Burning Topic: సౌదీపై తీవ్రమైన హౌథీల దాడులు
Burning Topic: సౌదీలోని రియాద్ విమానాశ్రయంపై హౌతీల క్షిపణి దాడిలో హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన ఐటీ నిపుణుడు ముహమ్మద్ యూసుఫ్ మృతి చెందారు.
Burning Topic: సౌదీపై తీవ్రమైన హౌథీల దాడులు
Burning Topic: పశ్చిమాసియాలో అమెరికా, ఇరాన్ మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతలు కొనసాగుతుంటే, మరోవైపు హౌతీ తిరుగుబాటుదారులు రోజు రోజుకీ మరింతగా చెలరేగిపోతున్నారు. యెమెన్‌లో అధికారికంగా తమ పట్టును సాధించుకోవడానికి చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా, అక్కడి ప్రభుత్వానికి అండగా నిలిచిన సౌదీ అరేబియాపై తమ ప్రతాపాన్ని చూపిస్తున్నారు. ఆ దేశాన్ని ఆర్థికంగా నష్ట పరిచే దిశగా వ్యూహాత్మక దాడులకు పాల్పడుతున్నారు.
ఇందులో భాగంగా సౌదీ అరేబియాకు ప్రధాన ఆదాయ వనరైన అరామ్‌కో చమురు క్షేత్రాలు, అభ్లా, నాజ్రాన్, అడెన్ విమానాశ్రయాలను లక్ష్యం చేసుకున్నారు. ఉద్రిక్తతల నేపథ్యంలో హౌతీలు సౌదీ అరేబియా రాజధాని రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై అక్టోబర్ మొదటి రెండు వారాల్లోనే కనీసం 4 సార్లు దాడులు జరిపారు. ఈ దాడులు అంతర్జాతీయంగా తీవ్ర ఆందోళనకకు కారణమవుతున్నాయి.
తాజాగా శనివారం నాడు కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయంపై మూడోసారి అత్యంత భీకరమై దాడికి దిగారు హౌతీ తిరుగుబాటుదారులు. టెర్మినల్స్ లక్ష్యంగా జరిగిన ఈ దాడిలో 12 మంది మరణించగా, 300 మందికి పైగా గాయపడ్డారు. దేశీయ విమానాల రాకపోకలకు ఉపయోగించే టెర్మినల్ 3, 4 ఉన్న సముదాయాన్ని క్షిపణి తాకినట్లు అక్కడి అధికారులు తెలిపారు. . ఇరాన్ మద్దతు ఉన్న హౌతీ తిరుగుబాటుదారులే ఈ దాడికి పాల్పడినట్లు సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు ఆరోపించాయి.
మృతుల్లో నలుగురు సౌదీ పౌరులు, ఇద్దరు బంగ్లాదేశ్ వాసులు, అమెరికా, పాలస్తీనా, ఈజిప్ట్, జోర్డాన్, సిరియా, సూడాన్‌కు చెందిన ఒక్కొక్కరు ఉన్నారు. యపడిన వారిని పలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. గల్ఫ్ అరబ్ దేశాల్లో ఇరాన్ యుద్ధం ప్రారంభమైన తర్వాత జరిగిన అత్యంత భీకర దాడిగా ఈ ఘటన నిలిచింది.
కాగా శనివారం నాటి దాడి ఘటన నుంచి సౌద అరేబియా ఇంకా కోలుకోక ముందే నాలుగో సారి కూడా దాడులకు తెగించారు హౌతీలు. ఎయిర్‌పోర్టును మూసివేసినప్పటికీ, ఆదివారం మధ్యాహ్నం టెర్మినల్ 4పై హౌతీలు దాడి చేశారు. ఈ దాడిలో ఒకరు మరణించగా, 11 మంది గాయపడ్డారు. విమానాశ్రయంలోని ప్యాసింజర్ టెర్మినల్‌ను క్షిపణి ఢీకొట్టిందని అధికారులు తెలిపారు.
అయితే, విమానాశ్రయాన్ని అంతకుముందే మూసివేయడంతో ప్రాణ నష్టం పెద్దగా జరగలేదని చెబుతున్నారు. గాయపడిన వారిలో కొందరి పరిస్థితి విషమంగా ఉందని చెబుతున్నారు. క్షతగాత్రులకు వేర్వేరు ఆస్పత్రుల్లో చికిత్స జరుగుతోందని చెప్పారు సౌదీ నాయకులు, అధికారులు బాధితులను ఆస్పత్రుల్లో పరామర్శించారు. కాగా మరిన్ని దాడులు తప్పవంటూ హౌతీలు చేసిన హెచ్చరికలతో సౌదీ ప్రభుత్వం విమానాశ్రయాన్ని మూసేసి, భారీగా భద్రతా దళాలను మొహరించింది.
రియాద్ విమానాశ్రయంపై జరిగిన దాడిలో మరణించిన వారిలో హైదరాబాద్ మెహిదీపట్నానికి చెందిన ఐటీ నిపుణుడు మహమ్మద్ యూసుఫ్ ప్రాణాలు కోల్పోయారు. ఉమ్రా యాత్ర కోసం మదీనా వెళ్లేందుకు కుటుంబంతో ఈ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఈ దాడిలో యూసఫ్ తీవ్ర గాయాలతో ప్రాణాలు కోల్పోగా, భార్య, కుమారులు, కుమార్తె గాయపడ్డారు. క్షతగాత్రులు రియాద్ ఆసుపత్రి ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.
వీరిలో ఒక కుమారుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. గాయపడిన భారతీయుల ఆరోగ్య పరిస్థితిని భారత రాయబార కార్యాలయం పర్యవేక్షిస్తోంది. ముగ్గురు భారతీయులు ఐసీయూలో చికిత్స పొందుతున్నారని, వారి పరిస్థితి నిలకడగా ఉందని ఎంబసీ వెల్లడించింది. యూసుఫ్ మృతదేహాన్ని స్వదేశానికి తీసుకొచ్చేందుకు, బాధిత కుటుంబానికి సహాయం అందించేందుకు స్థానిక అధికారులతో ఎంబసీ సమన్వయం చేసుకుంటోంది.
వరుస దాడుల నేపథ్యంలో సౌదీ అరేబియాలో భద్రతా పరిస్థితులపై ఆందోళనలు కొనసాగుతున్నాయి. అక్కడి పౌరులు, పౌర మౌలిక సదుపాయాలపై హౌతీలు జరిపిన దాడులను భారత్ తీవ్రంగా ఖండించింది. రియాద్ విమానాశ్రయంపై దాడులను తప్పుపట్టింది. పౌరులు, పౌర మౌలిక వసతులను లక్ష్యంగా చేసుకుని దాడులకు దిగడం ఎంతమాత్రం ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది.
సౌదీ అరేబియాలోని భారతీయులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని రాయబార కార్యాలయం కోరింది. అవసరమైనప్పుడు ఇళ్లలోనే ఉండాలని సూచించింది. ఈ దాడుల్లో హైదరాబాద్ వాసి మృతిపై విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని పేర్కొన్నారు. ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కూడా తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు.
మరోవైపు సౌదీ అరేబియాపై హౌతీల దాడులను అమెరికా తీవ్రంగా పరిగణిస్తోంది. రియాద్ విమానాశ్రయంపై దాడి నేపథ్యంలో హౌతీలకు వ్యతిరేకంగా సౌదీ అరేబియా చేపడుతున్న సైనిక చర్యల్లో అమెరికా చేరే అవకాశాన్ని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పరిశీలిస్తున్నారు. ఈ అంశంపై విలేకరులు ప్రశ్నించగా.. ‘చేరవచ్చు.. దీన్ని పరిశీలిస్తాం. ఈ దాడి గురించి ఇప్పుడే తెలుసుకున్నాం.
నిర్ణయం తీసుకుంటాం.. మేం చాలా వేగంగా కదులుతాం’ అని వ్యాఖ్యానించారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు’ అంటూ హెచ్చరికలు జారీ చేశారు.. అయితే యుద్ధంలోకి దిగాలని నిర్ణయించుకున్నట్లు ప్రకటించలేదు. హౌతీలపై చర్యలకు సంబంధించి ఇంకా నిర్ణయం తీసుకోవాల్సి ఉందని అమెరికా అధ్యక్షుని మాటలు స్పష్టం చేస్తున్నాయి. సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్‌తో మాట్లాడనున్నట్లు కూడా ఆయన వెల్లడించారు.
సౌదీపై దాడులకు తమదే బాధ్యత అంటూ హౌతీ మిలీషియా ప్రకటించింది. యెమెన్‌పై సౌదీ దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేసినట్టు తాజాగా ఓ ప్రకటనలో పేర్కొంది. సౌదీ ఎయిర్‌పోర్టులకు ప్రయాణికులు, విమానాలు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేశారు. తమపై సౌదీ దాడులు నిలిపివేసే వరకు తాము వెనక్కి తగ్గబోమన్నారు. సౌదీకి మరింత భయానక పరిస్థితి రానుందని పేర్కొన్నారు.
మరోవైపు సౌదీ-హూతీలు చర్చలతోనే సమస్యలు పరిష్కరించుకోవాలని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ పేర్కొన్నారు. తమకు పొరుగుదేశాలతో యుద్ధాలు చేయాలన్న కోరికలేదని పేర్కొన్నారు. హూతీలు పూర్తిగా స్వతంత్ర వైఖరితోనే పనిచేస్తున్నారన్నారు. సౌదీపై దాడులకు ఇరాన్ ప్రోత్సహించిందన్న వాదనలు వస్తున్న నేపథ్యంలో అరాగ్చీ స్పందించారు. రియాద్ ఎయిర్‌పోర్ట్‌పై దాడిని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహూ కూడా తీవ్రంగా ఖండించారు.
పశ్చిమాసియాలోని యెమెన్‌లో 2015 నుంచి సౌదీ అరేబియా, హౌతీల మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఇటీవల సౌదీ నేతృత్వంలోని సంకీర్ణ దళాలు హూతీలపై సైనిక చర్యలను తీవ్రతరం చేయడంతో దాడులు పెరిగాయి. ఎర్ర సముద్రానికి కీలకమైన బాబ్ అల్-మండేబ్ జలసంధి పరిసరాల్లోనూ పోరు ఉధృతమవుతోంది. ఈ మార్గం అంతర్జాతీయ వాణిజ్యానికి, ఇంధన రవాణాకు వ్యూహాత్మకంగా కీలకం.
ఈ నేపథ్యంలో రియాద్ విమానాశ్రయంపై దాడి పరిస్థితిని మరింత క్లిష్టం చేసింది. ఇప్పటికే సౌదీ నేతృత్వంలోని కూటమి హౌతీ స్థావరాలపై దాడులు చేస్తుండగా.. అమెరికా కూడా సైనికంగా జోక్యం చేసుకుంటే ఘర్షణ మరింత విస్తరించే ప్రమాదం ఉంది. కాగా అమెరికా ప్రత్యక్షంగా పాల్గొంటుందా? లేదా సౌదీకి సహకరిస్తుందా? అన్నది ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. తాజా దాడితో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగే ప్రమాదం కనిపిస్తోంది.




