Off The Record: టీడీపీలో భగ్గుమన్న వర్గ పోరు.. పార్టీ నేత పై ఆదిమూలం సంచలన కామెంట్స్
Off The Record: సత్యవేడు టిడిపిలో వర్గపోరు భగ్గుమంది! కోఆర్డినేటర్ శంకర్ రెడ్డిపై ఎమ్మెల్యే ఆదిమూలం సంచలన ఆరోపణలు.
Off The Record: టీడీపీలో భగ్గుమన్న వర్గ పోరు.. పార్టీ నేత పై ఆదిమూలం సంచలన కామెంట్స్
Off The Record: తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలో అధికార పార్టీ నేతల మధ్య ఆధిపత్యపోరు రణరంగాన్ని తలపిస్తోంది. సొంత పార్టీ నేతలే తనపై కుట్రలు పన్నుతున్నారంటూ.. సిట్టింగ్ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర రాజకీయాల్లో కలకలం రేపుతున్నాయి. ముఖ్యంగా నియోజకవర్గ పార్టీ కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి టార్గెట్ గా ఆదిమూలం విరుచుకుపడ్డారు. నియోజకవర్గం లో గ్రావెల్ తవ్వకాలు, ఇసుక మాఫియా విచ్చలవిడిగా జరుగుతోందని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారట ఎమ్మెల్యే. శంకర్ రెడ్డి పగలు టీడీపీ నేతలతో, రాత్రి వైసీపీ నేతలతో తిరుగుతూ, మాజీ మంత్రి పెద్దిరెడ్డితో 24 గంటలు టచ్‌లో ఉంటున్నారని సంచలన ఆరోపణలు చేశారు. ఒక దళిత ఎమ్మెల్యేను కాబట్టే, ఎస్సీ నియోజకవర్గం కాబట్టే ఇక్కడ పెత్తనం చెలాయిస్తున్నారా? అని ప్రశ్నించిన ఆదిమూలం.. అదే ఇతర నియోజకవర్గాల్లో అయితే ఈ రేంజ్ లో ఆధిపత్యం చేయగలరా అంటూ నిలదీశారు.
గ్రావెల్ మాఫియా డబ్బుతో శంకర్ రెడ్డి పెత్తనం చెలాయిస్తున్నారని.. నీకు ఆర్థిక బలం ఉంటే, నాకు అంగబలం ఉంది. నన్ను రెచ్చగొట్టొద్దు, నేను రోడ్డెక్కితే 50 వేల మంది నా వెనక వస్తారు అంటూ బహిరంగ సవాల్ విసిరారు ఎమ్మెల్యే ఆదిమూలం. అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా పార్టీ పదవులు ప్రకటించినా, సత్యవేడులో మాత్రం కోఆర్డినేటర్ కుట్రల వల్లే దళితుల మధ్య వర్గపోరు పెరిగి, నిజమైన కార్యకర్తలకు పదవులు రాకుండా పోతున్నాయని ఎమ్మెల్యే ఆదిమూలం ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో తనపై తప్పుడు కేసు పెట్టి సస్పెండ్ అయ్యేలా చేశారని, దాన్ని హైకోర్టు కొట్టివేసినా.. అప్పట్లో ఆ కేసు నమోదు చేసిన అధికారులే ఇంకా ఇక్కడ పాతుకుపోయారని ఆయన మండిపడ్డారు.
విన్నారుగా ఎమ్మెల్యే గారి ఆవేదన… ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే.. నాకేమో జీరో ప్రొటోకాల్.. పార్టీ పదవి తెచ్చుకున్నోడికేమో హీరో ప్రొటోకాల్.. ఇదేం న్యాయం సారూ? అని అడుగుతున్నారు ఆదిమూలం. విసుగెత్తిపోయిన ఎమ్మెల్యే .. డైరెక్ట్ గా అసెంబ్లీ స్పీకర్ వద్దకే పంచాయితీ తీసుకెళ్లారు. జిల్లా స్థాయి పార్టీ అధ్యక్షుడికి కూడా దక్కని ప్రొటోకాల్‌ను, ఒక నియోజకవర్గ కోఆర్డినేటర్ కు అధికారులు ఎలా ఇస్తారని సూటిగా ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ కార్యక్రమాలకు తనను కాకుండా శంకర్ రెడ్డిని ఆహ్వానించడం, పోలీసు యంత్రాంగం కూడా ఆయనకే వంతపాడటంపై భగ్గుమన్నారు. రేపు మేమంతా ఒకటవుతాం.. అప్పుడు మధ్యలో ఉండి తప్పులు చేసిన అధికారుల పరిస్థితి ఏంటి? అని డైరెక్ట్ గా హెచ్చరించారు. అధికారుల తీరులో మార్పు రాకపోవడంతో, ఎమ్మెల్యే ఆదిమూలం ఈ ప్రొటోకాల్ వివాదాన్ని నేరుగా అసెంబ్లీ దృష్టికి తీసుకెళ్లారు. తనకు ప్రొటోకాల్ దక్కడం లేదని, ప్రభుత్వ కార్యక్రమాలకు ఆహ్వానం పలకడం లేదని స్పీకర్‌కు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. దీనిపై సీరియస్ గా స్పందించిన అసెంబ్లీ జనరల్ సెక్రటరీ సూర్యదేవర వరప్రసాద్… తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్‌కు నోటీసులు జారీ చేశారు.
ఇదీ సత్యవేడులో నడుస్తున్న పవర్ పాలిటిక్స్. అసెంబ్లీ నుంచి నోటీసులు రావడంతో సత్యవేడు అధికారుల్లో ఇప్పుడు వణుకు మొదలైంది. ఇదిలా ఉంటే... పగలు టీడీపీ-రాత్రి వైసీపీ అని ఎమ్మెల్యే ఆరోపిస్తున్న కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి వ్యవహారంపై టీడీపీ అధిష్టానం ఎలాంటి కొరడా ఝుళిపిస్తుంది? అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రతిపక్షాలు వేలెత్తి చూపకముందే, సొంత పార్టీలోని ఈ డ్యామేజ్‌ను చంద్రబాబు ఎలా కంట్రోల్ చేస్తారో వేచి చూడాలి.




