Off The Record: ఏపీ లో రాయలసీమ లిఫ్ట్ సెగ .. ఆగిందా, ఆపారా?

Off The Record: రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ పై ఆంధ్రప్రదేశ్‌లో ముదురుతున్న రాజకీయ రగడ. పనులు ఆగడానికి గల కారణాలపై కూటమి మరియు వైసీపీ నేతల మధ్య సాగుతున్న ఆఫ్ ది రికార్డ్ విశ్లేషణ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 April 2026 9:20 PM IST
Off The Record
X

Off The Record: ఏపీ లో రాయలసీమ లిఫ్ట్ సెగ .. ఆగిందా, ఆపారా?

Off The Record: రాయలసీమలో కరవు ప్రాంతాలు, నీటి సౌలభ్యం లేని మండలాలకు తాగు, సాగు నీరు అందించాలన్న లక్ష్యంతో గతంలో కృష్ణా నదిపై పలు ప్రాజెక్టులు నిర్మించారు. పోతిరెడ్డిపాడు హెచ్ రెగ్యులేటర్ ద్వారా నీటిని బనకచర్లకు తీసుకువచ్చి.. అక్కడి నుంచి తెలుగు గంగ, ఎస్‌ఆర్‌బీసీ, తెలుగు గంగ, గాలేరు-నగిరి

హంద్రీ నీవా కాల్వలకు నీరు సరఫరా అవుతోంది. వరద వచ్చిన సమయంలో ఎక్కువ నీటిని రాయలసీమ జిల్లాలకు మళ్లించి లబ్ధి పొందాలన్న లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం 2019లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ప్రారంభించింది. శ్రీశైలం డ్యాం నుంచి రోజుకు మూడు టీఎంసీల నీటిని ఎత్తిపోసే

విధంగా ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారు. రాయలసీమలోని నాలుగు ఉమ్మడి జిల్లాలకు తాగు, సాగు నీరు అందించే లక్ష్యంతోపాటు శాస్వతంగా నీటి సమస్యకు పరిష్కారం అవుతుందని అప్పట్లో ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. సుమారు 18 శాతం మేరకు పనులు పూర్తయ్యాయి. ఇలా ఉండగా ప్రాజెక్టు నిర్మాణంపై తెలంగాణ ప్రభుత్వం అప్పట్లో అభ్యంతరం వ్యక్తం చేసింది.

నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లోనూ కేసులు నమోదు కావడంతో 2021లో ఈ పథకం పనులు దాదాపు ఆగిపోయాయి. ఎన్‌జీటీ జోక్యంతోపాటు న్యాయ సమస్యలు ఎదురవడంతో నిర్మాణ పనులు పూర్తిగా నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వ సంస్థలతోపాటు కేఆర్‌ఎంబీ(కృష్ణా రివర్ మేనేజ్‌మెంట్ బోర్డు) జోక్యం చేసుకోవడంతో పనులు ముందుకు సాగడం కష్టంగా మారింది.

వైసీపీ ప్రభుత్వ పాలన చివరి నాటికి పనులు పడకేయడంతో కూటమి ప్రభుత్వం వచ్చిన అనంతరం దానిని పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. తాజాగా రాయలసీమ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టు (ఆర్‌ఎల్ఐపి) రాజకీయ ప్రచారానికి, ప్రత్యర్థి పార్టీని దూషించడానికి వేదికగా మారిందన్న టాక్ బలంగా వినిపిస్తోంది.

రాయలసీమ లిఫ్ట్ ఇర్రిగేషన్ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం ఆపేసిందని.. తక్షణమే పనులు చేపట్టాలని వైసీపీ నేతలు ఉద్యమాలు కొనసాగిస్తూన్నారు. కర్నూలు జిల్లాలోని ప్రాజెక్టు నిర్మాణ పనులు పరిశీలించిన ఆ పార్టీ నేతలు.. అక్కడే ఆందోళనకు దిగారు. అనంతరం రాయలసీమ లిఫ్ట్ పనులు ఆగిపోవడంపై ఉద్యమాన్ని సీమ జిల్లాలకు విస్తరించారు.

అయితే వైసీపీ హయాంలోనే 80 శాతానికిపైగా ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయని, మిగిలిన పనులు కూటమి ప్రభుత్వం పూర్తి చేసి సీమకు నీటి సమస్య తీర్చాలని ప్రతిపక్ష పార్టీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. టీడీపీ నేతలు మాత్రం కేవలం వైసీపీ ప్రభుత్వంలో 18 శాతంలోపే పనులు జరిగాయని.. అప్పట్లో తెలంగాణ సీఎం కేసీఆర్ కోరిక మేరకు ముఖ్యమంత్రిగా ఉన్న జగన్ పనులు ఆపేశారని ఆరోపిస్తున్నారు.

వైసీపీ హయాంలో సీమలోని ముఖ్యమైన బైరవాన్ తిప్ప, గుండ్రేవుల, ఆర్డీఎస్, వేదవతి వంటి 102 ప్రాజెక్టులను ఆపేశారని. అన్నమయ్య డ్యాం కొట్టుకుపోయి 39 మంది చనిపోతే పట్టించుకోలేదని విమర్శిస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 190 రోజుల్లోనే హంద్రీ-నీవాను విస్తరించి రాయలసీమకు నీళ్లు ఇచ్చామని చెబుతున్నారు.

నీటి మళ్లింపు, సీమ జిల్లాలకు సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టుల విషయంలో రెండు పార్టీలు చిత్తశుద్ధి ప్రదర్శించాలని. ఇప్పటికైనా ద‎శాబ్ధాలుగా వెంటాడుతున్న నీటి కరవును పారదోలేందుకు పాలకులు నిర్ణయాలు తీసుకోవాలని సీమవాసులు డిమాండ్ చేస్తున్నారు. అయితే రాయలసీమ లిఫ్ట్ విషయంలో వైసీపీ ఉద్యమాలు ఏమేరకు ఫలితాలు ఇస్తాయో.. కూటమి ప్రభుత్వం చేపట్టిన పనులు ఏమేరకు సీమకు మేలు చేస్తాయో చూడాలి మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story