్న యువతపై ప్రధాని అటువంటి ముద్ర వేయడం తగదని సీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి సౌరవ్‌దాస్ మండిపడ్డారు. మీ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారనే కారణంతోనే ఇలా అంటారా?' అని ప్రశ్నించారు. ఇదిలా ఉంటే ప్రధాని వ్యాఖ్యలకు ప్రతిస్పందనగా ఎక్స్ , ఇన్‌స్టాగ్రామ్ వంటి ప్లాట్‌ఫామ్‌లలో ‘దిమాగీ నక్సల్ పార్టీ’, ‘దిమాగీ నక్సల్స్ జనతా పార్టీ’ పేర్లతో అనేక అకౌంట్స్ మొదలయ్యాయి.
వీటికి వేల సంఖ్యలో ఫాలోవర్లు పెరుగుతున్నారు. ‘కాక్రోచ్ జనతా పార్టీ’ తరహాలోనే ఇది కూడా నిరసన ఉద్యమంగా మారుతుందా అనే చర్చ ఊపందుకుంది.నీట్ పరీక్షల్లో అక్రమాల బాధ్యతగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాకు డిమాండ్ చేస్తూ సీజేపీ పోరాడి విజయం సాధించడం తెలిసిందే. ‘దిమాగీ నక్సల్ పార్టీ’ ఈ స్థాయిలో సక్సెస్ కాకపోవచ్చని చెప్పకతప్పదు.




