Burning Topic: అణ్వాయుధాలపై పుతిన్ వార్నింగ్.. మోదీపై మాత్రం ప్రశంసల వర్షం!
Burning Topic: కలినిన్‌గ్రాడ్‌పై దాడి జరిగితే అణ్వాయుధాలు వాడుతామని పుతిన్ హెచ్చరించారు. ఉక్రెయిన్ సంక్షోభంలో మోదీ శాంతి ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.
Russia-Ukraine War: కలినిన్‌గ్రాడ్‌పై దాడి జరిగితే అణ్వాయుధాలు పుతిన్ హెచ్చరిక
Burning Topic: రష్యా, ఉక్రెయిన్‌ల మధ్య గత నాలుగున్న ఏళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం ఎప్పుడు ముగుస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడింది. 2014 ఫిబ్రవరిలో రష్యా క్రిమియాను ఆక్రమించుకున్నప్పటి నుంచే ప్రారంభమైన ఘర్షణలు 2022 ఫిబ్రవరి నాటికి పూర్తిస్థాయి యుద్ధంగా మారాయి.
ఈ పోరాటం కారణంగా ఇరు దేశాలు ఇప్పటికే తీవ్రంగా నష్టపోయాయి. రష్యా ఐదు లక్షల మంది సైనికులను పోగొట్టుకుంటే, ఉక్రెయిన్ సైన్యంలో లక్షన్నర సైనికులు మరణించారు. ప్రస్తుతం ఉక్రెయిన్‌కు చెందిన దాదాపు 20% భూభాగం రష్యా ఆధీనంలో ఉంది. ఉక్రెయిన్ దళాలు ఆపరేషన్ వివాల్డి పేరుతో విజృంభించి కొన్ని ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటున్నాయి.
ఇటీవలి కాలంలో రష్యాలోని చమురు శుద్ధి కర్మాగారాలు, ఇంధన మౌలిక సదుపాయాలపై ఉక్రెయిన్ భారీగా డ్రోన్ దాడులు చేస్తోంది. ప్రతిగా రష్యా కూడా ఉక్రెయిన్ ఇంధన వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతోంది.
ఈ యుద్ధాన్ని ఆపేందుకు అంతర్జాతీయంగా తీసుకొస్తున్న ఒత్తిడి ఫలించడంలేదు. ఉక్రెయిన్‌కు భారీగా సాయం అందిస్తున్న అమెరికా అధ్యక్షుడు ట్రంప్, రష్యాను కట్టడి చేసే దిశగా అంక్షలు విధిస్తున్నా ఫలితం లేకుండా పోయింది. రష్యా-పశ్చిమ దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత ముదురుతున్న వేళ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కీలక హెచ్చరిక చేశారు.
రష్యా భూభాగమైన కలినిన్‌గ్రాడ్‌పై ప్రత్యక్ష దాడి జరిగితే.. తమ దేశం వద్ద ఉన్న అన్ని రకాల ఆయుధాలను ఉపయోగించే అంశం వెంటనే తెరపైకి వస్తుందని స్పష్టం చేశారు. అవసరమైతే అణ్వాయుధాలను కూడా ఉపయోగించే పరిస్థితి తప్పదని తెలిపారు. కాగా రష్యాకు యూరప్‌లోని ఏ దేశంపైనా దాడి చేసే ఉద్దేశం లేదన్నారు.
తాము శాంతియుత సహజీవనాన్నే కోరుకుంటున్నామని చెప్పారు. అయితే కలినిన్‌గ్రాడ్, రష్యాలోని ఇతర ప్రాంతాలపై ప్రత్యక్ష దాడి జరిగితే పరిస్థితులు పూర్తిగా మారిపోతాయని హెచ్చరించారు.
ప్రస్తుత ఉద్రిక్తతలు మరింత పెరిగితే తిరిగి మార్చలేని స్థాయికి పరిస్థితులు చేరుకునే ప్రమాదం ఉందని పుతిన్ హెచ్చరించారు. రష్యా వద్ద ఉన్న ఆయుధాలు తమకు పోటీ ప్రయోజనం కల్పిస్తున్నాయని పేర్కొన్నారు. బ్రిటన్, ఫ్రాన్స్ వద్ద ఉన్న అణ్వాయుధ సామర్థ్యాల గురించి కూడా తమకు పూర్తిగా తెలుసని చెప్పారు.
ప్రపంచంలోని ప్రధాన శక్తుల వద్ద భారీ విధ్వంసానికి కారణమయ్యే ఆయుధాలు ఉన్నాయని, వాటి వినియోగానికి దారితీసే పరిస్థితులను నివారించాలని సూచించారు. మరోవైపు ఉక్రెయిన్‌పై రష్యా దాడులను ఆపే ప్రసక్తే లేదని పుతిన్ స్పష్టం చేశారు.
రష్యా చమురు శుద్ధి కేంద్రాలపై ఉక్రెయిన్ దాడుల వల్ల తమ దేశ జీడీపీలో సుమారు ఒక శాతం మేర నష్టం వాటిల్లిందని చెప్పారు. పశ్చిమ దేశాలు ఉక్రెయిన్‌కు రష్యా భూభాగంలోకి లోతుగా దాడులు చేసే సామర్థ్యాన్ని అందిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు.
మరోవైపు భారత ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసలు కురిపించారు రష్యా అధ్యక్షుడు పుతిన్. గత నాలుగేళ్లుగా ఉక్రెయిన్‌తో సాగుతున్న వివాదాన్ని ముగించడానికి మోదీ చేస్తున్న ప్రయత్నాలను ప్రస్తావించారు. యుద్ధం ముగించాలని ప్రయత్నించే నాయకుల్లో మోదీ ఒకరని, శాంతియుత పరిష్కారం కోసం ఆయన వద్ద మంచి ఆలోచనలు ఉన్నాయని కొనియాడారు.
పరస్పరం ఆమోదయోగ్యమైన పరిష్కారాల కోసం మోదీ తనవంతు కృషి చేస్తున్నారని అన్నారు. మోదీతో తమకు స్నేహపూర్వక సంబంధాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఉక్రెయిన్ వివాదాన్ని ముగించే విషయంపై మోదీ నిరంతరం తనతో మాట్లాడుతుంటారని పుతిన్ చెప్పారు. ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన పరిష్కారాలను కనుగొనడంలో మోదీ చురుగ్గా వ్యవహరిస్తున్నారని అన్నారు.
రష్యా, ఉక్రెయిన్ వివాదంలో మోదీ తటస్థ వైఖరిని అవలంబిస్తున్నారని, అయితే, యుద్ధం త్వరగా ముగియాలనే ఆయన ఆకాంక్షిస్తున్నారని చెప్పారు.ఇటీవలే ఢిల్లీలో జరిగిన 18వ బ్రిక్స్ శిఖరాగ్ర సదస్సు సందర్భంగా మోదీ, పుతిన్ సమావేశమయ్యారు. 'ఎకనామిక్ కోఆపరేషన్ 2030' ప్రోగ్రామ్‌తో పాటు మౌలిక సదుపాయాలు, ఇంధనం, సాంకేతికత, రక్షణ, సంస్కృతి రంగాలలో ద్వైపాక్షిక సహకారంపై కీలక చర్చలు జరిపారు.
ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలోనూ ఇరుదేశాలు గణనీయమైన వృద్ధిని నమోదు చేస్తూ స్థిరత్వాన్ని చూపుతున్నాయని ఇద్దరు నాయకులు అభిప్రాయపడ్డారు. భారత్, రష్యా మధ్య ప్రత్యేకాధికార వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయడానికి కృషి చేసేందుకు అంగీకరించారు.
భారత్, రష్యా 24వ వార్షిక సదస్సు కోసం మాస్కోకు రావాలని పుతిన్ ఆహ్వానించారు. గత నాలుగేళ్లుగా సాగుతున్న ఉక్రెయిన్ సంక్షోభాన్ని కూడా మోదీ ప్రస్తావించినట్లు సమాచారం. చర్చలు, దౌత్యమార్గాల ద్వారానే వీటిని పరిష్కరించుకోవాలని సూచించారు.




