Burning Topic: హౌథీలకు సౌదీ యువరాజు బంపర్ ఆఫర్!
Burning Topic: సౌదీ-హూతీల మధ్య దాడులు తీవ్రం కాగా, ఇరాన్ మధ్యవర్తిత్వంతో శాంతి చర్చలు, కాల్పుల విరమణ కోసం భారీ ఆర్థిక ప్యాకేజీ ఒప్పంద ప్రయత్నాలు జరుగుతున్నాయి.
Burning Topic: హౌథీలకు సౌదీ యువరాజు బంపర్ ఆఫర్!
Burning Topic: పశ్చిమాసియాలో సౌదీ అరేబియా-హూతీ తిరుగుబాటుదారుల మధ్య ఘర్షణలు రోజు రోజుకీ కొత్త మలుపు తిరుగుతున్నాయి. హౌతీలు తమ దేశ మౌలిక సదుపాయాలు, చమురు క్షేత్రాలను డ్రోన్లు, క్షిపణులతో టార్గెట్ చేస్తుండడంతో సౌదీ తీవ్ర ఆర్థిక, ప్రాణ నష్టాలను చవిచూస్తోంది. సౌదీ అరేబియా ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి అరామ్కో చమురు క్షేత్రాలు, రస్ తనురా వంటి అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.
ఇవి సౌదీ అంతర్జాతీయ ప్రతిష్టను, పెట్టుబడులను దెబ్బతీస్తున్నాయి. రియాద్‌లోని కింగ్ ఖలీద్ అంతర్జాతీయ విమానాశ్రయం, దమ్మామ్‌లోని కింగ్ ఫహద్ విమానాశ్రయాలపై హౌతీలు జరిపిన దాడుల వల్ల విమాన సర్వీసులు నిలిచిపోయి తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. హౌతీలు ఇరాన్ మద్దతుతో చిన్న డ్రోన్లను, క్రూజ్ క్షిపణులను ప్రయోగిస్తున్నారు. వాటిని అడ్డుకోవడానికి సౌదీ అరేబియా మిలియన్ల డాలర్లు ఖరీదు చేసే పేట్రియాట్ వంటి క్షిపణులను వాడాల్సి వస్తోంది, ఇది సౌదీకి భారీ ఆర్థిక భారంగా మారింది.
తాజాగా సౌదీ అరేబియా రక్షణ శాఖ కార్యాలయాన్ని లక్ష్యంగా చేసుకొని దాడులు చేసినట్లు హూతీలు ప్రకటించారు. రాజధాని రియాద్‌లో బాలిస్టిక్ క్షిపణులతో నేరుగా దాడులు జరిపినట్లు పేర్కొన్నారు. అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారం రాస్ తనూరా పైనా దాడులు చేశామని, తద్వారా భారీ మంటలు వ్యాపించినట్లు హూతీ సైనిక అధికార ప్రతినిధి వెల్లడించారు.
దీనిపై సౌదీ నుంచి ఎటువంటి ప్రకటన రాలేదు. హూతీలు ప్రయోగించిన రెండు క్షిపణులను అడ్డుకున్నామని సౌదీ ప్రభుత్వం ప్రకటించిన కొన్ని గంటలకే ఈ పరిణామం చోటుచేసుకుంది. మరోవైపు, హూతీ తిరుగుబాటుదారులతో కాల్పుల విరమణకు సంబంధించి ఓ కీలక అంశం చర్చనీయాంశమైంది. దాడులు నిలిపివేసేందుకు ఇరాన్ మధ్యవర్తిత్వంలో హూతీలతో ఒప్పందానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని, వారికి బిలియన్ డాలర్ల ఆర్థిక ప్యాకేజీ ఇచ్చేందుకు సౌదీ సిద్ధమయినట్లు ఇజ్రాయెల్ కథనాలు వచ్చాయి.
సౌదీ అరేబియా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన రక్షణ వ్యవస్థలు, అత్యాధునిక ఆయుధ సంపత్తిని కలిగి ఉన్నప్పటికీ, యెమెన్‌కు చెందిన హౌతీ తిరుగుబాటుదారులకు భయపడటానికి ఆర్థిక వ్యూహాత్మక లోపాలు, అసమాన యుద్ధ పద్ధతులు మరియు చమురు రంగంపై దాడులే ప్రధాన కారణం. సౌదీ అరేబియా భౌగోళికంగా చాలా పెద్దది. యెమెన్‌తో సుమారు 1,300 కిలోమీటర్ల పొడవైన సరిహద్దును కలిగి ఉంది.
అంత పెద్ద సరిహద్దు పొడవునా విస్తరించి ఉన్న కీలక ఇంధన, సైనిక కేంద్రాలను అన్ని వేళలా కాపాడుకోవడం సౌదీ రక్షణ వ్యవస్థకు సవాలుగా మారింది.హర్మూజ్‌లో ట్యాంకర్లపై ఇరాన్ చేస్తున్న దాడుల వల్ల గల్ఫ్ దేశాల నుంచి చమురు ఎగుమతులకు కూడా అంతరాయం కలుగుతోంది. దేశంలోని విమానాశ్రయాలు, చమురు కేంద్రాలపై దాడులు మరింత తీవ్రమవుతున్న నేపథ్యంలో యువరాజు మహమ్మద్ బిన్ సల్మాన్ ఎట్టకేలకు హౌతీలతో రాజీకొచ్చారు. కాల్పుల విరమణ కోసం ఇరాన్ మధ్యవర్తిత్వంతో తిరుగుబాటుదారులకు ఓ ఆఫర్ ఇచ్చారు.
హౌతీలు యెమెన్ ప్రభుత్వంతో పోరాడుతున్న తరుణంలో వీరికి వ్యతిరేకంగా సౌదీ అరేబియా ప్రత్యక్షంగా రంగంలోకి దిగింది. అప్పటి నుంచి వీరి మధ్య ప్రత్యక్ష పోరు జరుగుతోంది. కాగా హౌతీలు తమ దేశంపై దాడులను పూర్తిగా ఆపితే 1 బిలియన్ డాలర్లు ఇస్తామని సౌదీ యువరాజు ఓ ఒప్పందం కుదుర్చుకున్నారు. అంటే దాదాపు రూ.9,500 కోట్ల ఆఫర్ ఇది. ఈ భారీ మొత్తాన్ని ఇరాన్ ద్వారానే హౌతీలకు అందించే అవకాశం ఉంది. ఈ ఒప్పందం కోసమే సౌదీ అరేబియా రక్షణ మంత్రి ప్రిన్స్ ఖలీద్ బిన్ సల్మాన్ టెహ్రాన్‌కు వెళ్లారు.
ఆయన వచ్చిన సైనిక రవాణా విమానంలోనే.. హూతీలకు ఇవ్వదలిచిన మొత్తం డబ్బును తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని సౌదీ అధికారులు ధ్రువీకరించాల్సి ఉంది. ఇరాన్ మధ్యవర్తిత్వంతో జరిగిన శాంతి చర్చల్లో తుర్కియే ఇంటెలిజెన్స్ చీఫ్, పాకిస్థాన్ ఆర్మీ చీఫ్ ఫీల్డ్ మార్షల్ ఆసిమ్ మునీర్, ఇరాన్ అధ్యక్షుడు పెజెష్కియాన్, ఐఆర్జీసీ సీనియర్ అధికారులు పాల్గొన్నట్లు సమాచారం.
కొద్ది రోజుల క్రితం హౌతీలుపవిత్రమైన మక్కా, మదీనా ప్రాంతాల వైపు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించగా, సౌదీ రక్షణ వ్యవస్థలు వాటిని అడ్డుకున్నాయి. కూల్చేసిన క్షిపణుల శకలాలు మక్కాలోని వాడి అల్-ముగమ్స్ ప్రాంతంలో పడ్డాయి. తాయిఫ్, యాంబు నగరాల వైపు దూసుకొచ్చిన మరో రెండు హూతీ క్షిపణులను సౌదీ సంకీర్ణ దళాలు ధ్వంసం చేశాయి. మరోవైపు హూతీలకు దీటుగా బదులిస్తూ సౌదీ దళాలు యెమెన్ రాజధాని సనాతో పాటు మోఖా నగరంపై భారీ వైమానిక దాడులు చేశాయి.
ఎర్ర సముద్ర తీరం వెంబడి సౌదీ వైమానిక దాడులతో రక్షణ కల్పిస్తుండగా యెమెన్ ప్రభుత్వ దళాలు వ్యూహాత్మకంగా ముందుకు సాగుతున్నాయి. శనివారం మక్కాతో పాటు జెడ్డా, యాన్బు తైఫ్ గవర్నరేట్లలో దాడులు జరగనున్నట్లు అధికారులు ముందస్తు హెచ్చరికలు కూడా జారీ చేశారు. అత్యవసర సైరన్లు మోగించారు. నివాసితులంతా భద్రతా సూచనలను పాటించాలని, ఒకచోట గుమిగూడడం వంటివి చేయవద్దని విజ్ఞప్తి చేశారు.
సౌదీ అరేబియా, హౌతీ రెబల్స్ మధ్య 2022 నాటి కాల్పుల విరమణ ఒప్పందం పూర్తిగా విచ్ఛిన్నమై, ఘర్షణలు మళ్లీ తీవ్రరూపం దాల్చడానికి ప్రధాన కారణాలు ప్రాంతీయ భౌగోళిక రాజకీయాలు, వ్యూహాత్మక ఆధిపత్యం మరియు ఆర్థిక ఒత్తిళ్లే.. ఇరాన్‌తో ముడిపడి ఉన్న తాజా ప్రాంతీయ ఉద్రిక్తతలలో భాగంగా హౌతీలు తమ వ్యూహాత్మక భాగస్వామి అయిన ఇరాన్‌కు మద్దతుగా నిలిచారు. అమెరికా, ఇజ్రాయెల్ మిత్రదేశమైన సౌదీ అరేబియాపై ఒత్తిడి పెంచడానికి ఇరాన్ హౌతీలను ఒక సాధనంగా వాడుకుంటోంది.
హౌతీ రెబల్స్ ఇటీవల మెరుపు దాడులతో యెమెన్ తీరప్రాంతంలోని వ్యూహాత్మక ప్రాంతాలను, ద్వీపాలను తమ ఆధీనంలోకి తెచ్చుకున్నారు. అంతర్జాతీయ చమురు, రవాణా మార్గమైన బాబ్ ఎల్-మందేబ్ జలసంధిపై పట్టు సాధించి, సౌదీ రేవులకు వెళ్లే నౌకలపై వారు పూర్తి దిగ్బంధనాన్ని విధించారు. యెమెన్‌పై ఉన్న ఆర్థిక ఆంక్షలను పూర్తిగా ఎత్తివేయాలని, తమ ప్రభుత్వాన్ని అధికారికంగా గుర్తించాలని హూతీలు డిమాండ్ చేస్తున్నారు.




