Burning Topic: బ్రిటన్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగ్వత్ పర్యటన!
Burning Topic: ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ బ్రిటన్ పర్యటన. లండన్‌లో 'సెలబ్రేషన్ ఆఫ్ వన్‌నెస్' వేడుకల్లో ప్రసంగం. హిందుత్వం, విద్వేష ప్రచారంపై కీలక వ్యాఖ్యలు.
Burning Topic: బ్రిటన్‌లో ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగ్వత్ పర్యటన!
Burning Topic: మూడు దేశాల అంతర్జాతీయ పర్యటనలో భాగంగా అమెరికా, కెనడా దేశాల్లో పలు కార్యక్రమాలను పూర్తి చేసుకున్నారు రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సర్ సంఘచాలక్ మోహన్ భాగవత్. అనంతరం బ్రిటన్‌కు వచ్చారు.. ఆర్‌ఎస్‌ఎస్ శతాబ్ది వేడుకల్లో భాగంగా అక్కడి ప్రవాస భారతీయులు, హిందూ సంస్థలు నిర్వహించిన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ మీద కొనసాగుతున్న దుష్ప్రచారం, అపోహలను తొలగించడంతో పాటు సంస్థ కార్యకలాపాలను అందరికీ వివరిస్తున్నారు. ఇందులో భాగంగా లండన్‌లో నిర్వహించిన సెలబ్రేషన్ ఆఫ్ వన్‌నెస్ అనే చర్చాగోష్టిలో పాల్గొన్నారు భాగవత్.
బ్రిటన్‌లోని హిందూ స్వయంసేవక్ సంఘ్ యూకే, ఇంటిగ్రల్ సంస్థల ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో 326 సంస్థలకు చెందిన సుమారు 600 మంది ప్రతినిధులు, బ్రిటన్ పార్లమెంట్ సభ్యులు, మేయర్లు, కౌన్సిలర్లు, వివిధ వర్గాల నాయకులు పాల్గొన్నారు.
ఆర్‌ఎస్‌ఎస్ కార్యకలాపాలకు విద్వేషమే పునాది అనే ఆరోపణలను ఖండించారు మోహన్ భాగవత్. విద్వేషం కాదు.. అందరినీ కలిపే భావనే ఆర్‌ఎస్‌ఎస్ పునాది అని, అదే తమ సంస్థ పనితీరుకు ఆధారమని స్పష్టం చేశారు. ఒక వ్యక్తి నుంచి కుటుంబం, సమాజం, మానవాళి వరకు ఒకరితో ఒకరికి అనుబంధ భావన ఉండటమే హిందూ ఆలోచనా విధానమని చెప్పారు.
భిన్నత్వం సహజమేనని, అయితే దాని వెనుక ఉన్న ఏకత్వాన్ని గుర్తించి పరస్పరం గౌరవించుకోవాలని సూచించారు. ‘వైవిధ్యం కోసం ఏకత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.. ఏకత్వం కోసం వైవిధ్యాన్ని తొలగించాల్సిన పనిలేదు’ అనే భావనను వివరించారు.
ప్రపంచంలో ఘర్షణలు, పోటీ, పర్యావరణ సమస్యలకు పరస్పర ప్రయోజనకరమైన పరిష్కారాలు అవసరమని అన్నారు. సమాజాన్ని మరింత సంఘటితం చేసి, ప్రజలంతా కలిసి ముందుకు సాగే వాతావరణాన్ని సృష్టించడమే తమ లక్ష్యమని భాగవత్ చెప్పారు.
అసలు హిందుత్వం అంటే ఏమిటి అనేది వివరించారు మోహన్ భాగవత్ ‘హిందూ’ అనేది కేవలం ఒక మతం లేదంటే పూజా విధానం కాదని అన్నారు. భిన్న మార్గాలను గౌరవించడం, ప్రతి ఒక్కరూ తమ మార్గంలో ముందుకు సాగేందుకు అవకాశం కల్పించడమే హిందూ ఆలోచనా విధానమని చెప్పారు.
హిందుత్వం భిన్నత్వాన్ని అంగీకరిస్తుందని చెప్పారు. ప్రపంచానికి అందించాల్సిన సందేశం భిన్నత్వం సహజం, ఏకత్వం సత్యం అనే భావనేనని పేర్కొన్నారు. భారతదేశంలో నాస్తికత్వం నుంచి బహుదైవారాధన వరకు అనేక రకాల ఆలోచనా విధానాలు పుట్టుకొచ్చాయని గుర్తుచేశారు.
ప్రతి ఒక్కరూ తమకు నచ్చిన మార్గంలో పయనించినా, అంతిమ లక్ష్యం ఒక్కటేననే భావన హిందూ తత్వంలో ఉందన్నారు. అందుకే ఒకరిని మరొకరు మతం మార్చాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. హిందూ రాష్ట్రం అనే భావన దేశం, భాష, పాలనా విధానం, ఉమ్మడి ప్రయోజనాల ఆధారంగా ప్రజలను ఒక చోటకు తీసుకువస్తుందని చెప్పారు.
బ్రిటన్‌లో స్థిరపడిన హిందువులకు ఆ దేశాన్నే కర్మభూమిగా అభివర్ణించారు మోహన్ భాగవత్. భారత్, బ్రిటన్ ప్రయోజనాల మధ్య ఎప్పుడైనా విభేదాలు తలెత్తితే, బ్రిటిష్ హిందువులు బ్రిటన్ వైపే నిలబడతారని అన్నారు. మంచి, దృఢమైన, నిజమైన హిందువులుగా ఉంటే భారత్, బ్రిటన్ ప్రయోజనాల మధ్య ఘర్షణకు అవకాశం ఉండదని వ్యాఖ్యానించారు.
ఒకవేళ అలాంటి పరిస్థితి వచ్చినా కర్మభూమి వైపే నిలబడటం సహజమని చెప్పారు. జన్మభూమి నుంచి విలువలు వస్తాయని, ఆ విలువలను మనం కర్మభూమిలో అమలు చేస్తామని మోహన్ భాగవత్ వివరించారు.
కర్మభూమి ఎక్కడ ఉంటే అక్కడే మన విధేయత ఉండాలని పేర్కొన్నారు. కర్మభూమికి ద్రోహం చేయాలని హిందుత్వం ఎప్పుడూ చెప్పదని స్పష్టం చేశారు. భారత్ నుంచి పొందిన విలువలను విదేశాల్లో ఉన్నవారు తమ జీవనంలో పాటిస్తూ, తాము నివసిస్తున్న దేశ అభివృద్ధికి తోడ్పడాలని ఆయన సూచించారు.
భవిష్యత్ తరాలపై తనకు మరింత నమ్మకం ఉందని తెలిపారు మోహన్ భాగవత్. ప్రస్తుతం యువతకు తమ లక్ష్యాన్ని ఎలా సాధించాలో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదన్న మోహన్ భగవత్.. వారికి లక్ష్యాన్ని నిర్దేశించండి-మార్గాన్ని మాత్రం వారికే వదిలేయండి అంటూ సూచించారు.
వయసు పెరిగే కొద్దీ మనుషులకు అనుభవాలు పెరుగుతాయని వాటి కారణంగా అనేక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తారని వివరించారు. ఏ పని చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ముందే ఆలోచిస్తారని చెప్పారు. యువతకు అలాంటి భయాలు తక్కువగా ఉంటాయని, సరైనదని భావించిన పనిని చేయడానికి వారు ముందుకు వస్తారని అన్నారు.
యువతను ముందుకు నడిపించే విషయంలో పెద్దల పాత్రపై కూడా మోహన్ భాగవత్ మాట్లాడారు. తమ అనుభవం, సమాచారం ద్వారా యువతకు సహాయం చేయాలని సూచించారు. అయితే ఏం చేయాలో మాత్రమే చె ఎలా చేయాలో తమ పద్ధతిని వారిపై రుద్దకూడదన్నారు.




