Off The Record: తెలంగాణలో మోదీ పర్యటనపై సస్పెన్స్.. వస్తున్నారా? లేదా?
Off The Record: తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఎందుకు వాయిదా పడుతోంది? బీజేపీ అంతర్గత విభేదాలే కారణమా లేక అసంపూర్తిగా ఉన్న ప్రాజెక్టులే అడ్డంకిగా మారాయా?
Off The Record: తెలంగాణలో మోదీ పర్యటనపై సస్పెన్స్.. వస్తున్నారా? లేదా?
Off The Record: తెలంగాణలో అధికారం కోసం బీజేపీ అధిష్టానం ఉవ్విళ్లూరుతోంది. ఆ దిశగా ఆ పార్టీ జాతీయ అధినాయకత్వం ఫోకస్ పెట్టింది. కేరళం, తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ప్రచారం కోసం దక్షిణాదిలో పర్యటించనున్న ప్రధాని మోదీ.. తెలంగాణకు కూడా రానున్నారన్న వార్తలొచ్చాయి. దీంతో మోదీ రాక కోసం కాషాయ శ్రేణులు ఎంతో ఆతృతగా ఎదురుచూశారు. కేరళం ఎన్నికలు ముగిశాయి. కానీ ప్రధాని మాత్రం రాలేదు. ముచ్చటగా మూడోసారి ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా సందర్భాల్లో తెలంగాణలో మోదీ పర్యటన ఉంటుందని భావించారు. ఆ దిశగా ప్రయత్నాలు కూడా జరిగాయి. కానీ ఆ పర్యటన మాత్రం వాయిదా పడుతూనే వస్తోంది. తాజాగా కేరళం, తమిళనాడు ఎన్నికల సమయంలోనే తెలంగాణకు రావాలని ప్రధాని భావించినా.. అనివార్య కారణాలతో ఆ పర్యటన రద్దు అయిందనే ప్రచారం జరుగుతోంది. దానికి ప్రధాన కారణం లేకపోలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు. పదేళ్లు గడుస్తున్నా బీబీనగర్ ఎయిమ్స్ పనులు అసంపూర్తిగానే ఉండటం, ములుగు గిరిజన విశ్వవిద్యాలయం కాగితాలు దాటి క్షేత్రస్థాయిలోకి రాకపోవడం, వరంగల్ మామునూరు విమానాశ్రయానికి సాంకేతిక చిక్కులు, రీజినల్ రింగ్ రోడ్డుకు భూసేకరణ లొల్లి అడ్డంకిగా మారాయనే ప్రచారం జోరుగా నడుస్తోంది. తెలంగాణలో కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా భావించి మంజూరు చేసిన అభివృద్ధి పనులు పూర్తయ్యాకే పర్యటనకు రావాలన్నది ప్రధాని ఆలోచనగా కనిపిస్తోందట. ఈ విషయం బీజేపీ నాయకుల్లోనే చర్చనీయాంశంగా ఉంది.
తెలంగాణలో అభివృద్ధి పనులు ఒక ఎత్తైతే.. గత కొంత కాలంగా రాష్ట్ర బీజేపీ నేతల మధ్య కొనసాగుతున్న అంతర్గత కుమ్ములాటలు మరోఎత్తు అన్న వాదన బలంగానే వినిపిస్తోంది. తెలంగాణలో పార్టీ బలపడిందని సంతోషించాలో.. లేక నేతల మధ్య పెరుగుతున్న దూరాన్ని చూసి బాధపడాలో తెలియని స్థితిలో ఉందట బీజేపీ అధిష్టానం. దూరపు కొండలు నునుపు లాగా ఢిల్లీ నుంచి చూస్తే అంతా ఒక్కటే అన్నట్టు కనిపిస్తున్నా.. లోలోపల మాత్రం గ్రూపు రాజకీయాలు తారాస్థాయిలో ఉన్నాయనే చర్చ లేకపోలేదు. ఒకవైపు పాత నేతలు, మరోవైపు కొత్తగా వచ్చిన నేతలు అన్నట్లుగా ఆధిపత్య పోరు సాగుతోందట. నేతల మధ్య సమన్వయం వచ్చిన తర్వాతే తెలంగాణలో ఎంట్రీ ఇవ్వాలని ప్రధాని భావిస్తున్నట్టు పార్టీ కేంద్ర కార్యాలయంలో గుసగుసలాడుకుంటున్నారు. మరి రాష్ట్ర పార్టీలో కీలక నేతల మధ్యనే అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరడంతో రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావుకు తలనొప్పిగా మారిందనే చర్చ జరుగుతోంది. దీంతో నేతలకు పార్టీ లైన్ దాటి మాట్లాడొద్దంటూ వార్నింగ్ ఇచ్చే పరిస్థితి వచ్చిందట. ఆ నేతల మధ్య ఉన్న విభేదాలను పరిష్కరించాల్సిన హైకమాండ్ పెద్దలు ఎప్పుడు పరిష్కారిస్తారనే ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. జాతీయ పెద్దలు ఈ విభేదాల్లో కలగచేసుకోకపోతే నేతల మధ్య దూరం మరింత పెరిగే అవకాశం లేకపోలేదు.? ఇక అసోం, పుదుచ్ఛేరి, కేరళం అసెంబ్లీ ఎన్నికలు ముగిసాయి. మిగిలింది తమిళనాడు, పశ్చిమ బెంగాల్ ఎన్నికలు. బెంగాల్ ఎన్నికల్లో ప్రధాని బిజీబిజీగా ప్రచారాన్ని హోరేత్తిస్తున్నారు. ఈసారి ఎలాగైనా బెంగాల్‌లో పాగు వేయాలనే పట్టుదలతో మోదీ, అమిత్ షా ద్వయం బెంగాల్లోనే 15రోజులుగా మకాం వేశారు. దీంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా తెలంగాణలో ప్రధాని మోదీ పర్యటన ఇప్పట్లో లేనట్లేనన్న చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది.
హైదరాబాద్‌లో త్వరలో జరిగే గ్రేటర్ ఎన్నికల ముందు మోదీతో బహిరంగ సభ ఏర్పాటు చేయాలని తెలంగాణ బీజేపీ రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది. ప్రధాని వస్తే.. తెలంగాణ రాష్ట్రానికి ఇప్పటివరకు ఇచ్చిన నిధులు, అభివృద్ధి కార్యక్రమాలు, వివిధ ప్రాజెక్టులతోపాటు భవిష్యత్తులో చేపట్టబోయే నిధులపై మాట్లాడాలని స్కెచ్ వేశారు. అభివృద్ధి విషయంలో అధికార కాంగ్రెస్‌కు ఏ మాత్రం అవకాశం ఇవ్వకూడదని భావించిన బీజేపీ.. ఆ దిశగా అడుగులు వేస్తోందట. ఇప్పుడు ప్రధాని వచ్చి నిధులపై హామీలు ఇస్తే.. ఆ క్రెడిట్ రేవంత్ రెడ్డి ఖాతాలోకి వెళ్లే ప్రమాదం ఉందని కాషాయ వ్యూహకర్తలు హెచ్చరిస్తున్నారట. అందుకే ఎన్నికల సమయంలో ఒకేసారి మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేలా మోదీ పర్యటనను రిజర్వ్ చేసి ఉంచినట్లు బీజేపీ వర్గాల నుంచి వినిపిస్తున్న టాక్. మరి తెలంగాణలో అధికారంలోకి రావాలని భావిస్తున్న బీజేపీకి క్షేత్రస్థాయిలో ప్రజల్లోకి వెళ్లాలంటే జాతీయ పెద్దల పర్యటనలు నిత్యం తెలంగాణలో ఉండేలా ప్లాన్ చేసుకోవాలనే చర్చ సైతం జరుగుతోంది.
మొత్తంగా తెలంగాణలో అటు ప్రాజెక్టులు పూర్తి కావాలి. ఇటు నేతల మధ్య ఆధిపత్య పోరు సమసిపోవాలి. ఈ రెండు అంశాలు ఓ కొలిక్కి వస్తేనే తెలంగాణ గడ్డపై మోదీ.. అడుగు పెట్టే అవకాశం ఉందనే అభిప్రాయం వినిపిస్తోంది. ఇంతకీ ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన ఎప్పుడు..? అన్న ప్రశ్నకు సమాధానం సస్పెన్స్‌గా మారింది.




