OFF THE RECORD: పూతలపట్టు వైసీపీలో ఎవరి మాట నడుస్తోంది?.. మురళీమోహన్ వ్యూహమేంటి?
OFF THE RECORD: పుతలపట్టులో వైఎస్సార్సీపీ వర్గపోరు టీడీపీకి లాభిస్తోంది. కన్వీనర్ల నియామకాల రగడ, మాజీ ఎమ్మెల్యే బాబు భవితవ్యం, ఎమ్మెల్యే మురళీమోహన్ ప్రణాళికలు.
OFF THE RECORD: పూతలపట్టు వైసీపీలో ఎవరి మాట నడుస్తోంది?.. మురళీమోహన్ వ్యూహమేంటి?
OFF THE RECORD: టికెట్ దగ్గర మొదలైన గ్యాప్.. ఇప్పుడు వర్గాల దాకా చేరింది. పూతలపట్టు రాజకీయాలను అర్థం చేసుకోవాలంటే.. ముందుగా గత ఎన్నికలను గుర్తు చేసుకోవాలి. పూతలపట్టు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత 2014, 2019 ఎన్నికల్లో వైసీపీ విజయం సాధించింది. 2019లో ఎంఎస్ బాబు వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు.
కానీ 2024 ఎన్నికలకు వచ్చేసరికి వైసీపీ అధిష్టానం సిట్టింగ్ ఎమ్మెల్యే ఎంఎస్ బాబును పక్కనపెట్టి.. మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్ కు టికెట్ ఇచ్చింది. దీంతో బాబు వైసీపీకి రాజీనామా చేసి కాంగ్రెస్‌లో చేరారు. ఈ పరిణామం అప్పట్లోనే పూతలపట్టు వైసీపీలో రాజకీయంగా పెద్ద చర్చకు కారణమైంది.
అదే సమయంలో తెలుగుదేశం పార్టీ నుంచి డాక్టర్ కలికిరి మురళీమోహన్ బరిలోకి వచ్చారు. ఇక ఎన్నికల ఫలితాల్లో పూతలపట్టు టీడీపీకి అనుకూలంగా మారింది. అంటే.. ఒకప్పుడు వైసీపీకి కంచుకోటగా కనిపించిన పూతలపట్టులో.. రాజకీయం
ఒక్కసారిగా మారిపోయింది. గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమిలో భాగంగా తెలుగుదేశం పార్టీ తరపున మురళీమోహన్ ఘనవిజయం సాధించారు. వైసీపీకి కంచుకోటగా ఉన్న పుతపట్టులో పసుపు జెండాను ఎగురవేశారు.
ఇప్పుడు రెండేళ్ల తర్వాత చూస్తే.. ప్రతిపక్ష వైసీపీలో మళ్లీ వర్గాల చర్చ తెరపైకి రావడం, అధికార కూటమికి రాజకీయంగా కలిసొచ్చే అంశంగా మారుతోందన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఇక్కడే అసలు మ్యాటర్ ఉంది.. పార్టీ ఓడిపోయిన తర్వాత.. సాధారణంగా ప్రతిపక్షం చేయాల్సింది ఏంటి.. క్యాడర్‌ను కాపాడుకోవాలి.. నాయకులను కలుపుకొనివెళ్లాలి.
మొత్తానికి పార్టీ బలహీనపడకుండా జాగ్రత్త పడాలి. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలి.. కానీ.. పూతలపట్టులో మాత్రం వైసీపీ నాయకుల మధ్య సమన్వయం కంటే.. ఎవరికి ఎవరు దగ్గర.. ఎవరికి ఎవరు దూరం.. ఎవరి మాట నడుస్తోంది అన్న చర్చే ఎక్కువైందన్న టాక్ వినిపిస్తోంది.
తాజాగా మండల పార్టీ కన్వీనర్ల నియామకాల వ్యవహారం వైసీపీలో అసంతృప్తికి కారణమైందన్న ప్రచారం జరుగుతోంది. వర్గాలకు అతీతంగా వ్యవహరించాల్సిన నియోజకవర్గ ఇంచార్జ్.. ఒక వర్గానికే ప్రాధాన్యత ఇస్తున్నారన్న ఆరోపణలు కొందరు నేతల నుంచి వినిపిస్తున్నాయట.
అయితే ఇవన్నీ ఆయా వర్గాల మధ్య జరుగుతున్న రాజకీయ చర్చలేనని చెప్పాలి. కానీ ఈ చర్చలు బయటకు రావడం మాత్రం పార్టీకి ఇబ్బందికరమే ఎందుకంటే మండల కన్వీనర్ అంటే కేవలం ఒక పదవి కాదు గ్రామస్థాయిలో పార్టీ కార్యక్రమాలు.. కార్యకర్తల సమన్వయం.. బూత్ స్థాయి వ్యవస్థ.. పార్టీ ఆదేశాల అమలు చేయడం ఇవన్నీ కన్వీనర్ల చుట్టూనే తిరుగుతాయి.
అలాంటి కీలకమైన పదవుల విషయంలోనే నాయకుల మధ్య అసంతృప్తి వస్తే.. దాని ప్రభావం కిందిస్థాయి క్యాడర్‌పై పడే అవకాశం ఉంటుందని వైసీపీ సీనియర్ నాయకులు చెబుతున్నారు. పూతలపట్టు మండలంలో అయితే పరిస్థితి మరింత ఆసక్తికరంగా ఉందన్న టాక్.
ఒక వర్గం సునీల్‌కుమార్ నాయకత్వాన్ని వ్యతిరేకిస్తోందని ప్రచారం జరుగుతుంటే.. మరో వర్గం ఆయనకు మద్దతుగా ఉందని చెబుతున్నారు. ఇంకొందరు నాయకులు మాత్రం ఈ రెండు వర్గాలకు దూరంగా ఉంటూ.. పెద్దిరెడ్డి అడుగుజాడల్లో నడుస్తూ తమ రాజకీయ భవిష్యత్‌ను బట్టి అడుగులు వేస్తున్నారన్న చర్చ ఉంది.
అంటే.. పార్టీ జెండా ఒక్కటే.. కానీ నాయకుల లైన్ మాత్రం వేరువేరుగా ఉందన్న సంగతి గ్రహించి.. క్షేత్రస్థాయి కార్యకర్తలు సైలెంట్ అయిపోయారట. ఇదే పరిస్థితి కొనసాగితే.. గ్రామస్థాయిలో కార్యకర్తలను ఎవరు సమన్వయం చేస్తారు.. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో అందరూ ఒకే వేదికపైకి వస్తారా..? అన్నది వైసీపీలో ప్రశ్నార్ధకంగా మారిందట.
ఇక మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే పూతలపట్టు మండలం మాత్రమే కాదు ఐరాల.. తవణంపల్లి.. యాదమర్రి.. బంగారుపాళ్యం.. ఈ మండలాల్లో కూడా పార్టీ అంతర్గత వ్యవహారాలపై చర్చ జరుగుతోందట.. అంటే.. సమస్య ఒక్క చోట లేదని.. నియోజకవర్గమంతటా ఇదే పరిస్థితి ఉందని కొందరు సీనియర్లు అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది.
రాజకీయాల్లో అసంతృప్తి ఉండటం కొత్త కాదు. కానీ ఆ అసంతృప్తి పార్టీ కార్యక్రమాల్లో కనిపిస్తే.. కార్యకర్తల మధ్య కనిపిస్తే.. పార్టీ పిలుపునిచ్చే కార్యక్రమాలకు ఒక వర్గం వచ్చి.. మరో వర్గం దూరమైతే. ఒక నాయకుడు కార్యక్రమం నిర్వహిస్తే.. ఇంకో నాయకుడు దూరంగా ఉండటం వంటి పరిస్థితులు ఏర్పడితే.. పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారే ప్రమాదం ఉందని వైసీపీ అధిష్టానం భావిస్తోందని అంటున్నారు.
ఇక ఇప్పుడు పూతలపట్టు రాజకీయాల్లో మరో హాట్ టాపిక్ ఏంటంటే మాజీ ఎమ్మెల్యే ఎంఎస్ బాబు 2024లో వైసీపీ నుంచి టికెట్ దక్కకపోవడంతో కాంగ్రెస్‌లో చేరారు. ఎంఎస్ బాబు తాజాగా జగన్‌ను కలవడం ఆసక్తి రేపింది. ఇప్పుడు ఎంఎస్ బాబు భవిష్యత్ రాజకీయ అడుగు ఏంటి.. వైసీపీకి తిరిగి దగ్గరవుతారా.. లేక కాంగ్రెస్‌లోనే కొనసాగుతారా.. లేదా అనేది నియోజకవర్గంలో హాట్ టాపిక్ గా మారింది.
పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ విషయానికి వస్తే.. ఆయన ప్రస్తుతం నియోజకవర్గంలో అభివృద్ధి, ప్రజా సమస్యలపై ఫోకస్ పెంచుతున్నారన్న చర్చ ఉంది. సంస్థాగతంగా యాక్టివ్‌గా ఉంటున్నారట.
ఒకవైపు ప్రభుత్వ కార్యక్రమాలు.. మరోవైపు పార్టీ కార్యక్రమాలు.. ఇంకోవైపు నియోజకవర్గ ప్రజల సమస్యలు ఈ మూడు అంశాలను కలిపి ముందుకు వెళ్లే ప్రయత్నం చేస్తున్నారన్నది పరిశీలకుల అభిప్రాయం.
ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకునేందుకు ప్రజాదర్బార్ నిర్వహించడం కూడా మురళీమోహన్ రాజకీయ శైలిలో ఒక భాగంగా కనిపిస్తోంది. ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లాలంటే మధ్యవర్తులు అవసరం లేదు.. నేరుగా సమస్య చెప్పుకోవచ్చు అనే భావన ప్రజల్లో ఏర్పడేలా చేయడం రాజకీయంగా కూడా ఉపయోగపడుతుందని కూటమి వర్గాలు భావిస్తున్నాయి.
మామిడి రైతుల సమస్యలు.. మార్కెటింగ్.. ధరలు.. ఫ్యాక్టరీలు.. రహదారులు.. సాగునీరు.. ఇలాంటి అంశాలపై ఎమ్మెల్యే మురళీమోహన్ ఫోకస్ పెంచుతున్నారన్న చర్చ ఉంది. కాణిపాకం వరసిద్ధి వినాయకస్వామి ఆలయ అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం టీటీడీ స్థాయిలో ఆలయ మాస్టర్ ప్లాన్ రూపొందించింది.
ఆలయ అభివృద్ధి పనులకు నిధులు.. వేద పాఠశాల, గోశాల వంటి ప్రతిపాదనలు ఎమ్మెల్యే తీసుకురావడం ప్రజలను ప్రభావితం చేస్తున్నాయట. మొత్తంగా పూతలపట్టులో వైసీపీ వర్గపోరు.. కూటమి ఎమ్మెల్యే మురళీమోహన్‌కు రాజకీయంగా కలిసొస్తున్నట్టే కనిపిస్తోంది.
ఒకవైపు వైసీపీలో అంతర్గత విభేదాలు కొనసాగుతుంటే.. మరోవైపు టీడీపీ ఎమ్మెల్యే మురళీమోహన్ అభివృద్ధి, సంక్షేమం, ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతున్నారు. అభివృద్ధి పనులతో ప్రజల్లో మరింత బలపడుతూ పూతలపట్టు టీడీపీకి మరింత పట్టు పెరిగే అవకాశం ఉంది.




