BURNING TOPIC: భూమిపై యుద్ధం.. స్పేస్‌లో అణు బాంబు.. పుతిన్ స్కెచ్ ఇదేనా!
BURNING TOPIC: డిసెంబర్ నాటికి రష్యా 'స్పుత్నిక్-ఎస్' అణ్వాయుధ ఉపగ్రహాన్ని ప్రయోగించే అవకాశం ఉందంటూ జర్మనీ నిఘా నివేదిక కలకలం రేపుతోంది.
BURNING TOPIC: భూమిపై యుద్ధం.. స్పేస్‌లో అణు బాంబు.. పుతిన్ స్కెచ్ ఇదేనా!
BURNING TOPIC: దేశాల మధ్య జరిగే యుద్ధాలు కేవలం భూమి మీదే జరగవు. జల మార్గంలో, ఆకాశ మార్గంలో కూడా దాడులు జరుగుతుంటాయి. కాలానుగుణంగా యుద్ధ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ద్వారా మార్పులు వచ్చాయి. క్షిపణులు, డ్రోన్ల వాడకం పెరిగింది.
కాగా యుద్ధ మేఘాలు భూమిని దాటి ఇప్పుడు అంతరిక్షాన్నీ కమ్మేస్తున్నాయి. భూమిపై ఇప్పటికే భీకర యుద్ధాలతో అట్టుడుకుతున్న ప్రపంచానికి ఇప్పుడు అంతరిక్షం నుంచి సరికొత్త అణు ముప్పు పొంచి ఉంది. నక్షత్రాలు, గ్రహాలు, ఉపగ్రహాలు, పాలపుంతలు, ఉల్కలు, తోక చుక్కల మధ్య శాంతికి నిలయంగా ఉండాల్సిన రోదసిలో అణ్వాయుధాలను మోహరించేందుకు అగ్రరాజ్యాలు ఎప్పటి నుంచో పోటీపడుతున్నాయి.
ఈ ప్రయోగాల విషయంలో అమెరికా ఇప్పటికే ముందుండగా, తాజాగా రష్యా కూడా తన ప్రయత్నాలను ముమ్మరం చేస్తోందనే వార్తలు కలవరానికి గురి చేస్తున్నాయి.. 2026 చివరి నాటికి రష్యా కూడా అణ్వాయుధంతో ఉన్న ఉపగ్రహాన్ని ప్రయోగించేందుకు సిద్ధమవుతున్నట్లు జర్మనీ నుంచి సంచలన నివేదిక వచ్చింది.
జర్మన్ నిఘా వర్గాలు, స్థానిక మీడియా వెల్లడించిన వివరాల రష్యా రూపొందించిన న్యూక్లియర్ శాటిలైట్ ‘‘స్పుత్నిక్-ఎస్’’ డిసెంబర్లో అంతరిక్షం ప్రయోగానికి సిద్ధంగా ఉంది. ఈ ఉపగ్రహాన్ని కొన్ని ఏళ్లకు ముందే రష్యా తయారు చేసి సిద్ధంగా ఉంచింది. దీనిపై నవంబర్లోనే కొన్ని నాటో దేశాలకు హెచ్చరికలు అందాయి. ఈ ఉపగ్రహాన్ని 60 రోజుల్లో ప్రయోగించే అవకాశం ఉందని చెబుతున్నారు.
కాగా రష్యా గతంలో ప్రయోగించిన కాస్మోస్ 2553 ఉపగ్రహం కూడా ఈ అణ్వాయుధ వ్యవస్థ విడిభాగాల పరీక్షల్లో భాగమేనని నిపుణులు అనుమానిస్తున్నారు. రష్యా చేస్తున్న ఈ సన్నాహాలు ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. అంతరిక్షంలో అణు విస్పోటనం జరిగితే తీవ్రమైన ప్రభావం ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా వేలాది ఉపగ్రహాలు నావిగేషన్, టెలికమ్యూనికేషన్లు, వాతావరణ అంచనాలు, ఇంటర్నెట్, బ్యాంకింగ్, సైనిక నిఘా క్షణాల్లో కుప్పకూలే ప్రమాదం ఉంది.
రష్యా అంతరిక్షంలో అణ్వాయుధాలను మొహరిస్తోందనే వార్తలు ఇప్పుడు అమెరికాతో పాటు యూరోప్ దేశాలను కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇది నిజంగానే జరిగితే భూ కక్ష్యలో అణ్వాయుధాల మోహరింపు, అంతరిక్షంలో పేలుళ్లను నిరోధించే 1963 నాటి పాక్షిక అణు నిషేధ ఒప్పందతోపాటు, 1967 నాటి అంతరిక్ష ఒప్పందాన్ని కూడా రష్యా ఉల్లంఘించినట్లవుతుంది.
తమకు అందిన నిఘా నివేదికపై జర్మన్ ఛాన్సలర్ ఫ్రెడరిక్ మెర్జ్ స్పందించారు. రష్యా ఉద్రిక్తల్ని ఎంత వరకు తీసుకెళ్తుందనే విషయాన్ని ఇది సూచిస్తోందని అన్నారు. ఈ నివేదిక తనను దిగ్భ్రాంతికి గురిచేసిందని అన్నారు. నాటో సెక్రటరీ జనరల్ మార్క్ రుట్టే మాట్లాడుతూ.. అంతరిక్ష రంగంలో చోటుచేసుకుంటున్న పరిణామాలను నాటో పరిశీలిస్తోందని అన్నారు. ,
అంతరిక్ష రంగంలో భద్రతకు ప్రాధాన్యత ఇస్తామని వెల్లడించారు. ఇటీవలి కాలంలో యూరోప్, నాటో దేశాలు ఉక్రెయిన్‌కు అండగా నిలవడం రష్యాను ఒత్తిడికి గురి చేసినట్లు భావిస్తున్నారు.
ఇదిలా ఉంటే జర్మనీ ఇంటెలిజెన్స్ రిపోర్టు గురించి తెలియదని క్రెమ్లిన్ ప్రతినిధి దిమిత్రి పెస్కోవ్ అన్నారు. ఈ ఆరోపణను తాము తీవ్రంగా పరిగణించడం లేదని స్పష్టం చేశారు. ఇవన్నీ నిరాధారమని కొట్టి పారేశారు. తమ అంతరిక్ష కార్యకలాపాలు పూర్తిగా శాంతియుత ప్రయోజనాల కోసమేనని స్పష్టం చేశారు. కాగా రష్యా అణ్వాయుధ ఉపగ్రహాలపై అమెరికా 2024లోనే ఆందోళన వ్యక్తం చేసింది.
శత్రు ఉపగ్రహాలను నాశనం చేయడానికి రూపొందించిన ఒక కొత్త వ్యవస్థను రష్యా అభివృద్ధి చేస్తోందని ఆరోపించింది. అయితే ఇదంతా నిరాధారం అంటూ అప్పట్లోనే రష్యా ఖండించింది. ఇటీవల ఉక్రెయిన్ ఉపయోగిస్తున్న స్టార్లింగ్ శాటిలైట్ ఇంటర్నెట్ను దెబ్బ తీసేందుకు రష్యా అణ్వాయుధాన్ని రూపొందని అమెరికా ఆరోపిస్తోంది.ఈ నేపథ్యంలో అంతరిక్షంలో రష్యా అణ్వాయుధాలను ఉపయోగించే అవకాశం ఉందని జర్మన్ నిఘా నివేదిక వెల్లడించడంతో అనేక ప్రశ్నలు, ఆందోళనలు మొదలయ్యాయి.
కాగా యుద్ధ రంగంలో సాంకేతిక రోజు రోజుకీ కొత్త పుంతలు తొక్కుతోంది. యుద్ధ విమానాలు, క్షిపణులు, డ్రోన్లు ఉపయోగించి శత్రువులను దెబ్బ తీయడం నిన్నటి మాట.. యుద్ధం ఇప్పుడు సరిహద్దులు, కంప్యూటన్ స్క్రీన్లను దాటి అంతరిక్షాన్ని చేరింది. శత్రు దేశాల ఉపగ్రహాలను ధ్వంసం చేయడం ద్వారా వారి జీపీఎస్ , నిఘా, సమాచార వ్యవస్థలను దెబ్బతీయడమే అంతరిక్ష యుద్ధం.
వాస్తవానికి ప్రచ్ఛన్న యుద్ధం నాటి నుంచి అంతరిక్షంలో ఆయుధాల మోహరింపుపై వ్యూహాలు అమెరికా, రష్యాలు సిద్ధమయ్యాయి. రష్యా 1957లో స్పుత్నిక్-1 శాటిలైట్‌ను ప్రయోగించడంతో అంతరిక్ష రక్షణ రంగంలో పోటీ మొదలైంది. 1960వ దశకంలో రష్యా ఉపగ్రహాలను ధ్వంసం చేసే ఆల్మాజ్ ప్రాజెక్ట్, అమెరికా బ్లూ జెమిని వంటి మిలిటరీ అంతరిక్ష ప్రాజెక్టులతో స్పేస్ వార్ పరిశోధనలను వేగవంతం చేశాయి. ఇటీవల అమెరికా తన ఆయుధాలను అంతరిక్షంలో మోహరించినట్లు తొలిసారి అంగీకరించింది.
కాగా అమెరికా 1985లోనే ఎఫ్–15 యుద్ధ విమానం ద్వారా 11.6 కిలోమీటర్ల ఎత్తుకు ఎగసి అక్కడి నుంచి ఏఎస్ఎం–135 క్షిపణిని ప్రయోగించింది. ఈ క్షిపణి 555 కిలోమీటర్ల ఎత్తులో తిరుగుతున్న శాస్త్రీయ ఉపగ్రహం ఒకదాన్ని ధ్వంసం చేసింది . క్షిపణుల సాయంతో ఉపగ్రహాలను ధ్వంసం చేయగల వ్యవస్థలను కైనెటిక్ డైరెక్ట్ అసెంట్ ఏశాట్లని పిలుస్తారు. నేల, సముద్రం, గాల్లోంచి కూడా ప్రయోగించగలగడం వీటి ప్రత్యేకత.
ఎక్కడో వందల కిలోమీటర్ల దూరంలో కక్ష్యలో కంటికి కనిపించకుండా నిరంతరం తిరిగే ఉపగ్రహాన్ని గుర్తించేందుకు, కచ్చితంగా దాన్ని బలంగా ఢీకొనేందుకు శక్తిమంతమైన రాడార్లు, ఆప్టికల్ సెన్సర్లను ఉపయోగిస్తారు. ఆ తర్వాత కాలంలో 2007లో చైనా కూడా అంతరిక్ష యుద్ధ సాంకేతికను సమకూరుకుంది. రష్యా 2021లో కాస్మోస్1408 ఉపగ్రహాన్ని ధ్వంసం చేసి తనకూ ఏశాట్లు ఉన్నాయని ప్రకటించుకుంది.
ఇక్కడ గర్వంగా చెప్పుకోవాల్సిన మరో విషయం ఏమంటే.. భారత్ కూడా అంతరిక్ష యుద్ధ సన్నాహాల్లో ఇప్పటికే ముందంజలోనే ఉంది. ఉపగ్రహాలను కూల్చేయగల సత్తా మన దేశానికి 2019లోనే సమకూరింది. ‘మిషన్ శక్తి’ పేరుతో ఈ ఉపగ్రహ విధ్వంసక ఆయుధ వ్యవస్థను మనం పరీక్షించాం.
అమెరికా, రష్యా, చైనా తర్వాతమఈ సత్తా కలిగిన నాలుగవ దేశంగా భారత్ అవతరించింది. మిషన్ శక్తిలో భాగంగా రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ డీఆర్డీవో పృథ్వీ క్షిపణికి కొన్ని మార్పులు చేసి ప్రయోగించింది. 2019 మార్చి 27న ఒడిశాలోని అబ్దుల్ కలామ్ దీవి నుంచి నింగికి ఎగసిన ఈ మూడు దశల పృథ్వీ క్షిపణి అంతకు రెండు నెలల క్రితం ఇస్రో రాకెట్ ద్వారా భూమి లో ఎర్త్ ఆర్బిట్‌లోకి చేరిన మైక్రోశాట్–ఆర్ ఉపగ్రహాన్ని ఢీకొని నాశనం చేసింది.
అయితే క్షిపణిలో ఎలాంటి పేలుడు సామగ్రిని వాడలేదు. మొత్తానికి స్పేస్ వార్స్ మొదలైతే ప్రపంచ వ్యాప్త యుద్ధాలు సమూలంగా మారడమే కాదు, కొత్త భయాలకు కారణమవుతున్నాయి.




