BurningTopic: ప్రపంచ పెద్దన్న గా అవతరించనున్న భారత్

BurningTopic: ప్రధాని నరేంద్ర మోదీ పారిస్ పర్యటన మరియు భారత్-ఫ్రాన్స్ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యంపై ప్రత్యేక కథనం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 20 Jun 2026 6:55 AM IST
BurningTopic
X

BurningTopic: ప్రపంచ పెద్దన్న గా అవతరించనున్న భారత్

BurningTopic: ఫ్రాన్స్‌లోని ఎవియన్‌–లెస్‌–బెయిన్స్‌లో జీ7 శిఖరాగ్ర సమావేశం పూర్తయిన తర్వాత ప్రధాని మోదీ రాజధాని పారిస్‌కు చేరుకున్నారు. అక్కడి ప్రవాస భారతీయులు మోదీకి ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఏర్పాటైన సమావేశంలో భారతీయ సమాజాన్ని ఉద్దేశించి ప్రసంగించారు ప్రధాని. భారత్-ఫ్రాన్స్ సంబంధాలపై మాట్లాడుతూ, రెండు దేశాల మధ్య విశ్వాసం, ఆవిష్కరణ, ఉమ్మడి పురోగతి బలమైన పునాదులుగా ఉన్నాయని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఈ భాగస్వామ్యం ప్రపంచానికి కొత్త అవకాశాలు, కొత్త పరిష్కారాలను అందిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.. భారత్‌ ప్రస్తుతం ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ప్రధాన ఆర్థిక వ్యవస్థగా ఎదిగిందని మోదీ తెలిపారు. ప్రతి దేశం విశ్వసనీయ సరఫరా వ్యవస్థను, సుస్థిర భాగస్వామ్యాన్ని కోరుకుంటోంది. ఇందుకోసం ప్రతి దేశం అటువంటి దీర్ఘకాల భాగస్వామి కోసం అన్వేషిస్తోంది. ప్రపంచానికి విశ్వసనీయ భాగస్వామిగా భారత్‌ అవతరిస్తోందని మోదీ పేర్కొన్నారు.

భారత్‌ భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతిబింబంగా నిలుస్తోందన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. మామూలు చాయ్‌వాలాను ప్రధానిని చేసిన భారత్‌కు 12 ఏళ్లపాటు సేవలందించడం గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. గత 12 సంవత్సరాల్లో భారతదేశ జీడీపీ రెట్టింపు కాగా, దేశంలోని విమానాశ్రయాలు, విశ్వవిద్యాలయాల సంఖ్య కూడా రెండింతలు పెరిగిందని మోడీ తెలిపారు. రహదారుల నిర్మాణ వేగం మూడింతలు పెరగగా, మెట్రో రైలు నెట్‌వర్క్ నాలుగింతలు విస్తరించిందన్నారు. 25 కోట్ల మంది పేదరికం కోరల నుంచి బయటపడ్డారు. సాధికారికత దిశగా దేశం సాగుతోంది. ప్రజల జీవితాలు మారుతున్నాయి. ప్రపంచ రూపురేఖలను మార్చే స్థాయికి భారత్‌ ఎదిగింది. భారత్‌ - ఫ్రాన్స్‌ తమ సంబంధాలను ప్రత్యేక అంతర్జాతీయ వ్యూహాత్మక భాగస్వామ్య స్థాయికి పెంచుకున్నాయి. వచ్చే ఏడాది ఇరుదేశాలు కలిసి ప్రపంచంలో నీటి, ఆహార భద్రతకు ఉపయోగపడే ‘తృష్ణ’ అనే ఉపగ్రహాన్ని నింగిలోకి పంపనున్నాయి’’ అని ప్రధాని మోదీ తెలిపారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని అందరికీ అందుబాటులోకి తీసుకురావాలన్నదే తమ లక్ష్యమని ప్రధాని మోదీ తెలిపారుతమ దృష్టిలో ఏఐ అంటే ‘అందరినీ కలుపుకొని పోయేది’అని తెలిపారు. పారిస్‌లో వివాటెక్‌–2026 టెక్నాలజీ సదస్సులో ఆయన మాట్లాడారు. భారతదేశ సాంకేతిక సామర్థ్యాన్ని ప్రస్తావించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే డిజిటల్‌ లావాదేవీల్లో సగం తమ దేశంలోనే జరుగుతున్నాయని గుర్తుచేశారు. ఆర్థిక సమ్మిళితం, విద్య, టెలిమెడిసిన్, వ్యవసాయం, ఇతర రంగాల్లో సాంకేతికతను భారీ స్థాయిలో వినియోగిస్తున్నామని తెలిపారు.సాంకేతికత, నూతన ఆవిష్కరణలు అందరికీ అందుబాటు ఉండడం చాలా ముఖ్యమని ఉద్ఘాటించారు. సాంకేతికత ప్రజాస్వామీకరణతోనే పురోగతి సాధ్యపడుతుందని వివరించారు. ఈ విప్లవాత్మక మార్పుల యుగంలో టెక్నాలజీ అందరికీ ప్రయోజనం చేకూర్చాలని భారత్‌ విశ్వసిస్తోందని అన్నారు. ఏఐ అనేది ప్రజల జీవితాలను మెరుగుపరచాలని వ్యాఖ్యానించారు.

భారత్‌లో వ్యాపార అభివృద్ధికి, విస్తరణకు అద్భుతమైన అవకాశాలు ఉన్నాయని, పెట్టుబడులతో రావాలని ఫ్రాన్స్‌ పారిశ్రామికవేత్తలకు మోదీ పిలుపునిచ్చారు...పారిస్‌లో అగ్రశ్రేణి కంపెనీల సీఈఓలుతో సమావేశమైన ప్రధాని పెట్టుబడి అవకాశాలు, విస్తరణ ప్రణాళికలపై చర్చించారు. సెయింట్‌ గోబైన్‌ సంస్థ సీఈఓ బెనాయిట్‌ బెజిన్, అల్‌స్టామ్‌ సీఈఓ మార్టిన్‌ సియోన్, మిస్ట్రాల్‌ ఏఐ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ ఆర్థర్‌ మెన్స్‌ను మోదీ కలుసుకున్నారు. భారత్ భవిష్యత్‌ తరాలకు వృద్ధి, ఆవిష్కరణలు, అవకాశాలు కల్పించే రంగాల్లో పెట్టుబడులు పెడుతోందన్నారు. మా ప్రభుత్వం మీకు అన్ని విధాలా సహకరిస్తుంది. పరిశ్రమలు ఆవిష్కరణలు చేస్తాయి. స్టార్టప్‌లు విప్లవాత్మక మార్పులు తీసుకువస్తాయి. ప్రపంచ భాగస్వాములు మాతో కలిసి అభివృద్ధి చెందుతారు. మనమందరం కలిసి మునుపెన్నడూ లేనంత వేగంగా ముందుకు సాగుదాం’’అని పారిశ్రామికవేత్తలకు సూచించారు. తమతో కలిసి పని చేయాలని, అందరికీ ఫలితాలను అందించాలని కోరారు.

ప్రపంచవ్యాప్తంగా అస్థిరత, అనిశ్చితి నెలకొన్న రోజుల్లో భారత్-ఫ్రాన్స్ సంబంధాలు పరస్పర నమ్మకానికి, సహకారానికి ఒక బలమైన లంగరు లాంటివని ప్రధాని మోదీ అన్నారు. రెండు దేశాల మధ్య బంధాన్ని ఈ ఏడాది ప్రత్యేక ప్రపంచ వ్యూహాత్మక భాగస్వామ్యం స్థాయికి తీసుకెళ్లిందని తెలిపారు. నీస్ నగరంలో ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్‌తో జరిగిన భేటీని గుర్తుచేస్తూ.. రక్షణ, అంతరిక్షం, అణుశక్తి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్రిటికల్ మినరల్స్, హై-స్పీడ్ రైల్వేల వంటి కీలక రంగాలలో రెండు దేశాలు కలిసికట్టుగా ముందుకు సాగుతాయన్నారు..భారత్ ఎగుమతుల రంగంలో కూడా దేశం గణనీయమైన పురోగతి సాధించిందని ప్రధాని మోడీ చెప్పారు. గత 12 ఏళ్లలో భారత ఎగుమతులు మూడు రెట్లు పెరిగాయని, మొబైల్ ఫోన్ తయారీ యూనిట్ల సంఖ్య 100 రెట్లు పెరిగిందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రపంచంలో రెండవ అతిపెద్ద మొబైల్ ఫోన్ తయారీ దేశంగా భారత్‌ నిలిచిందని తెలిపారు. తయారీ రంగంలో భారత్‌ ప్రపంచానికి ప్రధాన కేంద్రంగా మారుతోందన్నారు.




హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story