Off The Record: నెల్లూరులో పొలిటికల్ హీట్
Off The Record: నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గంలో నెలకొన్న రాజకీయ వివాదంపై తాజా సమాచారం.
Off The Record: నెల్లూరులో పొలిటికల్ హీట్
Off The Record: నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం.. ఈ పేరు చెబితే రాజకీయాలకు రాజధానిగా పేరు తెచ్చిన ఉద్దండ నేతలు గుర్తుకొస్తారు. ఇక్కడ నుంచే సుదీర్ఘకాలం తన రాజకీయ ప్రస్థానాలను కొనసాగించారు. హుందా రాజకీయాలకు పెట్టింది పేరు ఈ నియోజకవర్గం. అలాంటి ఈ నియోజకవర్గంలో ఇప్పుడు రాజకీయాలు దారి తప్పుతున్నాయట. తొలిసారిగా కోవూరు ఎమ్మెల్యేగా గెలిచిన టీడీపీ నాయకురాలు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఆరుసార్లు ఇదే నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించిన మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయట. రాజకీయ విమర్శలు పరిధి దాటి వ్యక్తిగత జీవితాలవైపు మళ్ళాయట. దీంతో కోవూరు నియోజకవర్గంలో రాజకీయం వేడెక్కిందట. ఈ వివాదం డెల్టా నియోజకవర్గంలో వ్యక్తిగత కక్షలవైపు మళ్లుతుందా..? అనే సందేహం కూడా వ్యక్తమవుతోందట.
ఉమ్మడి నెల్లూరు జిల్లాలో రాజకీయాలకు, అభివృద్ధికి, పరిపక్వత కలిగిన రాజకీయాలకు పురిటిగడ్డ కోవూరు. జిల్లాలో పూర్తి డెల్టా నియోజకవర్గంగా.. ఎప్పుడూ పచ్చని పైర్లు, పరవళ్ళు తొక్కే సాగునీటి కాలువలు, పచ్చని పైర్లు కోనసీమను తలపించే కొబ్బరి తోటలు, కూరగాయల సాగు, తూర్పున విశాలమైన సముద్రతీరం, మైపాడు బీచ్ లాంటి ఆహ్లాదకర అభివృద్ధికి చిహ్నాలుగా పేరుగాంచిన కోవూరు నియోజకవర్గంలో.. ఇప్పుడు రాజకీయ సెగ రాజుకుంది. టీడీపీకి చెందిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి.. గత ఎన్నికల్లో వైసిపి నేత నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డిపై విజయం సాధించారు. ఏకంగా ఆరుసార్లు శాసనసభ్యులుగా, మంత్రిగా కొనసాగిన ప్రసన్నకుమార్ రెడ్డిపై ప్రశాంతి రెడ్డి విజయం.. రాజకీయాలలో పెను సంచలనమే అయింది.
ఏపీలో కూటమిపాలన అధికారంలోకి వచ్చాక.. కొన్నాళ్లపాటు అధికార, ప్రతిపక్షాలు మౌనంగానే అభివృద్ధి వైపు అడుగులు వేశాయి. నియోజకవర్గంలో సాగునీటి వ్యవస్థను పూర్తిస్థాయిలో అభివృద్ధి చేసే దిశగా.. ఎమ్మెల్యే పక్కా ప్రణాళికలు రూపొందించారు. అందుకు తగిన కార్యాచరణకు శ్రీకారం చుట్టారు. ఒకవైపు ప్రభుత్వ పథకాలు, మరోవైపు తమ సొంత నిధులను వెచ్చించి వివిధ అభివృద్ధి, ఆరోగ్యపరమైన, విపిఆర్ విద్య, విపిఆర్ నేత్ర లాంటి కార్యక్రమాలకు ప్రారంభించారు. ఈ క్రమంలో నియోజకవర్గ వ్యాప్తంగా విజయోత్సవ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. తాము చేస్తున్న అభివృద్ధితోపాటు రానున్న మూడేళ్లలో చేయబోయే ప్రణాళికలను ప్రజల ముందుంచారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో జరిగిన పలు సభల్లో నల్లపురెడ్డిని ఉద్దేశించి ఘాటు వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే వేమిరెడ్డి. ప్రసన్నకుమార్ రెడ్డి.. కమీషన్లు, ఫోన్ పే నాయకుడంటూ పరోక్ష విమర్శలు గుప్పించారట వేమిరెడ్డి.
కూటమిపాలన రెండేళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో.. టీడీపీ విజయోత్సవ సభలు నిర్వహిస్తోంది. ప్రతిపక్ష వైసీపీ.. వెన్నుపోటుకు రెండేళ్లంటూ నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టింది. ఈ క్రమంలో కోవూరులో నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి నిరసన ర్యాలీలు నిర్వహించారు. ప్రభుత్వ పాలనా తీరుతోపాటు, ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డిపైనా విమర్శలు గుప్పించారు. ఇవి కాస్త పరిధి దాటాయట. ఈవీఎంల ఎమ్మెల్యే సోమిరెడ్డి ప్రశాంతి.. గత చరిత్ర తెలుసుకోమంటూ.. ప్రసన్నకుమార్ వ్యక్తిగత విమర్శలకు దిగారట. ఇలా ఇద్దరు నేతలు పరస్పర వ్యక్తిగత విమర్శలు చేసుకోవడం నియోజకవర్గంలో దుమారం రేపిందట. ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఇంటి పేరును సోమిరెడ్డి అంటూ.. ప్రసన్నకుమార్ సంబోధించడాన్ని ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డితోపాటు ఆమె అనుచరులు తీవ్రస్థాయిలో మండిపడుతున్నారట.
ఒకప్పుడు రాజకీయ నేతలకు పురిటిగడ్డగా పేరొందిన కోవూరు నియోజకవర్గంలో.. ప్రస్తుతం నెలకొన్న వివాదాస్పద రాజకీయ వ్యవహారంపై ప్రధాన నేతలు సంయమనం పాటించాలంటూ రాజకీయ పరిశీలకులు హితవు చెబుతున్నారట. రాజకీయాలలో "ప్రత్యర్థులుగా ఉండాలే గానీ.."విరోధులు" కాకూడదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమౌతోందట. ఇందుకు ఇరువైపులా నేతలు సంయమనం పాటించాల్సిన అవసరం ఉంది.




