BIG STORY: అయ్యప్ప భక్తులకు శుభవార్త!
BIG STORY: శబరిమల మండల-మకరవిళక్కు యాత్ర నేపథ్యంలో 204 ప్రత్యేక రైలు ట్రిప్పులు ప్రకటించిన రైల్వే శాఖ. హైదరాబాద్, విజయవాడ సహా పలు మార్గాల్లో ప్రత్యేక సర్వీసులు, స్టేషన్లలో సౌకర్యాలు.
BIG STORY: అయ్యప్ప భక్తులకు శుభవార్త!
BIG STORY: కేరళలోని శబరిమల అయ్యప్ప ఆలయంలో మండల-మకరవిళక్కు తీర్థయాత్ర సీజన్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో భక్తుల ప్రయాణాన్ని సురక్షితంగా, సౌకర్యవంతంగా సాగించేందుకు దక్షిణ రైల్వే విస్తృత ఏర్పాట్లు చేసింది.
యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైళ్లను నడపడంతో పాటు ప్రధాన రైల్వే స్టేషన్లలో అదనపు సౌకర్యాలు కల్పించింది. భద్రతను కూడా కట్టుదిట్టం చేసింది. గత సంవత్సరాలతో పోలిస్తే ఈసారి ప్రత్యేక రైళ్లను ముందుగానే అందుబాటులోకి తీసుకొచ్చినట్లు రైల్వే మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియచేసింది.
శబరిమల యాత్రకు వచ్చే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని చెన్నై-కొల్లం, తిరువనంతపురం-మంగళూరు, పన్వెల్-కొట్టాయం, విశాఖపట్నం-కొల్లం, హైదరాబాద్-కొల్లం, విజయవాడ-కొట్టాయం మార్గాల్లో ప్రత్యేక రైళ్లను ప్రవేశపెట్టింది. ప్రస్తుత యాత్రా సీజన్ కోసం మొత్తం 204 ప్రత్యేక రైలు ట్రిప్పులను ప్రకటించింది.
ప్రయాణికుల డిమాండ్, టికెట్ బుకింగ్ సరళిని బట్టి అవసరమైతే మరిన్ని సర్వీసులను నడపనున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అంతేకాదు యాత్రా సమయంలో భక్తుల అవసరాలకు అనుగుణంగా ఏర్పాట్లను ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు పేర్కొంది.
శబరిమల భక్తుల కోసం కొట్టాయం, చెంగన్నూర్, ఎర్నాకులం జంక్షన్, ఎర్నాకులం టౌన్ రైల్వే స్టేషన్లలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. వసతి, మరుగుదొడ్లు, ఆహారం, వైద్య సహాయం, రవాణా సౌకర్యాలను అందుబాటులో ఉంచారు.
అలాగే కొట్టాయంలోని ప్రధాన ప్రవేశ ద్వారం సమీపంలో మూడు అంతస్తుల ప్రయాణికుల సౌకర్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఇందులో ఒకేసారి 900 మంది ప్రయాణికులు ఉండేందుకు వీలుంది. చెంగన్నూరులో 600 మంది ప్రయాణికులకు వసతి కల్పించేలా మూడు షెల్టర్లను ఏర్పాటు చేశారు.
వీటితో పాటు ఒక ఏసీ వెయిటింగ్ హాల్, రెండు నాన్-ఏసీ పడక గదులు అందుబాటులో ఉన్నాయి. ఎర్నాకులం జంక్షన్లో పునరుద్ధరణ పనులు కొనసాగుతున్నప్పటికీ ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా ఏసీ వెయిటింగ్ హాళ్లు, విశ్రాంతి గదులు, భోజన సదుపాయాలు, లగేజీ నిల్వ సేవలను అందిస్తున్నారు.
భక్తులకు అవసరమైన సమాచారం, సహాయం అందించేందుకు చెంగన్నూర్, కొట్టాయం రైల్వే స్టేషన్లలో రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ఆధ్వర్యంలో 24 గంటల పాటు పనిచేసే సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ రెండు స్టేషన్లలో అదనపు నాన్-రిజర్వేషన్ టికెట్ కౌంటర్లు, బుకింగ్ సదుపాయాలను కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతర్రాష్ట్ర ప్రయాణికులకు భాషాపరమైన ఇబ్బందులు తలెత్తకుండా తెలుగు, కన్నడ, తమిళం మాట్లాడే సిబ్బందిని నియమించారు.
యాత్రికుల భద్రత కోసం ప్రధాన రైల్వే స్టేషన్లతో పాటు రైళ్లలోనూ భద్రతను పెంచారు. మహిళా అధికారులు, కానిస్టేబుళ్లతో సహా అదనపు ఆర్పీఎఫ్ సిబ్బందిని ప్రత్యేక విధుల్లో నియమించారు. అత్యవసర వైద్య సహాయం అందించేందుకు సెయింట్ జాన్ అంబులెన్స్ బ్రిగేడ్, దక్షిణ రైల్వే వైద్య విభాగం, ప్రభుత్వ ఆరోగ్య శాఖ సిబ్బందితో కూడిన ప్రత్యేక బృందాలను కీలక ప్రాంతాల్లో మోహరించారు.
మరోవైపు రైల్వే పోలీసులు ఎర్నాకులం, చెంగన్నూర్, తిరువల్ల, కొట్టాయం, కాయంకుళం రైల్వే స్టేషన్లలో 24 గంటల పాటు పనిచేసే సహాయ కేంద్రాలను ఏర్పాటు చేశారు. యాత్రా సీజన్లో భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా రైళ్ల నిర్వహణ, ప్రయాణికుల సౌకర్యాలు, భద్రతా ఏర్పాట్లను నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు రైల్వే అధికారులు తెలియచేశారు.




