Burning Topic: 90 మిస్సైల్.. 600 డ్రోన్లతో.. భీకర యుద్ధం
Burning Topic: ఉక్రెయిన్ రాజధాని కీవ్ నగరంపై రష్యా భీకర దాడులు. 600కు పైగా డ్రోన్లు, 90 క్షిపణులతో దాడి. ఒరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణి ప్రయోగం.
Burning Topic: 90 మిస్సైల్.. 600 డ్రోన్లతో.. భీకర యుద్ధం
Burning Topic: ఉక్రెయిన్ రాజధాని కీవ్నగరం ఒక్కసారిగా దద్దరిల్లిపోయింది. పెద్ద ఎత్తున డ్రోన్లు, మిసైళ్లతో విరుచుకుపడింది రష్యన్ సైన్యం. నాలుగేళ్లుగా ఇరుదేశాల మధ్య కొనసాగుతున్న యుద్ధంలో ఇటీవల దాడులు కాస్త తగ్గుముఖం పట్టగా.. రష్యా ఆక్రమిత భూభాగంపై ఉక్రెయిన్ దాడులు చేసింది. దీనికి ప్రతీకారంగానే దాడులు చేపట్టినట్లు రష్యా పేర్కొంది. ఏకంగా 6 వందలకు పైగా డ్రోన్లు, 90 మిసైళ్లతో కీవ్ సిటీపై దాడి చేసింది. ఈ భీకర దాడిలో ఓ షాపింగ్ కాంప్లెక్స్ పూర్తిగా కాలి బూడిదయ్యింది. మ్యూజియం ఆఫ్ చెర్నోబిల్ భవనం, ఒక పాఠశాల భవనం కూడా ఈ దాడిలో పాక్షికంగా అగ్నికి ఆహుతైంది. నగరంలో పలుచోట్ల అనేక భవనాలు పాక్షికంగా ధ్వంసమయ్యాయి. ఈ దాడుల్లో కీవ్ నగరంతో పాటు దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో నలుగురు మృతిచెందగా, మరో 83మంది గాయపడ్డారని ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.
నాలుగేళ్ల క్రితం యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచీ ఉక్రెయిన్ మీద జరిగిన అతి పెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. ఆ నగరంపై మరిన్ని దాడులు ప్రారంభిస్తామని రష్యా హెచ్చరించింది. ఈ నూతన దాడులు నగరంలోని డ్రోన్ తయారీ కేంద్రాలతో పాటు నిర్ణయాలు తీసుకునే కేంద్రాలు, కమాండ్ పోస్టులను లక్ష్యంగా చేసుకుంటాయని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఉక్రెయిన్ తమ దేశంలోని స్టారోబిల్స్క్ పట్టణంలోని ఒక విద్యార్థి వసతిగృహంపై ఉక్రెయిన్ ఉద్దేశపూర్వకంగా దాడి చేసి, 21 మంది మరణానికి కారణమైందని రష్యా అధికారులు ఆరోపించారు. ఈ దాడికి ప్రతిస్పందనగానే తాము కీవ్‌పై క్షిపణుల వర్షం కురిపించామని చెబుతోంది. అయితే రష్యా ఆక్రమిత తూర్పు ఉక్రెయిన్‌లోని సైనిక డ్రోన్ యూనిట్‌పైనే తాము దాడి చేశామని, పౌరులను లక్ష్యంగా చేసుకోలేదని ఉక్రెయిన్ సైన్యం స్పష్టం చేసింది.తాము చేసిన దాడులు పూర్తిగా సమర్థనీయమైనని ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్‌స్కీ సమర్ధించుకున్నారు.
కాగా ఈ దాడుల్లో రష్యా శబ్ద వేగానికి పది రెట్లు వేగంగా దూసుకెళ్లే ఒరెష్నిక్ మిసైల్ ఉపయోగించింది. ‘ఒరెష్నిక్’ అంటే ‘హాజెల్‌నట్ చెట్టు’ అని అర్థం. రష్యా ప్రెసిడెంట్ వ్లాదిమిర్ పుతిన్ ఈ క్షిపణిని అత్యంత శక్తిమంతమైన ఆయుధంగా అభివర్ణించారు. పుతిన్ మాటల్లో చెప్పాలంటే ఇది ఆకాశం నుంచి ఒక ‘ఉల్క’ లాగా దూసుకొస్తుంది. ప్రస్తుత ప్రపంచంలో ఏ ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ కూడా దీనిని అడ్డుకోలేదు. అణుబాంబులనూ మోసుకెళ్లే సామర్థ్యం దీనికి ఉంది. భూగర్భంలో 3 నుంచి 4 అంతస్తుల లోతులో ఉండే బంకర్లను సైతం ఇది సులువుగా ధ్వంసం చేస్తుంది. ఈ క్షిపణిని సాధారణ ఆయుధాలతో ప్రయోగించినా.. అది సృష్టించే విధ్వంసం అణుదాడితో సమానంగా ఉంటుందని రష్యా హెచ్చరిస్తోంది.బిలా సెర్క్వా నగరంపై జరిగిన దాడిలో ఒరెష్నిక్ హైపర్సోనిక్ క్షిపణి వాడినట్టు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ చెప్పారు. రష్యా రష్యా ఒరెష్నిక్ క్షిపణి ప్రయోగించే అవకాశం ఉందని తమ నిఘా సంస్థలకు సమాచారం వచ్చినట్టు కూడా ఆయన చెప్పారు.
మరోవైపు కీవ్ నగరం మీద దాడులను మరింతగా పెంచుతామని హెచ్చరిస్తోంది రష్యా. కీలకమైన భవనాలు, రక్షణరంగ పరిశ్రమలు, కమాండ్ సెంటర్లు, డ్రోన్ తయారీ కేంద్రాలు లక్ష్యంగా దాడులు కొనసాగుతాయని చెప్పింది. వెంటనే విదేశీ దౌత్యవేత్తలు, పౌరులు నగరాన్ని వీడాలని కోరిందిరష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్రోవ్, అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో సోమవారం ఫోన్‌లో మాట్లాడుకున్నారు. రానున్న రోజుల్లో మరిన్ని దాడులకు అవకాశం ఉన్నందున కీవ్‌లోని అమెరికా దౌత్య సిబ్బందిని ఖాళీ చేయించాలని రూబియోకు లావ్రోవ్ సూచించారు. ‘‘దౌత్యవేత్తలు, పలు అంతర్జాతీయ సంస్థల సిబ్బంది, విదేశీయులు సాధ్యమైనంత త్వరగా కీవ్‌ను వీడండి. మిలిటరీ, పరిపాలనా భవనాలకు సాధారణ పౌరులు దూరంగా ఉండాలని కోరారు. . ఆ సంభాషణ అనంతరం రూబియో స్పందిస్తూ, ఈ దాడులు ఈ యుద్ధం ఎంత భయంకరమైనదో గుర్తుచేస్తున్నాయని, దీనికి ముగింపు పలకాల్సిన అవసరం ఎంతైనా ఉందని అన్నారు.
విదేశీ పౌరులు కీవ్‌ను విడిచి వెళ్ళాలన్న రష్యా హెచ్చరికను ఒక రకమైన మానసిక ఒత్తిడిగా భావిస్తున్నారు.రష్యా బెదిరింపులు సిగ్గుమాలిన బ్లాక్‌మెయిల్‌కు ఏమాత్రం తక్కువ కాదని ఉక్రెయిన్ తీవ్రంగా ఖండించింది. విదేశీ పౌరులకు రష్యా చేసిన హెచ్చరికల వెనుక, విదేశీ దౌత్య బృందాలను భయపెట్టడమే మాస్కో పరోక్ష ఉద్దేశమని ఉక్రెయిన్ పేర్కొంది. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి కీవ్‌పై రష్యా దాడులు దాదాపు ఒక వారంగా నిరంతరాయంగా సాగుతున్నాయని, మాస్కో వల్ల కలిగే భద్రతా ముప్పు ఎప్పటికప్పుడు కొనసాగుతూనే ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో మాస్కోపై అంతర్జాతీయ ఒత్తిడిని మరింత పెంచాలని ఉక్రెయిన్ తన మిత్రదేశాలను కోరింది. ఈ సుదీర్ఘ యుద్ధ కాలంలో ఉక్రెయిన్ అధునాతనమైన, బహుళ అంచెల వాయు రక్షణ వ్యవస్థను అభివృద్ధి చేసుకుంది. అయితే ఇప్పటికీ విదేశీ వాయు రక్షణ వ్యవస్థలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది.




