Burning Topic: అణ్వాయుధాలపై పుతిన్ వార్నింగ్.. మోదీపై మాత్రం ప్రశంసల వర్షం!
Burning Topic: ఫ్లై దుబాయ్ విమానంలో కో-పైలట్ దాడిని ఎదుర్కొని, ప్రాణాలకు తెగించి విమానం కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్‌ను ప్రధాని మోదీ ఫోన్‌లో పరామర్శించారు!
Flydubai: విమానాన్ని కాపాడిన భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్!
Burning Topic: ఫ్లై దుబాయ్ విమానంలో జరిగిన అసాధారణ ఘటన యావత్ ప్రపంచాన్ని కదిలించింది. టెల్ అవీవ్‌కు వెళ్తున్న విమానం ఘోర ప్రమాదం నుంచి తప్పించుకున్న సంగతి తెలిసిందే. పైలట్‌పై కో-పైలట్ దాడి చేయడంతో విమానం అదుపుతప్పి వేగంగా కిందికి దూసుకెళ్లింది. ఆ సమయంలో విమానంలో 174 మంది ప్రయాణికులు ఉన్నారు.
వారిలో 27 మంది పిల్లలు, ఆరుగురు సిబ్బంది ఉన్నారు. విమానం అప్పటికే విమానం వందల అడుగుల మేర కిందికి దూసుకెళ్లడంతో భయాందోళనలు నెలకొన్నాయి ఇలాంటి సమయంలో ఏమాత్రం ధైర్యం కోల్పోకుండా భారతీయ పైలట్ స్మిత్ మచ్చార్ తెగువ ప్రదర్శించారు. తీవ్రంగా గాయపడి రక్తం ఓడుతున్నా లెక్క చేయకుండా కాక్‌పిట్ తలుపు తెరిచి సిబ్బందితో పాటు ప్రయాణీకులకు అప్రమత్తం చేశారు.
దీంతో కొందరు ప్రయాణికులు కాక్‌పిట్‌లోకి చేరుకొని అత్యంత ధైర్యాన్ని, సమయస్ఫూర్తిని ప్రదర్శించడంతో ఆ విమానం సురక్షితంగా ల్యాండ్ అయింది. విమానం కాక్‌పిట్‌లో వీరోచితంగా పోరాడి గాయపడిన భారత కెప్టెన్ స్మిత్ మచ్చర్ యూఏఈలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కోలుకుంటున్నారు. ఆయనను ప్రధాని నరేంద్రమోదీ ఫోన్‌లో పరామర్శించి అరోగ్య పరిస్థితి అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా తనకు ఎదురైన విపత్కర పరిస్థితి గురించి మోదీకి వివరించారు. ప్రమాద సమయంలో కెప్టెన్ స్మిత్ మచ్చర్ చూపిన ధైర్యం, సమయస్ఫూర్తి, సంయమనాన్ని ప్రధాని ప్రశంసించారు. ‘‘అత్యంత క్లిష్ట పరిస్థితుల్లో మీరు చూపించిన సమయస్ఫూర్తి, ధైర్యసాహసాలు అభినందనీయం.
మీ ప్రాణం కంటే ప్రయాణికుల భద్రత కోసం పోరాడిన మీరు ఎంతోమందికి స్ఫూర్తిదాయకం. మీరు కోలుకోవాలని యావత్ భారతావని ప్రార్థిస్తోంది. భారతీయులు ఇతరుల ప్రాణాలు తీసేవారు కాదు.. ఇతరులను రక్షించడం కోసం తమ సొంత ప్రాణాలను పణంగా పెట్టడానికి సిద్ధపడతారని మన దేశం గర్వంగా చెప్పగలదు’’ అని స్మిత్‌ను అభినందించారు మోదీ.
ప్రధాని మోదీ స్వయంగా తనకు ఫోన్ చేసి పరామార్శించడంతో కెప్టెన్ స్మిత్ భావోద్వేగానికి లోనయ్యారు. తాను గత 11 ఏళ్లుగా కెప్టెన్‌గా పనిచేస్తున్నానని. విమానంలో ఏం జరుగుతుందో కళ్లు మూసుకుని కూడా తెలుసుకోగలనని తెలిపారు. తీవ్ర గాయాలతో కింద పడిపోయినప్పుడు, విమానం వేగంగా కిందికి పడిపోతోందని గ్రహించాను.
అవే చివరి క్షణాలు అని గ్రహిం ఏదో ఒకటి చేయాలని నాకు నేను ధైర్యం చెప్పుకున్నా. సాధారణంగా నేను ఎప్పుడైనా ఇబ్బందుల్లో ఉంటే హనుమాన్ చాలీసా పఠిస్తాను. ఆ సమయంలో కూడా అదే చేశా. ఆ దేవుడే నన్ను కాపాడాడని నేను నమ్ముతున్నా. వెంటనే తేరుకుని కాక్‌పిట్ తలుపు తెరిచాను.
మిగతా వారు లోపలికి వచ్చి ఈ ప్రమాదాన్ని తప్పించడంలో ఎంతో సాయపడ్డారు. మీరు నన్ను ప్రోత్సహిస్తున్న తీరుపట్ల నాకు ఎంతో గర్వంగా ఉంది. మీరే నాకు ఆదర్శం. మీతో మాట్లాడే అవకాశం లభిస్తుందని నేను ఎప్పుడూ అనుకోలేదు. ఇది నాకెంతో ప్రత్యేకమైన క్షణం" అని కెప్టెన్ స్మిత్ మచ్చర్ పేర్కొన్నారు.
కత్తిపోట్లతో తీవ్రంగా గాయపడినా.. విమానాన్ని కాపాడేందుకు చివరి వరకు పోరాడిన భారత పైలట్ స్మిత్ మచ్చర్ ఇప్పుడు అంతర్జాతీయంగా ప్రశంసలు అందుకుంటున్నారు.స్మిట్ మచ్చర్ కు బోయింగ్ 737 విమానాలను నడపండంలో 13 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. సుమారు 9,750 గంటలకు పైగా విమానాలను నడింపించారు 2011లో స్పైస్‌జెట్‌లో చేరిన మచ్చర్.
అక్కడ లైన్ ట్రైనింగ్ కెప్టెన్, సీనియర్ కమాండర్‌గా పనిచేశారు. 2022 జూన్‌లో స్పైస్‌జెట్‌ను వీడి ఫ్లై దుబాయ్‌లో డైరెక్ట్ ఎంట్రీ కెప్టెన్‌గా చేరారు. ఆయన సోదరుడు కూడా ఇటీవల ఫ్లై దుబాయ్‌లో చేరినట్లు సమాచారం.
ఆయన గత ఏడాది ఇచ్చిన ఓ పాడ్‌కాస్ట్‌లో.. ఫ్లైట్ ప్రయాణికుల్లో డాక్టర్లు ఉండడం ఎంత అవసరమో వివరించారు స్మిత్ మచ్చర్. మనం గాల్లో ఉన్నప్పుడు అనుకోనిది జరిగితే..? పరిస్థితి ఏమిటి? ప్రయాణికుల్లో డాక్టర్లు, నర్సులు ఉంటే ఆ ఆపద తొలుగుతుంది. అని వ్యాఖ్యానించారు. కాక్‌పిట్ ఘటనలో తీవ్రంగా గాయపడిన మచ్చర్‌కు టబుక్ ఆసుపత్రిలో చికిత్స కొనసాగుతోంది.
కెప్టెన్ స్మిత్ మచ్చర్‌తో పాటు విమానాన్ని కాపాడంలో ఇజ్రాయెల్‌కు చెందిన యానివ్ హయూన్, జ్వికా మానెస్, అసఫ్ రాజువాన్, డాక్టర్ షోటా ముసాయెవ్ కీలకంగా వ్యవహరించారు. ముఖ్యంగా
యానివ్ హయూన్ కాక్‌పిట్‌లోకి వెళ్లి దాడి చేసిన కో పైలట్‌ను నియంత్రించడంలో సహకరించారు. తీవ్రంగా గాయపడి నేలపై పడివున్న మచ్చార్‌ను చూసి ‘‘నువ్వు చనిపోవు బ్రో.. నీకేం కాదు’’ అంటూ ధైర్యం చెప్పారు. ఆ సమయంలో విమానం స్థిరపడేందుకు కంట్రల్ యోక్‌ను వెనక్కి లాగారు.
విమాన ప్రమాదాలపై రూపొందించే టీవీ కార్యక్రమం మేడే చూస్తుంటానని, అందులో చూసిన విషయాలు ఆ సమయంలో గుర్తొచ్చాయని యానివ్ తెలిపారు. మచ్చార్‌కు సాయం చేసిన యానివ్ హయూన్ రక్తపు దుస్తులతోనే ఇజ్రాయెల్‌లో అడుగుపెట్టాడు. నేరుగా ప్రధాని బెంజమిన్ నెతన్యాహును కలిసి జరిగింది వివరించారు.
మచ్చార్ గాయపడినప్పటికీ కాక్‌పిట్ తలుపు తెరవడం వల్లే మిగతావారు లోపలికి వెళ్లగలిగారని చెప్పారు. యానివ్ హయూన్ సాహసాన్ని ప్రశంసించారు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ. విమానం కో–పైలట్‌ను అదుపులోకి తీసుకోవడంలో జ్వికా మానెస్, అసఫ్ రాజువాన్ కీలకంగా వ్యవహరించారు.
బ్యాంక్ లియూమి అండర్‌రైటింగ్ కంపెనీ సీఈవో అయిన మానెస్.. విమానంలోని హెడ్‌ఫోన్ కేబుళ్లతో దాడి చేసిన వ్యక్తిని కట్టేశారు. ఇన్సూరెన్స్ ఏజెన్సీ నిర్వహించే రాజువాన్ కో–పైలట్‌ను పట్టుకొని, విమానం సురక్షితంగా ల్యాండ్ అయ్యే వరకు పరిస్థితిని అదుపులో ఉంచినట్లు ఆయన తెలిపారు.
ఈ ఘటనలో డాక్టర్ షోటా ముసాయెవ్ తీవ్రంగా గాయపడిన కెప్టెన్ మచ్చార్ తలకు, చేతులకు ప్రాథమిక వైద్యం అందించి రక్తస్రావాన్ని ఆపేందుకు ప్రయత్నించారు. విమానం అత్యవసరంగా ల్యాండ్ అయ్యే వరకు ఆయన పరిస్థితిని స్థిరంగా ఉంచడంలో ముసాయెవ్ సహకరించారు. ఈ ఘటనలో ప్రాణాలకు తెగించి స్పందించిన నలుగురు ఇజ్రాయెలీలకు దేశ అత్యున్నత పౌర వీరత్వ పురస్కారానికి సిఫార్సు చేయనున్నట్లు ఇజ్రాయెల్ అధ్యక్షుడు ఐజాక్ హెర్జోగ్ ప్రకటించారు.
కాగా కాక్‌పిట్‌లో పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత విమానంలో ప్రయాణిస్తున్న ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్లు కంట్రోల్స్ చేపట్టారు. వారి సహాయంతో విమానం మళ్లీ స్థిరపడింది. అనంతరం అత్యవసర పరిస్థితిని ప్రకటించి సౌదీ అరేబియాలోని తబుక్ విమానాశ్రయానికి మళ్లించారు. అయితే భద్రతా కారణాల దృష్ట్యా ఆ ఇద్దరు ఆఫ్-డ్యూటీ పైలట్ల పేర్లను ఫ్లై దుబాయ్ సంస్థ గానీ,
దర్యాప్తు సంస్థలు గానీ ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. వీరందరి కృషి కారణంగానే విమానంలోని మొత్తం 174 మంది సురక్షితంగా బయటపడ్డారు. లేకుంటే మరో 9/11 ఘటన అయ్యేది. కాగా ఫ్లైదుబాయ్ ఘటన వెనుక కో–పైలట్ ఉద్దేశం ఏమిటన్నది ఇంకా దర్యాప్తులోనే ఉంది. ఫ్లైదుబాయ్ కూడా అధికారులతో కలిసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఘటన అనంతరం FZ1073 టబుక్‌లో సురక్షితంగా దిగిందని, ప్రయాణికులందరూ క్షేమంగా ఉన్నారని సంస్థ అధికారికంగా వెల్లడించింది.




