BIG STORY: పర్యావరణం పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
BIG STORY: 454 చెట్ల నరికివేత కేసులో వ్యాపారికి సుప్రీంకోర్టు మరో రూ.50 లక్షల జరిమానా విధించింది.
BIG STORY: పర్యావరణం పై సుప్రీంకోర్టు సంచలన నిర్ణయం!
BIG STORY: సుప్రీంకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి 454 చెట్లను నరికివేసిన స్థిరాస్తి వ్యాపారి జైలు శిక్షతో పాటు భారీ జరిమానా చెల్లించుకోవాల్సి వచ్చింది. వాస్తవానికి చెట్లు నరికివేసిన ప్రాంతం సదరు వ్యాపారి స్వంతమే. అయినప్పటికీ సదరు మధుర - బ్రుందావనంలోని ఆ ప్రాంతం సుప్రీంకోర్టు నియమిత పర్యావరణ పరిమిత కమిటీ పర్యవేక్షణలో ఉంది.
ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. శంకర్ అగర్వాల్ మౌలికంగా ఒక స్థిరాస్తి వ్యాపారి. కాగా రక్షిత అటవీ ప్రాంతానికి చెందిన రహదారి చెంతనే ఉన్న దాల్మియా ఫామ్స్ ను శంకర్ అగర్వాల్ కొనుగోలు చేశాడు. ఆ తరువాత ప్రారంభమైంది అసలు కథ. 2024 సెప్టెంబరులో స్థిరాస్తి వ్యాపారంలో భాగంగా ఇళ్ల నిర్మాణం కోసం రాత్రికి రాత్రి 454 చెట్లను నరికివేయించాడు.
దీనిపై కోర్టులో కేసు నమోదైంది. కోర్టు ధిక్కరణ కింద శంకర్ అగర్వాల్ కు జైలు శిక్ష విధించారు. జరిమానా కూడా విధించారు. అయితే ఇదే అంశంపై తాజాగా చీఫ్ జస్టిస్ సూర్యకాంత్ నాయకత్వంలోని త్రిసభ్య ధర్మాసనం శంకర్ అగర్వాల్ కు మరో యాభై లక్షల రూపాయల జరిమానా విధించింది.
మనదేశంలో విచిత్రమైన పరిస్థితి నెలకొంది. ఒక వైపు విచ్చలవిడిగా మహావృక్షాల నరికి వేస్తుంటారు.మరో వైపు చెట్ల సంరక్షణ పేరుతో అక్కడక్కడా మొక్కలు నాటుతుంటారు. హరితహారం అంటూ గొప్పలు చెప్పుకుంటాయి ప్రభుత్వాలు. ఈ నేపథ్యంలో పాలకులకు సుప్రీంకోర్టు తాజా తీర్పు ఒక చెంపపెట్టు లాంటిది. పర్యావరణ పరిరక్షణకు చెట్లు ఎంత ముఖ్యమో సుప్రీంకోర్టు తాజా తీర్పు ఒక ఉదాహరణగా నిలిచింది.
చాలాకాలంగా సమాజంలో ఒక విచిత్ర ట్రెండ్ నడుస్తోంది.అభివృద్ధి పేరుతో చెట్ల నరికివేత చాలా కాలంగా యధేచ్ఛగా సాగుతోంది. అభివృద్ధి పేరుతో ఈ విధ్వంసకాండ అడ్డూ అదుపూ లేకుండా సాగుతోంది. ముఖ్యంగా పంటపొలాల్లో ఉండే భారీ వృక్షాల తొలగింపు ఇటీవలికాలంలో అత్యధికంగా జరుగుతోంది. ప్రధానంగా సేద్యానికి అడ్డువస్తున్నాయనే కారణంతో పంటపొలాల్లో పెద్ద పెద్ద చెట్ల నరికివేత ఎక్కువైంది.
2018-2022 మధ్యకాలంలో మనదేశంలో దాదాపు 50 లక్షలకు పైగా భారీ వృక్షాలు పంట పొలాలనుంచి కనుమరుగు అయినట్లు ఇటీవల ఓ నివేదిక వెల్లడించింది. అధిక ఫలసాయం కోసం పొలాల్లో ఉన్న భారీ సైజు చెట్లను రైతులు తొలగిస్తున్నట్లు కోపెన్‌హాగెన్ విశ్వవిద్యాలయ పరిశోధకుల బృందం ఈ నివేదికలో తేల్చి చెప్పింది. భారీ చెట్ల నరికివేతతో అటవీయేతర ప్రాంతాల్లో పచ్చదనం తగ్గుతుందని, ఈ ప్రభావం భవిష్యత్‌లో పర్యావరణంపై పడుతుందని పరిశోధకులు పేర్కొన్నారు.
సహజంగా వాతావరణంలోని వాయుకాలుష్యాన్ని చెట్లు హరించివేస్తాయి. అందుకు బదులుగా గాలిలోకి ఆక్సిజన్ విడుదల చేస్తాయి. మనిషి మనుగడకు మూలం ఆక్సిజనే. కరోనా సెకండ్ వేవ్ టైంలో చాలా మంది రోగులు శరీరానికి సరిపడ ఆక్సిజన్ అందక ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామాన్ని ఒక హెచ్చరికగా అన్ని దేశాలు తీసుకోవాలంటున్నారు పర్యావరణవేత్తలు. పర్యావరణ సమతుల్యతను రక్షించుకోకపోతే ఆ తరువాత అనేక దుష్పరిణామాలు తలెత్తుతాయన్న వాస్తవాన్ని పాలకులు అర్థం చేసుకోవాలంటున్నారు.
అడవుల్లోని చెట్లను ఎడాపెడా నరికివేయడం కొంతకాలంగా బాగా పెరిగింది. ఈ ధోరణిని ఎవరైనా వ్యతిరేకిస్తే....ప్రాజెక్టులను తెరమీదకు తీసుకువస్తున్నారు. అభివృద్ధికి ప్రాజెక్టులు కావాలి కదా...అని పర్యావరణ వేత్తలు ఎదురు ప్రశ్నిస్తున్నారు. ఇలా .ప్రాజెక్టుల పేరు చెప్పి, చెట్లను తొలగించడం సరైన పద్దతి కాదంటున్నారు పర్యావరణవేత్తలు.
ఇదేవిధంగా చెట్లను నరుక్కుంటే పోతే గాలిలో ఆక్సిజన్ లెవెల్స్ పడిపోతాయి. అడవుల నరికివేతకు ఫుల్ స్టాప్ పడకపోతే ఇప్పుడు ప్రయాణాల్లో వాటర్ బాటిల్స్‌ను వెంట తీసుకెళ్లినట్లే రానున్న రోజుల్లో బయటకు వెళ్లేటప్పుడు ఆక్సిజన్ సిలిండర్‌ను జనం వెంట తీసుకెళ్లక తప్పదంటున్నారు పర్యావరణవేత్తలు.
మనదేశంలో గత పది సంవత్సరాల్లో అభివృద్ధి పేరుతో కోటికి పైగా చెట్లను నరికేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చినట్లు కేంద్ర పర్యావరణ మంత్రిత్వ శాఖ లెక్కలు చెబుతున్నాయి. చెట్ల నరికివేతపై పర్యావరణవేత్తలు అనేక సార్లు ప్రభుత్వాలను హెచ్చరించారు.
పర్యావరణ సమతుల్యత అనేది లేకపోతే వాతావరణంలో పెనుమార్పులు సంభవిస్తాయని శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. అభివృద్ధితో ముడిపెట్టి చెట్లను నరికివేయడం ఎంతమాత్రం సమంజసం కాదని తేల్చి చెప్పారు. అయితే పర్యావరణవేత్తల హెచ్చరికలను ప్రభుత్వాలు పెడచెవిన పెడుతున్నాయి.
కాగా ఇప్పటికీ పర్యావరణంపై ప్రభుత్వాల వైఖరిలో పెద్దగా మార్పు రావడం లేదు. తెగి పడుతున్న చెట్ల సంఖ్యను చూస్తుంటే సమాజం అభివృద్ధి పేరిట వినాశనం వైపు పరుగు తీస్తున్నట్లుగా ఉందంటున్నారు పర్యావరణవేత్తలు. అడవుల నరికివేత పట్ల పాలకుల వైఖరి మారకపోవడం పై పర్యావరణవేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
పర్యావరణంపై ముందుగా ప్రభుత్వాల వైఖరి మారాల్సిన అవసరం ఉంది. అభివృద్ధి, పర్యావరణం ....ఈ రెండూ వేర్వేరు అంశాలన్న పాలకుల ఆలోచనా ధోరణి ముందుగా మారాలి. అభివృద్ధిలో భాగంగానే చెట్ల పెంపకాన్ని చూడాలి. అప్పుడే, మనం చెట్లను రక్షించుకోగలం. అడవులను కాపాడుకోగలం. మన శరీరంలో ఊపిరితిత్తులు చేసే పనిని పర్యావరణానికి అడవులు చేస్తున్నాయి.
వాస్తవానికి అడవులు లేకపోతే అసలు మనిషి మనుగడే లేదు. అడవుల వల్ల మానవాళికి బోలెడు ప్రయోజనాలున్నాయి. వాస్తవానికి ప్రపంచంలో వాయు కాలుష్యాన్ని నియంత్రించేంది అడవులే. అడవులు, ప్రజలకు స్వచ్ఛమైన గాలి అందిస్తాయి. వరదలను అడ్డుకునే శక్తి ఒక్క అడవులకే ఉంది.
అడవుల వల్ల నేల కోతకు గురి కాదు. అడవులు బావుంటే భూసారం దెబ్బతినదు. పంటల ఉత్పత్తి ఏమాత్రం తగ్గదు. గాలిలో ఉన్న ఉష్ణోగ్రతను గ్రహించి వాతావరణాన్ని చల్లబరుస్తాయి. వాతావరణంలో వచ్చే మార్పులను నియంత్రించే సత్తా ఒక్క అడవులకే ఉంది. ఆరోగ్య సమస్యలకు ఇప్పుడు మనం వాడే అనేకానేక ఔషధాలన్నీ అడవుల నుంచి వచ్చినవే.
ఆయుర్వేదం పుట్టిందే అడవుల్లో. ఒక్కమాటలో చెప్పాలంటే అడవులు ఎంత దట్టంగా ఉంటే మనిషి మనుగడకు అంత గ్యారంటీ ఉంటుంది. వృక్షాలను రక్షిస్తే , అవి మనల్ని రక్షిస్తాయంటారు పెద్దలు. పచ్చని చెట్లు పర్యావరణానికే కాదు. మనిషి మనుగడకు, ఆరోగ్యకరమైన జీవనానికి ఎంతో ముఖ్యం. పాలకులు ఈ వాస్తవాన్ని ఇప్పటికైనా గ్రహించాలి.




