Burning Topic: బంగారంపై మోదీ 'బ్రేక్': దేశ ఆర్థిక భద్రత కోసం సరికొత్త 'పొదుపు మంత్రం'.. అసలు కారణాలివే!

Burning Topic: దేశ ఆర్థిక భద్రత కోసం ఏడాది పాటు బంగారం కొనుగోళ్లు వాయిదా వేయాలని ప్రధాని మోదీ పిలుపునిచ్చారు.

Arun Chilukuri
Published on: 14 May 2026 1:51 PM IST
Burning Topic
X

Burning Topic: బంగారంపై మోదీ 'బ్రేక్': దేశ ఆర్థిక భద్రత కోసం సరికొత్త 'పొదుపు మంత్రం'.. అసలు కారణాలివే!

Burning Topic: బంగారం అంటే ఒక లోహం మాత్రమే కాదు.. భారతీయులకు అదొక సెంటిమెంట్. కష్టకాలంలో ఆదుకుంటుందనే భరోసా. ప్రధాని మోదీ ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను తగ్గించుకోమని ఇచ్చిన పిలుపు ప్రకంపణలు సృష్టించింది. బంగారం వ్యక్తుల దగ్గర ఉండటంకన్నా ప్రభుత్వం దగ్గర ఉండటం దేశానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంధనాలు, వంట నూనెల వాడకం తగ్గించడం ద్వారా విదేశీ మారక ద్రవ్య నిల్వలను కాపాడుకోవడం సాధ్యమవుతుందని అంటున్నారు. వాటన్నింటి సారం ఒక్కటే.. విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేయడం. ఎందుకు ఆదా చేయాలి? ఇందకీ ప్రధాని మోదీ ఎందుకలా చెప్పారు?

ఇటీవల హైదరాబాద్ పర్యటనకు వచ్చిన ప్రధాని నరేంద్ర మోదీ సికింద్రాబాద్‌ పరేడ్ గ్రౌండ్‌లో జరిగిన బహిరంగ సభలో దేశ ప్రజలకు ఇచ్చిన పిలుపు యావత్ ప్రపంచాన్ని ఆకర్శించింది. మొత్తం పది కీలక సూచనలు చేశారు ప్రధాని.. అవి ఇలా ఉన్నాయి..

విదేశీ మారక ద్రవ్యాన్ని ఆదా చేసేందుకు ఏడాది పాటు బంగారం కొనొద్దు.

పెట్రోల్, డీజిల్, గ్యాస్ వాడకాన్ని వీలైనంత వరకు తగ్గించుకోవాలి.

కాలుష్యం, ఇంధన భారం తగ్గించడానికి ఎలక్ట్రిక్ వాహనాలను ప్రోత్సహించాలి.

ఐటీ, ఇతర రంగాలలో ఇంటి నుండి పని చేసే విధానం పెంచాలి.

విదేశీ కరెన్సీ వృధా కాకుండా, ఏడాది పాటు విదేశీ ప్రయాణాలు మానేసి, స్వదేశీ టూరిజంను ఎంచుకోవాలి.

దిగుమతి భారాన్ని తగ్గించడానికి ఆహారంలో వంట నూనెల వాడకాన్ని తగ్గించాలి

రసాయన ఎరువుల దిగుమతి ఖర్చులు తగ్గించేందుకు సేంద్రియ వైపు మళ్లాలి.

విద్యుత్ ఆదా కోసం సోలార్ ప్యానల్స్ ద్వారా సౌరశక్తిని వినియోగించాలి.

విదేశీ బ్రాండ్ల కొనుగోలు తగ్గించి, స్వదేశీ ఉత్పత్తులకే ప్రాధాన్యత ఇవ్వాలి.

ప్రయాణ ఇంధనాన్ని ఆదా చేసేందుకు ఆన్‌లైన్ క్లాసులు, డిజిటల్ విద్యను ప్రోత్సహించాలి

ప్రధాని నరేంద్ర మోదీ చేసిన సూచనల్లో అతి ముఖ‌్యమైనది.. దేశ ప్రయోజనాల దృష్ట్యా కనీసం ఒక ఏడాది పాటు బంగారం కొనుగోళ్లను వాయిదా వేయాలి. బంగారం దిగుమతి కోసం మనం భారీగా విదేశీ కరెన్సీని వెచ్చించాల్సి వస్తోంది. ప్రస్తుతం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరుగుతున్న తరుణంలో మన విదేశీ మారక ద్రవ్య నిల్వలను దేశ ప్రయోజనాల కోసం, ఇంధన భద్రత కోసం మళ్లించాల్సిన అవసరం ఉంది.. దేశ చరిత్రలో మునుపెన్నడూ లేని విధంగా.. గతంలో ఎన్ని సంక్షోభాలు, ఆర్థిక మాంద్యాలు వచ్చినా ఏ ప్రధానీ చేయని విధంగా.. మోదీ చేసిన ఈ సూచన సాధారణమైనది కాదని ఆర్థిక నిపుణులు స్పష్టం చేస్తున్నారు. బంగారం అంటే భారతీయులందరికీ సెంటిమెంట్.. ప్రస్తుతం దేశం ఎదుర్కొంటున్న సంక్షోభ సమయంలో ఏడాది పాటు బంగారం కొనొద్దని ప్రజల్ని కోరారు ప్రధాని.

భారత రిజర్వ్ బ్యాంక్ తన బంగారు నిల్వలను 880 మెట్రిక్ టన్నుల రికార్డు స్థాయికి పెంచుకుంటుండగా, ప్రధాని మోదీ ప్రజలను బంగారం కొనుగోలు తగ్గించాలని కోరడం చర్చనీయాంశమైంది.

పశ్చిమాసియాల యుద్ధం ఇప్పట్లో ఆగేలా లేదు. ముడిచమురు ధరల భారంతోపాటు ఇతర వస్తువుల ధరలూ భారీగా పెరిగిపోతున్నాయి. ఇరాన్‌పై అమెరికా యుద్ధం మొదలుపెట్టడానికి ముందు మన దగ్గరున్న ఫారెక్స్‌ రిజర్వ్స్‌ 728 బిలియన్‌ డాలర్లు. కేవలం రెండు నెలల్లో అవి 690.69 బిలియన్‌ డాలర్లకు పడిపోయాయి. 2025-26 ఆర్థిక సంవత్సరానికిగాను మన దిగుమతుల బిల్లు 775 బిలియన్‌ డాలర్లు అందులో ముడిచమురు, బంగారం, వంట నూనెలు, ఎరువుల బిల్లే ఏకంగా 240 బిలియన్‌ డాలర్లకన్నా ఎక్కువ. ఇలా దిగుమతులకోసం మనం ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చే కొద్దీ మన ఫారెక్స్‌ నిల్వలు మరింత వేగంగా కరిగిపోతాయి.

రిజర్వ్ బ్యాంక్ కేవలం పెట్టుబడి కోసం బంగారం కొనడం లేదు. ఇది దేశ ఆర్థిక రక్షణ కవచం . దీనికి మూడు ప్రధాన కారణాలు ఉన్నాయి.. 1.భౌగోళిక రాజకీయ భద్రత, 2.ఆర్థిక స్థిరత్వం, 3. కరెన్సీ రక్షణ..1991లో మన దేశం వద్ద కేవలం 2 వారాలకు సరిపడా మాత్రమే విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయి. అందుకే మన బంగారాన్ని లండన్‌కి పంపి తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వచ్చింది.అలాంటి పరిస్థితి మళ్లీ రాకూడదనే ఉద్దేశంతో ఆర్‌బీఐ నిల్వలను పెంచుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఒడుదొడుకులు వచ్చినప్పుడు బంగారం ఒక స్థిరమైన ఆస్తిగా మన రూపాయి విలువను సంరక్షిస్తుంది.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధ సమయంలో రష్యాకు చెందిన విదేశీ నిల్వలను పశ్చిమ దేశాలు స్తంభింపజేశాయి. ఇలాంటి పరిస్థితులు ఎదురైతే డాలర్ల కంటే స్వదేశీ ఖజానాలో ఉండే బంగారమే సురక్షితమని భారత్ భావిస్తోంది. అందుకే బ్యాంక్ ఆఫ్ ఇంగ్లాండ్‌లో ఉన్న మన బంగారాన్ని కూడా ఆర్‌బీఐ వేగంగా వెనక్కి రప్పిస్తోంది.

మన దేశ ప్రజలు ఏడాదికి సగటున కొనే బంగారం దాదాపు 700-900 టన్నులు. దీని విలువ సుమారు రూ.13.69 లక్షల కోట్లు. 2024-25తో పోలిస్తే.. 2025-26లో మన బంగారం దిగుమతులు దాదాపు 24 శాతం పెరిగాయి. భారతీయులు కొనే బంగారంలో 90 శాతానికి పైగా విదేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్నదే. అందుకు మనం భారీగా విదేశీ మారక ద్రవ్యాన్ని ఖర్చు చేయాల్సి వస్తోంది. ఏడాది పాటు బంగారం కొనకుండా ఉంటే కచ్చితంగా మన విదేశీ మారక ద్రవ్య నిల్వలపై భారం కాస్తంతైనా తగ్గుతుంది. దేశ ఆర్థిక భద్రత కోసం ఆర్‌బీఐ బంగారం నిల్వ చేయడం అవసరమని, అయితే ప్రజలు వ్యక్తిగతంగా కొనే బంగారం వల్ల డాలర్లు విదేశాలకు వెళ్లి రూపాయి బలహీనపడుతుందని నిపుణులు వివరిస్తున్నారు. ప్రధాని మోదీ తన ప్రసంగంలో బంగారం గురించి ప్రత్యేకంగా ప్రస్తావించడానికి కారణమిదే

మన దేశ పరపతిని నిర్ణయించడంలో విదేశీ మారక ద్రవ్య నిల్వలు కీలక పాత్ర పోషిస్తాయి. అంతర్జాతీయ సంస్థలు.. ఫారెక్స్‌ రిజర్వ్స్‌ ఎక్కువగా ఉన్న దేశాలకు మంచి రేటింగ్‌ ఇస్తాయి. ఆ రేటింగ్‌ ఎంత ఎక్కువ ఉంటే అంత తక్కువ వడ్డీకి అప్పులు లభిస్తాయి. ఒక దేశం విదేశాల నుంచి అప్పు తీసుకోవాలనుకుంటే.. ఆయా దేశాలు సదరు దేశం వద్ద విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఎంత ఉన్నాయనే విషయాన్నే చూస్తాయి. సాధారణంగా 7-10 నెలలపాటు ముడిచమురు దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలు ఉంటే ఆ దేశ పరపతి బాగున్నట్టు.

దేశ ప్రజలు బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగం, వంట నూనెల వినియోగం 10 శాతం తగ్గించుకుని, ఎరువుల దిగుమతులను 50 శాతం మేర తగ్గించి, అనవసర విదేశీ పర్యటనలను మానుకుంటే.. ఏడాదిలో 4500 కోట్ల డాలర్ల మేర విదేశీ మారక ద్రవ్య నిల్వలను ఆదా చేయొచ్చని ఒక అంచనా. అంటే మన కరెన్సీలో దాదాపుగా రూ.4.3 లక్షల కోట్లు.

మన సాంప్రదాయంలో కూడా ధన త్రయోదశి, అక్షయ తృతీయ వంటి పండగల సందర్భంగా బంగారం కొనుగోలు ఆనవాయితీగా వస్తోంది. ఇక కొత్తగా పెళ్లి అయినప్పుడు మెడలో ధరించే మంగళసూత్రం బంగారం గొలుసుతో చేయించినది ధరించడం అనేది. కొత్తగా పిల్లలు పుట్టినా కూడా వారికి వారి కుటుంబ సభ్యులు బంగారం గొలుసు బహుమతిగా ఇస్తుంటారు. ప్రధాని మోదీ ప్రజలను బంగారం పూర్తిగా మానేయమని చెప్పడం లేదు. కేవలం ఆభరణాలు, బిస్కెట్ల రూపంలో భౌతికంగా కొనే బదులు, సావరిన్ గోల్డ్ బాండ్స్, డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపాలని సూచిస్తున్నారు. దీనివల్ల మీకు బంగారం ధర పెరిగినప్పుడు వచ్చే లాభం దక్కుతుంది, అదనంగా వడ్డీ కూడా వస్తుంది. అన్నింటికంటే ముఖ్యంగా, దేశం డాలర్లు ఖర్చు చేసి విదేశాల నుండి భౌతిక బంగారాన్ని దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉండదు. అయితే మన దేశంలో బంగారం కొనుగోలు పైన స్వీయ నియంత్రణ పాటించమని కోరడం సాధ్యమేనా? ప్రజలు వింటారా అన్నది ప్రశ్నార్థకమే

దేశ ప్రజలకు ఇంధన పొదుపుపై పిలుపునిచ్చిన ప్రధాని మోదీ ఇప్పుడు స్వయంగా ఆచరణలో పెట్టేందుకు సిద్ధమయ్యారు. తన అధికారిక కాన్వాయ్‌లో వినియోగించే వాహనాల సంఖ్యను 50 శాతం వరకు తగ్గించాలని ఆదేశించారు. ఈ క్రమంలోనే ప్రధాని తన కాన్వాయ్‌లో వాహనాల సంఖ్యను తగ్గించాలని స్పెషల్‌ ప్రొటెక్షన్‌ గ్రూప్‌ అధికారులకు సూచించినట్లు అధికార వర్గాలు వెల్లడించాయి.

అంతే కాకుండా కాన్వాయ్‌లో ఎలక్ట్రిక్‌ వాహనాల వినియోగాన్ని మరింత పెంచాలని కూడా ఆదేశించారు. ప్రధానమంత్రి భద్రత విషయంలో ఎలాంటి రాజీ లేకుండా ఈ మార్పులు చేపడుతున్నట్లు ఎస్పీజీ వర్గాలు తెలిపాయి. కాన్వాయ్‌ పరిమాణం తగ్గించినప్పటికీ, తమ మార్గదర్శకాల ప్రకారం అన్ని కీలక భద్రతా ఏర్పాట్లు యథాతథంగా కొనసాగుతున్నాయని వెల్లడించాయి. మరోవైపు కేంద్ర హోంమంత్రి అమిత్‌షాతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ప్రధానమంత్రి బాటలోనే నడుస్తున్నారు.


Arun Chilukuri

Arun Chilukuri

వెబ్ జర్నలిస్ట్ గా నా కెరీర్ HMTV ద్వారా పదేళ్ల క్రితం ప్రారంభం అయింది. పదేళ్లుగా HMTV లోనే వెబ్సైట్ కు ఆర్టికల్స్ రాస్తున్నాను. దాదాపుగా అన్ని కేటగిరీల్లోనూ ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల వార్తలతో పాటు వివిధ కేటగిరీల్లో అవసరాన్ని బట్టి ఆర్టికల్స్, బ్రేకింగ్ న్యూస్ ను ఇవ్వడం చేస్తున్నాను.

Next Story