Burning Topic: ఆర్ఎస్ఎస్‌కు అమెరికా కెనడాల్లో బ్రహ్మరథం!

Burning Topic: అమెరికా పర్యటనలో ముస్లింలపై ఆరెస్సెస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు, న్యూయార్క్ ప్రసంగంపై నిరసనలు వ్యక్తమయ్యాయి.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 1 Sept 2026 6:32 AM IST
Burning Topic
X

Burning Topic: ఆర్ఎస్ఎస్‌కు అమెరికా కెనడాల్లో బ్రహ్మరథం!

Burning Topic: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ సర్‌సంఘ చాలక్ మోహన్‌ భాగవత్‌ విదేశీ పర్యటన ఆసక్తిగా కొనసాగుతోంది. ఆరెస్సెస్ శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా అమెరికా, కెనడా, బ్రిటన్‌లో ఆయన పర్యటిస్తున్నారు. ముందుగా న్యూయార్క్ చేరుకున్న ఆరెస్సెస్ చీఫ్‌కు ప్రవాస భారతీయులు ఘనంగా స్వాగతం పలికారు.

ఈ మహా నగరంలోని వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, పరిశ్రమల ప్రతినిధులతో సమావేశమయ్యారు. భారత యువత సామర్థ్యంపై అపారమైన విశ్వాసం ఉందని మోహన్ భాగవత్ తెలిపారు. వసుధైవ కుటుంబకం భావనకు అనుగుణంగా సమాజాన్ని, ప్రపంచాన్ని ఒక కుటుంబంగా చూడాలని పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా ఆయన టెలికమ్యూనికేషన్స్‌, అంతరిక్షం, క్లీన్‌ ఎనర్జీ, టెక్నాలజీ, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ తదితర రంగాలకు చెందిన వారితో రౌండ్‌టేబుల్‌ నిర్వహించారు. అనేక అంశాలపై వారితో చర్చించడంతో పాటు వారు అడిగిన ప్రశ్నలకు జవాబులిచ్చారు.

న్యూయార్క్‌లో మోహన్ భాగవత్ పాల్గొన్న కార్యక్రమంలో అత్యంత కీలకంగా నిలిచింది యూనివర్సల్ వన్నెస్ సెలబ్రేషన్. అమెరికన్‌ హిందూస్‌ ఫర్‌ ఎంగేజ్‌మెంట్‌ అండ్‌ డైలాగ్‌ ఆధ్వర్యంలో మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ ఇన్ఫోసిస్‌ థియేటర్‌లో నిర్వహించిన ఈ సభ ఎంతో ఉత్సాహంగా సాగింది.

వివిధ మతాలు, సంస్కృతులకు చెందిన ప్రజలతో నిర్వహించిన ఈ సభకు ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. ఆర్‌ఎస్‌ఎస్‌ మూల సిద్ధాంతమైన మానవతా సేవ గురించి మోహన్ భాగవత్ ప్రస్తావించారు. ఏ సమస్య వచ్చినా మానవత్వంతో స్పందించడమే తమ లక్ష్యమన్నారు.

ఆ సమయంలో బాధితులు ముస్లింలా, ఇతర మతాలకు చెందినవారా అని చూడబోమన్నారు. ఆరెస్సెస్‌ మీద అపోహలను ఉద్దేశించి మాట్లాడుతూ, తప్పుడు కథనాల వల్ల ఎన్నో అభిప్రాయాలు ఏర్పడ్డాయని అన్నారు. కానీ ఇతరులు వచ్చి ఆర్ఎస్ఎస్‌ను లోపలి నుంచి చూసినప్పుడే అవి తప్పులని తేలతాయని తెలిపారు భాగవత్.

భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతదేశ డీఎన్‌ఏలోనే అంతర్లీనంగా ఉందని అన్నారు మోహన్‌ భాగవత్‌. విభిన్న భాషలు, సంస్కృతులు, సంప్రదాయాలు ఉన్నప్పటికీ అందరినీ ఏకత్వ భావనతో కలుపుకొని ముందుకు సాగడమే భారత్‌ ప్రత్యేకత అని తెలిపారు.

ఆర్‌ఎస్‌ఎస్‌ ఎప్పుడూ భారత్‌లో ముస్లింలు ఉండకూడదని చెప్పలేదని స్పష్టం చేశారు. ముస్లింలు లేని భారత్‌ను కోరుకోవడం హిందుత్వం కాదని, అలా భావించేవారు అసలు హిందువుగా ఉండలేనని వ్యాఖ్యానించారు. ప్రవాస భారతీయులు తాము నివసిస్తున్న దేశానికి విధేయులుగా ఉండాలని పిలుపునిచ్చారు.

మనం అమెరికాలో నివసిస్తున్నాం, ఇక్కడే సంపాదిస్తున్నాం. అందుకే అమెరికాకు నిజాయితీగా ప్రవర్తించాలి అని సూచించారు ఆరెస్సెస్స్ చీఫ్ భారత్‌ వారి జన్మభూమి అయినప్పటికీ, తాము నివసిస్తూ, పనిచేస్తున్న దేశమే కర్మభూమి అని పేర్కొన్నారు. కర్మభూమి పట్ల తమ బాధ్యతలను ముందుగా నెరవేర్చాలని కోరారు.

అమెరికాలో తన పర్యటన ముగించిన ఆర్‌ఎస్‌ఎస్‌ చీఫ్‌ మోహన్‌ భాగవత్‌ కెనడా పర్యటనకు వెళ్లారు. టొరంటోలో నిర్వహించిన హిందూ విశ్వ బంధు- ఎంబ్రేస్‌ ది వరల్డ్‌ ఇన్‌ ఫ్రెండ్‌షిప్‌ కార్యక్రమంలో ప్రసంగించారు. భారతీయ సంస్కృతిలో భిన్నత్వానికి ప్రత్యేక స్థానం ఉందని వివరించారు.

అనేక కులాలు, మతాలు, భాషలు ఉన్నప్పటికీ అవన్నీ భారతీయ సమాజంలో భాగంగానే ఉన్నాయని చెప్పారు. ప్రపంచంలో ఎక్కడైనా కష్టాల్లో ఉన్నవారికి భారత్‌ అండగా నిలిచిందని మోహన్ భాగవత్‌ గుర్తుచేశారు.

రెండో ప్రపంచ యుద్ధ సమయంలో పోలాండ్‌కు చెందిన శరణార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నప్పుడు, జామ్‌నగర్‌ మహారాజా వారికి ఆశ్రయం కల్పించిన విషయాన్ని ప్రస్తావించారు. ఇటీవల పశ్చిమాసియాలో యుద్ధ పరిస్థితులు నెలకొన్నప్పుడు భారత సైనిక విమానాలు అక్కడ చిక్కుకున్న భారతీయులను మాత్రమే కాకుండా ఇతర దేశాల పౌరులను కూడా సురక్షితంగా తరలించాయని పేర్కొన్నారు.

భారత్‌ను మహాశక్తిగా కాకుండా విశ్వగురువుగా చూడాలని పేర్కొన్నారు మోహన్ భాగవత్‌. భారత్ ఇతర దేశాలను జయించడాన్ని లక్ష్యంగా పెట్టుకోలేదని అన్నారు. ప్రాచీన కాలంలో భారతీయులు ఎక్కడికెళ్లినా ఏ దేశాన్నీ ఆక్రమించలేదని, బలవంతంగా మతం మార్చలేదన్నారు.

వెళ్లిన చోట జ్ఞానాన్ని పంచారు. జ్యోతిష్యం, ఆయుర్వేదం, నాగరికత విలువలను అందించారని వివరించారు. భారతీయ సంస్కృతి ప్రపంచంపై ఆధిపత్యం సాధించడాన్ని కాకుండా, మానవాళికి ఉపయోగపడే జ్ఞానాన్ని పంచడాన్నే ప్రాధాన్యంగా చూసిందని చెప్పారు.

భారత్‌ ప్రపంచంలో అగ్రశక్తిగా ఎదగడం కంటే తన సేవా గుణం, మానవతా విలువలతో విశ్వగురువుగా గుర్తింపు పొందిందని ఆరెస్సెస్ చీఫ్ తెలిపారు. భారత్‌ ఎప్పుడూ ఇతర దేశాలపై ఆధిపత్యం చెలాయించేందుకు ప్రయత్నించలేదని, ప్రపంచానికి జ్ఞానం, సంస్కృతి, మానవతా విలువలను అందించిందని తెలిపారు.

మరోవైపు ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ అమెరికా పర్యటను భగ్నం చేసేందుకు కొన్ని సంస్థలు ప్రయత్నం చేశాయి. ఆయన వీసాను రద్దు చేయాలని అంతర్జాతీయ మత స్వేచ్ఛపై అమెరికా కమిషన్‌ డిమాండ్ చేసింది.

మత స్వేచ్ఛ ఉల్లంఘనలకు పాల్పడినవారిపై ఆంక్షలు విధించాలని కోరింది. మోహన్ భాగవత్ సభ జరిగిన న్యూయార్క్‌లోని మాడిసన్‌ స్క్వేర్‌ గార్డెన్‌ దగ్గర భారత వ్యతిరేక శక్తులు త్రివర్ణ పతాకాన్ని అవమానించాయి.

ఖలిస్థాన్ అనుకూల నినాదాలు చేస్తున్నట్లు ఈ వీడియోలో కనిపించింది. ఈ ఘటనలపై తీవ్రంగా స్పందించారు కేంద్ర మంత్రి కిరణ్‌ రిజిజు. ఆర్‌ఎస్‌ఎస్, బీజేపీని, ప్రభుత్వాన్ని విమర్శించే స్వేచ్ఛ నిరసనకారులకు ఉందని అన్నారు.

అయితే శ్రద్ధగా వినండి. భారత్‌ను, మా దేశ జెండాను అవమానించవద్దు. దానికి మీరు భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుంది అని హెచ్చరించారు కిరణ్ రిజుజు.. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ పోస్టు పెట్టారాయన

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story