Jordar Varthalu: హెల్మెట్ తో బస్సు నడుపుతానన్న డ్రైవర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన ప్రయాణికులు
Jordar Varthalu: ముందు అద్దం లేని బస్సులో బెంగళూరు ప్రయాణం! హెల్మెట్ ధరించి డ్రైవింగ్ చేస్తానన్న డ్రైవర్‌ను చూసి ప్రయాణికులు షాక్.
Jordar Varthalu: హెల్మెట్ తో బస్సు నడుపుతానన్న డ్రైవర్ పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లిన ప్రయాణికులు
Jordar Varthalu: శిగ్గులేదే జీడిగింజా అంటె నల్లగున్న నాకెందుకు శిగ్గు అన్నదట. అగో అచ్చం గట్లనే ఉన్నది గీ ప్రైవేట్ ట్రావెల్సోల్ల కథ. కారైనా, బస్సైనా.. లారీ అయినా.. ఇమానమైనా.. తొవ్వ మీదికెక్కినయంటె అన్ని సక్కగుండాలె. దాంట్ల ఏది తక్వైన్నా.. తిప్పలే ఉంటది. ఏదో ఒగ పర్శానుంటది. బండికి హారన్ సక్కగ లేకుంటెనే.. తొవ్వెక్కాల్నంటె గజ్జుమంటరు. అసొంటిది.. గీ ప్రైవేట్ బస్సోల్లు ఏకంగ ముంగటి అద్దం లేకుంటనే దూరపు ప్రయాణానికి బైలెల్లిర్రు. ఆంధ్రా దిక్కు మార్కాపురం కాన్నుంచి బెంగ్లూరుకు ఐతారం నాడు రాత్రి బైలెల్లిందట గీ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు.
అస్సల్కే ఐతారం బస్సులు మస్తు రష్షుంటయ్. సీట్లు నిండుతున్నయని, ఆత్రమాత్రం ఆన్లైన్ల బస్సు ఎంబటెంబటే బుకింగ్ జేసుకున్నరట. ఆన్లైన్ల సూస్తె, బస్సు ఏక్ షేక్ ఉన్నది. కనీ., లైవుల అచ్చినంక బస్సు మొఖం సూశి షాకైర్రు ప్యాసింజర్లు. ముంగటి అద్దం డ్రైవర్ మందమే ఉన్నదట. ఇంకో పక్క పచ్చెకు పచ్చె ఊశిపోయింది. అగో గిట్ల గూడ బస్సును నడ్పుతరా అని ప్యాసింజర్లు ఉగ్రరూపం సూపెట్టిర్రు. మంచి బస్సు తెప్పిచ్చెదాంక కదిలేదని డ్రైవర్కు అడ్డం తిర్గిర్రు. డ్రైవరన్న గూడ తక్వోడేం గాదు. బస్సు గిట్లున్నదంటె.. హెల్మెట్ పెట్టుకొని ప్రయాణికులను సురక్షితంగ బెంగ్లూరు పట్కపోతనని ఉద్దెరహామీలు గూడ ఇత్తున్నడట. ఇగ ప్రయాణం కట్టినోల్లకు ఇంకింత శిర్రుమన్నది.
ఛల్ నువ్వు.. మార్కాపురం తొవ్వల మీద బండెట్ల నడ్పుతవని, సీదా స్టేషన్కు తోల్కపోయిర్రు. ఆడ సీఐ సుబ్బారావు సారు బస్సును కండ్లార సూశి, నిజమేనయ్యా.. డ్రైవరూ.. గంత దూరం గీ బస్సులేం పోతవ్, సీజ్ జేస్తున్నా.. కొత్త బండ్లెవోదువ్ తియ్యని కేసు రాశిండు. కొందరు ప్రయాణికులను ఇంకో బస్సుల తోలిచ్చిర్రట కని, గిసొంటి బండ్లు తొవ్వల మీద తిర్గుతున్నయంటె.. ఆంధ్రా రవాణా శాక ఆఫీసర్లు ఎంత మంచిగ కొల్వు జేస్తున్నరో దీన్నివట్టే తెలుస్తున్నది పోండ్రి. నవ్వెటోల్ల ముంగట బోర్లవడ్డట్టు.. ఇప్పటికే ఎన్నో టక్కర్లైనయ్. మొన్ననే మార్కాపురం బస్సు ప్రమాదంల 14 మంది జీవిడ్శిర్రు. ఆఫీసర్లు, ప్రైవేట్ ట్రావెల్సోల్లు ఇవన్ని ఎంటనే మర్శిపోయిర్రో... లేకుంటె లంచాలు శేత్లవడ్తె సాలు, మనకెందుకని లైట్ తీసుకుంటున్నరో తెల్వదిగనీ., ఇగీ అద్దం లేని బస్సు వీడియోను ఇంటర్నెట్ల ఇడ్వంగనే.. ఆంధ్రా ఆఫీసర్ల పనితనం, ఎంతమంచిగుందో సూడుర్రని నవ్వుకోవట్టిర్రు దున్యా జనాలు.




