Off The Record: మోదీ చెబితే వినాలి.. ఎందుకంటే?
Off The Record: ప్రధాని నరేంద్ర మోదీ దేశ ప్రజలకు సంచలన పిలుపునిచ్చారు. ఏడాది పాటు బంగారం కొనవద్దని ఆయన కోరడం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
Off The Record: మోదీ చెబితే వినాలి.. ఎందుకంటే?
Off The Record: ఏడాది పాటు ఎవరూ బంగారం కొనొద్దు. తద్వారా విదేశీ మారక నిల్వలను భారీగా ఆదా చేయొచ్చు. భాగ్యనగరం పర్యటనలో మోడీ ఇచ్చిన ఈ పిలుపు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఐతే గతంలో ఎన్ని సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినా ఏ ప్రధానీ చేయని విధంగా.. కొన్ని రోజుల పాటు బంగారం కొనకూడదని మోడీ ప్రకటన చేయడం అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇంతకు గోల్డ్ ఎందుకంత కీలకం అంటే.? భారతదేశం తన అవసరాలకు కావాల్సిన 85 శాతం ముడి చమురును ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటోంది. బంగారం కూడా భారీగా దిగుమతి అవుతోంది. ఏటా 700-800 టన్నుల బంగారం వినియోగిస్తుంటే అందులో దేశీయంగా ఉత్పత్తి అయ్యేది పరిమితమే. అంటే 90 శాతానికి పైగా బంగారం దిగుమతి చేసుకుంటున్నాం.
బంగారం, ముడి చమురుకు అమెరికన్ డాలర్లలోనే చెల్లింపులు చేయాలి. అంటే మనం ఎంత ఎక్కువగా ఈ రెండూ దిగుమతి చేసుకుంటే ఆమేర మన ఖజానాలోని విదేశీ మారకపు నిల్వలు బయటకు వెళ్తాయి. దీనివల్ల అంతర్జాతీయ మార్కెట్లో డాలర్‌కు డిమాండ్ పెరిగి, భారత రూపాయి విలువ పడిపోతుంది
పశ్చిమాసియాలో యుద్ధం కారణంగా అంతర్జాతీయ విపణిలో ముడిచమురు ధరలు, ఎరువుల ధరలు భారీగా పెరిగాయి. మరోవైపు.. 2-3 ఏళ్లుగా బంగారం ధర సైతం కొత్త రికార్డులు సృష్టిస్తోంది. వీటి దిగుమతికే మన విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో అధిక శాతం ఖర్చయిపోయే పరిస్థితి నెలకొంది. ‘ట్రేడింగ్ ఎకనమిక్స్’ గణాంకాల ప్రకారం.. ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం మొదలుపెట్టడానికి ముందు మన దేశ ఫారెక్స్ రిజర్వ్స్ 728 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. అంటే దాదాపు 69.4 లక్షల కోట్లు. కేవలం రెండు నెలల్లో అవి 690.69 బిలియన్ డాలర్లకు తగ్గిపోయాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను ముడిచమురు, బంగారం, మందులు, ఆహారం, సెమీ కండక్టర్లు, ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల దిగుమతులకు మన చేసే ఖర్చు.. దాదాపు 73.86 లక్షల కోట్లు. అందులో ముడిచమురు, బంగారం, వంట నూనెలు, ఎరువుల బిల్లే ఏకంగా 240 బిలియన్ డాలర్లకన్నా ఎక్కువ అంటే 22.87 లక్షల కోట్లు. ఇలా దిగుమతులకోసం మనం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చే కొద్దీ మన ఫారెక్స్ నిల్వలు మరింత వేగంగా కరిగిపోతాయి. అలా కరిగిపోతే ఏమవుతుంది? అంటే.. దేశ ఆర్థిక బలం తగ్గిపోతుంది. డాలర్ విలువ పెరిగిపోయి రూపాయి విలువ తగ్గిపోతుంది. విదేశీ పెట్టుబడుల రాక ఆగిపోయి దేశం సంక్షోభంలోకి వెళ్లిపోతుంది.
ఒక దేశ పరపతిని నిర్ణయించడంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు అత్యంత కీలక పాత్ర పోషిస్తాయి. ఒక దేశం ఎంత ధనికమైనది, ఎంత సురక్షితమైనది అని చెప్పడానికి ఈ ఫారెక్స్ రిజర్వులు ఒక రిపోర్ట్ కార్డులాంటివి. మూడీస్, ఎస్ అండ్ పి, ఫిచ్ వంటి అంతర్జాతీయ సంస్థలు.. ఫారెక్స్ రిజర్వ్స్ ఎక్కువగా ఉన్న దేశాలకు మంచి రేటింగ్ ఇస్తాయి. ఆ రేటింగ్ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ వడ్డీకి అప్పులు లభిస్తాయి. మనం బ్యాంకుల వద్దకు అప్పు కోసం వెళ్తే అవి మన సిబిల్ స్కోర్ ఎంత ఉందో చూసినట్టుగా.. ఒక దేశం విదేశాల నుంచి అప్పు తీసుకోవాలనుకుంటే.. ఆయా దేశాలు సదరు దేశం వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత ఉన్నాయనే విషయాన్నే చూస్తాయి. ఒక దేశ ఫారెక్స్ రిజర్వులు తగ్గిపోతుంటే విదేశీ పెట్టుబడిదారులు ఆ దేశంలో తాము పెట్టిన పెట్టుబడులను వెనక్కి తీసేసుకుంటారు. సాధారణంగా 7-10 నెలలపాటు ముడిచమురు దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉంటే ఆ దేశ పరపతి బాగున్నట్టు. 1991లో మన దేశం వద్ద కేవలం 2 వారాలకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. అందుకే మన బంగారాన్ని లండన్‌కి పంపి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఇప్పుడు మన వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు దాదాపు 9 నుంచి 11 నెలలకు సరిపడా ఉన్నప్పటికీ.. అంతర్జాతీయ పరిస్థితులు కంగారు పెట్టిస్తున్నాయి. పశ్చిమాసియాలో యుద్ధం ఇప్పట్లో ముగిసేలాగా కనిపించట్లేదు. ముడిచమురు ధరల భారంతోపాటు..ఎరువుల ధరలు కూడా భారీగా పెరిగిపోయే ప్రమాదం కనపడుతోంది. అంటే వాటి దిగుమతుల కోసం చేయాల్సిన ఖర్చు మరింతగా పెరిగిపోయి డాలర్ల రిజర్వు అనుకున్నదానికంటే వేగంగా కరిగిపోయే ముప్పుంది. దీనికితోడు.. మనకు వచ్చే విదేశీ మారక ద్రవ్య నిల్వల్లో ఎక్కువ భాగం.. గల్ఫ్ దేశాల నుంచి అక్కడున్న భారతీయులు మనదేశంలో ఉన్న తమ కుటుంబసభ్యులకు పంపే డబ్బు. యుద్ధం దెబ్బకు అతలాకుతలమైన గల్ఫ్ దేశాల్లో ఉంటున్న మనవాళ్లు పంపే డబ్బు తగ్గిపోతోంది. దీనికితోడు.. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో మన ఎగుమతులకు, తద్వారా మనకు రావాల్సిన డాలర్లకు కూడా ఆటంకం కలుగుతోంది. ఒకవైపు మనకు రావాల్సిన విదేశీ మారక ద్రవ్యంలో కోత పడుతుండగా, మరోవైపు మన వద్ద ఉన్న నిల్వలు కరిగిపోతున్నాయి.
ప్రధాని మోదీ తన ప్రసంగంలో బంగారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణం ఏంటంటే.. భారతీయులు ఏడాదికి సగటున కొనే పసిడి దాదాపు 700-900 టన్నులని అంచనా. దీని విలువ సుమారు 13.69 లక్షల కోట్లు. 2024-25తో పోలిస్తే.. 2025-26లో మన బంగారం దిగుమతులు దాదాపు 24శాతం పెరిగాయి. భారతీయులు కొనే బంగారంలో 90 శాతానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. అందుకు మనం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. కాబట్టి మోదీ చెప్పినట్లు ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే కచ్చితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై భారం కాస్తంతైనా తగ్గుతుంది.
ప్రధాని పిలుపు మేరకు దేశ ప్రజలు ఇంధన వినియోగం, బంగారం కొనుగోళ్లు, వంట నూనెల వినియోగం 10 శాతం తగ్గించుకుని, ఎరువుల దిగుమతులను 50శాతం మేర తగ్గించి, అనవసర విదేశీ పర్యటనలను మానుకుంటే.. ఏడాదిలో 4500 కోట్ల డాలర్ల మేర విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఆదా చేయొచ్చని ఒక అంచనా.
ఐతే మోడీ సూచనను...పలువురు స్వాగతిస్తుండగా.. మరికొందరు దీనిని తప్పుబడుతున్నారు. పసిడి కొనుగోళ్లను ఏడాది నిలిపివేయడం.. విదేశీ మారక ద్రవ్య సమస్యకు పరిష్కారం కాదన్నారు. మోదీ ప్రకటనతో ఆభరణాల తయారీ రంగం తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉంద్నారు. దీనివల్ల 3.5 కోట్ల మంది ఉపాధికి ముప్పుగా పరిణమిస్తాయని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు ప్రత్యామ్నాయంగా దేశంలో నిరుపయోగంగా ఉన్న బంగారాన్ని సమీకరించడం సహా దానిని పునర్వినియోగంలోకి తీసుకురావడం మంచి ఆప్షన్ అని పేర్కొంటున్నారు.
దేశ ప్రజలకు మోదీ చేసిన సూచనలను విపక్షాలు తీవ్ర స్థాయిలో విమర్శించాయి. బంగారం కొనొద్దని, విదేశాలకు వెళ్లొద్దని, పెట్రోల్ తక్కువ వాడాలని, ఫెర్టిలైజర్, కుకింగ్ ఆయిల్ వాడకం తగ్గించాలని.. ఉద్యోగులు మెట్రో వాడాలని.. ఉద్యోగులు వర్క్ ఫ్రం హోంకు ప్రియారిటీ ఇవ్వాలని మోదీ పిలుపునివ్వడం ప్రభుత్వ వైఫల్యాలకు నిదర్శనమని రాహుల్ ‘ఎక్స్’లో ట్వీట్ చేశారు. 12 ఏళ్లలో ప్రధాని మోదీ దేశాన్ని ఏ స్థాయికి వెనక్కి తీసుకెళ్లారో ప్రజలు గమనించాలని రాహుల్ సూచించారు. ఏం కొనాలి, ఏం కొనకూడదు, ఎక్కడికి వెళ్లాలి, ఎక్కడికి వెళ్లకూడదు.. ఇలా ప్రతిసారీ జవాబుదారీతనాన్ని గాలికొదిలేసి.. మీరే భరించాలని ప్రజల మీదకు బాధ్యతలను నెట్టేయడం మోదీ ప్రభుత్వానికి అలవాటుగా మారిందని రాహుల్ విమర్శించారు. ఇలా ఇన్నేళ్లుగా సంక్షోభం తలెత్తిన ప్రతిసారీ రాజీపడిన ప్రధానికి దేశాన్ని పాలించడం ఇకపై సాధ్యం కాదని రాహుల్ గాంధీ మండిపడ్డారు.
ఐతే మోడీ పిలుపును దేశ ప్రజలు ఎంత వరకు పాటిస్తారు..? ప్రస్తుత ఆర్ధిక సవాళ్ల నేపథ్యంలో దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని బంగారం కొనుగోళ్లను ఏడాది పాటు నిలుపుదల చేస్తారా..? బంగారం అంటే.. భారతీయులకు ఒక సెంటిమెంట్. మహిళలు ఆభరణాలు ధరించడం ఆనవాయితీగా వస్తుంది. శుభకార్యాల్లో పసిడిని ధరించడం.. గౌరవ సూచనకంగా చూస్తారు. మరికొందరు బంగారాన్ని పెట్టుబడి గానీ, ఆర్థిక భరోసా భావిస్తారు. మరి ఇలాంటి తరుణంలో మోడీ పిలుపునకు ఏ మేరకు ప్రాధాన్యతను ఇస్తారు. పసిడి మోజులో పడి.. దేశ ఆర్థికాన్ని సంక్షోభంలో నెట్టుకుంటారా.. లేక జాగ్రత్తపడి..రూపాయిని కాపాడుకుంటారా అన్నది చర్చనీయాంశంగా మారింది. మోడీ పిలుపు అనంతరం.. గోల్డ్‌ను కొనొద్దని అనేక స్లోగన్స్ వినిపిస్తున్నాయి. ఐతే ఇది కేవలం ప్రజల వరకేనా లేక కిలోల కొద్దీ బంగారాన్ని పోగేసే లీడర్లు పాటిస్తారా..?
దేశ నాయకులు ప్రజలను బంగారం కొనవద్దని కోరడం ఇదే మొదటిసారి కాదు. గతంలో దేశంలో ఆర్థిక సంక్షోభ సంకేతాలు కనిపించిన ప్రతిసారీ...భారత ప్రధానులు ఇలాంటి సూచనలే చేశారు. ఇప్పుడు పశ్చిమాసియాలో యుద్దం వల్ల.. చమురు, గోల్డ్ సహా నిత్యావసరాల ధరలు పెరిగిపోవడం, వేగంగా విదేశీ మారక నిల్వలు తరిగిపోతుండటంతో ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని, ఇది కూడా దేశ సేవ లాంటిదే అని మోడీ కోరారు. అంతకు ఇందిరా గాంధీ నుంచి పి.చిదంబరం వరకు గతంలో ఇలాంటి విజ్ఞప్తులు చేశారు. 1962 భారత-చైనా యుద్ధ సమయంలో అప్పటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ జాతీయ రక్షణ నిధికి బంగారం, నగదు దానం చేయాలని కోరారు. సాయుధ దళాల సంక్షేమం కోసం ఈ ఫండ్‌ను ఏర్పాటు చేశారు. ఇక 1967న అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ ప్రజలను బంగారం కొనవద్దని కోరారు. ఆ సమయంలో భారత విదేశీ మారక నిల్వలపై తీవ్ర ఒత్తిడి ఉంది. 1965 పాకిస్థాన్ యుద్ధం తర్వాత దేశం కరువును ఎదుర్కొంటోంది. విదేశీ మారక నిల్వలు దాదాపు సున్నాకి పడిపోయాయి. అటువంటి క్లిష్ట సమయంలో ఆర్థిక వ్యవస్థను కాపాడుకోవడానికి క్రమశిక్షణతో ఉండాలని ఆమె పిలుపునిచ్చారు. 1991లో భారత్ తీవ్ర ఆర్థిక సంక్షోభంలో పడింది. చమురు, ఎరువుల దిగుమతుల కోసం విదేశీ మారక నిల్వలు కేవలం 3 వారాలకు మాత్రమే సరిపోయేలా ఉన్నాయి. అప్పుడు భారత్ తన వద్ద ఉన్న 20 టన్నుల బంగారాన్ని విదేశీ బ్యాంకుల్లో తాకట్టు పెట్టి 200 మిలియన్ డాలర్లను సేకరించింది. ఆ తర్వాత మరో 47 టన్నుల బంగారాన్ని బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌కు పంపింది. ఈ నిర్ణయమే దేశాన్ని దివాళా తీయకుండా కాపాడింది.
ఇక యూపీఏ ప్రభుత్వ హయాంలో 2013లో అప్పటి ఆర్థిక మంత్రి పి. చిదంబరం కూడా ప్రజలను బంగారం కొనవద్దని కోరారు. అప్పట్లో కరెంట్ అకౌంట్ లోటు 6.7 శాతానికి చేరడంతో బంగారు దిగుమతులను తగ్గించడానికి ప్రభుత్వం దిగుమతి సుంకాన్ని 8 శాతానికి పెంచింది.




