Burning Topic: ఎర్ర సముద్రం మీద పట్టు హౌతీల పట్టు!
Burning Topic: సౌదీ అరేబియాపై హూతీ తిరుగుబాటుదారుల డ్రోన్ దాడులు. ఈస్ట్-వెస్ట్ చమురు పైప్‌లైన్‌ను మూసివేసిన ఆరామ్‌కో. గ్లోబల్ ఆయిల్ మార్కెట్‌లో అనిశ్చితి.
Burning Topic: ఎర్ర సముద్రం మీద పట్టు హౌతీల పట్టు!
Burning Topic: పశ్చిమాసియా పరిణామాలు కొత్త ములుపు తిరుగుతున్నాయి. ఇరాన్-అమెరికా మధ్య దాడులు కాస్త ఆగాయనుకుంటే.. సౌదీ అరేబియా- హూతీ తిరుగుబాటుదారుల మధ్య పోరు తీవ్రరూపం దాల్చింది.
హర్మూజ్ జలసంధిలో ఇబ్బందులు తలెత్తడంతో సౌదీ అరేబియా తన ముడి చమురు రవాణా కోసం ఎర్ర సముద్రంలోని బాబ్ ఎల్ మండేబ్ జలసంధిని ఉపయోగిస్తోంది. ఈ నేపథ్యంలో గత కొంత కాలంగా దక్షిణ ఎర్ర సముద్రంపై యెమెన్‌లోని హూతీ రెబెల్స్ పట్టు సాధిస్తున్నారు.
వీరికి ఇరాన్ మద్దతు ఇస్తుండగా, యెమెన్ ప్రభుత్వానికి సౌదీ అండగా ఉంది. కాగా హౌతీలు ఇక్కడి వ్యూహాత్మక ద్వీపాలను స్వాధీనం చేసుకుంటూ సముద్ర నౌకా రవాణా మార్గంపై తమ నియంత్రణను బలోపేతం చేసుకున్నారు. బాబ్ ఎల్ మండేబ్ జలసంధికి 160 కిలోమీటర్ల ఉత్తరాన ఉన్న గ్రేటర్ హనీశ్, లెసర్ హనీశ్ ద్వీపాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు. తాజాగా ఎల్ మండేబ్ జలసంధిలో హౌతీలకు సౌదీ మద్దతుగల ప్రభుత్వ బలగాలు మధ్య ఘర్షణ చోటు చేసుకుంది.
గత వారం హౌతీ రెబెల్స్ బాబ్ ఎల్ మండేబ్ జలసంధిలోని సమీపంలో ఉన్న మోఖా ఓడరేవు నగరాన్ని, బాబ్ ఎల్ మండేబ్ జలసంధి లోపల ఉన్న మయూన్ ద్వీపాన్ని స్వాధీనం చేసుకున్నారు. తాజాగా దక్షిణ ఎర్ర సముద్రంలోని మరిన్ని వ్యూహాత్మక ద్వీపాలను తమ ఆధీనంలోకి తీసుకున్నారు.
దీంతో దక్షిణ ఎర్ర సముద్రంలో హౌతీ తిరుగుబాటుదారుల పట్టు మరింత పెరిగినట్లైంది. ఇది ఒక రకంగా సౌదీ అరేబియాకు అతిపెద్ద ఎదురు దెబ్బ. ఆ దేశ ముడి చమురు రవాణాను అడ్డుకునేందుకు హౌతీలకు అవకాశం ఏర్పడింది. తాజాగాసౌదీలోని రియాద్, మదీనా ప్రాంతాల్లో శనివారం చమురు పైప్‌లైన్‌లే లక్ష్యంగా హౌతీలు డ్రోన్ దాడులు జరిపారు.
అలాగే షారురాహ్ ప్రావిన్స్‌లోని సైనిక స్థావరం లక్ష్యంగా రెచ్చిపోయారు. దీంతో సౌదీ ఆరామ్‌కో సంస్థ ముందు జాగ్రత్త చర్యగా ఈస్ట్ వెస్ట్ చమురు పైప్‌లైన్ మూసివేసింది. ఈ పరిణామం ప్రపంచ చమురు సరఫరా రంగంలో మరింత అనిశ్చితికి దారితీసే అవకాశం ఉంది.
సౌదీ తన ఎగుమతుల కోసం హర్మూజ్ జలసంధికి ప్రత్యామ్నాయంగా ఈస్ట్-వెస్ట్ ఆయిల్ పైప్‌లైన్ ను ఏర్పాటు చేసుకుంది. ఇది 1200కి.మీ పొడవునా తూర్పున ఉన్న అబ్‌కైక్ చమురు శుద్ధిక్షేత్రం నుంచి పశ్చిమాన ఎర్రసముద్ర తీరంలోని యాన్బు పోర్టు వరకు విస్తరించి ఉంది.
ఈ యాన్బు పోర్టు నుంచి బాబ్ ఎల్ మాండెబ్, సూయజ్ కెనాల్ మీదుగా ఆసియా, ఐరోపా దేశాలకు చమురు వెళ్తుంటుంది. హర్మూజ్‌లో అంతరాయాల కారణంగా చమురు ఎగుమతులకు ఇబ్బంది కలగకూడదనే ఉద్దేశంతో ఈ పైప్‌లైన్‌ను నిర్మించారు. ఇప్పుడు హూతీల దాడులతో ఈ పైప్‌లైన్‌ను మూసివేయాల్సి వచ్చింది. ఇది మళ్లీ ఎప్పుడు తెరుచుకుంటుందనే విషయంలో మాత్రం స్పష్టత లేదు.
తాజాగా ఇరాక్ వైపు నుంచి వచ్చిన డ్రోన్‌ల సమూహం తమ పైప్‌లైన్‌పై విరుచుకుపడిందని సౌదీ అరేబియా విదేశాంగ శాఖ పేర్కొంది. పైప్‌లైన్ వెంబడి ఉన్న పంపింగ్ స్టేషన్ల వద్ద మంటలు ఎగసిపడ్డాయి. . ఈ మేరకు యూఎస్ అధికారుల వ్యాఖ్యలను, ఉపగ్రహ చిత్రాలను ఉటంకించాయి.
ఈస్ట్-వెస్ట్ పెట్రోలైన్ కు ఒక రోజుకు 7 మిలియన్ల బ్యారెళ్ల చమురు రవాణా చేసే సామర్థ్యం ఉంది. అందులో 5 మిలియన్ల బ్యారెళ్ల ముడిచమురు ఎగుమతుల కోసం కేటాయిస్తోంది. మిగతా చమురును సౌదీలోని రిఫైనరీలకు పంపిస్తున్నారు.
ఇప్పుడు ఈ రూట్‌పై దాడులు జరగడంతో చమురు సరఫరా రంగంలో మరింత అనిశ్చితికి దారితీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది.భారత్ దిగుమతుల్లో సౌదీ చమురు కూడా కీలకమే. హర్మూజ్ సంక్షోభం తర్వాత ఆ దేశం నుంచి వస్తున్న ఆయిల్ గణనీయంగా తగ్గిపోయింది. అయినా మన దిగుమతుల్లో ఆ దేశ వాటా 8 శాతంయాన్బు పోర్టు నుంచే వస్తోంది. ఆగస్టులో భారత్ 3,32,000 బ్యారెళ్ల సౌదీ చమురును దిగుమతి చేసుకుంది.
జులైలో ఆ మొత్తం 4,14,000 బ్యారెళ్లు. పెట్రోలైన్ మూసివేతతో మన రిఫైనరీలపై ప్రభావం పడనుంది. మన దేశం వేర్వేరు దేశాల నుంచి చమురు దిగుమతి చేసుకోవడంతో రిఫైనరీలకు చమురు కొరత అంతగా ఏమీ ఉండదు గానీ.. ఇతర దేశాల చమురు ధర మాత్రం తలనొప్పిగా మారుతుంది.
మరోవైపు సౌదీ అరేబియా దక్షిణ ప్రాంతంలో హౌతీ తిరుగుబాటుదారులు వరుసగా క్షిపణులు, డ్రోన్లతో జరిపిన మెరుపు దాడుల్లో 13 మంది పౌరులు గాయపడ్డారు. ఇటువంటి సంక్షోభ సమయంలో మక్కా ఒప్పందంలో భాగస్వామిగా ఉన్న పాకిస్థాన్.. సౌదీకి మద్దతు ఇచ్చేందుకు ముందుకు రాలేదు.
‘మక్కా త్రైపాక్షిక రక్షణ ఒప్పందం’లో పాకిస్థాన్, తుర్కియే, సౌదీ అరేబియాలు భాగస్వామిగా ఉన్నాయి. సౌదీతో పాకిస్థాన్‌కు ప్రత్యేకంగా స్వీయ రక్షణ ఒప్పందం కూడా ఉంది. పాకిస్థాన్ ఇటీవల హూతీలకు హెచ్చరికలు చేసింది. కానీ తర్వాత ఆ వ్యాఖ్యలపై వెనక్కి తగ్గింది. హూతీలపై సైనిక స్పందన అవసరం లేదని, దాని గురించి ఎలాంటి చర్చ జరగడం లేదని చెప్పింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ సాయం కోరింది సౌదీ అరేబియా.
దీనికి అమెరికా సెంట్రల్ కమాండ్ మధ్యవర్తిత్వం వహించినట్లు తెలుస్తోంది. సౌదీ క్రౌన్ ప్రిన్స్ మొహ్మద్ బిన్ సల్మాన్ అమెరికా సైన్యం సాయంతో ఇజ్రాయెల్‌తో పరోక్షంగా చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది.




