Off The Record: మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్న బీజేపీ లీడర్లు?

Off The Record: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణ పర్యటన రాష్ట్ర బీజేపీ నేతల్లో కొత్త జోష్ నింపుతుందని భావిస్తే, అది కాస్తా నిరాశకు దారి తీసింది.

Off The Record
X

Off The Record: మా మనోభావాలు దెబ్బతిన్నాయి అంటున్న బీజేపీ లీడర్లు?

Off The Record: ప్రధాని మోడీ పర్యటనను ఎనర్జీ టానిక్ అనుకున్నారు తెలంగాణ బీజేపీ నేతలు. కానీ అది కాస్తా ఇప్పుడు చేదు గుళికలా మారింది. అడుగుపెట్టిన దగ్గరి నుంచి వెళ్లే వరకు.. మోడీ షెడ్యూల్‌లో రాష్ట్ర నేతలకు కేవలం షేక్ హ్యాండ్ మాత్రమే దొరికింది తప్పితే... పర్సనల్ టచ్ కరువైంది, పలకరింపులు లేవు, పరామర్శలు అంతకంటే లేవు. అసలే రాష్ట్రంలో పార్టీ పరిస్థితి డల్ గా ఉందనుకుంటున్న తరుణంలో.. పెద్దాయన వచ్చి తమకు రూట్ మ్యాప్ ఇస్తారని, భుజం తట్టి భరోసా ఇస్తారని ఆశపడ్డ కమలనాథులకు ఈ టూర్ పెద్ద షాక్ ఇచ్చిందట. ఎయిర్‌పోర్ట్‌లో ప్రొటోకాల్ ప్రకారం దండాలు, శాలువాలు వేయడం తప్ప.. పార్టీ భవిష్యత్తు గురించి మాట్లాడేందుకు ఒక్క నిమిషం కూడా టైం కేటాయించకపోవడం హాట్ టాపిక్ గా మారిందట. దీంతో మేము ఎక్కడున్నాం? మా పాత్ర ఏంటి? అన్న సందేహాలు నేతల్లోనే ఉత్పన్నం అవుతున్నాయట. ఇప్పుడు నాంపల్లి రాష్ట్ర కార్యాలయంలో ఇదే చర్చనీయాంశంగా మారింది.

తెలంగాణ గడ్డపై అడుగుపెట్టిన ప్రధాని.. ఇక్కడి నేతలకు షేక్ హ్యాండ్ ఇచ్చారు కానీ మాటలు లేవు, మాట్లాడుకోవడాలు లేవన్న చందంగా టూర్ జరిగిపోయిందట. రాష్ట్రంలో పార్టీ పరిస్థితిపై ఆరా తీయకపోవడం పెద్ద అసంతృప్తికి దారి తీ‌సిందట. కానీ పొరుగు రాష్ట్ర నేతల ఇళ్లకు వెళ్లి, వారితో కలిసి గంటకు పైగా సమయం గడపడం పెద్ద ఎత్తున చర్చకు కారణమైంది. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆరోగ్య పరిస్థితి తెలుసుకోవడం, తర్వాత సీఎం చంద్రబాబు ఇంటికి వెళ్లి..ఆయనతో భేటీ కావడం రాజకీయ వర్గాల్లో హాట్‌ టాపిక్‌గా మారింది. తెలంగాణలోనూ ఏపీ తరహా కూటమి ఏర్పాటుకు ముహూర్తం ఫిక్స్ చేశారా? అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు ఇదే బీజేపీ నేతల మధ్య చర్చకు వేదికైంది. సొంత పార్టీ నేతలతో భేటీ కాకుండా… పక్కా రాష్ట్ర నేతలకు ప్రాధాన్యం ఎందుకు ఇచ్చారన్న ప్రశ్న జిల్లా స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి నాయకుల వరకు వినిపిస్తోంది. ఇది కేవలం ప్రోటోకాల్ నిర్ణయమా? లేక రాష్ట్ర నేతల మధ్య ఉన్న గ్రూప్ రాజకీయాలపై హైకమాండ్ ఇచ్చిన సైలెంట్ సిగ్నలా? అన్న కోణంలో రాజకీయ విశ్లేషణలు జోరుగా నడుస్తున్నాయి.

తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీల మధ్య ఎన్నికల హీట్ పెరుగుతున్న వేళ.. మోడీని కలిసి తమ గ్రాఫ్ పెంచుకోవాలని భావించిన నేతల అంచనాలు తారుమారయ్యాయి. పక్క రాష్ట్ర నేతల ఇళ్ల గడప తొక్కిన పెద్దాయన.. ఇక్కడి సొంత నేతలను కలిసి వారి సాధక బాధలఫై ఆరా తీస్తారేమోనని ఆశించారట.

కాసేపు అవకాశం ఇస్తే తమ బాధలు మోడీకి చెప్పుకుందామని కొందరు అనుకుంటే.. ఐదు నిమిషాలు కూడా సమయం కేటాయించకపోవడం నిరాశ పరిచిందని నేతలంతా అసంతృప్తితో లోలోపల మదనపడిపోతున్నారట. ఐతే దీని వెనుక అధిష్టానం గుర్రుగా ఉందన్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. రాష్ట్ర నేతల మధ్య నెలకొన్న అంతర్గత విభేదాలు, గ్రూపు తగాదాలు, ఇటీవల లేఖలు, లీకులు వ్యవహారాల కారణంగానే మోడీ ఈసారి డిస్టెన్స్ మెయింటెయిన్ చేశారా? అన్న అనుమానాలు బలపడుతున్నాయి. మొత్తానికి మోడీ టూర్ క్యాడర్ లో జోష్ నింపినా... నేతల్లో మాత్రం అసంతృప్తి రాజేసిందనే టాక్ జోరుగా వినిపిస్తోంది..

తెలంగాణ బీజేపీ నేతలతో చర్చించడానికే షెడ్యూల్‌లో గంట సమయం మోదీ ఇచ్చారని అప్పట్లో పెద్ద ఎత్తున చర్చ జరిగింది. మోదీ టూర్ ముందు వరకు ఆ గంటలో నేతలతో మోదీ ఏమీ మాట్లాడుతారు? ఏమీ దిశానిర్దేశం చేస్తారు? అంటూ రాజకీయ ఊహాగానాలు, చర్చలు, విశ్లేషణలు జరిగాయి. కానీ తీరా మోదీ వచ్చిన రోజు ఆ గంట సమయం అంతా ఏపీ సీఎం, డిప్యూటీ సీఎంలతో భేటీకే సరిపోయింది. మోదీతో ముఖాముఖిలో తమకు మంచి రాజకీయ బూస్టింగ్‌తో పాటు.. గెలుపు టెక్నిక్స్ ఇస్తారని అందరూ భావించారట. ముఖ్యంగా బెంగాల్ గెలుపు మంత్రాన్ని తమకి నూరిపోస్తూ మార్గదర్శనం, దిశానిర్దేశం చేస్తారని నేతలు ఆశించారట. అలాగే రాష్ట్ర తాజా రాజకీయ పరిణామాలపై చర్చిస్తారని, అదే విధంగా తమ సాధకబాధకాలు మోదీని కలిసి చెప్పుకుందామని ముందు రోజు వరకు ఆశల పల్లకిలో ఉవ్విళ్లూరిన తెలంగాణ బీజేపీ నేతలకు "చివరికి అనుకున్నది ఒక్కటి.. అయినది ఒక్కటి" అనే పరిస్థితి నెలకొనడం తీవ్ర నిరాశకు గురి చేసిందనే చర్చ లేకపోలేదు..

వచ్చారు… వెళ్లారు…. కానీ ఒక ప్రశ్న మాత్రం మిగిలింది… సొంత నేతలతో భేటీ కాకపోవడమే మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిపోయింది.. ఇది కేవలం ప్రోటోకాల్ నిర్ణయమా? లేక తెలంగాణ బీజేపీలో ఏదో పెద్ద రాజకీయ స్క్రిప్ట్ నడుస్తోందా? రాబోయే రోజుల్లో ఈ షేక్ హ్యాండ్ వెనుక ఉన్న అసలు రాజకీయ సందేశం బయటపడుతుందా? లేక ఇది ఇంకా పెద్ద మార్పులకు సంకేతమా? ఇదే ఇప్పుడు తెలంగాణ బీజేపీలో అటు రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్. చూడాలి మరి ఏమీ జరుగుతుందో..


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story