Big Story: రాహుల్‌కు రిజిజు మాస్ వార్నింగ్..కాంగ్రెస్‌కు అరకొర సీట్లే!
Big Story: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు 7 సలహాలు ఇస్తూ, రహస్య విదేశీ పర్యటనలు, రాజ్యాంగ సంస్థలపై విమర్శలు మానుకోవాలని హితవు పలికారు.
Big Story: రాహుల్‌కు రిజిజు మాస్ వార్నింగ్..కాంగ్రెస్‌కు అరకొర సీట్లే!
Big Story: కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు వ్యంగ్యాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ మంది ఎంపీ స్థానాలను గెలుచుకోవాలంటే రాహుల్ గాంధీ తాను ఇచ్చే ఏడు సలహాలను పాటించాలని ఆయన సూచించారు.
రాహుల్ తరచూ విదేశీ పర్యటనలకు వెళుతుంటారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. అయితే రాహుల్ తరచూ రహస్యంగా విదేశీ పర్యటనలకు వెళ్లడం మానుకోవాలని కిరణ్ రిజిజు సూచించారు. సాధ్యమైనంత ఎక్కువ సమయం దేశంలోనే ఉండాలని ఆయన సలహా ఇచ్చారు.అంతేకాదు తనకంటే వయస్సులో , అనుభవంలో పెద్దలను గౌరవించాలని రాహుల్ కు మరో సలహా ఇచ్చారు కిరణ్ రిజిజు. అలాగే పెద్దల నుంచి విలువైన జ్ఞానాన్ని పొందాలన్నారు ఆయన.
దేశానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారిని కలవడం మానుకోవాలని కూడా కిరణ్ రిజిజు సలహా ఇచ్చారు. రాహుల్ గాంధీ విదేశాలకు వెళ్లినప్పుడు భారత వ్యతిరేకులుగా పేరొందిన జార్జ్ సొరేస్ వంటి వారిని కలుస్తారన్న ప్రచారం ఉన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అటువంటివారితో సమావేశమయ్యే అలవాటును మానుకోవాలని కిరణ్ రిజిజు సూచించారు. అంతేకాదు భారత్ వ్యతిరేకుల అజెండాలకు దూరంగా ఉండాలన్నారు.
రాహుల్ కు మరో ముఖ్యమైన సలహా ఇచ్చారు కిరణ్ రిజిజు. రాజకీయ ప్రత్యర్థులను శత్రువులుగా చూడటం మానుకోవాలన్నారు. అంతేకాదు బీజేపీ నాయకులంతా రాహుల్ గాంధీకి రాజకీయ ప్రత్యర్థులు మాత్రమేనన్నారు. అంతేతప్ప రాహుల్ కు శత్రువులు కారని ఆయన కుండబద్దలు కొట్టారు.
వీటన్నిటితో పాటు ఇటీవలి రాహుల్ గాంధీ ప్రవర్తనను చూస్తే...బీజేపీ,ఆర్ఎస్ఎస్, ప్రధాని నరేంద్ర మోడీపై ఎంతటి తీవ్ర ద్వేషభావంతో ఆయన ఉన్నారో తెలుస్తుందన్నారు. రాజకీయాల్లో ప్రత్యర్థుల పట్ల ఇంతటి ద్వేష భావం పనికిరాదన్నారు కిరణ్ రిజిజు.
ముందుగా పార్లమెంటును గౌరవించాలని రాహుల్ కు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు మరో సలహా ఇచ్చారు. పార్లమెంటులో అధికార, ప్రతిపక్షాల మధ్య వాదోపవాదాలు సహజమేనన్నారు. అయితే వాదోపవాదాలను అడ్డు పెట్టుకుని సభా కార్యకలాపాలకు అంతరాయం కలిగించడం రాహుల్ మానుకోవాలన్నారు.
అలాగే రాజకీయ ప్రయోజనాల కోసం రాజ్యాంగ సంస్థలైన కేంద్ర ఎన్నికల సంఘం వంటి వాటిపై బురద చల్లరాదన్నది కిరణ్ రిజిజు మరో సలహా. ఇటీవలి కేవలం ఎన్నికల సంఘం అలాగే గ్యానేష్ కుమార్ కు వ్యతిరేకంగా రాహుల్ పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించిన నేపథ్యంలో కిరణ్ రిజిజు ఈ సలహా ఇచ్చారు.
ఎవరైనా సరే...రాజ్యాంగ సంస్థలకు తగిన గౌరవం ఇవ్వాల్సిందేనన్నారు. చివరగా కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడపాలన్నారు. వంశపారంపర్య రాజకీయాలకు స్వస్తి పలకాలని కిరణ్ చివరి సలహా ఇచ్చారు.అంతేకాదు వచ్చే లోక్ సభ ఎన్నికల్లో కాంగ్రెస్ ఎక్కువ స్థానాలు గెలుచుకోవాలంటే పార్టీ వ్యవహారశైలిలో మార్పులు రావాలని పరోక్షంగా ఆయన వ్యాఖ్యానించారు.
ఇదిలా ఉంటే, ప్రతిపక్ష ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేసిన సందర్భంలో పార్లమెంటులో తాను చేసిన ప్రసంగానికి సంబంధించిన వీడియో క్లిప్‌ను కూడా రిజిజు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. పార్లమెంటు అనేది చర్చలు, సంభాషణల కోసం ఏర్పాటైన వేదిక అని ఆయన పేర్కొన్నారు.
ప్రజాస్వామ్యం, చర్చలు, సంభాషణలపై నమ్మకం లేని వారు వాటి గురించి మాట్లాడుతున్నారని ప్రతిపక్ష నేతలను కిరణ్ రిజిజు విమర్శించారు. పార్లమెంటులో ప్రజాప్రతినిధులు తమ అభిప్రాయాలను వెల్లడించడంతో పాటు, వివిధ అంశాలపై చర్చించాల్సిన అవసరం ఉందని కిరణ్ రిజిజు అభిప్రాయపడ్డారు.
ఈ సందర్బంగా దిమాగీ నక్సల్ అనే పదంపై కిరణ్ రిజిజు వివరణ ఇచ్చారు. మావోయిస్టుల అజెండాకు మద్దతు ఇస్తూ, భారత రాజ్యాంగాన్ని తిరస్కరించే వారు మాత్రమే దిమాగీ నక్సల్స్ అన్నారాయన. అలాగే వేర్పాటువాదులకు అండగా నిలబడి, ఆర్టికల్ 370కి మద్దతు ఇచ్చే వారు, భారతదేశ అభివృద్ధి ప్రాజెక్టులను ఆపాలనుకునే వారు, ఈశాన్య ప్రాంతాన్ని భారతదేశం నుంచి వేరు చేయడానికి కుట్ర పన్నే వారు కూడా దిమాగీ నక్సల్స్ కిందికే వస్తారని రిజిజు కుండబద్దలు కొట్టారు.




