Burning Topic: స్వదేశానికి షేక్ హసీనా.. బంగ్లాదేశ్‌లో ఏం జరగబోతోంది..?
Burning Topic: డిసెంబర్ 16న బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తానని మాజీ ప్రధాని షేక్ హసీనా ప్రకటించగా, సంకెళ్లతోనే రావాలని ఢాకా ప్రభుత్వం హెచ్చరించింది.
Burning Topic: స్వదేశానికి షేక్ హసీనా.. బంగ్లాదేశ్‌లో ఏం జరగబోతోంది..?
Burning Topic: ఒకప్పుడు బంగ్లాదేశ్‌ను ఏలిన అధినేత్రి.. ఇప్పుడు మరణశిక్ష పడిన ఖైదీ! రెండేళ్ల క్రితం ప్రాణభయంతో దేశం విడిచి వెళ్లిన షేక్ హసీనా, ఇప్పుడు మళ్లీ స్వదేశంలో అడుగుపెట్టేందుకు ముహూర్తం ఖరారు చేసుకున్నారు. అది కూడా బంగ్లాదేశ్ విముక్తి పొందిన డిసెంబర్ 16న.. 1971లో పాకిస్తాన్ నుండి బంగ్లాదేశ్ విముక్తి పొందిన 'విజయ దినోత్సవం' రోజునే ఢాకాలో అడుగుపెట్టాలని ఆమె భావిస్తున్నారు.
ఆమె తండ్రి షేక్ ముజిబుర్ రెహమాన్ నేతృత్వంలోనే బంగ్లాదేశ్ స్వాతంత్ర్యం సాధించినందున, ఈ తేదీని ఎంచుకోవడం రాజకీయంగా ఎంతో ప్రతీకాత్మకమని ఆమె సన్నిహితులు పేర్కొంటున్నారు. ఢిల్లీ నుంచి ఢాకా వెళ్లేందుకు విమానయాన సంస్థ బిమాన్ బంగ్లాదేశ్ ఎయిర్‌లైన్స్ విమానంలో తన ప్రయాణానికి ఏర్పాట్లు చేయాలని, కోరింది. ఇందుకు అవసరమైన ప్రయాణ పత్రాలను సమకూర్చాలని బంగ్లాదేశ్ ప్రభుత్వానికి సమాచారం అందించారు.
2024 ఆగస్టు తిరుగుబాటు తర్వాత ప్రశాంతత కోసం ఎదురుచూస్తున్న బంగ్లాదేశ్‌ను, మాజీ ప్రధాని షేక్ హసీనా పునరాగమన ప్రకటన మళ్లీ అస్థిరత అంచున నిలబెట్టింది. 2024 ఆగస్టు 5న ఆమె బంగ్లాదేశ్ విమానంలో భారత్‌కు వచ్చారు. తన స్వదేశానికి తిరిగి వెళ్లడానికి మాజీ ప్రధాని షేక్ హసీనా కొంత కాలంగా ప్రయత్నిస్తున్నారు. ఈ క్రమంలోనే తనకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని ఆమె బంగ్లాదేశ్ సర్కార్‌ను కోరారు.
అంతలోనే షేక్ హసీనా తన స్వస్థలానికి తిరిగి వెళ్లే తేదీని ఖరారు చేసుకున్నారు. అయితే బంగ్లాదేశ్ తిరిగి వెళ్లాలని షేక్ హసీనా కోరుకున్నా అక్కడ ఆమెకు స్వాగతం పలికేందుకు పూల బాటలు లేవు. ప్రభుత్వం మాత్రం షేక్ హసీనా ప్రకటనపై ఆగ్రహంతో ఉంది. ఆమె విజ్ఞప్తిని ప్రస్తుత బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ ప్రభుత్వం తిరస్కరించింది. స్వదేశానికి రావాలనుకుంటే సంకెళ్లతోనే రావాలని తేల్చి చెబుతోంది.
బంగ్లాదేశ్ లో 2024 ఉద్యమ సమయంలో నిరసనకారులపై జరిగిన అణచివేతకు సంబంధించి వివాదం నెలకొంది.. ఇందుకు సంబంధించి విచారణలో బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ 2025 నవంబర్‌లో షేక్ హసీనా గైర్హాజరీలో మరణశిక్ష విధించింది. దీంతో ఆమె దేశంలో అడుగుపెట్టిన వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపుతామని బంగ్లా ప్రభుత్వ వర్గాలు హెచ్చరిస్తున్నాయి.
షేక్ హసీనా చేతులకు సంకెళ్లతోనే హసీనా దేశంలో అడుగుపెట్టాల్సి ఉంటుందని విదేశాంగ శాఖ సహాయ మంత్రి హుమాయున్ కబీర్ అన్నారు. అప్పగింత ప్రక్రియ ద్వారా కట్టుదిట్టమైన నిఘా మధ్య సంకెళ్లతోనే తప్ప ఆమెను దేశంలోకి అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. హసీనా పరారీలో ఉన్న ఉగ్రవాది అని అభివర్ణించిన కబీర్.. విమానంలో దర్జాగా బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తున్నట్లు ఆమె నిద్రలో పీడకలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.
తన తండ్రి బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం తెచ్చిన డిసెంబర్ 16నే తిరిగి రావాలన్న హసీనా నిర్ణయం ఒకవైపు భావోద్వేగాలను రగిలిస్తుంటే, మరోవైపు ఆమెకు మరణశిక్ష అమలుకు తారిఖ్ రెహమాన్ ప్రభుత్వం సిద్ధమవుతోంది. 2024 ఆగస్టులో నిరసనల నేపథ్యంలో దేశం విడిచిన హసీనా భారత్‌లో ఆశ్రయం పొందుతున్న విషయం తెలిసిందే. గతంలో ఆమెను తిరిగి పంపాలని భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం ఇప్పుడు అప్పగింత ప్రక్రియ ద్వారానే ఆమె రావాలని చెబుతోంది.
హసీనా తిరిగి స్వదేశానికి వచ్చేందుకు కొత్త పాస్‌పోర్ట్, గుర్తింపు కార్డు కోసం దరఖాస్తు చేసుకోగా, కోర్టు విచారణలు పెండింగ్‌లో ఉన్నాయన్న కారణంతో ఢాకా అధికారులు వాటిని తిరస్కరించారు. హసీనాకు భారత్ ఆశ్రయం ఇవ్వడంపై ఢాకా అసంతృప్తి వ్యక్తం చేస్తూ, ద్వైపాక్షిక అప్పగింత ఒప్పందం ప్రకారం ఆమెను తమకు అప్పగించాలని కోరుతోంది.
హసీనాను అప్పగించేందుకు భారత్ రెండు ప్రధాన షరతులు పెట్టినట్లు కొన్ని అంతర్జాతీయ మీడియా సంస్థల్లో కథనాలు వచ్చాయి. దీని ప్రకారం 2024 ఆగస్టులో హసీనా బంగ్లాదేశ్ సైనిక విమానంలో భారత్‌కు వచ్చినందున, తిరిగి ఆమెను తీసుకెళ్లే బాధ్యతను కూడా బంగ్లాదేశ్ సైన్యమే తీసుకోవాలి . ఆమెకు విధించిన మరణశిక్షపై అప్పీల్ చేసుకునే అవకాశం కల్పించడంతో పాటు, నిష్పక్షపాతమైన కొత్త విచారణ జరిపిస్తామని హామీ ఇవ్వాలి.
అయితే షేక్ హసీనాను బంగ్లాదేశ్‌కు అప్పగించే విషయంలో భారత్ ఇప్పటివరకు అధికారికంగా ఎటువంటి షరతులను ధృవీకరించలేదు. బంగ్లాదేశ్ పంపిన అప్పగింత అభ్యర్థన తమ పరిశీలనలో ఉందని, ఇది పూర్తిగా చట్టపరమైన అంశమని భారత విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ ఇటీవల పేర్కొన్నారు. కొత్త ప్రభుత్వంతో నిర్మాణాత్మక సంబంధాలను కొనసాగించాలనేదే తమ ఉద్దేశమని భారత్ గతంలోనే తెలిపింది.
తనకు మరణ శిక్ష పడినా స్వదేశానికి వెళ్లి తీరుతానని షేక్ హసీనా ఇప్పటికే పలు మార్లు స్పష్టం చేశారు. హసీనా దేశం విడిచి వెళ్లిన తర్వాత గత ఏడాది మే నెలలో ఆమె పార్టీ 'అవామీ లీగ్'పై నిషేధం విధించారు. ఈ ఏడాది ఫిబ్రవరి జరిగిన ఎన్నికల్లో అవామీలీడ్ పోటీ చేయకుండా నిరోధించడంతో బంగ్లాదేశ్ నేషనల్ పార్టీ అధికారంలోకి వచ్చింది. హసీనా రాక ప్రకటన నేపథ్యంలో నిషేధిత అవామీ లీగ్ కార్యకర్తల్లో ఉత్సాహం వచ్చింది.
వీధుల్లోకి వచ్చి ఆందోళనలు చేపట్టడంతో పాటు డిసెంబర్ 16న జాతీయ రహదారులను దిగ్బంధిస్తామని పిలుపునిచ్చారు. హసీనా స్వస్థలమైన గోపాల్‌గంజ్‌తో పాటు పలు ప్రాంతాల్లో బాంబు దాడులు, అగ్నిప్రమాదాలు చోటుచేసుకున్నాయి. ఈ హింసాకాండ వెనుక అవామీ లీగ్ శక్తులు ఉన్నాయని ఆరోపించిన ప్రభుత్వం, ఢాకా, గోపాల్‌గంజ్, సరిహద్దు ప్రాంతాల్లో వేలాది మంది పోలీసులను, పారామిలిటరీ దళాలను మోహరించింది.
బంగ్లాదేశ్ లో అశాంతి సృష్టించడానికి షేక్ హసీనా కుట్ర పన్నుతున్నారని ప్రధానమంత్రి తారిఖ్ రెహమాన్ ఆరోపించారు. అవామీ లీగ్ మద్దతుదారులు ఆందోళనలకు దిగడంతో, క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలని బీఎన్పీ కార్యకర్తలను ఆదేశించారు.
దేశంలో జరుగుతున్న అల్లర్ల వెనుక భారత్ హస్తం ఉందని బంగ్లాదేశ్ మంత్రులు, నేషనల్ సిటిజన్ పార్టీ నేత నహీద్ ఇస్లాం వంటి వారు ఆరోపణలు చేయడంతో దౌత్యపరమైన ఉద్రిక్తతలు కూడా పెరిగాయి. హసీనాను పదవి నుంచి తొలగించడానికి దారితీసిన నిరసనల నుంచి ఉద్భవించిన విద్యార్థుల నేతృత్వంలోని నేషనల్ సిటిజన్ పార్టీ నాయకులతో బంగ్లాదేశ్ ప్రధాని తారిక్ రెహమాన్ చర్చలు జరిపారు.
మొత్తానికి డిసెంబర్ 16 సమీపిస్తున్న కొద్దీ బంగ్లాదేశ్‌లో శాంతిభద్రతల సమస్య మరింత జటిలమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. హసీనా నిజంగానే ఢాకాకు బయలుదేరుతారా లేదా అన్నది ఇప్పుడు దక్షిణాసియా రాజకీయాల్లో ఉత్కంఠ రేపుతోంది.




