Burning Topic: బీహార్ లో చక్రం తిప్పిన మోడీ
Burning Topic: బీహార్ ముఖ్యమంత్రిగా సామ్రాట్ చౌదరి ప్రమాణ స్వీకారం చేశారు.
Burning Topic: బీహార్ లో చక్రం తిప్పిన మోడీ
Burning Topic: బిహార్‌లో తొలిసారి బీజేపీ నేత ముఖ్యమంత్రిగా కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. సమ్రాట్ చౌధరీ రాష్ట్ర 21వ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు. లోక్‌భవన్‌లో గవర్నర్ సయ్యద్ అతా హస్నైన్ ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమానికి ఎన్డీఏ కూటమిలోని బీజేపీ, జేడీయూ, ఎల్జేపీ, హెచ్‌ఏఎం, ఆర్‌ఎల్‌ఎం నాయకులు హాజరయ్యారు. సమ్రాట్ చౌధరీ పాటు బిజేంద్ర ప్రసాద్ యాదవ్, విజయ్‌కుమార్ చౌధరీలు ఉప ముఖ్యమంత్రులుగా ప్రమాణం చేశారు. ఇప్పటి వరకూ బిహార్‌కు ముఖ్యమంత్రిగా ఉన్న జేడీయూ నేత నితీశ్‌కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో బీజేపీకి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలని నిర్ణయించారు. ఈ క్రమంలో సమ్రాట్ చౌధరీని బీజేపీ ఎంపిక చేసింది. బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా సమ్రాట్ చౌదరిని ఎన్నుకున్నారు. సమ్రాట్‌కు శుభాకాంక్షలు చెప్పారు నితీష్ కుమార్. కొత్త ప్రభుత్వానికి తన నుంచి పూర్తి సహకారం ఉంటుందని ప్రకటించారు.
ఇంతకీ ఈ సమ్రాట్ చౌధరీ ఎవరు? దేశ వ్యాప్తంగా జరుగుతున్న చర్చ ఇదే. తొమ్మిదేళ్ల క్రితమే పార్టీలోకి వచ్చిన ఈయనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది బీజేపీ. పార్టీలో సీనియర్లకు పక్కన పెట్టి సమ్రాట్‌ను ఎంపిక చేయడానికి కారణాలు ఏంటని ఆరా తీస్తున్నారు విశ్లేషకులు. సమ్రాట్ చౌదరి 1968 నవంబర్ 16న ముంగేర్ జిల్లాలో జన్మించారు. ఓబీసీల్లో ప్రముఖ వర్గం కుష్వాహ కమ్యూనిటీకి చెందిన నేత. బిహార్‌లో యాదవుల తర్వాత ఈ సామాజిక వర్గం ప్రాబల్యం ఎక్కువ. ప్రస్తుతం ఆయన కియోరి నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సమ్రాట్ తండ్రి శకుని చౌదరి చౌధరి తారాపూర్ నియోజకవర్గం నుంచి ఆరు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు. తల్లి పార్వతీ దేవి 1998లో అదే స్థానంలో సమతా పార్టీ తరఫున గెలిచారు. గత 12 ఎన్నికల్లో 9 సార్లు తండ్రి, తల్లి, కుమారుడు కలిసి ఆ స్థానంలో గెలిచారు. సమ్రాట్ చౌధరీ తన రాజకీయ జీవితాన్ని 1990లో లాలూ ప్రసాద్ యాదవ్‌కు చెందిన రాష్ట్రీయ జనతా దళ్ పార్టీతో ప్రారంభించారు.
సమ్రాట్ చౌధరి ముఖ్యమంత్రి రబ్రీ దేవి మంత్రివర్గంలో 1999 మే 19న అతిపిన్న వయస్సులోనే వ్యవసాయ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే ఆయనకు కనీస వయస్సు లేదనే కారణంతో పదవి నుంచి తొలగించారు. ఆ తర్వాత 2000, 2010 సంవత్సరాల్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆర్‌జేడీ అభ్యర్థిగా ఖగారియా జిల్లాలోని పర్బత్తా నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. 2010లో బిహార్ అసెంబ్లీలో ఆర్‌జేడీ తరఫున ప్రతిపక్ష చీఫ్ విప్‌గా సమ్రాట్ నియమితులయ్యారు. ఆ సమయంలో ప్రభుత్వంపై ఘాటైన విమర్శలు చేస్తూ పార్టీ గళాన్ని వినిపించారు. 2014 లోక్‌సభ ఎన్నికల్లో ఖగారియా నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని సమ్రాట్ ఆశించారు. అయితే ఈ సీటును కాంగ్రెస్‌కు కేటాయించింది. దీంతో ఆర్‌జేడీలోని 13 మంది ఎమ్మెల్యేలతో కలిసి సమ్రాట్ చౌధరీ తిరుగుబాటు చేశారు. ఆ పార్టీని వీడి నీతీశ్ కుమార్‌కు చెందిన జేడీయూలో చేరారు.
సమ్రాట్ చౌధరీ 2014లో జితన్ రామ్ మాంఝీ ప్రభుత్వంలో పట్టణాభివృద్ధి, గృహనిర్మాణ శాఖ మంత్రిగా పని చేశారు. కానీ నితీష్ కుమార్ ప్రభుత్వంలో మంత్రిగా అవకాశం దక్కలేదు. దీంతో 2017లో బీజేపీలో సమ్రాట్ చౌధరీ చేరారు. బిహార్‌లోని కీలకమైన కుష్వాహా సామాజిక వర్గానికి చెందిన నేత కావడంతో బీజేపీకి సమ్రాట్ అత్యంత ముఖ్యనేతగా మారారు. 2018లో బిహార్ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఆయన నియమితులు అయ్యారు. 2020లో బిహార్ శాసనమండలి సభ్యుడిగా ఎన్నికై, పంచాయతీ రాజ్ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఓబీసీలను ఆకట్టుకోవడానికే 2022లో శాసనమండలిలో ప్రతిపక్ష నేతగా సమ్రాట్‌ను బీజేపీ ఎంపిక చేసింది. ఇక 2023లో బిహార్ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగానూ ఆయన్ను నియమించింది. 2024 జనవరిలో బిహార్ ఉప ముఖ్యమంత్రిగా సమ్రాట్‌ను చేసింది. నితీష్ కుమార్ కుష్వాహా సామాజిక వర్గం కావడంతో అదే సామాజిక వర్గానికి చెందిన సమ్రాట్ చౌధరీని ముఖ‌్యమంత్రిగా చేయాలని బీజేపీ నిర్ణయించింది.
బిహార్‌లో తొలిసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే అవకాశం బీజేపీకి అంత సులభంగా దక్కలేదు. దీని వెనుక దశాబ్దాల కృషి ఉంది. హిందీ రాష్ట్రమైన బిహార్‌లో బీజేపీ ఎదుగుదల చాలా నెమ్మదిగా, వ్యూహాత్మకంగా సాగింది. ఇటీవలి కాలం వరకు సంకీర్ణ రాజకీయాలపైనే ఆధారపడింది. మధ్యలో కొన్నేళ్ల మినహా 2005 నుంచి జేడీయూకి బీజేపీ ఒక చిన్న భాగస్వామిగా ఉంది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జేడీయూకి 85 సీట్లు రాగా, బీజేపీకి 89 సీట్లు దక్కాయి. అయినప్పటికీ నితీష్ కుమార్‌కే సీఎంగా అవకాశం ఇచ్చింది బీజేపీ. అయితే నీతీశ్ కుమార్ రాజ్యసభకు వెళ్లడంతో బీజేపీ వేగంగా పావులు కదిపింది. వెంటనే తమ పార్టీ నేత సమ్రాట్ చౌధరీకి సీఎంగా అవకాశం ఇచ్చింది. రాష్ట్రంలో బీజేపీని క్షేత్ర స్థాయిలో బలోపేతం చేయడంతో సమ్రాట్ కృషి ఎంతో ఉంది. ఈ కారణాలతోనే బీజేపీ నాయకత్వం ఆయనను ముఖ్యమంత్రి పదవికి ఎంపిక చేసింది.




