BIG STORY: గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ కొత్త రూల్స్!
BIG STORY: డిజిటల్ మోసాల కట్టడికి 'స్టాప్ స్విచ్', 'ట్రస్టెడ్ పర్సన్' సదుపాయాలను ఆర్బీఐ ప్రతిపాదించింది.
BIG STORY: గుడ్ న్యూస్.. రిజర్వ్ బ్యాంక్ కొత్త రూల్స్!
BIG STORY: డిజిటల్ మోసాలు తెరమీదకు వచ్చి చాలా కాలమైంది. ఇంటర్నెట్ను అడ్డు పెట్టుకుని ఆర్థిక నేరాలకు పాల్పడటం ఎక్కువైంది. వీటినే డిజిటల్ మోసాలు అంటున్నారు. డిజిటల్ మోసం అంటే పూర్తిగా కంప్యూటర్ ఆధారిత నేరం. కంప్యూటర్ను అడ్డం పెట్టుకుని ఉద్దేశపూర్వకంగా చేసే నేరాన్నే డిజిటల్ మోసం అంటున్నారు. అక్రమంగా డబ్బు సంపాదన కోసం డిజిటల్ నేరగాళ్లు, హ్యాకర్లు వీటికి పాల్పడుతుంటారు.
ఈ నేపథ్యంలో ఆన్లైన్ బ్యాంకింగ్, డిజిటల్ లావాదేవీల్లో పెరుగుతున్న మోసాలకు అడ్డుకట్ట వేయాలని భారత రిజర్వు బ్యాంకు భావించింది. అంతేకాదు ఖాతాదారుల ప్రయోజనాలకు మరింత రక్షణ కల్పించాలని ఆర్బీఐ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలో సరికొత్త సంస్కరణలకు రిజర్వు బ్యాంకు శ్రీకారం చుట్టింది.
ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ మోసాల బారిన పడకుండా ఖాతాదారులే స్వయంగా తమ ఖాతా నుంచి నిధుల బదిలీని తక్షణమే నిలిపివేసేలా ‘స్టాప్ స్విచ్’ అనే సదుపాయాన్ని బ్యాంకులు తప్పనిసరిగా అందుబాటులోకి తీసుకురావాలని ఆర్బీఐ ప్రతిపాదించింది.
‘కస్టమర్ ప్రొటెక్షన్ ఇన్ ఫ్రాడ్యులెంట్ ఎలక్ట్రానిక్ బ్యాంకింగ్ ట్రాన్సాక్షన్స్’ సవరించిన నిబంధనల ముసాయిదాలో భాగంగా ఈ కీలక సంస్కరణలను ఆర్బీఐ ప్రతిపాదించింది. అనధికార లావాదేవీలు జరిగినప్పుడు ఖాతాదారుల బాధ్యతను పరిమితం చేయడమే కాకుండా, అసలు మోసాలు జరగకుండా ముందస్తు రక్షణ చర్యలు కల్పించడమే ఈ ప్రతిపాదన వెనుక ఉన్న ముఖ్య ఉద్దేశం అని ఆర్బీఐ పేర్కొంది.
డిజిటల్ చెల్లింపుల వ్యవస్థపై వినియోగదారులకు మరింత నియంత్రణ కల్పించేందుకు ఈ ప్రతిపాదన ఉపయోగపడుతుందని ఆర్బీఐ వెల్లడించింది.
లావాదేవీలు జరుగుతున్నప్పుడు..తాను డిజిటల్ మోసానికి గురవుతున్నట్లు ఖాతాదారుడు గుర్తించిన వెంటనే ఈ ‘స్టాప్ స్విచ్’ ఫీచర్‌ను ఆన్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ యాక్టివేట్ కాగానే సదరు ఖాతా నుంచి భవిష్యత్తులో బయటకు వెళ్లాల్సిన అన్ని రకాల డెబిట్ లావాదేవీలు తక్షణమే నిలిచిపోతాయి. అయితే, ఇప్పటికే ఇచ్చిన రికరింగ్ పేమెంట్స్, స్టాండింగ్ ఇన్స్ట్రక్షన్స్, లోన్ ఈఎంఐలు, బ్యాంకు ఛార్జీల వసూళ్లు వంటి వాటికి మాత్రం ఈ స్టాప్ స్విచ్ నుంచి మినహాయింపు ఉంటుంది.
ఇదిలా ఉంటే, డిజిటల్ మోసాల సమయంలో బ్యాంకుల బాధ్యతను మరింత పారదర్శకంగా మార్చాలని రిజర్వు బ్యాంకు నిర్ణయించుకుంది. ఇందులో భాగంగా బ్యాంకు నిర్లక్ష్యం అనే అంశానికి ఆర్బీఐ సరికొత్త నిర్వచనం ఇచ్చింది.బ్యాంకింగ్ వ్యవస్థల్లో తలెత్తే సాంకేతిక లోపాలు, సైబర్ సెక్యూరిటీ వైఫల్యాలు, బ్యాంకు సిబ్బంది లేదా థర్డ్ పార్టీ వ్యక్తుల కుమ్మక్కు వల్ల జరిగే మోసాలను కూడా 'బ్యాంకు నిర్లక్ష్యం' కిందకే ఇకనుంచిపరిగణిస్తారు.
ఖాతాలో అనధికార లావాదేవీ జరగడానికి బ్యాంక్ వైపు నుంచి జరిగే ఎలాంటి పొరపాటు జరిగినా బ్యాంకు నిర్లక్ష్యం పరిధిలోకే వస్తుందని రిజర్వు బ్యాంక్ కుండబద్దలు కొట్టింది.
అలాగే బ్యాంకులు ‘ట్రస్టెడ్ పర్సన్ మెకానిజం’ ను కూడా అమలు చేయాల్సి ఉంటుంది. దీని ప్రకారం ఖాతాదారులు తాము నిర్దేశించుకున్న ఒక నిర్దిష్ట పరిమితి కంటే ఎక్కువ మొత్తంలో లావాదేవీ జరిపినప్పుడు, ఆ లావాదేవీని ధ్రువీకరించడానికి తమకు నమ్మకమైన ఒక వ్యక్తిని (ట్రస్టెడ్ పర్సన్) నామినేట్ చేయవచ్చు. సదరు వ్యక్తినే బ్యాంకు పరిభాషలో ట్రస్టెడ్ పర్సన్ అంటారు.
ఖాతాదారుడు నిర్దేశించిన పరిమితి దాటి లావాదేవీ ప్రారంభించగానే, సదరు ట్రస్టెడ్ పర్సన్‌కు బ్యాంకు సమాచారం పంపుతుంది. ఆ నోటిఫికేషన్లో బదిలీ చేయదలచిన మొత్తం, లబ్ధిదారుని పేరు, ఖాతా నంబరు, మొబైల్ నంబరు వంటి వివరాలు ఉంటాయి.
ఆ సమాచారం అందినప్పటి నుంచి ట్రస్టెడ్ పర్సన్‌కు ఆమోదం తెలిపేందుకు ఒక గంట సమయం ఉంటుంది. వారు ఆమోదిస్తేనే లావాదేవీ పూర్తవుతుంది. ఒకవేళ ట్రస్టెడ్ పర్సన్ తిరస్కరించినా, లేదా గంటలోపు ఎలాంటి స్పందన తెలియజేయకపోయినా ఆ లావాదేవీ ఆటోమేటిక్‌గా రద్దవుతుంది.
అయితే ఈ విధానం పూర్తిగా ఖాతాదారుల ఆప్షనల్ మాత్రమే. ట్రస్టెడ్ పర్సన్‌గా ఎంపికైన వ్యక్తికి సదరు ఖాతాపై ఎలాంటి నియంత్రణ ఉండదు, అలాగే లావాదేవీలకు సంబంధించి వారు ఎలాంటి చట్టపరమైన బాధ్యత వహించాల్సిన అవసరం లేదు. ఇదిలా ఉంటే ఆర్బీఐ ముసాయిదా మార్గదర్శకాలు 2027 జులై 1 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి రానున్నాయి.




