Off The Record: నిజామాబాద్ కాంగ్రెస్ లో కల్లోలం.. కోవర్టులపై వేటు

Off The Record: నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు భగ్గుమన్నాయి.

హెచ్ఎం డిజిటల్ డెస్క్
Updated on: 28 April 2026 6:43 AM IST
Off The Record
X

Off The Record: నిజామాబాద్ కాంగ్రెస్ లో కల్లోలం.. కోవర్టులపై వేటు

Off The Record: ఆర్మూర్ పట్టణ కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన ప్రారంభమైంది. కోవర్టు ఆపరేషన్‌పై.. జిల్లా కాంగ్రెస్‌ పంజా విసిరింది. పార్టీలో ఉంటూ సొంత అభ్యర్థుల ఓటమికి కుట్ర పన్నారనే ఆరోపణలతో సస్పెన్షన్ వేటేసింది. ఆర్మూర్ మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు నుంచి కౌన్సిలర్‌గా పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ చైర్‌పర్సన్ అభ్యర్థి ఏబి శ్రీదేవి ఓటమికి విపక్ష పార్టీలతో కలిసి పని చేసిన ఇద్దరు కాంగ్రెస్ నాయకులను పార్టీ నుంచి సస్పెండ్ చేస్తూ డిసిసి అధ్యక్షుడు ఉత్తర్వులు జారీ చేశారు. విపక్షాలతో చేతులు కలిపి కోవర్ట్ రాజకీయం చేశారనే ఆరోపణలతో కాంగ్రెస్ నాయకులు ఇమామ్ ఉద్దీన్, ఫయాజ్ లపై పార్టీ అధిష్టానం సీరియస్ అయింది. ఆర్మూర్ పట్టణ అధ్యక్షుడు సాయిబాబాగౌడ్ ఫిర్యాదు మేరకు షోకాస్ నోటీసులు జారీ చేశారు. దీంతో ఇద్దరి నుంచి వివరణ రాకపోవడంతో పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.

సస్పెన్షన్‌కు గురైన ఫయాజ్.. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు. ఫయాజ్ వదిన గత పాలకవర్గంలో కౌన్సిలర్‌గా విజయం సాధించంతో.. పట్టణంలో అనధికారిక కౌన్సిలర్ గా ఫయాజ్ చలామణి అయ్యాడు. ఆర్మూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గంలో డైరెక్టర్‌గా సైతం ఫయాజ్‌ పేరును నామినేట్ చేశారు. ఐతే పార్టీలోనే ఉంటూ.. ప్రత్యర్థులకు సహరించేలా కోవర్ట్‌ ఆపరేషన్‌ చేస్తున్నారని, వీరివల్ల పార్టీకి నష్టం జరుగుతుందనే నిర్థారణకు వచ్చి పార్టీ నుంచి తొలగించారు. వీరితో పాటు.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పోటీ చేసిన రెబల్ అభ్యర్థులపై సైతం చర్యలు తీసుకోవాలంటూ పలువురు కాంగ్రెస్ నాయకులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాంగ్రెస్లో ఉంటూ జంబి హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్గా కొనసాగుతున్న రేగుల సత్యనారాయణ.. 27వ వార్డు నుంచి బిజెపి అభ్యర్థిగా తన సతీమణిని పోటీకి నిలిపారు. అలాగే పట్టణంలోని 1, 3, 13, 14, 18, 19, 20, 27, 30వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఓటమిలో రెబల్స్ తో పాటు కోవర్టులు కీలక పాత్ర పోషించారని,, దీంతో వీరందరిపై ఫిర్యాదులు చేసేందుకు కొందరు నాయకులు కూడా సిద్ధమైతున్నారట.

నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో పాత, కొత్త వర్గాల మధ్య పంచాయితీ కొనసాగుతుంది. మున్సిపల్ ఎన్నికల వేల ఇది గాంధీ భవన్ వరకు చేరింది. ఐతే ఎన్నికల అనంతరం సర్థుమణుగుతుందని అంతా భావించారు. కానీ కథ మళ్లీ మొదటికి వచ్చింది..ముఖ్యంగా ఆర్మూర్ కాంగ్రెస్ నియోజక వర్గ ఇంచార్జ్ వినయ్ కుమార్ రెడ్డికి వ్యతిరేకంగా స్వంత పార్టీ నేతలే అధిష్టానానికి పిర్యాదులు చేస్తున్నారట..ఆయన తీరుపై పాత కాంగ్రెస్ క్యాడర్ గుర్రుగా ఉందట. ఎన్నికల సమయంలో మున్సిపాలిటీ టికెట్ల కేటాయింపులో వినయ్ రెడ్డి ఏకపక్షంగా వ్యవహరించారని కొంతమంది సీనియర్ నాయకులు మదనపడ్డారట..వినయ్ కి వ్యతిరేకంగా జట్టుకట్టిన నేతలు.. రెబల్ గా బరిలోకి దిగేందుకు సిద్ధం అవటం హాట్ టాపిక్ గా మారింది..కానీ అధిష్టానం పెద్దలు ముఖ్యంగా మహేష్ కుమార్ గౌడ్ కల్పించుకుని వివాదానికి తెరదించారు. పార్టి కోసం కష్టపడ్డవారికి గుర్తింపు ఇస్తామని సముదాయించారు.. తాత్కాలికంగా శాంతించారు అక్కడి కాంగ్రెస్ నేతలు. కట్ చేస్తే..ఇపుడు మళ్లీ విభేదాలు బయటకు వస్తున్నాయి.

ఆర్మూర్‌ నియోజకవర్గంలో సీనియర్ నాయకుడిగా పేరున్న ఏబీ శ్రీనివాస్, వినయ్ రెడ్డిల మధ్య అస్సలు పొసగడం లేదనే ప్రచారం జరుగుతుంది. రాజకీయంగా దెబ్బకొట్టేందుకు వినయ్ రెడ్డి...ఏబీ శ్రీనివాస్ వర్గం అభ్యర్థుల ఓటమి కోసం పనిచేశారని బావిస్తున్నారట. ఇదే విషయాన్ని అధిష్ఠానం పెద్దలకు ఫిర్యాదు చేసినట్లు ప్రచారం జరుగుతుంది. అసలే ముందు ఉన్నవి ఎంపీటీసీ జెడ్పిటిసి ఎన్నికలు. ద్వితీయ శ్రేణి నాయకులు కీలంగా భావించే ఇలాంటి ఎన్నికల్లో క్యాడర్ కు భరోసా కల్పించే విధంగా ఉండాలి కానీ..సొంత పార్టీ వారికే వ్యతిరేకంగా పని చేస్తే పార్టీకి నష్టం తప్పదని వినయ్ రెడ్డి వ్యతిరేక వర్గీయులు రుసరుస లాడుతున్నట్లు సమాచారం.

ఐతే ఆర్మూర్ కాంగ్రెస్‌లో అధిష్టానం ప్రక్షాళన చేస్తుండటంతో మరో వర్గం వారు కూడా గురుగా ఉన్నారు. తమ వర్గం వారిని దురుద్దేశపూర్వకంగానే సస్పెన్షన్ చేస్తున్నారని మరో వర్గం ఆరోపిస్తోంది. తాజాగా ఇద్దరినీ సస్పెండ్ చేయడంతో ఇప్పటికైనా ఆర్మూర్ కాంగ్రెస్ లో విభేదాలు సద్దుమలుగుతాయా లేదా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. ఈ వర్గ విభేదాలు ఇలాగే కొనసాగితే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీకి జిల్లాలో కూడా నష్టం వాటిల్లే అవకాశం లేకపోలేదు. మరి అధిష్టానం కల్పించుకుని పులుస్టాప్ పెడుతుందా అనేది వేచి చూడాలి.


హెచ్ఎం డిజిటల్ డెస్క్

హెచ్ఎం డిజిటల్ డెస్క్

Next Story