Burning Topic: పీఓకే లో దారుణమైన పరిస్థితి.. పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్

Burning Topic: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ (PoK)లో రగిలిన తిరుగుబాటు. ఆహారం, మందుల సరఫరా నిలిపివేసి పాక్ సైన్యం దమనకాండ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 26 Jun 2026 6:48 AM IST
Burning Topic
X

Burning Topic: పీఓకే లో దారుణమైన పరిస్థితి.. పీఓకే ప్రజల్ని ఆకలితో చంపేస్తున్న పాకిస్తాన్

Burning Topic: పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్‌లో చెలరేగిన హింస ఇంకా చల్లారలేదు. తీవ్ర ఉద్రిక్తతలు, అశాంతి కొనసాగుతున్నాయి. ద్రవ్యోల్బణం, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పాక్ ప్రభుత్వ అణచివేత వైఖరికి వ్యతిరేకంగా స్థానిక ప్రజలు భారీ ఎత్తున వీధుల్లోకి వచ్చి నిరసనలు తెలుపుతున్నారు. పిండి, విద్యుత్ ఛార్జీలపై సబ్సిడీలు ఇవ్వాలని, స్థానిక పరిపాలనలో సంస్కరణలు తేవాలని, స్వేచ్ఛా పౌర హక్కులను పునరుద్ధరించాలని ప్రజలు 38 డిమాండ్లతో అల్టిమేటం జారీ చేశారు.

ఈ ఆరోపణలను పాక్‌ ప్రభుత్వం అధికారికంగా ఖండించింది. భద్రతా కారణాల వల్ల కొన్ని ప్రాంతాల్లో తనిఖీలు పెంచామని, సరఫరాలను ఉద్దేశపూర్వకంగా నిలిపివేయలేదని అధికారులు చెబుతున్నారు. పాక్ తీరును భారత్ విదేశాంగ శాఖ తీవ్రంగా ఖండించింది. దశాబ్దాలుగా పాకిస్తాన్ సాగిస్తున్న క్రూరమైన ఆర్థిక దోపిడీ, ప్రాథమిక హక్కుల నిరాకరణ, పరిపాలనాపరమైన అణచివేతకు ప్రత్యక్ష ఫలితం అని భారత్ తేల్చి చెప్పింది.

పాకిస్తాన్‌ ఆక్రమిత కశ్మీర్‌లో కొనసాగుతున్న ప్రజా ఆందోళనలు ఇప్పుడు కొత్త మలుపు తిరిగాయి. నిరసనలను అణచివేయడానికి పాకిస్తాన్ ప్రభుత్వం ఆహారం, మందులు, ఇంధనం వంటి నిత్యవసర వస్తువుల సరఫరాలను అడ్డుకుంటోంది. పాక్ దుశ్చర్యలతో ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న పీవోకే ప్రజలు.. మరింత సంక్షోభంలోకి కూరుకుపోతున్నారు. పంజాబ్ ప్రావిన్స్ నుంచి పీవోకేలోకి వచ్చే ప్రధాన సరఫరా మార్గాలపై భద్రతా తనిఖీల పేరుతో సరుకు వాహనాలను నిలిపివేస్తున్నారు.

దీనివల్ల గోధుమలు, పిండి, కూరగాయలు, వంటనూనె, పెట్రోల్, డీజిల్, వైద్య సామగ్రి వంటి వస్తువుల సరఫరా పూర్తిగా నిలిచిపోతోంది. కొన్ని ప్రాంతాల్లో మెడికల్ షాపుల్లో మందుల కొరత ఏర్పడింది. ఆసుపత్రుల్లో కూడా అత్యవసర మందుల మాట దేవుడెరుగు.. కనీస వైద్య సదుపాయాలు కూడా కల్పించలేకపోతున్నాయి. అలాగే ఇంధన కొరత కారణంగా ప్రజా రవాణా, సరుకు రవాణా వ్యవస్థలు కూడా తీవ్రస్థాయిలో ప్రభావితమయ్యాయి.

రావాల్‌కోట్, ముజఫరాబాద్ వంటి నగరాల్లో దాదాపు 70 వేల మందికి పైగా నిరసనకారులు బైఠాయించారు. ఈ పోరాటంలో మహిళలు, చిన్నపిల్లలు కూడా పాల్గొని, "పాక్ సైన్యం వెనక్కి వెళ్ళాలి" అంటూ నినాదాలు చేస్తున్నారు. నిరసనకారులకు, భద్రతా దళాలకు మధ్య జరిగిన ఘర్షణల్లో ఇప్పటివరకు దాదాపు 30 మందికి పైగా ప్రాణాలు కోల్పోగా, వందలాది మంది గాయపడ్డారు. శాంతియుతంగా నిరసనలు చేస్తున్న నిరసనకారులపై పాక్ సైన్యం, రేంజర్స్ విచక్షణారహితంగా కాల్పులు,

లాఠీచార్జ్ చేయడమే కాక టియర్ గ్యాస్ ప్రయోగిస్తున్నారు. నిరసనలను అణచివేయడానికి పీవోకే సరిహద్దుల్లో సప్లై ట్రక్కులను నిలిపివేసి, ఆహార పదార్థాలు, ఇంధనం, ప్రాథమిక మందులు లోపలికి వెళ్లకుండా పాక్ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోంది. దీనివల్ల అక్కడ తీవ్ర మానవతా సంక్షోభం ఏర్పడింది. పీవోకేలో జరుగుతున్న అరాచకాలు ప్రపంచానికి తెలియకుండా ఉండేందుకు ఇంటర్నెట్ సేవలను పూర్తిగా నిలిపివేశారు.

నిరసనలకు నాయకత్వం వహిస్తున్న JAAC కమిటీని పాకిస్తాన్ ఉగ్రవాద నిరోధక చట్టం కింద నిషేధించింది. అంతటితో ఆగక నాయకుల తలపై భారీ బహుమతులు ప్రకటించింది. పీవోకేలో తన వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికి పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ భారత్‌పై ‘సింధు జలాల ఒప్పందం’ వివాదాన్ని తెరపైకి తెస్తూ యుద్ధ బెదిరింపులకు దిగారు. పైగా పీవోకే ప్రజలను "నిజమైన కాశ్మీరీలు కారు" అని అవమానించడంపై నిరసనలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి.

పీవోకేలో ఇప్పటికే ఆర్థిక పరిస్థితులు అంతంత మాత్రంగానే ఉన్నాయి. ఉద్యోగ అవకాశాలు పరిమితంగానే ఉంది. ఫలితంగా జీవన వ్యయం పెరిగి.. ప్రభుత్వంపై ఆధారపడే పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఆర్థిక దిగ్బంధన ప్రభావం సామాన్య ప్రజలపై తీవ్రంగా పడుతోంది. మార్కెట్లలో సరుకుల కొరత కారణంగా ధరలు ఒక్కసారిగా పెరిగిపోయాయని వ్యాపారులు వాపోతున్నారు. కొన్నిచోట్ల ప్రజలు నిత్యవసర వస్తువుల కోసం కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సిన దుస్థితి ఏర్పడుతోంది.

పీవోకేలో పాక్ వక్రబుద్ధి చర్యలే ఈ సంక్షోభానికి కారణమన్నది ప్రపంచ దేశాలకు తెలియంది కాదు. ఎన్నో ఏళ్లుగా విద్యుత్ చార్జీల పెంపు, అధిక పన్నులు, ద్రవ్యోల్బణం, నిరుద్యోగం, నిత్యవసరాల ధరల పెరుగుదల వంటి సమస్యలపై ప్రజల్లో తీవ్ర అసంతృప్తి పెరుగుతోంది. ముఖ్యంగా విద్యుత్ ఉత్పత్తి చేసే ప్రాంతం అయినప్పటికీ స్థానిక ప్రజలకు అధిక ధరలకు కరెంట్ సరఫరా చేయడంపై నిరసనలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో జాయింట్ అవామీ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీలు, సమ్మెలు, బంద్ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గత ఏడాది జరిగిన నిరసనల తర్వాత కొన్ని డిమాండ్లను అంగీకరిస్తామని పాక్‌ ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ, వాటి అమలులో పురోగతి ఏమాత్రం లేదు. దీంతో పీవోకే ప్రజలు మళ్లీ వీధుల్లోకి వచ్చారు.

హైవోల్టేజ్ టెన్షన్ వాతావరణం నెలకొన్న పీవోకేలో ఈమధ్య కాలంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయి. అనేక ప్రాంతాల్లో నిరసనకారులు, భద్రతా బలగాల మధ్య ఘర్షణలు చోటుచేసుకున్నాయి. పలువురు ఉద్యమ నాయకులను అరెస్ట్ చేయడం, సమావేశాలకు అనుమతులు నిరాకరించడం, నిరసనకారులపై కేసులు నమోదు చేయడం వంటి చర్యలు పలు వివాదాలకు దారితీశాయి. ఈ పరిణామాలపై మానవ హక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో తమ సమస్యలను చెప్పుకునే హక్కును అణచివేయడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేస్తుందని హెచ్చరిస్తున్నారు.

పీవోకేలో నెలకొన్న తాజా హింసాత్మక పరిస్థితులు అంతర్జాతీయ దృష్టిని కూడా ఆకర్షిస్తున్నాయి. కశ్మీర్ అంశాన్ని ప్రపంచ వేదికలపై ప్రస్తావించే పాకిస్తాన్.. తన నిర్బంధంలో ఉన్న పీవోకే ప్రజల అసంతృప్తిని ఎదుర్కోవడంపై మాట మాత్రానికైనా ప్రస్తావించకపోవడం విడ్డూరంగా ఉందంటున్నారు అంతర్జాతీయ నిపుణులు. ప్రజల కనీస అవసరాలు, ఆర్థిక సమస్యలను పరిష్కరించకుండా కఠిన చర్యలకు పాల్పడితే మరింత సంక్లిష్ట పరిస్థితులు తలెత్తే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు.

మరోవైపు నిరాయుధులైన పౌరులపై పాక్ సైన్యం చేస్తున్న దాడులు, ఇంటర్నెట్ నిలిపివేత, కనీస సరుకుల సరఫరాను అడ్డుకోవడం వంటి అనాగరిక చర్యలకు గాను పాకిస్తాన్‌ను అంతర్జాతీయ సమాజం జవాబుదారీ చేయాలని భారత్ డిమాండ్ చేసింది. పీవోకే ఎప్పటికీ భారతదేశంలో అంతర్భాగమేనని, దానిని తిరిగి స్వాధీనం చేసుకోవడం తమ జాతీయ సంకల్పమని భారత విదేశాంగ శాఖ స్పష్టం చేస్తోంది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story