Off The Record: ట్రబుల్ షూటర్ ఈజ్ బ్యాక్!
Off The Record: ఆరేళ్ల విరామం తర్వాత బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా రామ్ మాధవ్ రీఎంట్రీ. ఆయన నియామకం వెనుక ఉన్న రాజకీయ వ్యూహాలపై ప్రత్యేక విశ్లేషణ.
Off The Record: ట్రబుల్ షూటర్ ఈజ్ బ్యాక్!
Off The Record: బీజేపీలోకి జాతీయ ఉపాధ్యక్ష హోదాలో రామ్ మాధవ్ రీఎంట్రీ ఇవ్వడంపై ఢిల్లీ నుంచి దక్షిణాది దాకా ఒకటే చర్చ. అవును.. ఆరేళ్ల విరామం తర్వాత కమలం పార్టీకి మళ్లీ అల్టిమేట్ 'ట్రబుల్ షూటర్' వచ్చేశారు. అకస్మాత్తుగా రంగంలోకి దిగిన ఆ రాజకీయ చాణక్యుడు.. సంఘ్ పరివార్‌తో సమన్వయం చేయగలిగిన నేత.
జమ్మూకశ్మీర్, ఈశాన్య రాజకీయాల్లో పొత్తుల పజిల్‌ను పరిష్కరించడంలో ఆయనకు ఆయనే సాటి. అట్లాంటి ట్రబుల్ షూటర్ కు బీజేపీ మళ్లీ కీలక బాధ్యతలు ఇవ్వడం దేనికీ సంకేతమన్న గుసగుసలు రాజకీయ పరిశీలకుల్లో జోరందుకున్నాయి. ఇంతవరకు చట్టసభల్లో అడుగుపెట్టని నేత ఇప్పుడు నేరుగా రాజ్యసభ గడప తొక్కబోతున్నారా..? యూపీనా..? లేక ఉత్తరాఖండా..? రాజ్యసభ ఎంట్రీతో తెలుగు రాష్ట్రాల కోటాలో కేంద్ర కేబినెట్లో బెర్త్ దక్కుతుందా..?
లేదంటే ఎన్నికల ముందు పార్టీకి అవసరమైన ట్రబుల్ షూటర్‌గానే కొనసాగుతారా..? ఎన్నికల వేడి పెరుగుతున్న వేళ.. రామ్ మాధవ్‌కు వరుసగా కీలక బాధ్యతలు అప్పగించడం వెనుక అసలు వ్యూహమేంటి..? ఇది సాధారణ సంస్థాగత మార్పా..? లేక పెద్ద రాజకీయ ఆపరేషన్‌కు సంకేతమా..?
ఢిల్లీ వీధుల్లో ఇప్పుడు ఒకటే మాట. ఒకటే చర్చ. పులి వేట మొదలెడితే.. వేట పద్ధతి వేరేలా ఉంటుంది.. అన్నట్టు, ఆరేళ్ల విరామం తర్వాత బీజేపీ నేషనల్ వైస్ ప్రెసిడెంట్‌గా రాంమాధవ్ అడుగుపెట్టడం వెనుక ఒక పెద్ద పొలిటికల్ థ్రిల్లరే దాగుందట. బీజేపీ జాతీయ రాజకీయాల్లో రామ్ మాధవ్ పేరు కొత్త కాదు. సంఘ్ నేపథ్యం నుంచి బీజేపీ జాతీయ రాజకీయాల్లోకి వచ్చిన ఆయన.. పార్టీ సంస్థాగత వ్యవహారాల్లో, ముఖ్యంగా పొత్తులు.. రాష్ట్రాల రాజకీయ సమీకరణాల్లో కీలక పాత్ర పోషించిన నేతగా గుర్తింపు తెచ్చుకున్నారు.
ఈశాన్య రాష్ట్రాల్లో జెండా పాతాలన్నా, జమ్మూ కాశ్మీర్లో పొలిటికల్ గేమ్ చేంజ్ చేయాలన్నా.. రాంమాధవ్ చాణక్యతకు తిరుగులేదనేది జగమెరిగిన సత్యం. ఇటీవల దేశంలో సీజేపీ జంతర్ మంతర్ ఉద్యమాల కారణంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా, కేంద్రంపై ప్రతిపక్షాల దాడి పెరుగుతున్న వేళ, రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్, బీజేపీ మధ్య బలమైన వారధిగా పనిచేసే ఈ ట్రబుల్ షూటర్‌ను హైకమాండ్ మళ్ళీ బరిలోకి దించింది. సెప్టెంబర్‌లో పార్టీ సంస్థాగత పునర్వ్యవస్థీకరణలో రామ్ మాధవ్‌కు ఉత్తరాఖండ్, తమిళనాడు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించింది బీజేపీ అధిష్టానం. అంటే... పాత ఆటగాడికి మళ్లీ కొత్త మ్యాచ్ అప్పగించినట్టే.
ఇప్పుడు అసలు మ్యాటర్ ఇదే. 2027లో ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, గోవా, మణిపూర్, హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ సహా కీలక రాష్ట్రాలు ఎన్నికల బరిలోకి రాబోతున్నాయి. బీజేపీ ఇప్పటికే ఎన్నికల దృష్టితో సంస్థాగతంగా భారీ మార్పులు చేసింది. యూపీకి వినోద్ తావ్డే.. పంజాబ్‌కు సతీష్ పూనియా.. ఉత్తరాఖండ్‌కు రామ్ మాధవ్. ఇలా కీలక రాష్ట్రాలకు అనుభవం ఉన్న నేతలను ఇన్‌ఛార్జ్‌లుగా రంగంలోకి దించింది బీజేపీ అధిష్టానం. ఇందులో రామ్ మాధవ్‌కు ఉత్తరాఖండ్‌తోపాటు తమిళనాడు బాధ్యతలు ఇవ్వడం ఆసక్తిని పెంచుతోందట.
ఇక రాబోయే రాజ్యసభ ఎన్నికల వేళ రాంమాధవ్ చుట్టూ భారీ ప్రచారం నడుస్తోందట. ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల నుంచి ఖాళీ అవుతున్న రాజ్యసభ స్థానాల్లో.. ఒక స్థానాన్ని ఈ 'పొలిటికల్ మాస్టర్ మైండ్'కు కేటాయిస్తారనే టాక్ గట్టిగా వినిపిస్తోందట. ఉత్తరప్రదేశ్ నుంచి స్మృతి ఇరానీ, వరుణ్ గాంధీ, హర్దీప్ సింగ్ పూరీ లాంటి బడా నేతల పేర్లు రేసులో ఉన్నప్పటికీ.. ఇప్పటివరకు ఏ సభలోనూ అడుగుపెట్టని రాంమాధవ్‌ను పెద్దల సభకు పంపి, ఆ తర్వాత కేంద్ర మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో 'తెలుగు రాష్ట్రాల కోటా' కింద కీలక మంత్రి పదవి కట్టబెట్టబోతున్నారనే పుకార్లు షికార్లు ఢిల్లీ నుంచి దక్షిణాది దాకా రాజకీయ వర్గాల్లో గుప్పుమంటున్నాయట.
త్వరలో కేంద్ర మంత్రివర్గంలో మార్పులు, చేర్పులు ఉంటాయన్న ప్రచార నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల కోటాలో కేంద్ర మంత్రి పదవి రాబోతోందనే ప్రచారం జోరుగా సాగుతోందట. మంత్రి పదవి ఇస్తే దక్షిణాది నుంచి కేంద్ర ప్రభుత్వంలో కీలక పాత్ర పోషించనున్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయట. దక్షిణాదిలో కర్ణాటక తర్వాత తెలంగాణ అనేది బీజేపీకి ఆయువుపట్టున్న రాష్ట్రం.. ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పటికే ఎన్డీయే కూటమి అధికారంలో ఉంది. తమిళనాడు, కేరళ వంటి రాష్ట్రాల్లో బలపడేందుకు ట్రబుల్ షూటర్ రాం మాధవ్ చాణక్య నీతి పనిచేసే అవకాశం లేకపోలేదట.
అదే విధంగా మోడీ ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా భిన్న స్వరాలు వినిపిస్తుండటం.. తిరిగి మళ్ళీ బీజేపీ అధికారంలోకి రావాలంటే పాత షూటర్ రాం మాధవ్ వ్యూహాత్మక చాణక్య నీతి అవసరం పడుతుందనే గుసగుసలు వినిపిస్తున్నాయట. నిజంగానే రామ్ మాధవ్‌ను రాజ్యసభకు పంపిస్తారన్న ఊహాగానాలున్నప్పటికీ.. ఆ తర్వాత కేంద్ర కేబినెట్లోకి తీసుకుంటారా..? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగిలిందట. రాజ్యాంగపరంగా కేంద్ర మంత్రిగా కొనసాగాలంటే పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలి.
ప్రస్తుతం రామ్ మాధవ్ లోక్‌సభ లేదా రాజ్యసభ సభ్యుడు కాదు కాబట్టి ఇదంతా రాజకీయ ఊహాగానమే. ఇక బీజేపీ అధికారికంగా రాజ్యసభ అభ్యర్థిత్వం గానీ.. కేబినెట్ పదవి గానీ ప్రకటించలేదు. ఇవన్నీ పొలిటికల్ సర్కిల్లో జరుగుతున్న చర్చ.
ట్రబుల్ షూటర్ రాం మాధవ్ టార్గేటేంటీ..? రాజకీయాల్లో టైమింగ్‌కి చాలా విలువ ఉంటుంది. ఎవరికి పదవి ఇచ్చారు అన్నదాని కంటే.. ఎప్పుడు ఇచ్చారు..? ఎందుకు ఇచ్చారు..? ఏం బాధ్యత ఇచ్చారు..? ఎలాంటి ఎన్నికల ముందు ఇచ్చారు..? అన్నదే అసలు కథ. రామ్ మాధవ్ విషయంలో ఇప్పుడు ఇవే ప్రశ్నలు వినిపిస్తున్నాయట.
ఇక ముందు కీలక రాష్ట్రాల ఎన్నికలు.. ఆ తర్వాత 2029 సార్వత్రిక ఎన్నికల రాజకీయ సమీకరణాలు.. నాలుగోసారి దేశంలో అధికారంలోకి రావడానికి రాం మాధవ్ సేవలు అవసరమనే రీఎంట్రీ చేయించారా..? అన్న మీమాంస లేకపోలేదట. అన్నీ కలిపి చూస్తే.. బీజేపీ తన పాత రాజకీయ వ్యూహకర్తల్లో ఒకరైన రాం మాధవ్‌ను మళ్లీ ఫుల్ ఫామ్‌లోకి తీసుకొచ్చిందా..? అనే చర్చకు బలం చేకూరుతోందట.
యితే ఇక్కడే అసలు ట్విస్ట్ ఉంది. రామ్ మాధవ్‌ను రాజ్యసభకు పంపించి.. కేబినెట్లోకి తీసుకుంటారా..? లేక.. మంత్రి పదవి కాదు.. ముందు పార్టీ పని ముఖ్యం..అంటూ సంస్థాగత బాధ్యతలకే పరిమితం చేస్తారా..? అన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉందట.
కానీ.. ఢిల్లీ పెద్దల మనసులో ఏముంది..? కేంద్ర కేబినెట్ బెర్తా..? లేక ఇవన్నీ పక్కనపెట్టి 2027 ఎన్నికల కోసం ఒక భారీ ఆపరేషన్ మొదలైందా..? సినిమాలో ఇంటర్వెల్‌కి ముందు హీరో ఎంట్రీ ఇస్తే.. అసలు ట్విస్ట్ తర్వాతే తెలుస్తుంది అన్నట్టు.. రామ్ మాధవ్ రీఎంట్రీ కూడా అలాంటిదేనా..? సమాధానం మాత్రం.. రాబోయే రోజుల్లో బీజేపీ అధిష్టానం తీసుకునే నిర్ణయంపైనా ఆధారపడి ఉంటుందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.




