Off The Record: రేవంత్ ఢిల్లీ వెళ్ళింది సురేఖకు షాకిచ్చేందుకేనా!

Off The Record: కాంగ్రెస్‌లో కొండా సురేఖ, చిన్నారెడ్డి ఎపిసోడ్ ఢిల్లీకి చేరింది. సీఎం రేవంత్ నేతృత్వంలో హస్తినకు రాష్ట్ర నేతలు; ఇద్దరు మంత్రుల పదవులకు గండం.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 2 Sept 2026 9:06 AM IST
Off The Record
X

Off The Record: రేవంత్ ఢిల్లీ వెళ్ళింది సురేఖకు షాకిచ్చేందుకేనా!

Off The Record: తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎపిసోడ్ ఢిల్లీకి చేరింది. కొండా సురేఖ‌తోపాటు చిన్నారెడ్డి పదవి కూడా పోతుందా..? అన్న చర్చ కాంగ్రెస్‌ శ్రేణుల్లో జోరందుకుంది. ఆదిలోనే చర్యలు తీసుకోకపోతే భవిష్యత్తులో మరొకరు ఇలాగే మాట్లాడుతారని పార్టీ అధిష్టానం కఠిన నిర్ణయం తీసుకోనుందా..? ఈ క్రమంలో సురేఖపై చర్యలు తీసుకుంటారా..? లేదా సురేఖ రాజీనామా చేస్తారా..? అన్నది కూడా ఆసక్తికరంగా మారింది.

ఈ క్రమంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ బాట పట్టారు. ఆయనతోపాటు TPCC అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కొండా సురేఖ హస్తిన పయనమయ్యారు. అటు.. ఏఐసీసీ జనరల్ సెక్రటరీ KC వేణు గోపాల్ కూడా బెంగళూరు నుంచి ఢిల్లీకి చేరుకుని వీరితో సమావేశం కానున్నారు. ఈ సమావేశంలో తెలంగాణ రాష్ట్ర ఇంచార్జి మీనాక్షి నటరాజన్ కూడా పాల్గొంటారు. మరోవైపు ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో CM రేవంత్ రెడ్డి బృందం భేటీ కానుంది.

హస్తినలో జరిగే ఈ కీలక భేటీలో ప్రధానంగా మంత్రి కొండా సురేఖ వివాదాస్పద అంశం, చిన్నారెడ్డి ఇష్యూలే కీలకం కానున్నాయట. కొండా సురేఖను స్వచ్ఛందంగా మంత్రి పదవి నుంచి తప్పుకోవాలని సూచించడమా..? లేదంటే తప్పించడమా..? అన్నది కాంగ్రెస్ అధిష్టానం ముందున్న ఆప్షన్స్‌గా భావిస్తు్న్నారు రాజకీయ విశ్లేషకులు.

చిన్నారెడ్డిని కూడా ప్రణాళిక బోర్డు వైస్ చైర్మన్ పదవి నుంచి తప్పించనున్నారని టాక్. ఈ ఊహాగానాలే నిజమైతే ఆ పదవుల్లో ఎవరిని నియమిస్తారన్న చర్చ కూడా జోరందుకుంది. ఈ ఇద్దరి స్థానాలను ఎవరితో భర్తీ చేస్తారనే ఆసక్తికర చర్చ లేకపోలేదు. ఆ నిర్ణయం కూడా వెనువెంటనే తీసుకుంటుందన్న గుసగుసలు కూడా వినిపిస్తున్నాయి.

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై మంత్రి కొండా సురేఖ కూతురు సుష్మితా పటేల్ చేసిన అనుచిత వ్యాఖ్యలు, వాటి పర్యవసానాలను ఏఐసీసీ సీరియస్‌గా పరిగణించిందట. ఆదిలోనే ఇటువంటి సమస్యలకు చెక్ పెడితే.. భవిష్యత్తులో మరొకరు ఈ విధంగా ప్రవర్తించే ఛాన్స్ ఉండదని కాంగ్రెస్ పెద్దలు భావిస్తున్నారట.

అదే కోవలో చిన్నారెడ్డి తదితరులు సీఎంతోపాటు ఏఐసీసీ, వనపర్తి టికెట్ కేటాయింపుపై చేసిన కామెంట్స్‌‌ను కాంగ్రెస్ పెద్దలు ఒకింత సీరియస్‌గానే తీసున్నారట. ఈ క్రమంలో వీరిద్దరిపై చర్యలు తీసుకోవాలన్న డిమాండ్ బలంగా వినిపించడంతో రాష్ట్ర కీలక నేతల ఢిల్లీ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది.

మంత్రి కొండా సురేఖ.. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గేతో, ఆమె భర్త కొండా మురళి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఉత్తమ్ రెడ్డితో భేటీ అయినప్పటికీ.. సానుకూల సంకేతాలు రాలేదట. ఈ నేపథ్యంలో.. సురేఖ, చిన్నారెడ్డికి ప్రస్తుతం పదవీ గండం పొంచి ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఇంకా చెప్పాలంటే పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయన్న చర్చ జోరందుకుంది. ఏఐసీసీ పెద్దల తుది తీర్పు ఎలా ఉండనుందో చూడాలి మరి.

హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్

Next Story