Off The Record: దేశం ముందు 'పొదుపు' సవాల్: ప్రధాని మోడీ పిలుపు.. ఆచరణలో నాయకత్వం!

Off The Record: ఇప్పుడు దేశం పొదుపు మంత్రం జపిస్తోంది. చమురు నుంచి బంగారం దాకా.. నూనే నుంచి విదేశీ పర్యటనల దాకా ఆచితూచి అడుగు వేయాలనే పిలుపులు, ప్రకటనలు వినిపిస్తున్నాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 May 2026 11:04 AM IST
Off The Record
X

Off The Record: దేశం ముందు 'పొదుపు' సవాల్: ప్రధాని మోడీ పిలుపు.. ఆచరణలో నాయకత్వం!

Off The Record: ఇప్పుడు దేశం పొదుపు మంత్రం జపిస్తోంది. చమురు నుంచి బంగారం దాకా.. నూనే నుంచి విదేశీ పర్యటనల దాకా ఆచితూచి అడుగు వేయాలనే పిలుపులు, ప్రకటనలు వినిపిస్తున్నాయి. ఏడాది పాటు బంగారం కొనొద్దన్న మోడీ.. ఆ మరుసటి రోజే తన కాన్వాయ్‌ వాహనాలను తగ్గించి తొలి అడుగు వేశారు. అదే బాటను ఎన్డీయే మిత్రపక్షాలు అందిపుచ్చున్నాయి. సీఎం నుంచి మంత్రుల దాక వాహనాల సంఖ్యను తగ్గించాయి. దీన్ని జనాలు కూడా పాటించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందా..? నా దేశం.. నా బాధ్యత స్లోగన్ మరింత ఉధృతం కావాల్సిన అవసరం ఏర్పడిందా..? ఇప్పుడు దేశం ఏకతాటిపై నిలబడాల్సిన సందర్భంగా వచ్చిందా..? ఇది భారత్ ప్రభుత్వ వైఫల్యం అని.. ప్రతిపక్షాలు చేస్తోన్న ఆరోపణల సంగతి ఏంటి..? దీన్ని ఎలా చూడాలి.

పశ్చిమాసియాలో యుద్ధంతో ప్రపంచం ఇప్పుడు క్లిష్ట సమయాన్ని ఎదుర్కొంటోంది. మెల్ల మెల్లగా ప్రపంచ దేశాలు.. ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్నాయి. ఆ ప్రభావం భారత్‌పైనా భారీగానే ఉంది. ఇప్పటికే చమురు, గ్యాస్ కష్టాలు ఎదుర్కొంటోంది. గల్ఫ్‌లో యుద్ధం ఎప్పుడు ముగిస్తుందో.. మళ్లీ సాధారణ పరిస్థితులు ఎప్పుడు నెలకొంటాయో తెలియని పరిస్థితి. ఓ వైపు చమురు కొరత వల్ల క్రూడాయిల్ ధరలకు రెక్కలొచ్చాయి. ఇటు బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మరోవైపు డాలర్‌తో పోల్చితే.. రూపాయి విలువ పతనం అవుతోంది. దీంతో చమురును, గోల్డ్‌ను భారీగా దిగుమతి చేసుకుంటోన్న భారత్‌.. విదేశీ మారక నిల్వలను కోల్పోయింది. దీనికి తోడు వంట నూనే, ఎరువుల దిగుమతికి.. డాలర్ల రూపంలో భారీగా చెల్లింపులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. గల్ఫ్‌లో యుద్ధం వల్ల మన ఎగుమతులు తగ్గగా అదే టైంలో దిగుమతుల భారం పెరగడంతో భారత్‌ ఇప్పుడు క్లిష్ట సమయాన్ని ఫేజ్ చేస్తోంది. ఫారెన్ రిజర్వ్స్‌ కరిగిపోతుండటమే ప్రస్తుతం భారత్‌ ముందున్న సవాల్.

మొన్న హైదరాబాద్‌ పర్యటనలో పెట్రోల్, డీజిల్, వంట నూనె, ఎరువుల వాడకాన్ని తగ్గించాలని, ఏడాది పాటు బంగారం కొనొద్దని, ఐటీలో వర్క్‌ఫ‌్రమ్‌ హోం పద్దతి పాటించాలని హెచ్చరించిన మోడీ.. పొదుపు మంత్రలో మరో అడుగు ముందుకు వేశారు. స్వయంగా తన కాన్వాయ్‌లోని వాహనాల సంఖ్యను తగ్గించి

యావత్ భారతాన్ని ఆలోచింపజేశారు. ఈ క్లిష్ట సమయాన్ని అందరం కలిసికట్టుగా ఎదుర్కోవాలనే మెసేజ్‌ పంపించారు. ప్రధానితో సహా కేంద్ర మంత్రులు కూడా ఇదే సూత్రాన్ని ఫాలో అవుతున్నారు. మోడీ పిలుపును ఇటు ఎన్డీయే భాగస్వామ్య పక్షాలు కూడా పాటిస్తున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు తన కాన్వాయ్ వాహనాలను తగ్గించారు. అలాగే నో వెహికల్ డే అంటూ మంత్రివర్గ సభ్యులకు ఆర్డర్స్ ఇచ్చారు. నా దేశం.. నా బాద్యత అంటూ ప్రధాని నిర్ణయానికి మరింత బలం చేకూర్చే ప్రయత్నం చేశారు.

మోడీ ఇచ్చిన పొదుపు మంత్రాన్ని ఇప్పుడు యావత్ దేశం పాటించాల్సిన ఆవశ్యకత ఏర్పడిందా..? కష్ట సమయాల్లో ప్రధానికి దేశం అండగా నిలవాల్సిన సందర్భం ఏర్పడిందా.? చమురు, బంగారం, వంట నూనెలు, ఎరువుల వాడకాన్ని తగ్గించి.. తద్వారా విదేశీ మారక నిల్వలను కాపాడుకోవడంలో జాగరుకతతో వ్యవహరిస్తారా..? ఇదే ఇప్పుడు అందరి ముందున్న ప్రశ‌్న. ప్రజావసరాల వినియోగంలో పౌరులు జాగ్రత్తగా మెలగాలని, అదే దేశానికి మీరు చేసే గొప్ప సేవ అంటూ ఒక దేశ ప్రధాని ఊరికే అంటారా..? పిలుపు ఇవ్వడమే కాదు.. తన భద్రతను సైతం లెక్క చేయకుండా ఆచరణలో చూపిస్తున్నారంటే.. ఆ పిలుపును పాటించడం దేశానికి ఇప్పుడు ఎంత అవసరమో తెలుస్తోంది. మరి భారత ప్రజలు దీన్ని చెవికి ఎక్కించుకుంటారా..? లేక మనకెందుకులే అని భవిష్యత్తులో ఆర్థిక ఇబ్బందులను మరింతగా కొని తెచ్చుకుంటారా..? ముఖ్యంగా చమురు వినియోగమే మన భారత్‌కు..అతిపెద్ద గుది బండగా మారుతోంది. ఏటా లక్షల కోట్ల ఖర్చు చేస్తున్నాం. ఈ విషయంలో భారత్ ఎంత పొదుపు పాటిస్తే అంత మంచిది. వర్క్‌ ఫ్రం హోమ్‌కు అవకాశం ఉన్న చోట ఆ పద్దతిని పాటిస్తే.. పొదుపు ఉద్యమానికి సహరించిన వారు అవుతారు. అలాగే ప్రజా రవాణాను మరింత మెరుగుపరిస్తే.. వ్యక్తిగత వాహనాల వినియోగాన్ని కొంత వరకు నివారించవచ్చు.

పశ్చిమాసియా సంక్షోభంతో కుదేలైన చాలా దేశాలు ఇప్పటికే పొదుపు చర్యలు అమలు చేస్తున్నాయి. దాదాపు 40కి పైగా దేశాలు నెలరోజులుగా కఠిన పొదుపు చర్యలు పాటిస్తున్నాయి. ప్రజా రవాణా వినియోగాన్ని ప్రోత్సహిస్తున్నాయి. వర్క్‌ ఫ్రం హోమ్‌కు వెసులుబాటు కల్పిస్తున్నాయి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story