Burning Topic: మక్కా మసీదుపై హౌతీల దాడి!

Burning Topic: ముస్లింల పవిత్రస్థలం మక్కా సమీపంలోకి దూసుకొచ్చిన డ్రోన్‌ను కూల్చివేసిన సౌదీ బలగాలు. హూతీల దాడిని తీవ్రంగా ఖండించిన భారత్, ఓఐసీ.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 17 Sept 2026 8:19 AM IST
Burning Topic
X

Burning Topic: మక్కా మసీదుపై హౌతీల దాడి!

Burning Topic: పశ్చిమాసియా పరిణామాలు కొత్త మలుపు తిరుగుతున్నాయి. నిన్నటి దాకా అమెరికా, ఇరాన్ మధ్య జరిగిన పోరు, ఇవాళ సౌదీ అరేబియా, హౌతీ తిరుగుబాటు దారుల మధ్య ఘర్షణలకు విస్తరించింది. గత కొత్త రోజులుగా హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రానికి దక్షిణాన ఉన్న మరికొన్ని కీలక ద్వీపాలను స్వాధీనం చేసుకున్నారు.

పశ్చిమాసియాలో విస్తరిస్తున్న ఘర్షణల ప్రభావం యెమెన్‌, సౌదీ-హూతీ ప్రాంతానికి కూడా వ్యాపిస్తోంది. తాజాగా ఉద్రిక్తతలు ముస్లింల పవిత్రస్థలం మక్కాను తాకాయి ఈ నగరం సమీపంలోకి ఒక డ్రోన్ దూసుకురాగా, దాన్ని గుర్తించి వెంటనే కూల్చివేశామని సౌదీ అరేబియా ప్రకటించింది.

దానిని రాయల్ సౌదీ ఎయిర్‌ డిఫెన్స్ బలగాలు దానిని అడ్డుకొని, నిర్వీర్యం చేశాయని సైనిక ఉన్నతాధికారి తుర్కి అల్‌ మాలికి వెల్లడించారు. దీనిని శత్రు, ఉగ్రవాద చర్యగా అభివర్ణించారు. ఇలాంటి దాడులను ఉపేక్షించబోమని హెచ్చరించారు. ఇది కచ్చితంగా హౌతీల పనేనని సౌదీ అరేబియా ఆరోపించింది.

సౌదీ అరేబియా పశ్చిమ తీరంపై హూతీ తిరుగుబాటుదారులు బాలిస్టిక్‌ క్షిపణులతో దాడికి దిగడంతో మక్కా నగరంతో పాటు జెడ్డా, తైఫ్‌లలో హై అలర్ట్‌ ప్రకటించారు. మక్కా, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇలాంటి అలర్ట్‌ ప్రకటించడం ఇదే మొదటిసారి.

మక్కాలోని రెండు పవిత్ర మసీదులు, అక్కడికి వచ్చే యాత్రికుల భద్రత విషయంలో ఎలాంటి రాజీ ఉండదని పేర్కొంది. అవసరమైతే ఎలాంటి చర్యలకు అయినా దిగేందుకు సిద్ధమేనని హెచ్చరించింది. హౌతీలపై తగిన, నిరోధక చర్యలు తీసుకునేందుకు సంకీర్ణ సంయుక్త దళాల కమాండ్‌ వెనుకాడబోదని స్పష్టం చేశారు.

ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది ముస్లింలు సందర్శించే పవిత్ర నగరాన్ని లక్ష్యంగా చేసుకోవడం యాత్రికులు, సౌదీ పౌరులు, నివాసితుల్లో భయాందోళనలు సృష్టించే ప్రయత్నమేనని ఆరోపించారు. 2017 తర్వాత మళ్లీమక్కాను లక్ష్యంగా చేసుకునే ప్రయత్నం ఇదే రెండోసారి అని సౌదీ నేతృత్వంలోని కూటమి తెలిపింది. 2017 జులై 27న మక్కా వైపు బాలిస్టిక్‌ క్షిపణిని ప్రయోగించిన ఘటనను గుర్తుచేసింది.

ముస్లింల పవిత్రస్థలం మక్కా సమీపంలో హూతీలు చేసిన దాడులను భారత్‌ ఖండించింది. ఈ దాడులపై ఆందోళన వ్యక్తం చేసింది. పశ్చిమాసియాలో వీలైనంత త్వరగా శాంతిస్థాపన జరగాలని ఆకాంక్షించింది. అత్యంత పవిత్ర నగరంగా.. మక్కాతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ప్రత్యేకమైన అనుబంధం, భక్తి ఉన్నాయని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్‌ పేర్కొన్నారు.

ఇకనైనా దాడులు ఆపాలని పిలుపునిచ్చారు. మరోవైపు పవిత్ర నగరం మక్కాను హూతీలు లక్ష్యంగా చేసుకోవడం హేయమైన చర్య అని ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కోఆపరేషన్ ఖండించింది. సౌదీ అరేబియాపై జరుపుతున్న దాడులను చర్యలుగా అభివర్ణిస్తూ, దురాక్రమణగా అభివర్ణించింది. కాగా.. తమపై వస్తున్న ఆరోపణలను హూతీలు ఖండించారు. మక్కాతో పాటు ఇతర ఏ పవిత్ర స్థలానికి తమ నుంచి ముప్పు పొంచిలేదని వివరణ ఇచ్చింది.

మరోవైపు సౌదీ అరేబియా చేసిన ఆరోపణలను హూతీలు ఖండించారు. మక్కా డ్రోన్‌ ఘటనకు ముందు హూతీ సైనిక ప్రతినిధి బ్రిగేడియర్‌ జనరల్‌ యహ్యా సరీ ఓ ప్రకటన విడుదల చేశారు. గత 24 గంటల్లో సౌదీ యుద్ధ విమానాలు 52 వైమానిక దాడులు నిర్వహించాయని ఆయన ఆరోపించారు.

ఎఫ్‌-15, టైఫూన్‌ విమానాలను ఉపయోగించి ఖమీస్‌ ముషైత్‌, తైఫ్‌ వైమానిక స్థావరాల నుంచి ఈ దాడులు జరిగాయని పేర్కొన్నారు. తైజ్‌ ప్రావిన్స్‌లో పాఠశాలలు, వంతెనలు, రహదారులు వంటి పౌర మౌలిక సదుపాయాలు దెబ్బతిన్నాయని, అల్‌-జౌఫ్‌, అల్‌-బైదా, సాదా, అమ్రాన్‌ ప్రాంతాల్లోనూ దాడులు జరిగాయని సరీ ఆరోపించారు.

ఇదిలా ఉంటే..హూతీ తిరుగుబాటుదారులు ఎర్ర సముద్రానికి దక్షిణాన ఉన్న మరికొన్ని కీలక ద్వీపాలను స్వాధీనం చేసుకున్నారు. బాబ్‌ ఎల్‌ మండెబ్‌ జలసంధిని స్వాధీనం చేసుకునేందుకు ప్రయత్నిస్తున్న హూతీలకు ఇది మరో విజయమని విశ్లేషకులు చెప్తున్నారు.

సౌదీ అరేబియా ఇప్పుడు ఊహించని సంక్షోభంలో చిక్కుకుంది. ఒకవైపు హౌతీల ముప్పు.. మరోవైపు మిత్రదేశాల నుంచి ఆశించిన స్థాయిలో ప్రత్యక్ష సైనిక సహకారం లభించడం లేదు. సౌదీ అరేబియా, పాకిస్థాన్, టర్కీ మధ్య కొద్ది వారాల క్రితం మక్కా రక్షణ ఒప్పందం కుదరడం తెలిసిందే.

దీంతో పాకిస్థాన్ నుంచి తగిన సాయం అందుతుందని సౌదీ అరేబియా ఆశించింది. అయితే యెమెన్‌లో హౌతీలపై పోరాటానికి తమ బలగాలను పంపే విషయంలో పాకిస్థాన్ వెనక్కి తగ్గింది. సౌదీ భూభాగాన్ని రక్షించేందుకు మాత్రం తమ బలగాలను మోహరించవచ్చని పాకిస్థాన్ స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

అయితే విదేశీ గడ్డపై జరిగే ప్రత్యక్ష యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనబోమని ఇస్లామాబాద్ చెబుతోంది. హౌతీలపై అమెరికా, బ్రిటన్ కూడా ప్రత్యక్ష సైనిక చర్య విషయంలో వెనుకంజ వేశాయి. అమెరికా ఇంటెలిజెన్స్ సహాయం అందించేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ.. యెమెన్‌లో హౌతీలపై నేరుగా దాడులు చేయబోమని స్పష్టం చేసినట్లు సమాచారం.

పాకిస్థాన్ మొండి చేయి చూపిన నేపథ్యంలో సౌదీ యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఇజ్రాయెల్ సహాయాన్ని కోరినట్లు తెలుస్తోంది. అమెరికా సెంట్రల్ కమాండ్ మధ్యవర్తిత్వంతో ఈ చర్చలు సాగుతున్నట్లు తెలుస్తోంది. ముఖ్యంగా బాబ్ ఎల్-మాండెబ్ జలసంధి వద్ద పొంచి ఉన్న ముప్పుపై నిఘా సమాచారాన్ని పంచుకోవాలని సౌదీ పరోక్షంగా విజ్ఞప్తి చేసింది.

వాస్తవానికి సౌదీ అరేబియా ఇజ్రాయెల్‌ను స్వతంత్ర దేశంగా గుర్తించదు, పైగా ఇరు దేశాల మధ్య ఎటువంటి అధికారిక దౌత్య సంబంధాలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో ‘ఆపదలో ఆదుకునేవాడే నిజమైన మిత్రుడు’ అన్న సామెత గుర్తుకొచ్చేలా.. రియాద్ ఇప్పుడు తనకు అందుబాటులో ఉన్న ప్రతి మార్గాన్నీ పరిశీలిస్తున్నట్లు కనిపిస్తోంది.

ఇజ్రాయెల్ నుంచి సౌదీకి వచ్చే సహాయం కూడా ప్రధానంగా ఇంటెలిజెన్స్‌కే పరిమితం కావచ్చని చెబుతున్నారు. గతంలో కొన్ని సందర్భాల్లో తెరవెనుక సహకారం అందిందని చెబుతున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్