Burning Topic: చైనా ఆధిపత్యానికి చెక్.. రంగంలోకి క్వాడ్ దేశాలు

Burning Topic: ఇండో-పసిఫిక్ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి క్వాడ్ (QUAD) దేశాల చెక్! ఢిల్లీ వేదికగా భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల విదేశాంగ మంత్రులు కీలక సమావేశం నిర్వహించారు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 28 May 2026 6:52 AM IST
Burning Topic
X

Burning Topic: చైనా ఆధిపత్యానికి చెక్.. రంగంలోకి క్వాడ్ దేశాలు

Burning Topic: పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో ఢిల్లీ వేదికగా క్వాడ్‌ దేశాల విదేశాంగ మంత్రుల సమావేశం అంతర్జాతీయంగా తీవ్ర ప్రాధాన్యత సంతరించుకుంది. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, జపాన్ దేశాల వ్యూహాత్మక కూటమి అయిన క్వాడ్.. ఇండో-పసిఫిక్ ప్రాంతంలో మారుతున్న సమీకరణాలపై సుదీర్ఘంగా చర్చించింది. భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, అమెరికా విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో, ఆస్ట్రేలియా విదేశాంగ మంత్రి పెన్నీ వాంగ్ , జపాన్ విదేశాంగ మంత్రి తోషిమిట్సు మొతేగి ఈ సదస్సులో పాల్గొన్నారు. నాలుగు దేశాల మధ్య సంబంధాలు, పరస్పర సహకారంపై విస్తృతంగా చర్చించారు. ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో సముద్ర భద్రత, ఆర్థిక సహకారం, సవాళ్లను ఎదుర్కొనే వ్యూహాలపై కీలక నిర్ణయాలు తీసుకున్నారు. స్వేచ్ఛాయుత సముద్ర రవాణాకు రక్షణ కల్పించడం, నిబంధనల ఆధారిత వ్యవస్థ పరిరక్షణ కోసమేనని నలుగురు రాయబారులు తెలిపారు..

ఇంధన సరఫరాలో తలెత్తే అంతరాయాలను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి క్వాడ్‌ కూటమి.. ‘ఇండో పసిఫిక్‌ ఇంధన భద్రత మార్గదర్శక ప్రణాళిక’ను విడుదల చేసింది. అత్యవసర పరిస్థితుల్లో పరస్పర సమన్వయానికి, విధానపరమైన నిర్ణయాలు తీసుకోవటానికి ఇది తోడ్పడుతుందని తెలిపింది. ప్రపంచ చమురు, సహజవాయువు రవాణాలో కీలక మార్గమైన హొర్ముజ్‌ జలసంధి ఇరాన్‌ ఆంక్షలతో నిలిచిపోయిన నేపథ్యంలో ఈ ప్రణాళికను ముందుకు తీసుకొచ్చింది. ఇండో పసిఫిక్ ప్రాంతంలో అరుదైన ఖనిజాల సప్లై చైన్లను బలోపేతం చేయడానికి ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంతో 20 బిలియన్‌ డాలర్ల వరకు ఖర్చు చేయబోతున్నట్లు ప్రకటించింది. కీలక ఖనిజాలు, ఇంధన రంగాల్లో సహకారాన్ని పెంపొందించుకుంటామని తెలిపింది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి, భద్రతకు ఇండో-పసిఫిక్ ప్రాంతమే ప్రధాన చోదకశక్తి అని భారత విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ తెలిపారు.

కాగా ఇండో-పసిఫిక్‌ ప్రాంతంలో చైనా ఆధిపత్యానికి క్వాడ్‌ దేశాలు గట్టి సవాలు విసిరాయి. సముద్ర నిఘా, ఓడరేవుల మౌలిక సదుపాయాలను బలోపేతం ద్వారా డ్రాగన్ దూకుడును అడ్డుకోవాలని నిర్ణయానికి వచ్చింది. తూర్పు చైనా సముద్రం, దక్షిణ చైనా సముద్రంలోని పరిస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు. అక్కడ శాంతి, స్థిరత్వానికి ముప్పు కలిగించే ఏకపక్ష చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తేల్చిచెప్పారు. ఆ ప్రాంతంలో ప్రమాదకరమైన విన్యాసాలు చేయడం మానుకోవాలని చైనాను పరోక్షంగా హెచ్చరించారు. సముద్ర వనరుల అభివృద్ధిలో జోక్యం చేసుకోవడం, నౌకాయానం, విమానయాన స్వేచ్ఛకు పదేపదే ఆటంకం కలిగించడం సరైంది కాదన్నారు. సముద్రాలు అంతర్జాతీయ సంపద అని, వాటిపై ఏ ఒక్కరి ఆధిపత్యం ఉండకూడదని అన్నారు. అయితే ఎక్కడా చైనా పేరు నేరుగా ఎత్తలేదు

ప్రపంచ సముద్ర వాణిజ్యంలో 60 శాతం ఇండో–పసిఫిక్‌ గుండానే సాగుతోందని గుర్తుచేశారు మార్కో రుబియో.

కాగా క్వాడ్‌పై చైనా తన అక్కసును వెళ్లగక్కింది. కొన్నిదేశాలు కలిసి ప్రత్యేక కూటములు ఏర్పాటు చేసుకోవడం, ఇతర దేశాలతో ఘర్షణలకు దిగడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని పేర్కొంది. క్వాడ్‌ విషయంలో తమ వైఖరిని ఇప్పటికే పలు సందర్భాల్లో స్పష్టం చేశామని చైనా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి మావో నింగ్‌ చెప్పారు. దేశాల మధ్య సహకారం ప్రాంతీయ శాంతి, స్థిరత్వం, శ్రేయస్సుకు దోహదపడాలని అన్నారు. అంతేతప్ప మూడో పక్షాన్ని లక్ష్యంగా చేసుకోవద్దని సూచించారు. ఇండో-పసిఫిక్ ప్రాంతం, దక్షిణ చైనా సముద్రంలో చైనా సైనిక, ఆర్థిక ఆధిపత్య ధోరణిని అడ్డుకోవడం క్వాడ్ కూటమి ముఖ్య ఉద్దేశం. 2004లో హిందూ మహాసముద్రంలో సునామీ వచ్చినప్పుడు నాలుగు దేశాలు కలిసి విపత్తు సహాయక చర్యలను సమన్వయం చేసుకున్నాయి. ఇదే క్వాడ్ ఏర్పాటుకు పునాదిగా నిలిచింది. 2007లో జపాన్ అప్పటి ప్రధానమంత్రి షింజో అబే ఈ కూటమి ఆలోచనను తెరపైకి తేగా, 2017లో ఉనికిలోకి వచ్చింది.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story