Off The Record: హై టెన్షన్.. ఒకే రోజు కేసిఆర్ రేవంత్ రెడ్డి సభలు
Off The Record: తెలంగాణ రాజకీయాల్లో బిగ్ ఫైట్! ఈ నెల 20న ఒకే రోజు కేసీఆర్ జగిత్యాల బహిరంగ సభ మరియు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటన.
Off The Record: హై టెన్షన్.. ఒకే రోజు కేసిఆర్ రేవంత్ రెడ్డి సభలు
Off The Record: మాజీ సీఎం కేసీఆర్, ప్రస్తుత సీఎం రేవంత్‌రెడ్డి పొలిటికల్‌గా తలపడేందుకు రంగం సిద్ధమైంది. ఒకే రోజు ఇద్దరు లీడర్లు ఉత్తమ తెలంగాణ పర్యటనతో.. రాజకీయాన్ని హీటెక్కించబోతున్నారు. గులాబీ బాస్ కేసీఆర్ ఈ నెల 20న జగిత్యాలలో పర్యటించబోతున్నారు. భహిరంగ సభలో పాల్గొంటారు. చాలా కాలం తరువాత కేసీఆర్ ఓ భహిరంగ సభలో పాల్గొంటుండటంతో సర్వత్రా ఆసక్తినెలకొంది.
కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి జీవన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరబోతున్నారు. ఈ చేరిక కార్యక్రమం నేపధ్యంలో జగిత్యాలలో ఈనెల 20న భహిరంగ సభ ఏర్పాటు చేశారు. గులాబీ బాస్ కేసీఆర్ ఈ సభకు హాజరై జీవన్ రెడ్డికి గులాబీ కండువా కప్పి పార్టీలో చేర్చుకోనున్నారు. దాదాపు యేడాది తరువాత కేసీఆర్ ఓ భహిరంగ సభలో పాల్గొంటుండటంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. గత ఏడాది ఏప్రిల్ 27న పార్టీ సిల్వర్ జూబ్లీ వేడుకల నేపధ్యంలో వరంగల్ లో ఏర్పాటు చేసిన భారీ భహిరంగ సభలో పాల్గొన్న కేసీఆర్, మళ్లీ తరువాత ఎక్కడా సభలకు హాజరు కాలేదు. ఇప్పుడు జగిత్యాల సభకు హాజరు అవుతుండటంతో భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. కాంగ్రెస్ సర్కార్ పాలనకు.. సగం కాలం పూర్తైంది. దీంతో రేవంత్ ప్రభుత్వంపై.. కేసీఆర్ సంధించే విమర్శల బాణాలు ఎలా ఉంబోతున్నాయి. ముఖ్యంగా పార్టీ ఫిరాయింపులపై ఎలాంటి కామెంట్స్ చేయనున్నారనే ఆసక్తి నెలకొంది.
కేసీఆర్ జగిత్యాల భహిరంగ సభలో పాల్గొంటున్న 20వ తేదీనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాళేశ్వరం ప్రాజెక్టులో భాగమైన మేడిగడ్డను సందర్శించబోతున్నారట. ఇదే ఇప్పుడు రాజకీయవర్గాల్లో ఆసక్తికరమవుతోంది. కాళేశ్వరం ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఇటీవల తెలంగాణ ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది. మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీలలో ఏర్పడిన సమస్యలను పరిష్కరించి, వాటిని తిరిగి వినియోగంలోకి తీసుకురావడానికి మరమ్మతులు చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు. ఈ నేపధ్యంలో స్వయంగా మేడిగడ్డ బ్యారేజీని పరిశీలించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారని తెలుస్తోంది. ఈ నెల 20న ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి మేడిగడ్డ బ్యారెజీని సందర్శించి, అక్కడి నుంచే అధికారులకు ఆదేశాలు జారీచేయనున్నారట.
రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించాక ఒక్కసారి మాత్రమే మేడిగడ్డ బ్యారేజీ దగ్గరకు వెళ్లారు. సరిగ్గా రెండేళ్ల క్రితం 2024 ఫిబ్రవరి 13న కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అంటూ.. మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు కుంగిపోవడంపై అధ్యయనం చేయడానికి ఆయన మొదటిసారి వెళ్లారు. తన కేబినెట్ మంత్రులతో పాటు ఎమ్మెల్యేలతో కలిసి ప్రత్యేక బస్సుల్లో అక్కడికి వెళ్లి పరిస్థితిని క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఆ తరువాత రేవంత్ రెడ్డి మళ్లీ మేడిగడ్డ బ్యారేజ్ దగ్గరకు వెళ్లలేదు. పైగా కాళేశ్వరం ప్రాజెక్టును కూళేశ్వరంగా అభివర్ణిస్తూ వస్తున్న సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ తో పాటు గత బీఆర్ఎస్ ప్రభుత్వంపై అవినీతి ఆరోపణలు చేస్తూ వస్తున్నారు. ఎప్పుడు అవకాశం వచ్చినా, సందర్బం ఏదైనా కాళేశ్వరంపై విమర్శలు గుప్పిస్తూ వస్తున్నారు. కాళేశ‌్వరంపై ప్రభుత్వం వేసిన రిటైర్డ్ జడ్జి విచారణ పూర్తై నివేదిక అందడం, అలాగే దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నట్టు అసెంబ్లీలో ప్రకటన తర్వాత..రేవంత్ కాళేశ్వరం టూర్ పట్ల సర్వత్రా ఆసక్తి నెలకొంది.
ఈనెల 20న కేసీఆర్ జగిత్యాలలో బహిరంగ సభ నిర్వహించడం, అదేరోజు సీఎం రేవంత్ రెడ్డి మేడిగడ్డ బ్యారేజీని సందర్శించడం వెనుక బలమైన రాజకీయ వ్యూహాం ఉందన్న చర్చ జరుగుతోంది. ఇది ఒక రకమైన మైండ్ గేమ్ గా రాజకీయ విశ్లేషకులు అభివర్ణిస్తున్నారు. కాంగ్రెస్ కు రాజీనామా చేసిన జీవన్ రెడ్డి బీఆర్ఎస్ లో చేరుతుండటంతో ఆ పార్టీకి ఇది కీలకమైన మలుపు. దీనికి పోటీగా సీఎం రేవంత్ రెడ్డి అదే రోజు పర్యటన పెట్టుకోవడం ద్వారా మీడియా ఫోకస్‌తో పాటు ప్రజల దృష్టి కేసీఆర్ వైపు ఉండకుండా తన వైపునకు తిప్పుకోవాలని కాంగ్రెస్ భావిస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. బీఆర్ఎస్ హయాంలో నిర్మాణమైన కాళేశ్వరం ప్రాజెక్టు వైఫల్యాలను, మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటును ప్రజలకు మరోసారి గుర్తుచేయడం రేవంత్ ప్రధాన ఉద్దేశంగా కనిపిస్తోంది. సభలో ప్రభుత్వంపై కేసీఆర్ చేసే విమర్శలకు..కాళేశ‌్వరం వేదికగా అక్కడికక్కడే క్షేత్రస్థాయిలో ఉన్న లోపాలను చూపిస్తూ కౌంటర్ ఇవ్వాలనేది రేవంత్ రెడ్డి ఆలోచన తెలుస్తోంది.
జగిత్యాల, మేడిగడ్డ రెండూ ఉత్తర తెలంగాణ పరిధిలోకి వస్తాయి. ఇక్కడ పట్టు నిరూపించుకోవడం రెండు పార్టీలకూ చాలా కీలకం. అందుకే జగిత్యాల సభ ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ధిని గాలికొదిలేసిందని, కేవలం విచారణల పేరుతో కాలయాపన చేస్తోందని విమర్శించడం ద్వారా ప్రజా మద్దతును కూడగట్టాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారట. ఇదే సమయంలో గత బీఆర్ఎస్ పాలకుల తప్పులను సరిదిద్దుతున్నాం అనే సంకేతాన్ని అక్కడి ప్రజల్లోకి తీసుకెళ్లాలని రేవంత్ చూస్తున్నారట. కేసీఆర్ జగిత్యాల సభ ద్వారా వచ్చే మైలేజీని తగ్గించడానికి రేవంత్ రెడ్డి మేడిగడ్డ పర్యటనను, అక్కడ ఆయన చేసే ప్రసంగాన్ని వాడుకోనున్నారని తెలుస్తోంది. ఇది ఖచ్చితంగా తెలంగాణలో ప్రధాన ప్రతిపక్షం, అధికార పార్టీల మధ్య జరుగుతున్న రాజకీయ ఆధిపత్య పోరుగానే చూడాలాంటున్నారు. మొత్తానికి ఉత్తర తెలంగాణ వేదికగా.. బడానేతల మధ్య.. బిగ్ ఫైట్ చూడబోతున్నాం.




