Burning Topic: బంగ్లాదేశ్ వెళ్ళి తీరతానంటున్న షేక్ హసీనా!

Burning Topic: డిసెంబర్‌లో బంగ్లాదేశ్‌కు తిరిగి వెళ్తానని షేక్ హసీనా స్పష్టం. హసీనాను అప్పగించాలని భారత్‌ను కోరిన బంగ్లా ప్రభుత్వం. ఉద్రిక్త పరిస్థితులు.

హెచ్ఎంటీవీ డెస్క్
Published on: 11 Nov 2026 7:24 AM IST
Burning Topic
X

Burning Topic: బంగ్లాదేశ్ వెళ్ళి తీరతానంటున్న షేక్ హసీనా!

Burning Topic: బంగ్లాదేశ్‌ మాజీ ప్రధాని, అవామీలీగ్ అధినేత్రి షేక్‌ హసీనా వ్యవహారం మరోసారి చర్చనీయాంశంగా మారింది. 2024 ఆగస్టు ఆ దేశంలో ఏర్పడిన ఏర్పడ్డ అనిశ్చిత పరిణామాల నేపథ్యంలో భారత్‌కు వచ్చి ఆశ్రయం పొందుతున్నారు హసీనా. దీర్ఘకాలం పాటు తన దేశ ప్రజలు, అక్కడి రాజకీయాలకు దూరంగా ఉండటం సమంజసం కాదని ఆమె భావిస్తున్నారు. దీంతో తిరిగి స్వదేశానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. వచ్చే నెల డిసెంబర్‌లో తన దేశానికి తిరిగి వెళతానని ఇప్పటికే స్పష్టం చేశారు షేక్ హసీనా. అయితే ప్రస్తుతం అక్కడి పరిణామాలు చూస్తుంటే పరిస్థితు చాలా ప్రమాదకరంగా కనిపిస్తున్నాయి. 2024లో విద్యార్థుల ఆందోళన సందర్భంగా చెలరేగిన హింసకు హసీనాను బాధ్యరాలిని చేస్తూ.. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ 2025 నవంబర్‌లో ఆమెకు మరణశిక్ష విధించింది. అయితే తనపై వచ్చిన ఆరోపణలను హసీనా అప్పుడే తోసి పుచ్చారు. రాజకీయ ప్రేరితమైన ఈ కేసులో తన వాదన వినకుండా ఏకపక్షంగా శిక్ష విధించారని తప్పుపట్టారు.

హసీనాకు శిక్ష విధించిన తర్వాత ఆమెను అప్పగించాలని బంగ్లాదేశ్ ప్రభుత్వం భారత్‌ను కోరింది. అయితే భారత ప్రభుత్వం ఈ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తోంది. హసీనా అధికారం కోల్పోయిన తర్వాత అవామీ లీగ్ కార్యకర్తలు పెద్ద సంఖ‌్యలో హత్యకు గురయ్యారు. ఎంతో మంది అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. పార్టీ మద్దతుదారులు ఇళ్లు, వ్యాపారాలు, ఉపాధిని కూడా కోల్పోయారు. ఆ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన బంగ్లా పార్లమెంట్‌ ఎన్నికల్లో షేక్ హసీనాకు చెందిన అవామీలీగ్‌ను పోటీ చేయకుండా నిషేధించారు. ఈ ఎన్నికల్లో తారిఖ్ రెహమాన్ నేతృత్వంలోని బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించి అధికారం చేపట్టారు. అయితే కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటికీ హసీనా విషయంలో విధానాలు అయితే మారలేదు. షేక్ హసీనా ఎక్కువ కాలం భారత్‌లోనే ఉండిపోతే స్వదేశంలో రాజకీయంగా ఇబ్బందులు తెచ్చి పెట్టే అవకాశం ఉంది. ఈ కారణంగా స్వదేశానికి తిరిగి వెళ్లాలనే నిర్ణయాన్ని ఆగస్టు మాసంలోనే ప్రకటించారు.

తాను డిసెంబర్ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో తాను బంగ్లాదేశ్ తిరిగి వెళ్లిపోతానని పునరుద్ఘాటించారు షేక్ హసీనా. ఏది ఏమైనప్పటికీ స్వదేశానికి వెళ్లడం ఖాయమన్నారు. ‘ మరణించాల్సి ఉంటే, నా సొంత నేలపై, నా సొంత ప్రజల మధ్యే చావడానికి ఇష్టపడతా. అందుకే బంగ్లాదేశ్‌కు తిరిగి వస్తా. ఈ నిర్ణయంలో ఎలాంటి మార్పూ లేదు’అని ఆమె కుండబద్దలు కొట్టారు. ‘తిరిగి వస్తే అరెస్ట్‌ చేస్తారని నాకు తెలుసు. జైల్లో పెట్టవచ్చు, హింసించవచ్చు చంపనూ వచ్చు. అందుకు అవకాశముందనీ నాకు బాగా తెలుసు. కానీ, నా ప్రజలు బాధపడుతుండటాన్ని చూస్తూ నేను దూరంగా ఉండి నా జీవితాన్ని గడపలేను’అని ఆమె అన్నారు. బంగ్లాదేశ్‌కు సురక్షితంగా తిరిగి వచ్చేందుకు భారత్, అమెరికా లేదా మరే ఇతర దేశం సాయాన్నీ కోరుకోవడం లేదని ఆమె వివరించారు. సొంత దేశానికి తిరిగి వెళ్లడానికి తనకు ఎవరి ఆశీస్సులూ అవసరం లేదని స్పష్టం చేశారు.

కాగా బంగ్లాదేశ్ ప్రభుత్వం మాత్రం షేక్ హసీనా విషయంలో ఇంకా కఠినంగా వ్యవహరిస్తోంది. భారత్‌లో ఆశ్రయం పొందుతున్న ఆమెను తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నామని బంగ్లాదేశ్‌ న్యాయశాఖ మంత్రి అసదుజ్జమాన్‌ వెల్లడించారు. ఈ విషయంలో భారత్‌కు పలుమార్లు విజ్ఞప్తి లేఖలు పంపినా సమాధానం రాలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. హసీనాను తమ దేశ ట్రైబ్యునల్‌ దోషిగా నిర్ధారించిందని, అందువల్ల ఆమెను ఎప్పటికైనా బంగ్లాదేశ్‌కు తీసుకొచ్చి తగిన శిక్ష విధిస్తామని స్పష్టం చేశారు. హసీనా తమ దేశ ప్రజల దృష్టిలో నేరస్థురాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు. హసీనా ప్రస్తుతం మరో దేశంలో ఉన్నందున ఆమె అప్పగింత వ్యవహారాన్ని హోం మంత్రిత్వ శాఖ పర్యవేక్షిస్తోందని తెలిపారు. భారత్‌ ఆమెను అప్పగిస్తే ఎలాంటి భావోద్వేగాలకు తావివ్వకుండా చట్టప్రకారమే వ్యవహరిస్తామని చెప్పారు. న్యాయపరమైన నిబంధనలను ఉల్లంఘించేలా ఎలాంటి చర్యలూ తీసుకోబోమని స్పష్టం చేశారు.

భారత్‌-బంగ్లాదేశ్‌ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ఆధారంగా ఆమెను తిరిగి పంపించాలని ఢాకా కోరుతోంది. అయితే ఈ విజ్ఞప్తులపై భారత్‌ తుది నిర్ణయం ప్రకటించకపోవడంతో ఈ వ్యవహారం ఇంకా కొలిక్కి రాలేదు. రెండు దేశాల మధ్య అప్పగింత ఒప్పందం ఉన్నప్పటికీ, ఒక వ్యక్తిని అప్పగించే ప్రక్రియలో ఒప్పందంలోని నిబంధనలు, చట్టపరమైన అంశాలు, సంబంధిత అభ్యర్థనల పరిశీలన కీలకంగా ఉంటాయి. బంగ్లాదేశ్‌ మాత్రం హసీనాను తిరిగి తీసుకురావాలన్న పట్టుదలతో ఉంది. భారత్‌ ఈ వ్యవహారంపై తన దౌత్య, న్యాయపరమైన ప్రక్రియలను అనుసరిస్తోంది. మొత్తంగా చూస్తే.. షేక్‌ హసీనా అప్పగింత వ్యవహారం కేవలం ఒక మాజీ ప్రధానమంత్రి స్వదేశానికి తిరిగి రావడానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు. భారత్‌-బంగ్లాదేశ్‌ ద్వైపాక్షిక సంబంధాలు, దౌత్యపరమైన నిర్ణయాలు, అంతర్జాతీయ న్యాయ ప్రమాణాలతో ముడిపడిన అత్యంత కీలకమైన వ్యవహారంగా మారింది.

మరోవైపు స్వదేశానికి వెళ్లే క్రమంలో తనకు కొత్త పాస్‌పోర్టు, జాతీయ గుర్తింపు కార్డు జారీ చేయాలని హసీనా కోరారు. రెండేళ్ల తర్వాత బంగ్లాదేశ్‌ అధికారులతో తొలిసారి అధికారిక సంప్రదింపులు జరిపారు. హసీనా తరఫు న్యాయవాదులు ఢిల్లీలోని బంగ్లాదేశ్ తాత్కాలిక హైకమిషనర్ ప్రీతి రెహ్మాన్‌కు లేఖను సమర్పించారు. ఆమె స్వదేశానికి తిరిగి వెళ్లేందుకు వీలుగా కొత్త పత్రాలను జారీ చేయాలని ఆ లేఖలో కోరారు. బంగ్లాదేశ్ పౌరురాలిగా ఆమెకున్న హక్కులను, అంతర్జాతీయ మానవ హక్కుల నిబంధనలను ప్రస్తావిస్తూ ఈ ప్రక్రియను వేగవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. ప్రక్రియలన్నీ పూర్తయిన తర్వాత ఆమె ప్రయాణ తేదీని ప్రకటిస్తామని హసీనా తరఫు న్యాయవాదులు వెల్లడించారు. అయితే బంగ్లాదేశ్ మాత్రం ఇదంతా రాజకీయ ప్రదర్శన మాత్రమేనని ఆరోపిస్తోంది. హసీనాకు తిరిగి స్వదేశానికివ వచ్చే ఉద్దేశం లేదని తిరిగి రావడానికి ఆమె తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం లేదు అంటూ విమర్శించారు.

కాగా షేక్ హసీనా తిరిగి బంగ్లాదేశ్‌కు వస్తారనే వార్తలు అక్కడ ఉద్రిక్తతలకు కారణమయ్యాయి డిసెంబర్‌లో స్వదేశానికి తిరిగి వస్తానని ప్రకటించడం, ఇందుకు గాను కొత్త పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకోవడంతో బంగ్లాదేశ్‌లో మళ్లీ తీవ్ర ఆందోళనలు చెలరేగాయి. ఢాకా, పరిసర ప్రాంతాలలో నిరసనకారులు బస్సులకు నిప్పంటించడం, ముడి బాంబుల పేలుళ్లకు పాల్పడటం వంటి సంఘటనలు జరిగాయి. ఢాకా యూనివర్సిటీ, డిస్ట్రిక్ట్ జడ్జ్ కోర్ట్ సమీపంలో బాంబు పేలుళ్లు సంభవించాయి. ఒకవేళ ఆమె స్వదేశానికి వస్తే, అక్కడ అధికారంలో ఉన్న బీఎన్‌పీకి, జమాతే ఇస్లామీ లాంటి అతివాద పార్టీలకు రాజకీయంగా ఇబ్బంది కరంగా మారుతుంది. కాగా హసీనా స్వదేశానికి వస్తే.. జైలు శిక్ష లేదా ఉరిశిక్ష తప్పదని, కేవలం తన పార్టీ శ్రేణుల్లో స్థైర్యాన్ని నింపేందుకు మరియు బంగ్లాదేశ్ నూతన ప్రభుత్వాన్ని అస్థిరపరిచేందుకే ఆమె ఈ తరహా ప్రకటనలు చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.


హెచ్ఎంటీవీ డెస్క్

హెచ్ఎంటీవీ డెస్క్