Burning Topic: కమర్షియల్ ఎల్‌పీజీపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం: పరిశ్రమలు, హోటళ్లకు భారీ ఊరట!

Burning Topic: అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు ఫలించడంతో పశ్చిమాసియాలో శాంతి వాతావరణం నెలకొంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 27 Jun 2026 6:40 AM IST
Burning Topic: కమర్షియల్ ఎల్‌పీజీపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం: పరిశ్రమలు, హోటళ్లకు భారీ ఊరట!
X

Burning Topic: కమర్షియల్ ఎల్‌పీజీపై ఆంక్షలు ఎత్తివేసిన కేంద్రం: పరిశ్రమలు, హోటళ్లకు భారీ ఊరట!

Burning Topic: అమెరికా, ఇరాన్‌ల మధ్య చర్చలు ఫలించి పశ్చిమాసియాలో శాంతియుత వాతావరణం ఏర్పడటం ప్రపంచానికి ఊరటనిస్తోంది. మన దేశంలో కూడా ఇంధన సరఫరాలకు ఆటంకాలు తొలగిపోయినట్లే.. పరిస్థితులు సాధారణ స్థితికి చేరుకుంటున్న నేపథ్యంలో హోటల్స్, రెస్టారెంట్లు, ఇతర వాణిజ్య సంస్థలు, పరిశ్రమలకు సరఫరా చేసే కమర్షియల్ ఎల్‌పీజీపై విధించిన అన్ని పరిమితుల్ని ఎత్తివేస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. సంక్షోభం సమయంలో నిలిపివేసిన బల్క్ ఎల్పీజీ సరఫరాలను కూడా ఇప్పుడు 50 శాతం మేర పునరుద్ధరించారు. దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి పెరగడం సహా ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటున్న ఎల్పీజీ ట్యాంకర్లు వస్తుండటం వల్ల సరఫరా గణనీయంగా మెరుగుపడిందని పెట్రోలియం, సహజ వాయు మంత్రిత్వ శాఖ తెలిపింది. వాణిజ్య ఎల్పీజీ సరఫరాల్ని పూర్తి స్థాయిలో పునరుద్ధరించినట్లు సంబంధిత శాఖ అధికారులు ప్రకటించారు.

కేంద్రం తాజాగా తీసుకున్న నిర్ణయంతో పరిశ్రమలకు కూడా ఉపశమనం లభించనుంది. మరోవైపు పర్యావరణహిత పైప్డ్ నేచురల్ గ్యాస్ వినియోగాన్ని ప్రభుత్వం మరింత ప్రోత్సహించనుంది. ఇప్పటికే పీఎన్‌జీ కనెక్షన్ తీసుకున్న వినియోగదారులు, సంస్థలు అదే విధానంలో కొనసాగాలని స్పష్టం చేసింది. PNG అందుబాటులో ఉన్న ప్రాంతాల్లోని ఇతర అర్హులైన ఎల్పీజీ వినియోగదారులను కూడా దశలవారీగా పీఎన్‌జీకి మార్చేందుకు కేంద్రం చర్యలు తీసుకోనుంది. గతంలో ఎల్పీజీ తయారీలో ఉపయోగించే సీ3, సీ4 హైడ్రోకార్బన్ గ్యాస్ స్ట్రీమ్స్‌ను పూర్తిగా ఎల్పీజీ ఉత్పత్తి కోసమే వినియోగించాలని రిఫైనరీలకు ఆదేశించింది. ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ సహా ఇతర ప్రైవేట్ రిఫైనరీలపై గణనీయమైన ప్రభావం చూయించింది. తమ అత్యంత లాభదాయకమైన పెట్రోకెమికల్స్ ఉత్పత్తిని తగ్గించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కేంద్రం నిర్ణయంతో భారీ ఊరట లభించినట్లయింది.

మరోవైపు ప్రపంచ ఇంధన మార్కెట్‌ సంక్షోభాలను దృష్టిలో పెట్టుకొని భారత్‌ అత్యంత వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోంది. వంటగ్యాస్ సరఫరాకు ఎటువంటి అంతరాయం కలగకుండా గల్ఫ్ దేశాలపై ఆధారపడటాన్ని తగ్గించుకుంటూ అమెరికా, ఇరాన్ వంటి దేశాల నుంచి దిగుమతులను ముమ్మరం చేసింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో అమెరికా నుంచి భారత్ కేవలం 8 శాతం ఎల్‌పీజీని దిగుమతి చేసుకోగా, ఏప్రిల్ నాటికి అది ఏకంగా మూడో వంతుకు అంటే సుమారు 33 శాతానికి పెరిగింది. అమెరికాతో కుదుర్చుకున్న 2.2 మిలియన్ టన్నుల సరఫరా ఒప్పందం ఈ క్లిష్ట సమయంలో భారత్‌కు ఎంతగానో అండగా నిలిచింది. అర్జెంటీనా, చిలీ, ఫ్రాన్స్, నెదర్లాండ్స్ వంటి సుదూర దేశాల నుంచి కూడా భారత్ ఎల్‌పీజీని సేకరించింది. అయితే సుదూర ప్రయాణాల వల్ల రవాణా ఖర్చులు భారీగా పెరిగాయి. పరిమిత లభ్యత కారణంగా భారత్‌లో ఎల్‌పీజీ వినియోగం కూడా తగ్గింది.

తాజాగా వెనెజువెలాలో భారీ భూకంపం నేపథ్యంలో భారత్‌ ఇంధన సరఫరా వ్యవస్థపై దాని ప్రభావం పడనుందా అనే ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని కారకస్‌ సహా అనేక నగరాలను ఈ భారీ భూకంపాలు వణికించాయి. అనేక భవనాలు కుప్పకూలాయి. మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయి. విద్యుత్‌కు అంతరాయం కలగడం, రవాణా వ్యవస్థ దెబ్బతినడం వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తి దేశాల్లో ఒకటి వెనెజువెలా. దీంతో చమురు సరఫరాపై తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. భూకంపం కారణంగా అక్కడి చమురు క్షేత్రాలు రిఫైనరీలు, ఎక్స్‌పోర్ట్ టెర్మినళ్లు, పైప్‌లైన్లకు ఏమేరకు నష్టం జరిగిందనే విషయంలో ఇంత వరకూ స్పష్టత లేదు. అయితే చమురు క్షేత్రాలు పెద్దగా దెబ్బతినలేదని చెబుతున్నారు. వెనెజువెలాకు ప్రధాన కార్గో గేట్‌వే అయిన ‘లా గువేరా’ నగరం తీవ్రంగా దెబ్బతింది. దీంతో చమురు లోడింగ్‌ ఆలస్యం కానుంది.

వెనెజువెలా భూకంపం కారణంగా భారత్‌లో తక్షణమే పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగే అవకాశం లేదని మార్కెట్‌ రంగ నిపుణులు వెల్లడిస్తున్నారు. భూకంపాలు సంభవించిన అనంతరం చమురు క్షేత్రాల పరిస్థితిని క్షుణ్ణంగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. భూగర్భ పైప్‌లైన్‌ వ్యవస్థలు, ఇతర మౌలిక సదుపాయాలు ఎంతమేర దెబ్బతిన్నాయో తెలియాంటే కొన్ని వారాల సమయం పడుతుంది. అందువల్ల పరిస్థితిని ఇప్పుడే అంచనా వేయలేమని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story