Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో మరింత పెరిగిన అసంతృప్తి!

Off The Record: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వంలో సొంత పార్టీ ఎమ్మెల్యేల అసంతృప్తి బహిర్గతమవుతోంది.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 15 Oct 2026 8:32 AM IST
Off The Record
X

Off The Record: తెలంగాణ కాంగ్రెస్‌లో మరింత పెరిగిన అసంతృప్తి!

Off The Record: తెలంగాణలో ముఖ్యమంత్రి, మంత్రులు తమ సొంత నియోజకవర్గాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, ఇతర నియోజకవర్గాలకు అవసరమైన స్థాయిలో నిధులు రావడం లేదన్న ఆరోపణలు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచే వినిపిస్తున్నాయి. ఎమ్మెల్యేల అభిప్రాయాలను, స్థానిక సమస్యలను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోవడం లేదన్న అసంతృప్తి కూడా పెరుగుతోంది.“ఎమ్మెల్యేలకే పరిస్థితి ఇలా ఉంటే.. సామాన్యుడి పరిస్థితి ఏంటి?”అనే ప్రశ్నలు కూడా రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

అయితే ఇవి కొందరు ఎమ్మెల్యేలు అనిరుధ్ రెడ్డి, సామేలు, రాజగోపాల్ రెడ్డి వంటి ఎమ్మెల్యేలు పలువురు బహిరంగంగానే ఇటీవల చేసిన వాఖ్యలు అసంతృప్తికి అద్దం పడుతున్నాయి. ఏకంగా మాజీ మంత్రి కొండా సురేఖ సైతం మంత్రి హోదాలోనే ప్రభుత్వంపై తన అసంతృప్తిని వ్యక్తం చేసిన పరిస్థితి. బహిరంగంగా మాట్లాడేది కొందరే అయినా మనసులో మదనపడుతూ నా అనుకున్న వారి దగ్గర అసంతృప్తి వెళ్లగక్కతున్న వారు ఎందరో ఉన్నారన్న టాక్ బలంగానే వినపడుతోంది.

మంత్రుల చాంబర్లు, అధికారిక నివాసాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ మంత్రులకు ఏకరువు పెట్టుకుంటున్న ఎమ్మెల్యేలు, స్థానిక ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పార్టీ గెలుపు కోసం పనిచేస్తే ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అనే భావన వ్యక్తం చేస్తున్నవారి సంఖ్య ఇటీవల భారీగా పెరుగుతోంది.

మరోవైపు కేబినెట్‌లో సామాజిక, ప్రాంతీయ సమతుల్యతపై చర్చ కొనసాగుతోంది. ఎస్సీ వర్గాల్లోని కొన్ని ఉపకులాలు, ఎస్టీ, యాదవ తదితర వర్గాలకు మంత్రివర్గంలో తగిన ప్రాతినిధ్యం లేదన్న అభిప్రాయాలు ఆయా వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. మంత్రివర్గ విస్తరణపై ఆశలు పెట్టుకున్న పలువురు ఎమ్మెల్యేలు, ఆశావహులు ఇప్పటికే చాలాకాలంగా ఎదురుచూస్తున్నారు.

ప్రభుత్వం ఏర్పడి దాదాపు మూడేళ్లు పూర్తవుతున్న సమయంలోనూ పూర్తి స్థాయి కేబినెట్‌పై స్పష్టత లేకపోవడం ఆశావహుల్లో అసంతృప్తికి కారణమవుతోంది.“ఇక విస్తరణ ఉండదా?”అన్న చర్చ కూడా కాంగ్రెస్‌ వర్గాల్లో మొదలైంది. అయితే కేబినెట్ విస్తరణపై తుది నిర్ణయం అధిష్ఠానం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్థాయిలోనే ఉంటుందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రభుత్వ ఏర్పాటులో మాకులాల ప్రాతినిధ్యం కీలమైందని.. కానీ మాకే కేబినెట్‌లో ప్రాతినిధ్యం లేకుంటే ఎట్లా అని ఆయా వర్గాలు తమ అసంతృప్తిని అవకాశం వచ్చినప్పడల్లా బహిరంగంగా వ్యక్తపరుస్తున్నాయి. రెడ్డి సామాజిక వర్గం నుంచి సైతం కేబినెట్‌లో చోటుకోసం పెద్ద ఎత్తున డిమాండ్ వినిపిస్తోంది.

ఉద్యోగులు, కాంట్రాక్టర్లలోనూ పెండింగ్ బిల్లుల ఆందోళన.. ప్రభుత్వంపై ఆర్థిక ఒత్తిడి మరో ప్రధాన సమస్యగా మారుతోంది. వివిధ శాఖల్లో పెండింగ్ బిల్లులు, కాంట్రాక్టర్ల చెల్లింపులు, ఉద్యోగులకు సంబంధించిన బకాయిలు, ప్రయోజనాల విషయంలో జాప్యం జరుగుతోందన్న అసంతృప్తి లేకపోలేదు.

అభివృద్ధి పనులు చేపట్టిన కాంట్రాక్టర్లకు బిల్లులు సకాలంలో అందకపోతే కొత్త పనులు చేపట్టేందుకు వారు వెనుకంజ వేసే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉంది. అదే సమయంలో ఉద్యోగుల సమస్యలు పరిష్కారం కాకపోతే ప్రభుత్వ యంత్రాంగంలోనూ అసంతృప్తి పెరిగే ప్రమాదం ఉంది. అటు.. రైతుల్లోనూ ఆందోళన అంతకంతకూ పెరుగుతోందట. రైతు రుణమాఫీ పూర్తిస్థాయిలో అందలేదన్న ఆరోపణలు, రైతు భరోసా నిధుల విడుదలలో జాప్యం, సాగునీరు, విద్యుత్‌ సరఫరాపై ఫిర్యాదులు ప్రభుత్వానికి మరో సవాల్‌గా మారుతున్నాయి.

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో సాగు పరిస్థితులు అనుకూలంగా లేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీనికితోడు పంటల సాగుపై క్రాప్‌ హాలిడే వంటి నిర్ణయాల దిశగా పరిస్థితులు వెళ్తే, అది కేవలం వ్యవసాయ సమస్యగానే కాకుండా రాజకీయ సమస్యగా కూడా మారే అవకాశం ఉంది. వర్షపాతం లోటు, ఎల్‌నినో ప్రభావం నేపథ్యంలో రాబోయే కాలంలో నీటి లభ్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. నీటి కొరతతో పాటు విద్యుత్‌ డిమాండ్‌ పెరగడం, సాగునీటి అవసరాలు అధికం కావడం ప్రభుత్వానికి అదనపు భారంగా మారవచ్చు.

ఒకవైపు సంక్షేమ పథకాలు, మరోవైపు అభివృద్ధి పనులు, రైతు సంబంధిత హామీల అమలు, ఉద్యోగులు.. కాంట్రాక్టర్ల బకాయిలు.. ఇలా అన్ని రంగాల నుంచి ఆర్థిక అవసరాలు పెరుగుతున్న సమయంలో ఆదాయ వనరులపై ఒత్తిడి కొనసాగితే ప్రభుత్వ ఆర్థిక నిర్వహణ మరింత కీలకంగా మారనుంది.

ఇలా ఉంటే.. ఇప్పటి వరకు ప్రభుత్వంపై ప్రతిపక్షాల విమర్శలు సహజంగానే ఉన్నప్పటికీ, సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి అసంతృప్తి బహిరంగంగా వ్యక్తం కావడం కాంగ్రెస్‌ ప్రభుత్వానికి రాజకీయంగా ముఖ్యమైన అంశంగా మారుతోంది. ఎమ్మెల్యేల అసంతృప్తి సామాజిక వర్గాల ప్రాతినిధ్యంపై అసంతృప్తి ఉద్యోగులు, కాంట్రాక్టర్ల బకాయిలు, రైతుల సమస్యలు, ఆర్థిక ఒత్తిడి, కరువు ప్రభావం.. ఇవన్నీ ఒకేసారి పెరిగితే ప్రభుత్వంపై ఒత్తిడి మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు.

ప్రభుత్వం వద్ద ఇంకా పరిస్థితిని చక్కదిద్దుకునే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎమ్మెల్యేలతో సమన్వయం పెంచడం, నియోజకవర్గాల వారీగా నిధుల కేటాయింపులో స్పష్టత తీసుకురావడం, పెండింగ్ బిల్లుల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం, రైతు సమస్యలపై వేగంగా నిర్ణయాలు తీసుకోవడం కీలకంగా మారింది. అదే సమయంలో కేబినెట్‌ ప్రాతినిధ్యంపై నెలకొన్న అసంతృప్తికి పరిష్కారం చూపడం కూడా పార్టీ పరంగా ముఖ్యమేనంటున్నారు.

పరిస్థితి చేయిదాటిన తర్వాత స్పందించడం కంటే.. సమస్యలు తీవ్ర రూపం దాల్చకముందే ప్రభుత్వం అప్రమత్తమై దిద్దుబాటు చర్యలు చేపట్టాలి. లేకపోతే ఇప్పటివరకు విడివిడిగా కనిపిస్తున్న అసంతృప్తులు ఒకే రాజకీయ వ్యతిరేకతగా మారే ప్రమాదం ఉందన్న చర్చ రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. చూడాలి.. కాంగ్రెస్ హైకమాండ్ కాని, ప్రభుత్వ పెద్దలు కానీ.. ఈ అసంతృప్తిని ఏవిధంగా పరిష్కరిస్తారో మరి.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్